Sunday, January 12, 2025

 సరిగ్గా ఏడాదిక్రితం, సంక్రాంతికి పెట్టిన 
నా పాత కథను, కొత్తగా చేరినవారి కోసం, 
మళ్ళీ ఇప్పుడు ఒకసారి పెడుతున్నాను.
అడ్మిన్స్ అనుమతిస్తారని ఆశిస్తున్నాను.
🙏
                    💐💐💐💐

"ఈ తూరుపు - ఆ పశ్చిమం..."
💐💐💐💐💐💐💐💐💐

మహలక్ష్మీ సమానురాలైన అత్తయ్య గారికి,
వాగ్దేవి నమస్కరించి వ్రాయునది. ఉభయకుశలోపరి.

ముందుగా మీకు, మావయ్యగారికి, నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు.

మనకి ఉత్తరాలు రాయడం, చదవడం కూడా అలవాటు తప్పిపోయిన ఈ కాలంలో, మళ్ళీ మీకు 
ఈ ఉత్తరం రాయాలనిపించింది. కారణం...ఫోన్లో చెప్పుకోలేని కొన్ని సున్నిత భావాల్ని ఉత్తరాలు మాత్రమే వ్యక్తీకరించగలవు కాబట్టి !

మీరు మొన్న మీ అబ్బాయితో వ్యక్తపరిచిన 
మీ మనసులోని సున్నితమైన భావాల్ని, ఆయన 
నాకు చెప్పారు. జీవితంలో ఎన్నో ఒడుదుడుకులు, కష్టసుఖాలు చూసి, మీ ఇద్దరు పిల్లల్ని ఎంతో ఆదర్శవంతంగా పెంచిన మీకు, మావయ్యగారికి, ఎప్పుడూ మా అందరి హృదయాల్లో ఎంతో ఉన్నతస్థానం ఉంది...ఉంటుంది.

మీకు తెలుసు...మీ అబ్బాయి ఆఫీసులో ఎంతమందికైనా సమాధానం చెప్పగలరు కానీ...ఇలాంటి సున్నిత కుటుంబ విషయాల్ని నాకు వదిలేస్తారని !

అమెరికాలో వుంటూ, ఎదుగుతున్న పిల్లలున్న తల్లిదండ్రులుగా, ఈ నడివయసులో, వాళ్ళ భవిష్యత్తు, చదువులు, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళ విషయంలో మాకున్న బాధ్యత చాలా పెద్దది. 

కానీ మీ ఇద్దరికీ, ఈ పెద్ద వయసులో, మీ మనవలపట్ల వుండే ఆలోచనలను మేము అర్థం చేసుకోగలం. పైకి చెప్పుకోము కాని, అటువంటి ఆలోచనలే మాక్కూడా ఉంటాయని మీకు తెలుసు. 

ఇక్కడ అమెరికాలో పుట్టి పెరుగుతున్న పిల్లలందరూ, ఇక్కడివాళ్ళ నడవడికల్ని చిన్నప్పటినుంచి చూస్తూ పెరుగుతారు కాబట్టి, మనకి నచ్చని, నప్పని కొన్ని పద్ధతులు, తిళ్ళు, ఇక్కడవాళ్ళు పవిత్ర సంప్రదాయాలుగా భావించే, "బాయ్ ఫ్రెండ్ - గర్ల్ ఫ్రెండ్" లాంటి వాటిని, వాటిని పాటించకపోతే, వాళ్ళకేదో లోపముందని భావించే వాతావరణంలో పెరుగుతూ, చదువులు ఎగ్గొట్టి, స్వేచ్ఛగా తిరుగుతారనే భయాలు...
మనదేశం నుంచి వచ్చి, ఇక్కడ స్థిరపడిన మాలాంటి పేరెంట్స్ అందరికీ ఉండడం సహజం !

మీ మనవల విషయంలో, మీరు అటువంటి అనవసర భయాలు, అస్సలు పెట్టుకోక్కర్లేదని చెప్పడానికే, 
ఈ ఉత్తరం !

