Monday, January 20, 2025

 *ఏకాగ్రత.....* 

*మానవుడు భగవంతుని చేరడానికి ఎన్నో సాధనలు ఉన్నా ధ్యానం ఒక సాధనం. భగవత్ సాక్షాత్కారానికి ధ్యానాదులు తప్పనిసరి. ధ్యానం జీవిత సాఫల్యానికి అత్యుత్తమ మార్గం. ధ్యానం ద్వారా పరమాత్మను చేరుకొని అలౌకిక ఆనందాన్ని పొందవచ్చును. ఇందుకు అభ్యాసము, సాధన అవసరం. ధ్యానం అనునది అంత సులభంగా మనకు సాధ్యం కాదు. శ్వాసను నిండుగా తీసుకొని, సుఖమైన ఉచ్ఛ్వాస నిశ్వాసలు క్రమబద్ధంగా ఉంచుకోవాలి. క్రమబద్ధమైన ఉచ్ఛ్వాస, నిశ్వాసలచే మనస్సు ప్రశాంతమవుతుంది. సాధకుడు ఏకాగ్రము కావటమే ధ్యానము.*

*పతంజలి సూచించిన అష్టాంగ యోగములను అనుసరిస్తే ధ్యానములో మానవుడు పరాకాష్ట పొందగలడు. ధ్యానము ప్రతి దినము రెండుసార్లు చేయవచ్చును. ఉదయం, సాయంత్రం నిర్ణీత సమయములలో ధ్యానము ఉత్తమ ఫలితాల్నిస్తుంది. ధ్యానమువలన ఏకాగ్రత సిద్ధించి ఎదుటివారి మనోభావములు గ్రహించు శక్తి పొందగలడు. దీర్ఘకాలము నిరంతర ధ్యాన ప్రక్రియను సాధించవచ్చునని, ధ్యాసే ధ్యానము. మానవుడు ఏ వస్తువునైనా, ఏ విషయాన్ని అయినా ఏకాగ్రత పొంది విశ్వాత్మక మనస్సులో సర్వవ్యాపకముగా నుండు శాశ్వత సత్యములను పొంది సర్వజ్ఞుడు కాగలడు.*

*పతంజలి మహర్షి కూడా అభ్యాస వైరాగ్యములలో మనస్సును అధీనమందుంచుకొనవచ్చును లేక అభ్యాస వైరాగ్యముల ద్వారా చిత్తప్రవృత్తులను అరికట్టవచ్చును అని సూత్రీకరించినాడు. వ్యక్తిగత మనస్సుని విశ్వాత్మక మనసుతో అనుసంధానము చేసే ప్రక్రియే ధ్యానము. నిర్గుణ ధ్యానములో మనము ఎంచుకున్న దైవాన్ని ఒక కాంతి స్వరూపముగా భావిస్తే ఏకాగ్రత సిద్ధించి శాంతి లభిస్తుంది. ప్రణవ ధ్యానములో మనస్సుని, నిస్సంకల్ప స్థితికి తీసుకుపోగా చిత్తవృత్తులు నిరోధించబడి ఆత్మానుభూతి కలుగుతుంది. ప్రాపంచిక విషయముల చింతన లేకుండా పరమాత్మను గురించి ఎడతెరిపి లేని చింతనే ధ్యానము.*

*మనం కష్టాల్లో వున్నపుడు, రోగాలు కలిగినపుడు ఆందోళన చెందకుండా ధ్యానం చేయాలి. ఈ ధ్యానం వినయ విధేయతలతో వచ్చినదే ధ్యానం, కాని చిత్తశుద్ధి లేనిదే ధ్యానం పనికిరాదు. మనకు ధ్యానంవలన ఎన్నో ఆరోగ్యకరమైన, ఆధ్యాత్మికపరమైన విషయాలు గోచరిస్తాయి. మనసు నిర్మలంగా ఉండి ఊపిరితిత్తులు, గుండె శుభ్రంగా ఉండి రక్తప్రసరణ బాగుండి, శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ధ్యానశక్తి మనకు అన్నింటినీ లభించేలా చేస్తుంది. నియంత్రించే శక్తి ధ్యానం ద్వారా దొరుకుతుంది. ధ్యానమంటే మనస్సును మనస్సుపైకే మరల్చడమే. ధ్యానంలో పరిపూర్ణమైన విశ్రాంతిని మాత్రము పొందగలుగుతాము. ధ్యానాన్ని మన మనస్సులో మనం కల్పించే ఆలోచనల ద్వారా చేస్తాము. ధ్యానంలో మూడు దశలున్నాయి. తొలి దశను ‘్ధరణ’ అంటారు. మనస్సు స్థిరంగా, నిశ్చలంగా ఉండేదాన్ని ధ్యానం అంటారు. మూడవది ‘సమాధి స్థితి’. ఇది యోగులు ఆచరిస్తారు. ధ్యానము మనస్సును శాంతపరచి, ఆత్మ స్థిరత్వమును కలిగించి, మానసిక శక్తులను ఏకాగ్రతపరచుటకు దోహదం చేస్తుంది. అనంతమైన ఆనందాన్ని మనకు ప్రసాదించే మార్గాలలో ధ్యానం ఒకటి. మనము ఏమి చేస్తున్నామన్న దానిమీద సంపూర్ణమైన అవగాహనతో, స్పృహతో, స్వచ్ఛందంగా ధ్యానసాధనను కొనసాగించాలి. పవిత్రమైన ధ్యానం మానసిక మాలిన్యాలన్నింటినీ దహింపజేయటానికి దోహదపడుతుంది.*

*సగుణ ధ్యానం, నిర్గుణ ధ్యానమని రెండు విధానాలు. నిర్గుణమైన పరమాత్మను ధ్యానించడం కష్టం. కనుక సగుణ ధ్యానం చేసి అది పరిపక్వత పొందిన తర్వాత నిర్గుణ ధ్యానం చేయవచ్చును. భగత్పరమై కొనసాగే ధ్యానము ఉత్తమమైనది. ‘నాస్తి ధ్యానసమో యజ్ఞః నాస్తి ధ్యాన సమం తపః నాస్తి ధ్యాన సమం తీర్థం తస్మాద్ద్యానం సమాచరేత్’ అని ధ్యానంతో సమానమైన యజ్ఞం, తపస్సు, తీర్థం లేవు. కాని ధ్యానం ఆచరించాలని శాస్త్రాలు బోధించాయి.*

*┈┉┅━❀꧁🙏ॐ🙏꧂❀━┅┉┈*
          *ఆధ్యాత్మికం ఆనందం*
🍁🍁🍁 🌺🕉️🌺 🍁🍁🍁

No comments:

Post a Comment