Friday, January 17, 2025

 *శంబల - 10*
💮

*రచన : శ్రీ శార్వరి* 


*లామా కలాపం -2*

"చూడు శార్వరీ! నీ కుడిచేతితో నీ దుర్గుణాలన్నీ పట్టుకో. భావన చెయ్యి. ఎడమ చేతిలో నీ మంచి గుణాలన్నీ ఏరి పట్టుకో. నీలోని దుర్గుణాలను నేలకు దింపు. అలాగే నీలో ఉన్నాయనుకునే సద్గుణాలను నేల మీద పెట్టు. ఇప్పుడు నీ మొహంలో (నీలో) మంచి, చెడు గుణాలు రెండూ కనిపించడం లేదు కదూ. నీ మొహంలో నీ పర్సనాలిటీ కనిపించడం లేదు. నీకు వయసు తెలియడం లేదు. అసలు నీకు వయస్సు లేదు. వయస్సుతో నిమిత్తం లేదు. అంటే నీవు ఏ దేశం వాడివో, ఏ మతస్తుడివో తెలియదు. నీవు ఇప్పుడు, ఒక భారవివి మాత్రమే. నీవు నీవు కాదు. నీ ప్రకృతి, ప్రవృత్తి, సంపాదన, వ్యక్తిత్వం ఏమీ లేకుండాపోయాయి. అంటే ఒక రకంగా నిన్ను శూన్యం చేసుకున్నావన్నమాట. నీ ముఖం పైన తగిలించుకునే ముసుగులు కొన్ని కృతకంగా ఉంటాయి. కొన్ని వికారంగా, అసహ్యంగా ఉంటాయి. మాస్క్ అతికించుకున్న ముఖాలు మన మనస్సుకు ప్రతీకలు. అవి ఆత్మకు ప్రతీకలు కావు. అవి మనవి కావు. బంగారంతో చేసినా 'మాస్కు' కృత్రిమమే. విలువ పెరగదు. ఈ మాస్కులు తాత్కాలికం. వాటిని తీసి నేల మీద పెట్టి జీవించాలి!”

ఆ పని లామాగారు చెప్పినంత సులభం కాదు. నా సంస్కారం, అభిజాత్యం అడ్డు వచ్చింది. సభ్య సమాజంలో, బాహ్య ప్రపంచం కోసం బ్రతికినంత కాలం ఈ దుస్తులు వదలిపెట్టం. ప్రయత్నించాను. ఎట్లా? నన్ను శూన్యం చేసుకోగలిగాను. కళ్లు, పళ్లు బిగపట్టి, మనసుకు కళ్లెం వేసి, ఆలోచనల్ని బలవంతంగా బంధించాను. ఇప్పుడు నా అందం, పర్సనాలిటీ, నా వయస్సు, సెక్సు ఏవీ తెలియడం లేదు. భౌతికంగా లయించిపోయిన నాకు సమాజంతో పనిలేదు. సమాజానికి నాతో పనిలేదు. అసలు నేను 'మనిషిని' అనే భావం పోయింది. పాము కుబుసం విడిచింది. నా భౌతిక అచ్ఛాదన తొలగి పోయింది. ఇప్పుడు నేను మనిషిని కాను - 'రుషి'ని.

లామా అన్నారు :

"స్వామీ! అప్పుడు నీవు దిగంబరివి. నగ్నంగా ఉన్నావు. నీ అసలు రూపం ఇది. మానసికంగా ఆధ్యాత్మికంగా శూన్యం కావాలి. ఏమీ మిగలకుండా పోవాలి. అది శూన్యం. చైతన్యం ఒక్కటే మిగలాలి. దాని పేరే 'నేను'. అదే అసలైన 'అహం, ఆత్మ (అహమాత్మ). మీరు ఆత్మ అంటారు. మేము కేవలం చైతన్యంగా భావిస్తాం. అగ్ని గుండంలో నీవు ఒక సమిధవు. నీకు వ్యక్తిత్వం లేదు. కాలిన కట్టెపుల్లకు, సమిధకు ప్రత్యేక మనుగడ ఉండదు. అగ్నిలో కాలి 'తన' తత్వాన్ని
వదలి బూడిద కావాలి. అది యోగ రహస్యం. ధ్యానంలో జరిగే పని అది. మనం ఆధ్యాత్మికంగా భూ పరిధులు దాటి ఎప్పుడో పైకి వచ్చిన వాళ్లం. చూడు! నీ చుట్టూ వినీల గగనంలో మిణుకు మిణుకు మనే నక్షత్రాలు.”

