Thursday, January 23, 2025

 ☘️🍁  ఆప్తవాక్యాలు  🍁☘️


84. అచ్చమైన దాంపత్యధర్మం
భారతీయ దాంపత్యజీవితంలో కామాన్ని గౌరవించారు. ధర్మబద్ధమైన దంపతీ. కామం భగవత్ స్వరూపమే. ఇది వంశవృద్ధికి హేతువు. అంతేగానీ దాంపత్యంలోకామమే సర్వస్వం కాదు. అది ఒక భాగం మాత్రమే! ప్రాధాన్యమంతా కామాతీతమైన
ప్రేమకీ, పరస్పర గౌరవానికీ, పరస్పర ధర్మపాలనకీ.

ఈ ధర్మపాలన, గౌరవం శ్రీ శారదాదేవి - రామకృష్ణ పరమహంస దంపతులు
చెప్పిన ఆదర్శం. మనబోటి సామాన్యులకు పరమహంస చెప్పిన ఒక సందేశం.“దంపతులు ఒకరిద్దరు (పరిమిత) సంతానాన్ని (వారసులను) పొందాక ఆత్మోన్ముఖులై ధర్మపాలనలో, ఆధ్యాత్మిక జీవితంలో, తత్త్వ విచారణలో పురోగమించాలి" అంటే నెమ్మదిగా కామనాసక్తిని త్యజించాలి. ఈ సందేశం ఏదో మనకు కాదన్నట్లుగా అందనంత ఎత్తులో ఉన్నట్లుగా అనిపిస్తుంది. కానీ మన సంస్కృతికి స్వాభావికమైన
ఉదాత్తత ఇది.

ఆత్మనిగ్రహం - ఇదే వ్యక్తి సమస్యకీ, క్రమంగా సామాజిక సమస్యలకీ పరిష్కారం.ఈ ప్రాథమిక సూత్రాన్ని కాదనడం వల్లనే ఇప్పుడు భయంకరమైన సమస్యలు
భూతాలై మనల్ని ఆక్రమించుకుంటున్నాయి.

'ఇంద్రియ నిగ్రహం' సన్న్యాసి ధర్మమో, ఆధ్యాత్మిక నియమమో మాత్రమే కాదు.అది మానవ సుఖ జీవనానికి మార్గదర్శక సూత్రం. 'తాత్కాలిక సుఖం కోసం శాశ్వత ప్రయోజనాలను కోల్పోవద్దు' అని హెచ్చరించే మహామంత్రమిది.

ఆధ్యాత్మిక వీధిలో పరాకాష్ఠకు చేరుకున్న పరమహంసల్లా ఏ మాత్రమూ కామభావన
లేనిస్థితి సామాన్యులకు అసాధ్యమే. అలాగని వారి జీవితంలోని స్ఫూర్తిని
వదులుకోరాదు. వివేకంతో గమనించి శాయశక్తులా అనుసరించడం సాధ్యమే.

అందుకే మనకు 'స్వయోషితి రతిః' - తన స్త్రీ యందు మాత్రమే ఆసక్తి ఉండాలని పూర్వీకులు నియమించారు. మానవుని స్వాభావిక శరీరధర్మాన్ని ధార్మిక పరిధిలో
నియంత్రించడం వల్ల సుఖశాంతికర జీవితాన్ని సాధించే విధానం ఏర్పడింది. అది ఆరోగ్యకర సమాజాన్ని ఏర్పరచే ధోరణి. ఇది మొదటి మెట్టు.

క్రమంగా నియమపాలనలో ఆత్మనిగ్రహణను పాటించే తాత్విక చింతనలో పురోగమించడం రెండవ మెట్టు. ఈ రెండవ మెట్టు కుటుంబనియంత్రణా పద్ధతిలో
స్వాభావిక సరళి. ఇటువంటి మానసిక స్థాయిని సమాజంలోని వ్యక్తులకు ఏర్పరచడంలో మేధావులు, పాలకులు, మాధ్యమ రంగం కృషి చేస్తే ఎంతో శ్రేయస్కరం.

ఈ రెండు మెట్లు నిగ్రహణ పద్ధతిని నినాదాలతో, చర్చలతో, హోర్డింగులతో అందిస్తే బాగుంటుంది. “ఒక జంతు రాజుగారు నిగ్రహణ శక్తి వల్ల వ్యాధిగ్రస్తుడు కాలేదు" అని ప్రచారం చేయడం బాగుంటుంది కానీ “అక్రమ సంబంధాలున్నా
ప్రమాదకరం కాని మార్గాన్ని ఎంచుకున్నాడు" అని మెచ్చుకుని మార్గం సూచించడం,పరిణతి పొందిన ఈ నాగరిక దేశంలో శోచనీయాంశం. అక్రమ సంబంధాలలో ప్రమాదకరం కాని పరిష్కార పదార్థాలను సూచిస్తూ ప్రబోధించడం, ఒక విధంగా
అక్రమాన్ని ఆమోదించడమే. ఇది పాలనావ్యవస్థకు తగని పని.

దేశ మేధావులు ఈ సంస్కృతిలోని ప్రధానాంశాలను ప్రజా జీవితంలో ప్రసరించేలా ప్రభావితం చేయాలి. నైతికత అనేది కేవలం ఆధ్యాత్మికాంశం కాదని, జీవిత విధానమని ప్రబోధించే పద్ధతులు ఏర్పరచాలి. విషవృక్షాన్ని కొమ్మలు నరికితే సరిపోదు. మూలానికీ
మందు పెట్టాలి. శారీరకంగా ఆరోగ్యాన్ని కాపాడడమే జాతి పరమార్థం కాదు.బలిష్ఠమైన, దృఢమైన మనో భూమికను ఏర్పరచాలి. అందుకు “ఆత్మనిగ్రహణ” అనే మంత్రమే శరణ్యం.

ఒక యోగి మనోవికారాన్ని సంపూర్తిగా జయించుతాడు. ఆ యోగిని ఆదర్శంగా తీసుకున్న సామాన్యుడు మొదట మనోవికారాలను నిగ్రహించుకుంటూ, క్రమంగా
జయించుతాడు. అదే భారతీయ కుటుంబ జీవన సరళి.

స్త్రీని మాతృమూర్తిగా సంభావించి శక్తి స్థానంగా ఆరాధించిన మన ప్రాచీనాదర్శాన్ని ప్రతిష్ఠించిననాడు... ప్రపంచంలోనే మహావ్యాధి సమస్య పరిష్కృతమవుతుంది. భార్యకు
కూడా మాతృస్థాయినీ, స్థానాన్నీ ఇచ్చిన మహాత్ముని ఆదర్శాన్ని... మన పరిధిలో మనం గ్రహించగలిగి, సవ్యమైన విధానంలో నేటి, భావితరానికి అందించగలిగిననాడు
(ఆశించే)ఆరోగ్య ప్రపంచాన్ని ఆవిష్కరించుకోగలం.            

No comments:

Post a Comment