బ్లావట్క్సీ చెప్పిన విషయాలు :-
బ్లావట్క్సీ దృష్టిలో గుప్త విద్య అంటే డివైన్ మాజిక్ మానవ మాత్రులకు ఈ మాజిక్ సాధ్యమేనా అంటే సాధ్యమే. కొన్ని నియమాలు, నింభంధనలను పాటించాలి. కొంత స్వయం నియంత్రణ, పరిపూర్ణ సాధన చేయాలి. అలాగే క్షుద్ర శక్తుల నుండి, వశీకరణ వంటి విద్యల నుంచి తమను తాము రక్షించుకోగల, ఇతరులకు రక్షణ ఇవ్వగల శక్తి ఈ డివైన్ మాజిక్ తెలిసినవారికి ఉంటుంది. ఉపాసన అంటే సాధన అనేది డివైన్ మాజిక్ కి అవసరం. ఈ సాధకులనే బ్లావట్క్సీ ఉపాసకులు అంటారు. నిజానికి ఈ ఉపాసకులు సాధనా పరంగా పాటించాల్సిన నియమాలు దాదాపు 73 ఉన్నప్పటికీ అతి ముఖ్యమైన కొన్నింటిని మాత్రం మేడం బ్లావట్క్సీ ఇచ్చారు.
అవి ....
1. మనసును వ్యాకుల పరచని పరిణామ ప్రదేశంలో అంటే ఎటువంటి చెడు ప్రభావాలను లేని ప్రదేశంలో సాధన జరగాలి.
2. బేసి సంఖ్య గల ఉపాసకుల మధ్య ముఖాముఖి అభ్యాసం జరగాలి ప్రాథమిక అవగాహన కలిగి ఉండాలి. ఇక్కడ ముఖాముఖి అంటే ఆత్మగతమైనా కావచ్చు, గురుముఖతః అయినా అయి ఉండవచ్చు.
3. శాంత మనసును కలిగిన శిష్యగణం మధ్యనే పవిత్రోపదేశం ( దీక్ష) జరగాలి. అక్కడ సమనస్క స్నేహం నెలకొని ఉంటుంది కాబట్టి ఫలితం త్వరగా సాధ్యం అవుతుంది.
4. సంసిద్దత నుండే సత్యం చేరువ అవుతుంది. అప్పుడు మతం కంటే సత్యమే సమ్మతమౌతుంది.
5. నొప్పించక తానొవ్వక, గాయపడక గాయపర్చక ఉండటం సాధన అవుతుంది.
6. ప్రాపంచికంగానైనా, ఆధ్యాత్మికంగా అయినా అహంకారాన్ని త్యజిస్తేనే సిద్దత్వం, ఆత్మశక్తుల సంక్రమణం జరుగుతుంది.
7. తర,తమ భేదాలు లేకుండా సాధన జరగాలి.. నేను తెలివైనవాడిని, నేను గొప్ప వాడిని అనేటువంటి ఆలోచనలు పనికిరాదు. ప్రతీ మనిషి సమానమే, ప్రతీ ప్రాణీ ముఖ్యమే అనుకోగలిగితే సాధన సజావుగా సాగుతుంది.
9. బాహ్య ప్రబావాలు పడని అంతరిక ప్రవృత్తి అవసరం, అంతర్వర్తన ప్రబావం వలనే బాహ్యవర్తనం సాగటం సాధనకు చాలా ముఖ్యం.
10. మానవులతోనే కాదు, జంతువులతో కూడా బాడి కాంటాక్ట్ పనికి రాదు. తనకు తానుగా ఉండగలిగితే అతీంద్రియ శక్తి సాధ్యం అవుతుంది.
11. హృదయ సిద్దాంతమే నేత్ర సిద్దాంతం కావాలి. అంటే హృదయం చెప్పినట్లుగా చూడగలిగితేనే విశ్వసత్యం అవిష్కృతం అవుతుంది.
12. మాంసాహారం తినకూడదు. మద్యపానం చేయరాదు. మద్యపానం ధూమపానం వంటి మాధక ద్రవ్యాలతో చెడు అయస్కాంత తరంగాలు మనలను చేరుకుంటాయి.
13. నైతిక బాధ్యత, సత్యార్యాచరణ, సరళ స్వభావం, మంచి మనసు అనేవి ఆత్మవర్తనాలై ధ్యాన సాధనలో దివ్య జ్ఞాన సంపన్నులు కావడానికి దోహదం చేస్తాయి.
14. స్వ- పర భేదం లేకుండా అసూయ ద్వేషాలను సంపూర్ణంగా త్యజించడం సాధనకు చాలా అవసరం.
15. దేహం, దాని పరిసరాలపై మనసును పరిభ్రమింప చేయకుండా ఉండటం సాధనకు అవసరం.
16. సాధన అనేది భౌతిక ఆవరణలో నియమ నిబంధనల మధ్య రాపిడి పట్టడం కాదు- స్వేఛ్ఛలోని భాధ్యతను ఆహ్వానించడం.
17. సంపూర్ణ నిస్వార్థ తత్వం, సత్య సంధత, ఆత్మజ్ఞానం అనేవి అర్హతలు.
ఈ నియమాలతోనే అర్హత ఆ అర్హత తోనే సాధన సాధనతోనే సిద్దత్వం అవుతుంది అంటారు మేడం బ్లావట్క్సీ.
No comments:
Post a Comment