లామా మాటలు మాత్రం నా మనసుకు వినిపిస్తున్నాయి. చెవులు పని చేయడం లేదు. అసలు ఇంద్రియాలు ఉంటే గదా పని చేయడం! నేనే లేనప్పుడు నా ఇంద్రియాలు పనిచేయడం ఏమిటి? నాకు మాటలు వినబడుతున్నాయి. లామా కనపడడం లేదు. మరి మాట్లాడేది ఎవరు? వినేది ఎవరు? చిత్రంగా ఉంది Transmission. అప్రయత్నంగా, నేను అలవోకగా చైతన్య సాగరంలోకి జారిపోతున్నాను ... మునిగిపోతున్నా ను. మునిగిపోయాను.

లామా గారి మనసు నన్ను శాసిస్తోందా? వారి సంకల్పం నాపై పనిచేస్తోందా? నా భావనే లామాగారి భావనగా మారిందా!

లామా అంటున్నట్లా? నేను వింటున్నట్లా?

"మనం ఇప్పుడు కాలరహిత భూమిక పైకి చేరుకున్నాం. ఇక్కడ అంతా వర్తమానమే. అంతా ప్రస్తుతమే. అప్రస్తుతం ఏదీ లేదు. గతం ఉండదు. భవిష్యత్తు ఉండదు. ఇది నిజానికి స్థితి కాని స్థితి. పరిస్థితి. అనిశ్చితస్థితి.

అకస్మాత్తుగా “నేను, ‘నా' భావన” సైతం లయించిపోయింది. అది శూన్యం కావడం కాదు. ఉన్నదైతే శూన్య మవుతుంది. లేనిది శూన్యం కావడం అంటే లయించడం. కాలం స్తంభించింది. అసలు కాలం ఎక్కడ కదిలింది? స్తంభించడానికి! కాలమే లేదు. నాతో పాటు నా అస్తిత్వం తో పాటు కాలం లయించింది. ఇక్కడ నిన్న లేదు, రేపు లేదు. నిజానికి ప్రస్తుతం అన్నదీ కనిపించడంలేదు. అనంతమైన విశ్వంలో అనంతమైన శూన్యం. అనంతంలో నేను లీనమైనాను. లామా అంటున్నాడు. సజెషన్ ఇస్తున్నాడు.

"ఇప్పుడు కాలం లేని (కాలరహిత) స్థితి నుండి కాలంతో ముడిపడిన భూమికి (చైతన్యంతోనే) దిగి వస్తున్నాం. నెమ్మదిగా, చైతన్యంతో దిగి నీ ముఖం నీవు తగిలించుకో. నీ సద్గుణాలు, దుర్గుణాలు, దొంగ బుద్ధులు మొహానికి అతికించుకో. ఇది నీ స్వస్థితి. నీ సహజ లక్షణం. నీవు ప్రపంచం దృష్టిలో మహా జ్ఞానివి. నీవు అసలు జ్ఞానం పొంది బుద్ధత్వం పొందేవరకు అలాగే వస్తూ పోతూ ఉండు. ఈ మెట్లు రోజూ ఎక్కుతూ దిగుతూ ఉండాలి."

కొంచెంసేపు నిశ్శబ్దం. ఆశ్చర్యంలోంచి కళ్లు విప్పాను. అడిగాను.

"లామాజీ! నిర్వాణం అంటారు ఇదేనా?"

"కాదు శార్వరీ! ఇది మహా శూన్యాను భవం. మహా నిశ్శబ్దాన్ని వినడం. ఇది నిశ్శబ్ద ప్రతిధ్వని. మనం అనుకుంటాం ఈ భూగోళం మన స్వంతం అని, మన కోసమే సృష్టించబడ్డదని. ఎవరు దీనిని సొంతం చేసుకున్నారు? ఎవరు అనుభవించారు? ఎవరు అనుభోగించా రు? కనుక అంతా తాత్కాలికమే. అంతా అశాశ్వతమే. ఇది 'మిధ్య'. ఇదే మిద్యా వాదం. మనది మాధ్యమిక వాదం. లేనిది ఉన్నట్లు భావిస్తూ బ్రతకడం. ఉన్నదాన్ని లేదని దబాయించడం. అవునా? ఈ దబాయింపు మాకంటే మీకే ఎక్కువ తెలుసు! ప్రపంచంలో బ్రతుకుతున్నవారు మీరు.ప్రపంచం చాటున జీవిస్తున్న వాళ్లం మేము.”

