Friday, January 3, 2025

 Vedantha పంచదశి.           అత ఏవాత్ర దృష్టాన్తో యోగ్యః ప్రాక్ సమ్యగీరితః ౹
ఘటాకాశ మహాకాశ జలాకాశాభ్రఖాత్మకః ౹౹224౹౹

224. అద్వైత సత్యమును నిరూపించుటకే ఉపాధియుతమైన ఆకాశమును పూర్వము ఉదాహరించితిమి.
ఘటమునందలి ఆకాశము, అనంతమగు ఆకాశము జలమునందు ప్రతిఫలించిన ఆకాశము మేఘమునందలి ఆకాశము అని.

జలాభ్రోపాధ్యధీనె తే జలాకాశాభ్రఖే తయోః ౹
ఆధారౌ తు ఘటాకాశ మహాకాశౌ సునిర్మలౌ ౹౹225౹౹

225. జలమునందు మేఘమునందు ప్రతిఫలించిన ఆకాశములు జలము మేఘములనెడి ఉపాధివశమున ఏర్పడినవి.ఘటమునందలి ఆకాశము అనంతమగు ఆకాశము శుద్ధములు నిర్మలములు.

ఏవ మానంద విజ్ఞానమయౌ మాయాధియోర్వశౌ ౹
తదధిష్ఠాన కూటస్థ బ్రహ్మణీ తు సునిర్మలే ౹౹226౹౹

226. అట్లే ఆనందమయ కోశము, విఙ్ఞానమయ కోశము అనునవి మాయ దాని వికారమగు బుద్ధి ఉపాధులుగ ఏర్పడినవి.వానికి ఆధారములు,అధిష్ఠానములు అగు కూటస్థము బ్రహ్మము అనేవి పరిశుద్ధములు.
వ్యాఖ్య:- తత్,త్వం అనే పదాలయొక్క శోధనస్వరూపాన్ని చూపించటానికై వెనుకటి దృష్టాంతాన్ని గుర్తు చేస్తున్నారు.

తత్,త్వం అనే పదాల్ని బాగా శోధనచేసి శుద్ధరూపాన్ని ప్రదర్శించాల్సి ఉంది.ఈ ప్రకరణమునందు తత్,త్వం అనే పదాల శోధనమే ముఖ్య ప్రయోజనం.

అందుచేత,ఘటాకాశ మహాకాశాలు,జలాకాశ,
అభ్రాకాశాల దృష్టాంతం లోగడ చూపబడ్డది.దానిని బట్టి, 

ఘటాకాశస్థానీయుడు కూటస్థుడు,
మహాకాశస్థానీయుడు పరబ్రహ్మ,
జలాకాశస్థానీయుడు జీవుడు,
మేఘాకాశస్థానీయుడు ఈశ్వరుడు!
అని గుర్తుచేసుకోవాలి.

పదార్థశోధన పద్దతి,
జలాకాశం జలరూపమైన ఉపాధియొక్క ఆధీనంలోను, మేఘాకాశం మేఘం అనే ఉపాధియొక్క ఆధీనంలోను ఉన్నందువల్ల పారమార్థికమైనవి
 కావు.

వాటికి ఆశ్రయభూతమైన ఘటాకాశం,మహాకాశం అనేవి స్వచ్ఛమైనవి.
జలంలాంటి ఏవిధమైన ఉపాధిని ఆపేక్షించకుండా శుద్ధము,నిర్మలము 
అయినవి కేవలం ఆకాశ మాత్రంగానే. ఉన్నాయి కాబట్టి!

ఇదే విధముగా ఆనందమయుడైన ఈశ్వరుడు మాయ అనే ఉపాధి యొక్క ఆధీనములోను, విజ్ఞానమయుడైన జీవుడు బుద్ధి అనే ఉపాధి ఆధీనములోను ఉన్నారు.

కాని వారిద్దరికి అధిష్ఠానాలైన కూటస్థుడు,బ్రహ్మ ఈ ఇరువురు మాత్రం,
శుద్ధము,నిర్మలము (పరిశుద్ధము)అయినవారు-ఘటాకాశ మహాకాశాల్లాగా !

పదార్థ శోధనలో ఉపయోగపడుతున్నప్పటికి సంఖ్యయోగమతాలు అంగీకరింపదగినవి కావు.

