వేదాంత పంచదశి. అద్వితీయ బ్రహ్మతత్త్వే స్వప్నోఽ యమఖిలంజగత్ ౹
ఈశ జీవాది రూపేణ చేతనాచేతనాత్మకమ్ ౹౹211౹౹
211. అద్వితీయమగు,రెండవది లేని,బ్రహ్మతత్త్వమునందు ఈ అఖిల జగత్తు ఒక కల మాత్రమే.
ఈశ్వరుడు జీవుల చేతనములు అచేతనములు అన్నీ కలలోనివే.
ఆనందమయ విజ్ఞానమయా వీశ్వర జీవకౌ ౹
మాయయా కల్పితావేతౌ తాభ్యాం సర్వం ప్రకల్పితమ్ ౹౹212౹౹
212. ఆనందమయకోశము విజ్ఞానమయకోశముల రూపమున ఈశ్వరుని,జీవులను మాయ కల్పించెను.ఈ దృశ్యమాన జగత్తంతా ఈశ్వర జీవుల సృష్టియే.
ఈక్షణాదిప్రవేశాన్తా సృష్టిరీశేన కల్పితా ౹
జాగ్రదాది విమోక్షాన్తః సంసారో జీవకల్పితః ౹౹213౹౹
213. సృష్టిని కల్పించుట మొదలు అందు ప్రవేశించుట వరకు ఈశ్వరుడు కల్పించెను.జాగ్రదవస్థ మొదలు మోక్షము వరకు గల సంసారమును జీవుడు కల్పించెను.
వ్యాఖ్య:- ఈశ్వర జీవరూపములో చేతనా చేతనాత్మకమైన మనకు కనిపించే సమస్త జగత్తూ అద్వితీయ బ్రహ్మమునందు స్వప్నంలాగానే ఉన్నదని గ్రహించాలి.
"త్రయమప్యేతత్సప్తం స్వప్నం మాయామాత్రమ్"
నృ.ఉ.తా.1 అనే శ్రుతి ననుసరించి జాగ్రత్,స్వప్న,సుషుప్తులనే మూడూకూడా సుషుప్తే !
స్వప్నమనేది మాయ.
అంటే , ఈ జగత్తు స్వప్న మాత్రమే అని తెలుస్తొంది.
జీవేశ్వరు లిద్దరూ బ్రహ్మముకంటే భిన్నులు కాదు కదా!
అయినప్పటికీ వారిని ఈ సంసారంలో ఉన్నట్లుగా ఎందుకు చెప్పారంటే,
ఈశ్వరుడు ఆనందమయుడు. జీవుడు విజ్ఞానమయుడు.
ఇద్దరూకూడా మాయచేత కల్పించబడ్డవారే!ఈ ఇద్దరే సమస్త జగత్తునూ కల్పించారు. అందుచేతనే ఈ ఇద్దరినీ జగత్తులోని వారినిగా అంగీకరిస్తున్నారు.
ఇక ఈశ్వరుడు,జీవుడు ఇద్దరిలో ఎవరు ఎంతవరకు జగద్రచన చేస్తున్నారు ?
ఈ దృశ్యమాన జగత్తంతా ఈశ్వర జీవుల సృష్టియే.
ఈ క్షణం మొదలుకొని జీవరూపంలో శరీరమునందు ప్రవేశించటం వరకు జరిగే సృష్టి ఈశ్వరకల్పితం.అంటే,
ఐతరేయోపనిషత్తులో
"స ఐక్షత లోకాన్ను సృజా ఇతి"
ఐ.4-1-2.నేను లోకాన్ని సృష్టిస్తాను అని సంకల్పించటం మొదలుకొని
"ఏతయాద్వారా ప్రాపద్యత"
బృ.4-3-12.మూర్థాన్ని చీల్చుకొని ఛిద్రంలో జీవరూపంలో ప్రవేశించటం వరకు శ్రుతిలో చెప్పిన విషయం ఈశ్వరకల్పితం అన్నమాట.
అట్లాగే,జాగ్రదాదులతో ఆరంభమైన మోక్షపర్యంతము జరిగే సంసారం జీవకల్పితం.