నేను అడిగాను. “మీరు చేస్తున్న మహా యజ్ఞంలో నేనూ ఒక సమిధను కావచ్చునా లామాజీ?”

"ఇది యజ్ఞం కాదు, యాగమూ కాదు స్వామీ. కేవలం యోగం. కేవలం పరిణామ క్రియ. ఇది ధ్యాన విజ్ఞానం. ధ్యాన విశేషం. ఇది అనుభూతి పర్వం. నీకు బోధిచిత్తుడు కావాలని ఉందా? లేక వారు చేస్తున్న పనులు తెలుసుకోవాలని ఉందా? ఇక్కడి కష్టాలు తెలిస్తే వెంటనే పారిపోతావు. నిమిషం నిలబడలేవు. నీ మనసు మారడం ఖాయం. వ్యక్తిత్వం వదులుకుని మీరు ఇక్కడ బ్రతకలేరు. ఇక్కడ ఎవరికీ Identity ఉండదు. ఎవరూ గొప్పగా ఆశించరు. ఎవరికీ పేరు మీద మోజు ఉండదు. నిరంతర తపనే తపస్సు. అన్వేషణే ధ్యానం. ఇది అనంత యాత్ర.”

లామా చాప మీద నుండి లేచి ప్రక్క గది లో ఉన్న ఒక కుర్ర లామాని పిలిచాడు. పావురాళ్ల గూళ్లలా ఉన్న సొరుగుల్లోంచి పుస్తకాలు కొన్ని బయటకు లాగి ఇలా అన్నాడు. “మా కుర్రకుంకలు ఈ పుస్తకాలు ముట్టుకోరు. భయం."

అక్కడ ఒక నేలమాళిగ ఉంది. బీరువా తొలిగించగా నేలమాళిగలోకి ప్రవేశం కనిపించింది. లామా ఒక కాగడాను వెలిగించి నన్ను తనతో రమ్మని పిలిచాడు. ఆయన వెంటపడి మెట్లు దిగాను.

లోపల పెద్ద గుహాలయం. సహజంగా కొండ రాళ్లతో ఏర్పడిన గోడలు. ఏ కాలం నాటిదో ఆలయం. ఆకాశం చిల్లులు పడ్డట్లు, ఎక్కడ నుండో వెలుగు జారి పడుతోంది. కొండరాళ్లు పగుళ్లిచ్చి వెలుగుల్ని స్రవిస్తున్నాయి. లోపల పొడిగా, వెచ్చగా ఉంది వాతావరణం. పై నుండి నీరు, కొండల్లోంచి ఊట, బొట్లు బొట్లుగా పడుతోంది. ఆ నీరు ఒక చోట తటాకంగా తయారైంది. అందులోని నీరు బయటకుపోయే ఏర్పాటు ఉందేమో! నీటి మట్టం పెరగదు. తగ్గదు. ఎప్పుడూ నిండుగా, అద్దంలా ఉంటుంది.

ఉత్తర దిశన పెద్ద గవాక్షం ఉంది. లామా అగరువత్తులు వెలిగించాడు. దీపాలు వెలిగించారు కుర్ర లామాలు, దీప కాంతి లో విగ్రహం ధగధగ మెరుస్తోంది. చాలా అందంగా ఉంది, ప్రసన్నంగా ఉంది. అది 'తారాదేవి' విగ్రహం. అది శుక్రగ్రహానికి ప్రతినిధి. తారాదేవి విగ్రహం చెవులకు పెద్ద రింగులున్నాయి. పాదాలు విశ్వ నర్తనం చేస్తున్నాయి.