అవశ్యం ప్రకృతిః సంగం పురేవాపాదయే త్తథా ౹
నియచ్ఛత్యేతమీశోఽ పి కోఽ స్య మోక్షస్తథా సతి ౹౹231౹౹

231. ప్రకృతి శాశ్వతమైనచో పురుషుడు తాను ప్రకృతి కంటె భిన్నుడనని తెలిసికొనిన పిమ్మట కూడా పురుషునియందు ప్రకృతి సంగము కల్పించును.ఈశ్వరుడు శాశ్వతుడైనచో శాశ్వతముగ పురుషుడు శాసింపబడును.ఇక సాంఖ్యుల మతమున పురుషునకు మోక్ష మెక్కడిది ? లేనే లేదని భావము.

అవివేకకృతః సఙ్గో నియమశ్చేతి చేత్తదా ౹
బలాదాపతితో మాయావాదః సాంఖ్యస్య దుర్మతేః ౹౹232౹౹

232. పురుషుని యొక్క ఈ సంగము (దేహాదులయందు) ఈశ్వరునిచే శాసింపబడుట అవివేకము వలన అనినచో మందబుద్ధులగు సాంఖ్యులపై మాయావాదము బలవంతముగ వచ్చిపడును.

వ్యాఖ్య:- వివేకం కలగడానికి పూర్వం, ప్రకృతి జీవుడిని తన బంధనంలో ఉంచుకొంటుంది.
అతనియందు సంగన్ని-అధ్యాసాన్ని కలిగిస్తుంది. వివేకానికి పిమ్మట కూడా జీవుణ్ణి బంధనంలోనే ఉంచుకొంటుంది. ఈశ్వరుడుకూడా జీవుడిని శాసిస్తూ వుంటాడు.
ఈశ్వరుని వల్ల జీవునికి ప్రేరణ కూడా కలుగుతూనే ఉంటుందన్నమాట.

ఈ విధముగా సంగము(అధ్యాసం) శాసనము(ఈశ్వరు నియమనం) ఉంటూనే ఉంటే ఇంకా మోక్షమనేది ఏముంటుంది ?

అద్వైత జ్ఞానం కలిగితేనే తప్ప అసంగత్వజ్ఞానం సైతం కలుగదు.

ప్రకృతి భిన్నత్వ వివేకముచే అవివేకము తొలగుటచే పురుషునకు సంగము, శాసనము సాంఖ్యమతమునకు కూడా ఉండవని ఆక్షేపము.

అవివేకము అనగానేమి ?తరచిచూచినచో అదే మాయయనీ మందబద్ధులగు సాంఖ్యులు దానిని గుర్తింప లేకున్నారనీ సమాధానము.

సంగము,నియమము(ప్రేరణ)
అనేవి అవివేకంవల్ల కలుగుతాయని పూర్వపక్షాలు అనవచ్చు.
అవివేకం నివారింపబడితే ఇక సంగము మొదలైనవి ఎట్లా పుడతాయి ? అని ప్రతిపక్షులు అనవచ్చు.

ఇలాగనుక జరిగితే కుమతులైన సాంఖ్యావాదులు తాము అనుకోకుండానే మాయావాదులైపోతారు.
సంగము(అధ్యాసం),
శాసనం(నియమనం)అనేవి అవివేకానికి కార్యాలు.
దీనిని అంగీకరిస్తే అపసిద్ధాంతం సిద్ధిస్తుంది.ఇందువల్ల సాంఖ్యంలోకి మాయావాదం బలవంతాన వచ్చి చేరుతుంది.అంటే,

అవివేకమనగా వివేకము లేకపోవుట కాదు,
లేని వస్తువు ఫలితములను చూపగలుగుట అసంగతము కనుక.
వివేకము కంటే ఇతరము కాదు,
ధైర్యము మొదలగునవి సంగమును కల్పింపకపోవుట చేత.
వివేకమునకు విరుద్ధమైనదనియే చెప్పవలెను.

లేనిదానిలో నుండి ఉన్నది పుట్టదు కనుక వివేకం కంటే వేరొక వివేకం ఉండటమన్నది కుదరదు.వివేకం కంటే అన్యమైనది ఘటాదుల సంగానికి హేతువు కాజాలదు. కాబట్టి వివేకంకంటే వేరొక వివేకం ఉన్నదని అనటానికి వీలు లేదు.

ఇక భావరూపమైన అజ్ఞానం అని అంగీకరిస్తే మాయావాదాన్ని అంగీకరించినట్లే!

అద్వైతవాదం అంగీకరిస్తే బంధమోక్ష వ్యవస్థ కుదరదు.కాబట్టి 
ఆత్మలు అనేకం ఉన్నాయనే అంగీకరించాలి ! అని వారి వాదం--
 
ఇదే అజ్ఞానము మాయ అని అద్వైత సిద్ధాంతము కనుక సాంఖ్యులు మాయనాహ్వానించినట్లే అగును.     

No comments:

Post a Comment