"తస్యత్రయ అవసధాః"
ఐ.4-3-12
ఆ జీవాత్మకు జాగ్రత్,స్వప్న, సుషుప్తులనే మూడు అవస్థలున్నాయి అనేది మొదలుకొని"స ఏతమేవ పురుషం బ్రహ్మం త తమమపశ్యత్"
ఐ.4-3-13,అతడు ఆ పురుషుణ్ణే వ్యాపక బ్రహ్మ రూపంలో చూడు అన్నంతవరకు జీవకల్పిత మన్నమాట.అంటే,
జాగ్రదాది మోక్షపర్యంతము సృష్టి అంతా జీవనిర్మితం.
(7-వ ప్రకరణం 4వ శ్లోకం చూడండి)
పరబ్రహ్మనే పరమార్థ తత్త్వంగా భావించినప్పుడు ఇంకా ఈ జీవుడు ఈశ్వరుడు అనే విప్రతిపత్తి వివాదం ఎందుకు ?
ఈ అఖిల జగత్తు ఒక కల మాత్రమే.ఈశ్వరుడు జీవుల చేతనములు అచేతనములు అన్నీ కలలోనివే.
"అద్వితీయమగు రెండవదిలేనిదే బ్రహ్మతత్త్వము".
"సత్యము అఖండబ్రహ్మము మాత్రమే".
అద్వితీయం బ్రహ్మతత్త్వం మసఙ్గం జానతే ౹
జీవేశయోర్మాయికయోర్ వృధైవ కలహం యయుః ౹౹214౹౹
214. అద్వితీయము సంగరహితము అగు బ్రహ్మతత్త్వమును ఎరుగని వారూ మాయాకల్పితములగు జీవేశ్వరులను గూర్చి వాదవివాదాలు చేయుదురు.
జ్ఞాత్వా సదాతత్త్వనిష్ఠాననుమోదామ హే వయమ్ ౹
అనుశోచామ ఏవాన్న భ్రాంతైర్వివదామహే ౹౹215౹౹
215. తత్త్వనిష్ఠులైన వారితో సంతోషము నొందుదుము ఇతరుల పట్ల సానుభూతి చూపుదుము.భ్రాంతులతో తగవు మాత్రము పెట్టుకొనము.
[26/02, 11:34 PM] sunithapidugu: వ్యాఖ్య:- జీవేశ్వరులకు సంబంధించిన విప్రతిపత్తి అజ్ఞానమూలకము అయినందువలన
అద్వితీయుడు,అసంగుడు అయిన పరమాత్మ తత్త్వాన్ని తేలుసుకోక పోవటం వలన మాయవలన కల్పింప బడిన జీవేశ్వరుల విషయములో అనవసరంగానే వివాదరూపమైన కలహం జరుగుతూ వుంది.
జీవుడు-ఈశ్వరుడు అనే వివాదం ఎందుకు?
అజ్ఞానమూలకమన్నమాట.
అటువంటప్పుడు వారికి సరియైన జ్ఞానము కలిగించాలి గదా! అంటే-
అజ్ఞానమూలమున కదా వాదవివాదములు చేయుదురు. వారికి యధార్థమును భోధింపవలదా అనే ప్రశ్నకు సమాధానము చెప్పబడినది.
సత్యాన్వేషులగు వారికి సంతోషముగ బోధింపవచ్చును. సత్యమక్కర లేక అసత్య విషయములలో ఆనందించే వారి పట్ల సానుభూతి చూపవచ్చును.
కాని సత్యమును గూర్చి భ్రాంతిచెంది తాము చెప్పినదే సత్యమని కలహించే భ్రాంతులకు బోధింపబూనుట వృధాశ్రమ. అట్టివారితో వివాదమునకు తలపడటము సముచితము కాదు.
తత్త్వ దర్శులైనవారు నిత్యము జాగృతమైనశీలముతో ప్రపంచమునకు వెలుగునిత్తురు. తమ సాంగత్యములోనికి వచ్చినవారందరికీ ఆధ్యాత్మికజ్ఞానము కలిగింతురు,
మూఢమనస్సు కల్పించిన భూతములను తొలగింతురు.
సర్వజీవులను సమదృష్టితో జూచుచుండు ఆత్మనిగ్రహము గలవాడు.క్రియారహితుడు కాడు, క్రియానిమగ్నుడు కూడా కాడు. బ్రహ్మభావము అనుభవగోచరము కాగా ప్రపంచభ్రమణము క్రీడామాత్రమగును
అట్టి మహాత్ముని సన్నిధిలో వ్యక్తి అనుభవించు సంతోషము నిరుపమానమైనది.
No comments:
Post a Comment