Thursday, December 8, 2022

రుద్రాక్ష ధారణ – మారేడు దళము :

 *శివపురాణం* -22 వ  భాగం ప్రారంభం... 

రుద్రాక్ష ధారణ – మారేడు దళము :

భస్మముతో పాటు రుద్రాక్షలు కూడా చాలా గొప్పవి. తపస్సు చేస్తున్న శంకరుని కన్నులవెంట కారిన జలబిందువులు భూమి మీద పడితే అవి రుద్రాక్షచెట్లయి పైకి లేచాయి. అందుచేత అవి ఈశ్వరుని తపశ్శక్తితో కూడిన కంటినీటి బిందువులలోంచి ఉద్భవించినవి కాబట్టి అవి మిక్కిలి తేజస్సు సంపర్కములై ఉంటాయి అని మన పెద్దలు నమ్ముతారు. నేపాల్ ఖాట్మండు పశుపతినాథ దేవాలయంలో రుద్రాక్ష చెట్టు ఉంది. అవి ఏకముఖి నుంచి దశముఖి వరకు ఉంటాయి. అందులో ఆరు ముఖములు ఉన్న రుద్రాక్ష కేవలము సుబ్రహ్మణ్య స్వరూపమని పెద్దలు నమ్ముతారు.

మీకు సృష్టిలో ఒక్క రుద్రాక్ష గింజలో మాత్రమే మధ్యలో తొర్ర ఉంటుంది. వీటిని ఒక మాలగా గ్రుచ్చవచ్చు. రుద్రాక్షలకు అపారమైన శక్తి ఉంది. రుద్రాక్ష శరీరము మీద ఉన్న చెమటతడితో తడిసినా లేదా స్నానం చేస్తున్నప్పుడు రుద్రాక్షలతో తడిసిన నీళ్ళు శరీరం మీద పడినా అది శరీరంలో ఉన్న ముఖ్యమయిన అవయవముల పనిని నియంత్రించి రక్షించగలదు.అలా రక్షించగలిగిన శక్తి రుద్రాక్షలకు ఉన్నది. అందుకే రుద్రాక్ష మాలలో పగదమును ముత్యమును కలిపి వేసుకుంటారు. రాత్రి నిద్రపోతున్నప్పుడు రుద్రాక్షమాల ధారణ ఉండదు. రాత్రుళ్ళు దానిని తీసి భగవంతుని పదముల వద్ద పెట్టి మరల పొద్దున్నే వేసుకుంటారు. చిదంబర క్షేత్రమును సాక్షాత్తు పరమేశ్వరుని హృదయంగా భావిస్తారు. భగవంతుని హృదయము చిదంబరం అయితే, ఈశ్వరుడు మనలోకి వచ్చి కూర్చోవడానికి వీలయిన రీతిలో మీ శరీరమునందు సాత్వికమయిన భావనలు కలిగేటట్లుగా లోపల కన్నం ఉండి ఇటునుంచి అటు దారం వెళ్ళిపోయేటట్లుగా ఉన్న ఏకైక పవిత్రమయిన గింజ రుద్రాక్ష.

రుద్రాక్ష వేసుకోవడం అంటే ‘నేను కూడా నా భావనల చేత నా కర్మల చేత నా శరీరంలో జరుగుతున్న సమస్త వ్యాపారములను ఒక మాలగా గుచ్చి ఈశ్వరుడి మెడలో వేయుచున్నాను” అని అర్థం. ఈ భావన ఏర్పడిందంటే ‘యద్యత్కర్మకరోమి తత్తదఖిలం శంభో తవారాధనం’ మనం చేసే కర్మలన్నీ ఈశ్వరుని సేవలై కూర్చుంటాయి. అటువంటి భావన కలగడానికి రుద్రాక్ష ధారణ చేస్తారు.

ఉమానాథుడయితే మారేడు దళము, శ్రీమహా విష్ణువయితే తులసిదళంతో మనం పూజ చేస్తాము. రెండూ దళాలే. మారేడుదళం ఏర్పడడమే చిత్రంగా ఏర్పడింది. శ్రీసూక్తం చదివినప్పుడు మనం ఈ క్రింది మంత్రమును చదువుతుంటాము.

ఆదిత్య వర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోథబిల్వః!
తస్య ఫలాని తపసా నుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః!!

లక్ష్మీదేవి ఒకనాడు తపస్సు చేద్దామని అనుకున్నప్పుడు కుడిచేతితో ఆమెచేత సృష్టించబడిన చెట్టు మారేడు చెట్టు. అందుకే ఆ చెట్టుకు పండిన కాయను ‘శ్రీఫలము’ అని పిలుస్తారు. సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉన్నది. అది పువ్వు పూయకుండా కాయ కాస్తుంది. మారేడు కాయలో ఉన్న గుజ్జును చిన్న కన్నం పెట్టి తీసి దానిని ఎండబెట్టి అందులో విభూతి వేసి ఆ విభూతిని చేతిలో వేసుకుని పెట్టుకునేవారు. మారేడు ఆయుర్వేదమునందు ప్రధానంగా ఉపయోగపడుతుంది. ఈ మారేడు దళము మూడుగా ఉంటుంది. 

No comments:

Post a Comment