నేను, మీ అబ్బాయి కూడా, వాళ్ళని చాలా జాగ్రత్తగా గమనిస్తూ, మన సంస్కృతి, సంప్రదాయాల్ని, పూజలు, పండుగలవంటి వాటిని అక్కడలాగే పాటిస్తూ, వాళ్ళకి మన సంస్కృతిని బాగా వంటబట్టిస్తున్నామని, ఇంట్లో మన మాతృభాషలోనే మాట్లాడడం చిన్నప్పటినుంచి అలవాటు చేసిన కారణంగా, మీ మనవలిద్దరూ కూడా, ఇంట్లో అచ్చతెలుగు వాళ్ళుగాను, బయట అమెరికన్లుగాను, చలామణి అవుతున్నారు. మీరు వాళ్ళకి చిన్నప్పుడే చెప్పిన కథలు, నేర్పిన శ్లోకాలు, భారత, భాగవత, రామాయణ కథలన్నీ బాగా వంటపట్టి, మీ మనవడు...వాళ్ళ స్కూల్లో జరిగిన ఫ్యాన్సీడ్రస్సు పోటీల్లో శ్రీరాముడి వేషం వేసి, మొదటి బహుమతి కొట్టేస్తే, మీ మనవరాలు ఇక్కడ 'ఇండియన్ రాగా' వాళ్ళు పెట్టిన పోటీల్లో, శాస్త్రీయ సంగీతంలో మొదటి బహుమతి పొందడం మీకు తెలుసు, మనందరికీ గర్వకారణం !

మవయ్యగారి సంగీత వారసత్వం దానికి వచ్చింది.

ఆరోజు మీరు ఫోనులో దానికి ఇచ్చిన మెచ్చుకోళ్ళు, పెట్టిన ముద్దులు, అది మరీ మరీ తల్చుకుని మురిసిపోతోంది.

దానికితోడు, వీళ్ళిక్కడ, కొంతకాలంగా, "తెలుగు బడి" అనే సంస్థద్వారా, తెలుగు రాయడం, చదవడం, కొన్ని మంచి మంచి శ్లోకాలు, పాటలు నేర్చుకుంటున్నారు. అక్కడికొచ్చాక, మనవాళ్ళందర్నీ అలరిస్తారు.

మీ ముద్దుల మనవరాలు అక్కడికొచ్చాక, వేసుకుందుకు, తెలుగింటి ఆడపిల్ల డ్రస్సులు నేను సెలెక్టుచేసి, ఆర్దరిచ్చాను. ఆ పార్సిలు, ఈపాటికి 
అందే ఉంటుంది.

వాళ్ళు తెలుగులో మీకు ఉత్తరం రాస్తామని పీకేస్తున్నారు. వాళ్ళ తెలుగు చూసి భయపడకండి. తెలుగు రాయడం కొత్త కాబట్టి, ఒత్తులు, గుణింతాలు పెద్దగా ఆశించకండి...
😃😃

నా మనసులోమాట ఇంకొకటి చెప్పి ముగిస్తాను.
మా పెళ్ళైన కొద్దికాలానికే మాఅమ్మ కాలంచేసిన 
సంగతి మీకు తెలుసు. అప్పటినుంచి, నేను అత్తారింట్లో ఉన్నాననే భావం..ఏ ఒక్కరోజూ నా మనసులోకి రాలేదంటే, ఆ ఘనత మీకే దక్కుతుంది. మీలో మా అమ్మే కనపడేది కానీ, అత్తగారిని నేను ఏరోజూ చూడలేదు ! మీ మనవలకి అమ్మమ్మ - నాయనమ్మ మీరే కాబట్టి, వాళ్ళు మిమ్మల్ని, మావయ్య గారిని, తలుచుకోని రోజుండదు. అందుకే వాళ్ళు మీకు తరచుగా వీడియోకాల్స్ చేస్తుంటారు.

విమానాల్లో అంతంతసేపు కూర్చోడం కష్టంగా వుంటోందని చెప్పి, మీరు కొంతకాలంగా ఇక్కడికి రావడం మానేశారు కాబట్టి, వచ్చే సంక్రాంతికి మేమే అక్కడికి వచ్చేస్తున్నాం.

