అందమైన జ్ఞాపకాలు ఎప్పటికీ ఆనందకరమే కదా! అందుకే మరొక్కసారి నా బాల్య జ్ఞాపకాలు మీతో....
ఆదివారం శలవు, సంక్రాంతి, వేసవి శలవులు ఏవైనా ఈ తరం పిల్లలు ఆట, పాట లేకుండా స్మార్ట్ ఫోన్ లకు అతుక్కుపోవడం చూస్తుంటే,
సీతాకోకచిలుక లా తుల్లుతూ ఆడి, పాడిన నా బాల్యం గుర్తొచ్చింది.....
స్కూల్ కి సంక్రాంతి శలవలు ఇవ్వగానే ముందే సద్దిపెట్టుకున్న గుడ్డ సంచి, కొన్ని పుస్తకాలు, పాకెట్ మనీ పేరుతో కొద్దిగా చిల్లర డబ్బులు ఇచ్చి నన్ను, తమ్ముడిని ఒక్కోసారి నన్నొకడినే అమ్ముమ్మ వాళ్ళ ఊరు గుంటూరు జిల్లా ( ప్రస్తుత బాపట్ల జిల్లా ), చెఱుకుపల్లి మండలం, ఆరేపల్లి అగ్రహారం కి పంపేవారు.. కండక్టర్ తో చెప్పి బస్ ఎక్కించి వెళుతుంటే కొద్దిగా దిగులుగా నాన్నకి టాటా చెబుతూ కనుమరుగయ్యే వరకు చూస్తూ ఉండేవాడిని..బస్ వేగం అందుకోగానే కిటికీ పక్కన కూర్చొని సొంత ఊరికి బరువుగా వీడ్కోలు చెబుతూ, వెళ్లబోయే అమ్ముమ్మా వాళ్ళ ఊరు, అక్కడి స్నేహితులు, వాళ్ళతో ఆడే ఆటలు, పండగ సంబరాలు, పిండివంట రుచులు తలుచుకుంటూ ఉంటే గంట ప్రయాణం కూడా ఎంతో భారంగా సాగేది...
నేను ఎదురు చూసే మజిలీకి గుర్తుగా మా ఊరి వంతెన, ఆ తర్వాత గ్రామదేవత నూకాలమ్మ తల్లి గుడి వచ్చేవి..కిటికీ లో నుంచి అమ్మకి నమస్కారం చేసుకొని మెల్లగా footbord దగ్గరకు వచ్చేవాడిని.. బస్ దిగగానే ముందు కనిపించేది రామచంద్రరావు తాత కొట్టు...తాత దగ్గర ఓ పావలా పెట్టి ( ఇది mid 1980's లో సంగతి) చాక్లేట్లు కొంటూండగా తాతయ్యో, మావయ్యో వచ్చేవారు....మెల్లగా ఇంటికి వెళుతూ దారిలో ఫ్రెండ్స్ ఎవరెవరు ఉన్నారో ఎంక్వైరీ చేసేవాడిని...కాళ్ళు, చేతులు కడుక్కొని అమ్ముమ్మ పెట్టిన అరిసెలు, చక్రాలు, కజ్జికాయల రుచి చూసి, శివాలయం ఎదురు ఉన్న రావి చెట్టుకిందకి చేరేవాళ్ళం...అక్కడి కి అంతకుముందే వచ్చి ఉన్న గంగిరెద్దుల కుటుంబాలు ఉండేవి..వాళ్ళు ధనుర్మాసం ప్రారంభం కాగానే వచ్చి చుట్టుప్రక్కల గ్రామాలు తిరుగుతూ సంక్రాంతి పండుగదాక అక్కడే ఉండేవారు...ఎవరైనా పెద్దవారు అడిగితే అప్పుడుకూడా ఒక స్పెషల్ గంగిరెద్దుల షో వేసేవారు...
పొద్దున్నే మంచులో లేచి గొడ్ల చావడిలోని చెత్తగడ్డి, కర్రపుల్లలు, పిడకలతో చలిమంటలు వేసేవాళ్ళం.. తర్వాత రాగి కాగులో కాగిన వేడినీళ్ళు హాయిగా స్నానం చేసి చక్కగా బొట్టుపెట్టుకొని మా చెన్నకేశవస్వామి గుడికి వెళ్ళేవాళ్ళం...వెళ్లేప్పుడు బాదం ఆకులు కోసుకుని వెళ్ళేవాళ్ళం..
ధనుర్మాసం కదా దద్ధోజనం, పులిహార, కట్టెపొంగలి పెట్టేవారు...ఆ వయసులో దేవుడు కంటే ప్రసాదామే ఎక్కువ ఇష్టం మరి...
తాతయ్య వాళ్లకు అప్పుడు సొంత వ్యవసాయం ఉండేది...మా దొడ్లేనే నూర్పిళ్ళు చేసి వడ్లు కాటా వేసేవారు.. కొన్ని వరి కంకులు తీసుకొని ఇంట్లో చూరులో, గుళ్లో మండపం లో గంట దగ్గర పిచ్చుకల కోసం కట్టే వాళ్ళం... వడ్ల బస్తాలతో పాటు మేము బరువు చూసుకునే వాళ్ళం...సాయంత్రాలు నులివెచ్చని ఎండలో నూకాలమ్మ గుడి దగ్గరి బీడు పొలాల్లో క్రికెట్ ఆడే వాళ్ళం.. మావయ్య వాళ్లు, కాస్త పెద్ద పిల్లలు పక్కనే వాలీ బాల్ ఆడే వాళ్ళు..
కర్రబిళ్ళ, దాగుడు మూతలు( i saw a boy), కబాడీ, పులిమేక, గోళీలు, కోతి కొమ్మచ్చి ఇవన్నీ మా స్పోర్ట్స్ timetable ప్రకారం ఆడేవాళ్ళం...
భోగి మంటల వెచ్చదనాలతో, హరివిల్లుని తలపించే రంగవళ్ళులతో, హరిదాసుల హరినామ సంకీర్తనలతో, గంగిరెద్దుల వారి డూడూ బసవన్నల కోలాహలంతో పండగ శలవలు ఇట్టే అయిపోయేవి...మళ్లీ యాంత్రీకమయిన ప్రపంచంలోకి అయిష్టంగానే అమ్ముమ్మ ఇచ్చిన ఫామిలీ పార్సెల్ తో మళ్ళీ వచ్చే వేసవి శలవలు తలుచుకుంటూ తెనాలి Bus ఎక్కేవాడిని...
ఒక తరం లోనే ఎంత మార్పు...గుడ్డు నుంచి పొదిగి స్వేచ్ఛగా ఎగరటం నేర్చుకున్న పక్షి లాంటి బాల్యం మాదయితే... ఇంక్యూబెటెర్ లో పొదిగి పంజరం లో పలికే చిలకలు ఈ తరం పిల్లలు....
సేకరణ J N RAO 🌹
No comments:
Post a Comment