టిబెట్, నేపాల్ దేశాలలో 'తారాదేవి' ప్రధాన ఆరాధ్యదేవత. టిబెట్ లో ఆమె పేరు 'కువన్ ఇన్'. అంటే ప్రేమ రూపిణి అని. కరుణకు ప్రతీక కువన్ ఇన్. అమ్మ కుడి చేయి కారుణ్యానికి గుర్తు. అనుగ్రహ ప్రతీక. ఎడమ చేతి బొటనవేలు మూడవ వేలు కలిసిన ముద్ర 'మైత్రికి' గుర్తు. స్నేహశీలతకు ఆలంబన. ఆమె అందరిని అనుగ్రహిస్తుంది.

కొండను తొలిచి, అందులో తారాదేవి విగ్రహం ప్రతిష్టించారు. అక్కడ అది మరో ప్రపంచం అనిపిస్తోంది. బయట ప్రపంచం మరచిపోతాం.

ఆ విగ్రహం ముందు నిలబడితే ఎంతటి నిగ్రహం కుప్పకూలిపోతుంది. మైమరపు తధ్యం. లామా నన్ను విగ్రహం దగ్గరకు తీసుకువెళ్లాడు. ఆ విగ్రహం ముందు చిన్న జలాశయం ఏర్పడ్డది. నీరు చాలా స్వచ్ఛంగా ఉంది. ముఖం అద్దంలో వలె చూచుకోవచ్చు. నిశ్చల జలాశయం అది. ఎన్ని వేల సంవత్సరాలు నాటిదో!

"ఇవి అమ్మ కన్నీళ్లు ..." 

లామా చెబుతున్నాడు. "మనిషి పతనం లోంచి అమ్మ ఏడుస్తోంది. ఇవి అమ్మ కన్నీళ్లు. వేల సంవత్సరాలుగా అమ్మ దుఃఖిస్తూనే ఉంది."

"టిబెట్ లో 'లామా లాంట్సే' అనే సరస్సు ఉంది. ఆ సరస్సులోకి చూస్తే రాబోయే 'లామా' రూపం కనిపిస్తుంది. కొత్త లామా ఎవరో అందులోనే తేల్చుకోవచ్చు."

" అవును. ఆ విషయం ఎక్కడో చదివిన గుర్తు."

"అలాంటిదే ఇది కూడా. ఇది మంత్రజలం. మనం కోరిన వారి బొమ్మలు కనిపిస్తాయి."

నేను ఆసక్తిగా నీటిలోకి చూచాను. ఎవరైనా కనిపిస్తారేమోనని. దీపాల ప్రతిబింబం. విగ్రహం ప్రతిబింబం తప్ప ఏమీ నాకు కనిపించలేదు.

"ఇంకా లోతుగా చూడండి స్వామీ! ఏకాగ్ర దృష్టితో చూడాలి. చూస్తూ 'ఓం మణి పద్మేహం' అని మంత్రం జపించాలి.”

ఆ పని చేశాను. నీటి మీద మంచు దుప్పటి కప్పినట్లయింది. నీటిలో ఏవేవో బొమ్మలు కదలసాగాయి.

మొదటి బొమ్మలో విశ్వం, ఖగోళం, గోళాలు, గ్రహాలు, నక్షత్రాలు. మరుక్షణం లో అది మాయమై స్క్రీన్ మీద నల్లని, దట్టమైన మబ్బుల కదలిక ఎర్రటి మేఘాలు భూగోళం పైన అక్కడక్కడ కనిపించాయి. అగ్ని పర్వతాలు బ్రద్దలై లావా ప్రవాహాలు, అక్కడక్కడ బంగారు రంగు మెరుపులు, చీకటి నేపధ్యంలో కాంతి గోళాలు, గాలులు, గీతలు, చుక్కలు మొత్తం బొమ్మ వికృతంగా మారింది. నాకు భయమేసింది.

"భయపడకు స్వామీ! అవి అన్నీ మన మనుషుల భావ విస్ఫోటనాలు. భావ వికారాలు. మన వాళ్లు ఎంత చెత్తచెత్తగా ఆలోచించగలరో చూడు. అంతా నెగెటివ్ థింకింగ్. ప్రతికూల భావ స్పందనలు ఆ స్పందనలే మేఘాలుగా విష గాలులై భూమి చుట్టూ వ్యాపించాయి. మనుషుల్లో స్వార్థం, ద్వేషం కలగలిపిన జీమూతాలవి. అవి ఇంకా పెరిగితే భూమినే మింగేస్తాయి. ఇప్పటికే భూగోళం సగం కలుషితమైంది. మిగిలిన సగం కాలరక్కసి నోట చిక్కితే మనిషన్న వాడు భూగోళం మీద మిగలకపోవచ్చు. అంతా అరిష్టం. అంతా ప్రళయం.

