*అల్పబుద్ధులు.....*
*యామిమాం పుష్పితాం వాచం ప్రవదన్త్యవిపశ్చితః*
*వేదవాదరతాః పార్ధ నాన్యదస్తీతి వాదినః*
*ఇది భగవద్గీతలో రెండవ అధ్యాయములోని 42వ శ్లోకం. దీని అర్ధం – అర్జునా! వేదోక్త కర్మలయందు అనురక్తులైన అవివేకులు వేదంలో చెప్పిన కర్మకండ తప్ప మరొకటిలేదు అనేవారు పుష్పించిన పూలవలె శోభాయమానమగు మాటలు పలికెదరు. దీనికి శంకరాచార్యుల వారికిచ్చిన భాష్యమును చూద్దాం – వేదవాదరతులు అంటే వేదోక్త కర్మలయందు ఆసక్తులు ఈ అల్పబుద్ధులయిన అవివేకులు పూచిన చెట్టువలె చెవులకు ఇంపైన మాటలు మాట్లాడుతారు. పూచిన చెట్టు చూపులకు ఎంత ఇంపుగా ఉంటుందో చెవులకు అంత ఇంపుగా ఉండే మాటలు అని అర్ధం చెప్పుకోవచ్చు. దీన్ని బాగా అర్ధం చేసుకొనే ప్రయత్నం చేద్దాం. సాక్షాత్తు శ్రీకృష్ణపరమాత్ముడు తనకు అత్యంత ప్రియమైన అర్జునునకు చెప్పిన విషయమిది.*
*మనకు శ్రీకృష్ణుడన్నా, భగవద్గీత అన్నా ఎంతో భక్తి, మరెంతో గౌరవం. మరి శ్రద్ధగా అవగాహన చేసుకోవాలి కదా! వేదోక్త కర్మలయందు అనురక్తులైన వారిని ‘అవివేకులు అని అంటున్నాడు శ్రీకృష్ణుడు.* *అలాంటి వారిని పొగడటం లేదు. అవివేకులు ‘అవిపశ్చితః అని నిందిస్తున్నాడు. వారు వేదములో చెప్పిన కర్మకాండ తప్ప మరొకటి లేదనుకొంటారట. వారు అనుకొని, వారు మాత్రమే దాన్ని ఆచరిస్తే సరి. అలా కాదు వారు తేనెలాగ తియ్యని, కమ్మని, చెవులకు ఇంపైన మాటలు చెప్పి ఇతరులను కూడా మభ్యపెట్టే మోసగారట. వారి పట్ల జాగ్రత్త వహించమని శ్రీకృష్ణుడు ఇక్కడ స్పష్టంగా హెచ్చరిస్తున్నాడు.* *శంకరాచార్యుల వారు కూడా వేదోక్త కర్మలయందు ఆసక్తులైన వారిని ‘అల్పబుద్ధులని, ‘అవివేకులు అని చెప్పారు.*
*మరి మనం నిజంగా శ్రీకృష్ణపరమాత్మను ఆయన చేసిన బోధను గౌరవించే వారమైతే ఫలాన మహర్షి ఫలాన రాజుకు సంతానం కలగాలని వేదంలో చెప్పబడిన ఫలాన యాగం చేయించాడు, పంటలు పండాలని ఫలానా యజ్ఞం చేయించాడు.*
*ఇంకా ఏదో లభించాలని ఆ హోమం చేయించాడు. ఈ యాగం చేయించాడు. అని ఎవరైనా చెబితే ఆ మహర్షిని, ఆ రాజును ఏమనాల్సి ఉంది? ఆనాడు ఆ మహర్షి, ఆ రాజు చేశారు కాబట్టి ఈనాడు మనమూ వేదోక్తమైన ఆ యజ్ఞాన్ని, ఆ యాగాన్ని చేద్దామనేవారిని, చేయటానికి సిద్ధమయ్యేవారిని ఏమనాలి? తర్వాతి శ్లోకంలో శ్రీకృష్ణుడు ఏమి చెబుతాడో చూడండి – ‘కామాత్మానః స్వర్గపరాః జన్మకర్మఫలప్రదామ్.*
*క్రియా విశేష బహులాం భోగైశ్వర్యగతిం ప్రతి*
*శ్లోకం 43- 2వ అధ్యాయం – ఈ శ్లోకము యొక్క అర్ధము వారు వాంఛాపరులు. స్వర్గమే అత్యుత్తమము అన్న అభిప్రాయం కలవారై భోగైశ్వర్యప్రాప్తి కొరకు చేయవలసిన అనేక క్రియా విశేషాలు చెపుతారు. వారు చెప్పి కర్మలు జన్మలకు కారణం. దీనిపై వ్యాఖ్యానిస్తూ శంకరులవారు ‘ఈ మూఢులు సంసారంలో మరణిస్తూ పుడుతూ ఉంటారు అని అంటాడు. ఈ అధ్యాయంలోని 45వ శ్లోకంలో శ్రీకృష్ణపరమాత్ముడు వేదాలను గురించి ఇలా చెబుతాడు.*
*త్రై గుణ్య విషయా వేదా* *నిస్త్రై గుణ్యో భవార్జున*
*నిర్ద్వన్ద్వో నిత్య సత్త్వస్థో నిర్యోగ క్షేమ ఆత్మవాన్*
*అంటే ఓ అర్జునా! వేదాలు త్రిగుణాత్మకములగు విషయములను తెలుపునవిగా ఉన్నవి. నీవు త్రిగుణములను వదలిన వాడవును, ద్వంద్వములు లేనివాడవును, నిరంతరం శుద్ధ సత్త్వమునాశ్రయించినవాడవును, యోగక్షేమముల దృష్టి లేని వాడవును, ఆత్మజ్ఞానియు కమ్ము అని అర్ధము చూడండి శ్రీకృష్ణ పరమాత్ముడు వేదవాదరతులను అల్పబుద్ధులని, అవివేకులు అని పేర్కొంటూ, వారు ఇతరులను తియ్యటి కబుర్లతో చేజిక్కించుకొంటారని హెచ్చరిస్తూ, త్రిగుణాత్మకమైన విషయాలను గూర్చి వేదాలు చెబుతాయని వాటి వలలో చిక్కుకోక వాటిని అధిగమించి పొమ్మని తన ప్రియభక్తునకు హితబోధ చేస్తున్నాడు. ఈ శ్లోకాల సారాన్ని మనం గ్రహించి జీవిస్తే ఎంతో వృధా శ్రమ తగ్గుతుంది. కాలం దుర్వినియోగం కాక సద్వినియోగం అవుతుంది. శుష్క పాండిత్యమున్న వారిని నమ్మక సర్వజ్ఞుడైన శ్రీకృష్ణపరమాత్ముని మాటలను విశ్వసించి, బోధను ఆచరించి ధన్యజీవులమవుదాం.*
*┈┉┅━❀꧁🌺ॐ🌺꧂❀━┅┉┈*
*ఆధ్యాత్మికం ఆనందం*
🌹🌹🌹 🙏🕉️🙏 🌹🌹🌹
No comments:
Post a Comment