Sunday, January 12, 2025

 (శంకర విజయము )

(ఎపిసోడ్  7 )

""" ద్విజత్వం విధ్యనుష్టానాత్, విప్రత్వం వేదపాఠతః,
బ్రహ్మత్వం బ్రహ్మవిజ్ఞానాత్, ఇతి వేదాంత డిండిమః""

సాధకులైనవారు ద్విజత్వము, విప్రత్వము మరియి బ్రాహ్మణత్వము   కోసము సహజముగ  ఆరాటపడుతుంటారు. కానీ మూల కారణమైన బ్రహ్మత్వం సిధ్దించాలంటే  సాధకుడు తన విధ్యుక్త ధర్మాన్ని విధిగ నిర్వహించడము వల్ల ద్విజత్వము, వేద పఠనమువలన విప్రత్వము ,బ్రహ్మజ్ఞానం వలన బ్రాహ్మణత్వము సిధ్దిస్తాయని వేదాంత భేరి తెలియచేస్తున్నది. శంకరభగవత్పాదుల వారు తమ  వేదాంత డిండిమః లో ఇదే విషయాన్ని స్పష్ట పరుస్తున్నారు.

"" యావత్ పవనో నివసతి  దేహే, తావత్ పృఛ్చతి కుశలం గేహే,
గతపతి వాయౌ దేహాపాయే, భార్యా బిభ్యతి తస్మిన్ కాయే""

ఒరే తండ్రీ!  తెలుసుకోరా! శరీరములో నీకు ఊపిరి యున్నంతవరకే  నీ పరివారము నీ కుశలము గురించి వాకబు చేస్తారు. దేహములో ఆ కాస్త వాయువు అనగా ప్రాణము కాస్త వెడలి పోతే ,దేహము చెడిపోగానే దాన్ని చూచి నీ"" భార్యకూడ""  భయపడి దూరముగ వెళ్లిపోతుంది.  దీని కోసమేనా  నీవు సంసార జంజాఠములో చిక్కుకొని అలమటిస్తున్నావని శంకరులు పై విధముగ హెచ్చరిస్తున్నారు.

వెనుకటికి ఒక ఆఫీసరు తన ఉద్యోగ ధర్మముమీద వారము రోజుల్లో ఆరు దినాలు గ్రామాంతరము వెడుతుండేవాడు. మిగతా రెండు రోజులు  పెండ్లాముతో  గడిపేవాడు.భర్త తన దగ్గర ఉండేది ఆ రెండు రోజులే కనుక చాలా ప్రేమగ ఆదరించేది.కమ్మని భోజనము చేసి ఆరబయట భర్త ఒళ్లు మరచి నిద్రిస్తుంటే గోముగా లోపలికి రమ్మని ప్రేమగా పడకగదిలోకి తీసుకొని వెళ్లేది.మీరు లేనిదే నేను బ్రతకలేనని గారాలు పోయేది.తన భార్య ఆదరాభిమానాలకి వాడు మురిసి పోయేవాడు.కొంతకాలానికి కాలపరిణామాలకి అనుగుణముగ అతని ఆయుష్షు తీరింది.
బంధువులందరు వచ్చారు.ఓదారుస్తున్నారు. ఒక పెద్దమనిషి వచ్చి "" అమ్మా చీకటి పడింది " దహన కార్యక్రమాలు రేపు చేద్దాము. తలదగ్గర దీపము ఆరిపోకుండగ జాగ్రత్తగ ఈ రాత్రికి గడుపు. రేపు మేమంతా వస్తామనగానే  ఆ భార్య అమ్మో ""ఈ శవ జాగరణ నాకు భయము మీరంతా తోడు ఉండాల్సిందే యని గోల చేసింది. 
చూసారా నిన్నటి దాక మీరు లేక పోతే నాకు తోచదు. లోపలికి రమ్మని గారాలు పోయిన స్త్రీమూర్తి భర్త శరీరములో గాలి పోగానే భర్తకు "" శవమని" పేరుపెట్టి శవజాగరణ చేయలేనంటున్నది.
అందుకనే భగవత్పాదులవారు""గతపతి వాయో దేహా పాయే" అంటూ ఒరే నాయనా ఎందుకురా ఈ సంసార బంధాలు.ఈ ప్రేమలు శరీరములో గాలి ఉన్నంత వరకేరా అది కాస్త దూరమౌతే ఎవరికి ఎవరురా?  
యోచన చేయరా నాయనా యని శంకర భగవత్పాదులవారు తమ ""భజ గోవింద" శ్లోకాలలో మనకి హితవు పలుకుతు "" శరీరమాద్యం ఖలు ధర్మసాధనం"" పరమాత్మ మనలకిచ్చిన ఏకైక సాధనము  శరీరము.దానిద్వారా బ్రహ్మ జ్ఞానాన్ని సాధించి ఆధ్యాత్మిక  చింతనతో మోక్షాన్ని సంపాదించమని ఉపదేశమిస్తు "" నిత్యం భగవన్నామ స్మరణ" తో తరించమని శరీరవ్యామోహం వీడమంటు

ఓరి సాధకుడా! జంతువుల శరీరాల  మరణానంతరము వాటి ఎముకలు గోళ్లు, చర్మము అనేకరకాలుగ ఉపయోగపడతాయి.మానవ శరీరము నుండి గాలి వీడిన తర్వాత వాడి కాయానికి ఏ మాత్రము విలువలేదని తెలుసుకొని శరీరవ్యామోహము వీడి '" భజ గోవిందం  భజ గోవిందం  గోవిందం భజ మూఢమతే"" అని హెచ్చరికలు చేస్తు దైవస్మరణలో కాలాన్ని సద్వినియోగము చేసుకొమ్మని  ఆత్మ  ప్రభోధము చేస్తున్నారు.

హర  హర మహాదేవ  శంభో శంకర.
.

No comments:

Post a Comment