మనుషుల దురాలోచన వల్ల భూగోళం జబ్బుపడ్డది. మనిషి ఆలోచన సక్రమంగా ఆరోగ్యప్రదంగా లేదు. భూమి మీద మంచిగా ఆలోచించేవారు తక్కువగా కనిపిస్తున్నారు. చూడు! తలలు విదుల్చుకున్న విష నాగులెన్నో! ఈ భూమి ఇంత విషాన్ని ఎట్లా భరిస్తోంది! ఇంత దుర్మార్గాన్ని ఎలా సహిస్తోంది! ఈ లోకంలో మనమూ బ్రతుకుతున్నందుకు సిగ్గుగానూ, భయంగానూ ఉంది.”అట్లా లామాగారు తన బాధ వ్యక్తం చేస్తుండగా నీలం కిరణాలు పసుపు రంగులోకి మారసాగాయి. తర్వాత గులాబీ రంగు సంతరించుకుని నెమ్మదిగా ఒక చిత్ర వర్ణమాలిక తయారైంది.

"ఏమిటా రంగుల వలలు మహాశయా?" అడిగాను ఉత్సుకతతో.

"అవి మీ వంటి మహాత్ముల భావ తరంగాలు స్వామి."

"అవును. ఒకటి నిజం. మా వల్ల అని కాదు, మనందరి వల్ల అను. మీరు వేరు మేము వేరు కాదు. అందరం ఒక్కటే. అందరి తపోఫలం కలుస్తుంది.

దుర్మార్గపు ఆలోచనలు (నెగెటివ్ థింకింగ్) వల్ల చుట్టూ నల్ల మబ్బులు కమ్మాయి. రుషుల తపస్సు వల్ల కాంతి కిరణాలు దూసుకువచ్చి ఆ మేఘాలను చీల్చుతున్నాయి. అయితే ఆ చీకట్లను పోగొట్టగలిగినంత వెలుగు తయారు కావటం లేదు. కొద్దిమంది తపోశక్తి చాలడం లేదు. జనంలో Positive Thinking పెరగాలి. లోకంలో మంచి వారి సంఖ్య తగ్గి, చెడ్డవారి జనాభా పెరిగిపోతోంది.

“దానికి పరిష్కారం లేదా లామాజీ?”

“ఏం పరిష్కారం బాబూ! అటు చూడు తారాదేవి ఏడ్చి ఏడ్చి అలిసిపోయింది. ఇంక ఆ జగజ్జననికి ఏడ్చే ఓపిక లేదు. ఏడ్చినా కారడానికి కన్నీరు మిగలలేదు. ఎండిపోయింది హృదయం. పరిష్కారం ఒక్కటే స్వామి. మానవత్వంలో పవిత్రత పెరగాలి. మనిషిలో మంచితనం పెరగాలి. ఆధ్యాత్మికత పెరగాలి. తపోశక్తి వల్లనే ఈ జీమూతాలు వదిలిపోతాయి. కారు మేఘాలు కరిగిపోతాయి. మా అర్హతులు, లామాలు చేస్తున్న తపస్సు చాలడం లేదు. చెడును తగ్గించగలుగుతున్నాం గాని మంచిని పెంచలేకపోతున్నాం. మనిషి దృక్పధంలో మార్పు రావాలి. అభిరుచి పెరగాలి. ఆశయం మారాలి.”

"అందుకు నేనేమైనా చేయగలనా మహాత్మా?" అని అడిగాను.

"చూద్దాం' పరమ గురువులు నిన్నెందుకు రప్పించారో తెలియదు. ప్రయోజనం లేని పనిని వారు తలపెట్టరు. నీవల్ల కాగల కార్యం ఏదో ఉండే ఉంటుంది. చూద్దాం.”

అప్పుడు నీటి మీద 'తారాదేవి' ప్రతిబింబం స్పష్టంగా కనిపించింది.

'శుభ సూచన' అన్నాడు లామా!
🪷

*సశేషం* 

꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*

No comments:

Post a Comment