Sunday, January 19, 2025

 ☘️🍁  ఆప్తవాక్యాలు  🍁☘️


79. సిద్ధాః స్వాంతస్థమీశ్వరమ్

శ్రద్ధావిశ్వాసాలే పార్వతీపరమేశ్వరులు (శ్రీరామచరిత మానస్)

'భక్తి' అనే దివ్యభావనకు ప్రధాన శక్తులు రెండు - అవి: శ్రద్ధ, విశ్వాసం

శ్రద్ధ - అనే మాట చాలా లోతైనది. ప్రధానంగా - 'ఏకాగ్రమైన బుద్ధి' అని అర్థం చెప్పవచ్చు. 'శ్రత్’, ‘ధీయతే' - అనే రెండు శబ్దాలతో ఈ పదం ఏర్పడిందని వేదనిరుక్తం చెబుతోంది. 'శ్రత్' అంటే 'సత్యం' అని అర్థం. సత్యం కోసం బుద్ధి చేసే ప్రయత్నాన్ని
'శ్రద్ధ' అంటారు.

ఏదేమైనా, నిశ్చలమైన శ్రద్ధ దేనినైనా సాధింపజేయగలదు. శ్రద్ధ లేనివాడు ఏ
రంగంలోనూ అభివృద్ధిని సాధించలేడు. లౌకిక సాధనలకు అవసరమైన వాటికన్నా,కొన్నిరెట్లు అధికంగా ఆధ్యాత్మిక సాధనలకు అంతశ్శక్తులను వినియోగించుకోవాలి.
ఆ కారణం చేతనే శ్రద్ధా, విశ్వాసాలను ఆధ్యాత్మికరంగంలో అత్యంత ప్రధానంగా పేర్కొన్నారు.
-
"శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరస్సంయతేంద్రియః”

- 'శ్రద్ధగలవాడు 'తత్పరుడై' (అదే దీక్షతో) ఇంద్రియాలను నిగ్రహించి జ్ఞానం పొందుతాడు" - అని గీతాచార్యుని వచనం.

“అజ్ఞశ్చ అశ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి" - అని కూడా గీతోక్తి.

“తెలివిలేనివాడు, శ్రద్ధలేనివాడు, సంశయాత్ముడు నశిస్తాడు” అని దీని భావం.శివపురాణంలో శివుడు పార్వతితో అన్నమాటలు: "శ్రద్ధామయ్యస్తి చేత్పుంసాం
యేన కేనాపి హేతునా వశ్యః స్పృశ్యశ్చ దృశ్యశ్చ పూజ్యః సంభాష్య ఏవచ” - “నాపై శ్రద్ధగలవానికి నేను లొంగిపోతాను. అతడు నన్ను తాకగలడు, చూడగలడు,
పూజించగలడు, మాట్లాడగలడు" - అంటే 'భగవంతుని అనుభవాన్ని పొందగలడు' అని తాత్పర్యం. ఈ మాటను అర్థం చేసుకుంటే - ఒక కన్నప్ప, ఒక సక్కుబాయి, ఒక
తుకారాం... ఇలా ఆధ్యాత్మిక సాధకులు భగవంతుని ఎలా సాక్షాత్కరింపజేసుకొని,తమవాణ్ణి చేసుకున్నారో అర్థమవుతుంది. 'శ్రద్ధ'ను ఒక దేవతగా ఉపాసించి, శ్రద్ధాశక్తిని పొంది ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చు అని వేదవాఙ్మయంలో -'శ్రద్ధాసూక్తం' చెబుతోంది.

శ్రద్ధ కుదరకపోతే బతుకు నడకలో ప్రతిదీ కుంటిదౌతుంది. శ్రద్ధకు తోడుగా
ఉండవలసింది - 'విశ్వాసం'. ఈ రెండిటిదీ ఎంత గాఢమైన అనుబంధమంటే భార్యాభర్తల బంధమంత బలీయమైనది. అందుకే తులసీదాసు 'శ్రీరామచరితమానస్'లో

భవానీశంకరౌ వందే శ్రద్ధావిశ్వాస రూపిణె,
యాభ్యాం వినా న పశ్యన్తి సిద్ధాః స్వాంతస్థమీశ్వరమ్||

“శ్రద్ధావిశ్వాసాలే పార్వతీపరమేశ్వరులు. అవి లేనిదే సిద్ధులు తమ అంతరంగంలోని
ఈశ్వరుని దర్శించలేరు” అని వచించాడు.

ఏకశరీరంగా అన్యోన్యతను సాధించిన శివశక్తుల్లాంటివి శ్రద్ధావిశ్వాసాలు.

“విశ్వాసం” అనేది శ్రద్ధకు ప్రేరకం. శ్రద్ధ విశ్వాసానికి ఉత్ప్రేరకం.

"విశ్వాసం సఖ్య లక్షణం" - అని శాస్త్రోక్తి.

సఖ్యానికి (స్నేహానికి, ప్రేమకు) విశ్వాసమే లక్షణం. భక్తిలో స్నేహమే (ప్రేమ) ప్రధానం. అందుకు విశ్వాసమే ఆధారం. “నాకు మంచి జరుగుతుంది" అనే విశ్వాసం ఒక విధం. “నాకు జరిగేదంతా మంచిదే" అనే విశ్వాసం మరో విధం. ఈ రెండో తరహా విశ్వాసం చాలా ప్రధానం. జీవితానికి కూడా ఇది ఆరోగ్యకరమైన సూత్రమే.

తనను నిరంతరం గమనించే తన స్వామికి తనను తాను అంకితం చేసుకున్నవాడు,ప్రతి అనుభవాన్నీ భగవద్దత్తమైన వరంగా భావిస్తాడు. బ్రతుకులో ప్రతి అనుభూతిలో
భగవత్కృపనే దర్శిస్తాడు. అతనికి జరిగే సంఘటనల ఫలితాలు ప్రధానం కాదు. ఆ ఘటనలు దైవలీలలుగా చూస్తూ పులకించిపోతూ, ఆ భగవదనుభవంలో ధన్యతను
పొందుతాడు.

శ్రద్ధను 'ఏకాగ్రత, తత్పరత' అని నిర్వచిస్తే, విశ్వాసాన్ని ‘శుభభావన' అని చెప్పవచ్చు.ఈ రెండూ ఉన్నప్పుడు విజయం లౌకికంగాను ఆధ్యాత్మికంగానూ సాధ్యమే.

ఈ రెండిటినీ కేవలం ఆధ్యాత్మిక శక్తులుగానే కాక, ప్రతివ్యక్తీ జాగృతం చేసుకోవలసిన అంతశ్శక్తులని గ్రహించాలి. పరమేశ్వరునే పట్టి ఇవ్వగలిగే ఈ రెండు శక్తులనూ
సాధ్యం చేసుకుంటే దేనినైనా సాధించగలం.     

No comments:

Post a Comment