🔱 అంతర్యామి 🔱
# త్రివేణీ సంగమం...
🍁భారతదేశంలోని పుణ్యక్షేత్రాల్లో ప్రయాగ ఒకటి. ఏడు మోక్షదాయక నగరాల తరవాత దివ్య పాపవిమోచన క్షేత్రంగా ప్రయాగ ప్రసిద్ధికెక్కింది. ప్రజాపతి బ్రహ్మ అక్కడ అనేక యాగాలు చేయడం వల్ల ప్రయాగ అనే పేరొచ్చిందని చెబుతారు. త్రివేణీ సంగమంలోని మూడు భాగాలను అగ్నిస్వరూప యజ్ఞవేదికలుగా భావిస్తారు. క్షేత్ర దర్శనానికి వచ్చే యాత్రికులు ఈ మూడు భాగాల్లోను భక్తి శ్రద్ధలతో స్నానం చేసి, ఒక్కొక్క రాత్రి బస చేస్తే త్రేతాగ్నుల ఉపాసనా ఫలం లభిస్తుందని విశ్వాసం. ప్రయాగరాజ అనే శబ్దాన్ని పలకగానే జీవుడు చేసిన పాపాలు భస్మమైపోతాయని, త్రివేణీ సంగమంలో స్నానం మోక్షప్రదమని భక్తులు విశ్వసిస్తారు. దానధర్మాలకు ప్రయాగ శ్రేష్ఠమైన భూమిగా పరిగణిస్తారు. ఎందరో రాజులు చక్రవర్తులు తమ సర్వస్వాన్నీ ఈ క్షేత్రంలో సమర్పించారని చెబుతారు. ఈ ప్రదేశంలో భరద్వాజ మహర్షి ఆశ్రమం ఉంది. వనవాసంలో సీతారామ లక్ష్మణులు ఈ ఆశ్రమాన్ని సందర్శించారని రామాయణం చెబుతోంది. భరద్వాజుడి విందు ప్రసిద్ధం. ఎప్పటికీ నాశనం కాకుండా కల్పాంతం వరకూ నిలిచి ఉండే అక్షయ వటవృక్షం ఇక్కడే ఉంది. శంఖమాధవ, చక్రమాధవ, గదామాధవ మొదలైన 14 మంది మాధవులు విరాజిల్లుతున్న క్షేత్రం ఇది. తంత్ర చూడామణి ప్రకారం 51 శక్తిపీఠాల్లో ఒకటి ప్రయాగ. సతీదేవి చేతివేలు భూమ్మీద పడిన ఈ ప్రదేశంలో అమ్మవారిని లలితాదేవిగా పూజిస్తారు.
🍁కుంభ అనే సంస్కృత పదానికి తెలుగులో కుండ, కలశమనే అర్థాలున్నాయి. మేళా అంటే కలయిక, జాతర. సూర్యుడు, బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు త్రయంబకేశ్వరంలో, సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లో కుంభమేళా జరుగుతుంది. బృహస్పతి వృషభరాశిలో సూర్యుడు మకరరాశిలో ఉన్నప్పుడు ప్రయాగలో, బృహస్పతి సూర్యుడు వృశ్చికరాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో కుంభమేళా నిర్వహిస్తారు. క్షీరసాగర మథనంలో అమృతం లభించాక దేవతలు దానవులు దాన్ని చేజిక్కించుకోవటానికి పోరాటం చేస్తారు. విష్ణువు అమృతభాండంతో పారిపోతూ మార్గమధ్యంలో ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ అనే నాలుగుచోట్ల అమృత బిందువులు చిలకరించాడట
సాధారణ కుంభమేళా నాలుగేళ్లకోసారి జరుగుతుంది.
🍁అర్ధ కుంభమేళా ఆరేళ్లకోసారి ప్రయాగ, హరిద్వార్లలో జరుగుతుంది. పూర్ణ కుంభమేళా పన్నెండేళ్లకో పర్యాయం ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ లో నిర్వహిస్తారు. పన్నెండు పూర్ణ కుంభమేళాలు పూర్తయ్యాక 144 సంవత్సరాలకోసారి ప్రయాగలో మహా కుంభమేళా జరుగుతుంది.
🍁క్రీ.శ. 7వ శతాబ్దం నాటి హర్షవర్ధనుడి పాలనాకాలంలో చైనా బౌద్ధ యాత్రికుడు హుయాన్ త్సాంగ్ కుంభమేళాను ప్రస్తావించాడు. చారిత్రకంగా సముద్రగుప్తుడి దిగ్విజయాలను వర్ణిస్తూ హరిసేను రచించిన అలహాబాద్ శాసనం ప్రసిద్ధమైంది.
🍁ప్రయాగలో మాఘస్నానం అత్యంత పుణ్యప్రదమని పద్మపురాణం చెబుతోంది. ప్రయాగ క్షేత్ర మాహాత్మ్యాన్ని అగ్ని, మత్స్య, కూర్మ పురాణాలూ పేర్కొన్నాయి.
✍️- డాక్టర్ దామెర వేంకట సూర్యారావు
⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️
శ్రీ రామ జయ రామ జయజయ రామ
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
No comments:
Post a Comment