ముఖ్యంగా, ఎదిగేవయసులో వున్న మన పిల్లలు, నాయనమ్మ, తాతలతో పాటు, మనవాళ్ళందరినీ కలవాలని, మన జన్మభూమి అందాలను, సంప్రదాయాల్ని వాళ్ళకి పరిచయం చెయ్యాలని, సంక్రాంతి ముగ్గులు, పండుగలు, పేరంటాలు చూపించాలని, భోగిమంటలు, హరిదాసులు, గంగిరెద్దులు లాంటి మన తెలుగింటి సాంప్రదాయ పద్ధతుల్ని ప్రత్యక్షంగా చూపించాలని, గుర్రబ్బండి, ఎద్దులబండీ, బల్లకట్టూ ఎక్కించాలనీ, మనూరి చెరువులో గుంపులుగా ఈతలు ఈదే బాతులు, అందమైన తామరపువ్వులు, కలువ పువ్వులు, ప్రకృతిలోని సహజ అందాలు, లేగదూడల గంతులు చూపించాలని, పక్షుల కిలకిలారావాలు వినిపించాలని, ఎప్పటినుంచో అనుకుంటున్న మా కోరిక, ఇప్పటికి నెరవేరుతున్నందుకు ఆనందంగా ఉంది.

నాయనమ్మ, తాతగార్ల ఊరు వెడుతున్నామని చెప్పగానే, మీ మనవలు గంతులేసేస్తున్నారు ! 

కొన్నాళ్ళపాటు, మేమిద్దరం అక్కడినుంచే ఆఫీసు పనులు చేస్తాం. వచ్చే సంక్రాంతి పండుగని, 
మనందరికీ ఎప్పటికీ గుర్తుండిపోయే ప్రత్యేక పండుగగా జరుపుకుందాం ! 

చాలాకాలం తరవాత, మన కుటుంబం అందరం కలుస్తున్నందుకు, ఎంతో థ్రిల్లింగ్ గా వుంది.

మేము వచ్చేటప్పుడు, మీకు, మావయ్యగారికి, 
వదిన వాళ్ళ కుటుంబంలో అందరికీ, ఏమేమి 
తేవాలో చెబితే, తెస్తాము.

అన్నయ్య గారు, వదిన బెంగళూరు నుంచి జనవరి 
12 నాటికి అక్కడికి వస్తున్నామని చెప్పారు. 
మీ ఇద్దరుపిల్లలు, వాళ్ళ జీవిత భాగస్వాములు, మనవలతో కలిసి, మన చిన్ననాటి రోజుల్లోలాగ, నలుగులు, తలంట్లు, కొత్తబట్టలు, భోగిమంటలు, గొబ్బెమ్మ పేరంటాలు, పాలపొంగుల సంక్రాంతి, పిండివంటలతో కనుమ పండుగల్ని జరుపుకోబోతున్న ఆనంద ఘడియల కోసం, అందరం ఆతృతగా ఎదురుచూస్తున్నాం...

మీకు, మావయ్యగారికి, అనేకానేక పాదాభివందనాలు.
                                      ...... ప్రేమతో,
                                            మీ వాగ్దేవి.

P.S: ఉత్తరం చదువుతుంటేనే, మీ మొహంలో 
వస్తున్న ఆనందం, ఉత్సాహం...నాకు ఇక్కడి నుంచే కనబడిపోతున్నాయి. ఈ రెండువారాలూ, 
మీరు మా అందరికోసం, అక్కడ పడే హడావిడి, 
చేసే పురమాయింపులు, ఇక్కణ్ణించే వీడియో తీసేస్తున్నాను...
ఫేస్ బుక్ లో పెట్టేసి, "నానమ్మ హడావిడి" అనే పేరు పెట్టి, మీకే అంకితం ఇస్తాను. స్వీకరించడానికి రడీగా వుండండి.
😃😃

అదిగో...ఆ నవ్వంటేనే నాకెంతో ఇష్టం ! 
ఎప్పుడూ అలాగే నవ్వుతూ ఉండండి...

ఈ ఉత్తరం పోస్టులో వేస్తే, మేము అక్కడికి వచ్చాక కూడా, అందుతుందో, లేదో అని, వాట్సాప్ పోస్టులోనే వేస్తున్నాను.

                          💐💐💐💐

నానమకి నమస్కరం. నేను..నీ M.M ని..అంటే తెల్సుగ, ముద్దల మనవరల్ని. నిను, తత గర్ని చూడానికి ఒచేస్తునం. వచ్చక, నీకు పెద జడ వేసి, మెకపు చేస్తను. "కుదురుగ కుచుని, వెయించుకొవలి", లెపోతే, జడ అందగ రాడు. తెల్సుగ ? తత గరికి నమస్కరలు చెపు. ఉం "టాటా..."
మీ MM.

