Friday, January 3, 2025

భజన అనే మాట చాలా పవిత్రమైనది. భజించడం, కీర్తించడం భగవంతుడికే వర్తిస్తాయి. నోరారా భగవన్నామాన్ని పాడి హృదయాలను రంజింపజేయడం భక్తి కార్యాల్లో ముఖ్యమైనది.
నారద భక్తి సూత్రాల్లోని నవ విధ భక్తి మార్గాల్లో మొదటి రెండు.. శ్రవణం, కీర్తనం.
శ్రవణం ద్వారా మోక్షాన్ని పొందవచ్చని నిరూపించిన వాడు పరీక్షిత్తు మహారాజు.
శుకమహర్షి లాంటి విజ్ఞాన ఘని దొరికితే చాలదు, పరీక్షిత్తు వంటి శ్రోత ఉండాలి. 
పరిప్రశ్న అనేది భగవద్గీతలో కృష్ణుడు పలికిన మాట. ప్రశ్నించడం అంటే తెలుసుకోవాలనే కుతూహలంతో అడగడం. పరిప్రశ్న అంటే కుతూహలం సరిపోదు జిజ్ఞాస ఉండాలి. తెలుసుకున్న దాన్ని ఆచరించే కార్యాచరణ కావాలి. 
పరీక్షిత్తు అలాంటివాడు. అందుకే శ్రవణం మోక్షానికి రాజమార్గమైంది.
ఒక్కరే భగవంతుడి నామాన్ని గానం చేస్తే అది కీర్తనం. సామూహిక గానం సంకీర్తనం అని పెద్దలు చెబుతారు.

*భజనలు నాలుగు విధాలు...*
1) నామ సంకీర్తనం : గోవిందా, మాధవా, రామా, కృష్ణా లాంటి నామాలతో భజించడం.
2) గుణ సంకీర్తనం : దేవదేవుడి గుణాలను వర్ణిస్తూ భజన చేయడం.
3) లీలా సంకీర్తనం : భగవంతుడి లీలలను పొగుడుతూ ఆయన చేసిన అద్భుత కార్యాల్ని కీర్తించడం.
4) భావ సంకీర్తనం : భగవంతుడు భావప్రియుడు. మన భావాలతో స్తుతించడం.

పల్లెల్లో నేటికీ కొన్ని భజన సంప్రదాయాలు కొనసాగుతున్నాయి. చిడతల భజన, చెక్కభజన, తాళాల భజన, జ్యోతిభజనతో గ్రామస్థులు భగవంతుణ్ని ఆరాధిస్తుంటారు

శ్రీరామదాసు, అన్నమయ్య మొ. వాగ్గేయకారులు, సంకీర్తనలతో తరించినవారు. తమ జీవితాలను సంప్రదాయ రీతుల్లో సంగీతపరంగా గానానికి అంకితం చేశారు. హనుమంతుడు శ్రీరామ నామ భజనలో అగ్రగణ్యుడు. నిరంతరం రామ నామ తారక మంత్రంతో తరించాడు.

మీరాబాయి కృష్ణ భక్తురాలు. మహారాణి వంశానికి చెందిన స్త్రీ అయినా వీధుల వెంట నగరసంకీర్తన చేసేవారు. మహారాణి హోదాలో ఉండి, వీధుల వెంట తిరిగి భజన కీర్తనలు పాడటం ఆమె మరిది సహించలేక పాలల్లో విషాన్ని కలిపి ఇచ్చాడు. కృష్ణార్పితంగా నైవేద్యం పెట్టి విషం పాలుతాగింది. నామసంకీర్తనా బలంతో ఆమెను  శ్రీకృష్ణుడు రక్షించాడు.

రెండు చేతులూ చరుస్తూ చప్పట్లతో భజన చేయడం గీతానికి అనుగుణమైన తాళంగా ప్రసిద్ధి పొందింది. భజన కూడా ప్రార్థనే.

రామనామ సంకీర్తనలో తరించిన గుహుడు, శబరి, భరతుడు, హనుమంతుడు భజన సంప్రదాయాన్ని ఆదర్శంగా నిలిపారు. అక్రూరుడు, విదురుడు, కుచేలుడు, మీరాబాయి.. కృష్ణ భక్తులుగా చరిత్రలో నిలిచారు.

త్రేతాయుగంలో యజ్ఞయాగాది క్రతువులు, ద్వాపరయుగంలో వ్రతాలు, పూజలు, నోములు, కలియుగంలో నామస్మరణ, యుగభక్తి ధర్మాలుగా మహర్షులు పేర్కొన్నారు.

నామి కన్నా నామం గొప్పదని ప్రకటించిన ఆంజనేయుడు భక్తి సామ్రాజ్యానికి చక్రవర్తిగా నిలిచాడు.
భజన చేద్దాం!
 భద్రంగా ఉందాం!
*ॐॐॐॐॐॐॐॐॐ*

No comments:

Post a Comment