💐💐

ననమ్మ, నేన కొతగ తెలగు రయడం నెరుచుకునను. టప్పలు ఉంటయి. ఎమనుకొకు. మికొసం బెంగాలు పెటుకుని, చుడలని వస్తునం. వచాక, బొలుడు కబురులు చెబుతను. తత్త గరికి హై చెపు.
నీ "మగ మొక్క...వరి మొక్క."

💐💐

చి. సౌ. వాగ్దేవికి,
అత్తయ్య దీర్ఘ సుమంగళిగా ఆశీర్వదించి రాయునది. ఉభయకుశలోపరి.

మీ అందరికీ నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు.

నువ్వు రాసిన ఉత్తరం చదువుతుంటే నిజంగా 
నాకు 'సెలైన్' ఎక్కించినంత బలం వచ్చినట్టుంది. 
నీ మనసులాగే, నీ మాటలు ఎంత అందంగా ఉంటాయో, నీ ఉత్తరాలు అంతకంటే ఎక్కువ బావుంటాయి. ఎదురుగా వుండి, మాట్లాడుతున్నట్టే రాశావు. నీ ఉత్తరం చదివి చాలాకాలం అయింది. ఎన్నిసార్లు చదువుకుని వుంటానో...చెప్పలేను.

నీకు తెలుసు, మాకు ఇద్దరు పిల్లలు కాదు, నలుగురని. బయటినుంచి వచ్చిన వాళ్ళయినా, ఒకసారి మన కుటుంబంలో సభ్యులయిపోయాక, వాళ్ళుకూడా మన పిల్లలే అనిపిస్తారని, నీతో ఎన్నిసార్లు చెప్పివుంటానో... 

రేపు మీక్కూడా అల్లుడు, కోడలు వచ్చాక, అనుభవపూర్వకంగా తెలుస్తుంది.
😊

బెంగళూరులో లావణ్య, అల్లుడు, పిల్లలు..అమెరికాలో మీ అందరూ ఎంత ఆనందంగా ఉండి, అభివృద్ధిలోకి వస్తే, మేము ఇక్కడ అంత ఆనందంగా గడుపుతూ, ఇంకో రెండు పుష్కరాలు చూసేస్తాము.

మేము జీవితంలో చూడాలనుకునేవి, అనుభవించాలనుకునేవి, ఇంకేమీలేవు..
మీ అందరి సుఖసంతోషాలు, అభివృద్దీ తప్ప !

అక్కడ బెంగళూరులో లావణ్య కూతురు ఉద్యోగంలో
చేరింది కాబట్టి, వాళ్ళు దానికి సంబంధాలు చూడడం మొదలెడుతున్నారు.

చి. రమేష్ కి డాక్టర్ అవ్వాలనుందిట. అందుకోసం, 
ఏవేవో కోచింగులు తీసుకుంటున్నాడు. బహుశా వాడే మన కుటుంబంలో మొదటి డాక్టర్ అవుతాడు. మనందరికీ ఫ్రీగా వైద్యం చేస్తాడు.

నీ ఉత్తరం చదివి, మీ మావయ్యగారు, ఆనవాయితీగా, నామీద జోకులు మొదలెట్టారు. పిల్లల్నీ, మనవలనీ చూసుకుని, ఈ నెల్లోనే నేను యాభై కిలోలు పెరిగిపోతానుట !

మీ మవయ్యగారి జోకులు మనకి కొత్త కాదుగా !
😊

మీరందరూ పెద్ద పండక్కి, ఇక్కడికి రావడం మాకు 
ఎంతో ఆనందాన్నిస్తోంది. ఇంక మీ మావయ్యగారి హడావుడి గురించి నీకు తెలుసుకదా? మీకు, పిల్లలకి, పండక్కి ఏమేమి పిండివంటలు కావాలో చెబితే, మన వంటావిడ చేత చేయించి, ఉంచుతాను. నా మనవల కోసం వాళ్ళకిష్టమైన రేగొడియాలు పెట్టాను.

మావాడికోసం నూపప్పు జంతికలు, కజ్జికాయలు, బెల్లం జిలేబి, నీకోసం, నీకిష్టమైన మినపసున్నుండలు, జున్ను చేయిస్తాను. లస్కోరా కాక, పిల్లలు ఇంకా ఏవి ఇష్టంగా తింటారో చెప్పు.

అన్నట్టు, డైమండ్ లాకెట్టుతో నీ నల్లపూసల గొలుసు,
చాలా బాగా కుదిరింది. నీకు బాగా నచ్చుతుందని, 
నా నమ్మకం. ఆచారి నిన్ననే తెచ్చిచ్చాడు.

ఏమిటో, ఈ రెండువారాలూ 'ఎప్పటికి గడుస్తాయా' అనిపిస్తోంది ! మళ్ళీ మీరందరూ వచ్చి వెళ్ళిపోయాక, 'పండగ అప్పుడే వెళ్ళిపోయిందా', అనిపిస్తుంది !

మీ అత్తగారు డిగ్రీ పాసయినా, ఉత్తరాలు రాయడం అలవాటు తప్పి, తెలుగక్షరాలు కూడా తడబడుతున్నాయి.

మీరు వచ్చేటప్పుడు, మీ మావగారికి, నాకూ మెత్తటి స్వెట్టర్లు, మెత్తటి, తేలికపాటి రగ్గులు తీసుకురండి. లావణ్య వాళ్ళకీ ఏంకావాలో వాళ్ళనే అడిగి, తెలుసుకోండి.

మీ అందరికీ మా ఆశీస్సులు.

మీరాక కోసం వేయికళ్ళతో ఎదురుచూస్తూ,

                                   అనేక దీవెనలతో,
                                మీ అత్తయ్య, మావయ్య.

అందరినీ అడిగానని చెప్పు. మీ ఆరోగ్యాలు జాగర్త.

💐💐

ఒరే పిల్లలూ, మీరిద్దరూ రాసిన ఉత్తరాలు చాలా చాలా బావున్నాయి. తెలుగులో బాగా రాసినందుకు, మీ ఇద్దరికీ మీ తాతగారు, మంచి బహుమానం ఇస్తారుట ! హాపీ ఏనా ?

ఇక్కడ పండగ పేరంటాల్లో అందరికీ మీ టేలెంట్లు చూపించి, మన కాలనీవాళ్ళు పెట్టే పోటీల్లో, నువ్వు సంగీతంలోను, నీ తమ్ముడు, శ్రీరాముడి వేషంలోను బహుమతులు కొట్టెయ్యాలి. ఆ సరంజామా తెచ్చుకోండి. బాగా చదువుకోండి.

శ్రియా, ఇక్కడ నీచేత గొబ్బిళ్ళ పేరంటం పెట్టించి,
సంక్రాంతి ముగ్గులు పెట్టిస్తాను, రెడీగా వుండు. 
నీకు నేను నేర్పిన మంగళహారతులు ఇక్కడ నువ్వు నలుగురిలోనూ పాడాలి, అన్నీ గుర్తున్నాయా, మర్చిపోయావా ? 

నువ్విక్కడ, "సీతారామయ్య గారి మనవరాలు" సినిమాలో, మీనా అన్నమాట !

నీకు, ఓణీ వేయించాలని, మీ బెంగళూరు మావయ్య ఎప్పటినుంచో అంటున్నాడు. ఆ కార్యక్రమం పెద్ద పండగనాడు పెట్టించి, పెద్ద పేరంటం పెడతాను. మాకు 
ఆ ముచ్చట కూడా తీరుతుంది. నీకు రాళ్ళ గాజులజత చేయించాను. నీకు బాగా నచ్చుతాయి. పండగపూట వేసుకుందువుగాని.

💐

ఒరేయ్, అల్లరి పండూ, నువ్వు పండగనాడు, నలుగెట్టి తలంటుకుని, కొత్త లాల్చీ, పైజామా, తొడుక్కోవాలి, తెలిసిందా ? నీకు భోగిపళ్ళు పోయిద్దామంటే, పెద్దయిపోయావు. ఎలారా, పండూ...?

నీకోసం తాతగారు, నువ్వు ఎప్పణ్ణించో అడుగుతున్న పులిగోరు పతకం వేయించి, గొలుసు చేయించారు. పండగనాడు వేసుకుందువుగాని. ఓకే నా ?

తొందరగా వచ్చెయ్యండి.

ముద్దులతో, మీనానమ్మ.

💐💐

                             వారణాసి సుధాకర్.
                            💐💐💐💐💐💐

No comments:

Post a Comment