Vedantha panchadasi:
జ్ఞానద్వయేన నష్టేఽ స్మిన్నజ్ఞానే తత్కృతావృతిః ౹
న భాతి నాస్తి చేత్యేషా ద్వివిధాపి వినశ్యతి ౹౹44౹౹
44. పరోక్ష అపరోక్ష జ్ఞానములచే ఈ అజ్ఞానము దాని వలన ఏర్పడే ఆవణము నశింపగా వాని కార్యములగు కన్పించుటలేదు,అసలు లేదు అనే భావములు కూడా నశించును.
పరోక్షజ్ఞానతో నశ్యేదసత్త్వవృతి హేతుతా ౹
అపరోక్షజ్ఞాన నాశ్యా హ్యభానావృతి హేతుతా ౹౹45౹౹
45. పరోక్షజ్ఞానము వలన అజ్ఞానము నశించును.
ఆవరణము అపరోక్షజ్ఞానము వలన నశించును.
వ్యాఖ్య:-
పరోక్ష అపరోక్షజ్ఞానాలవల్ల, అజ్ఞాన మనేది నివృత్తమైపోగా ఆవరణ అనేది కూడా నశిస్తుంది అని చెపుతున్నారు.
'పరోక్షజ్ఞానం,అపరోక్షజ్ఞానం' అనే రెండురకాల జ్ఞానాలవల్లనూ,
ఆవృత్తికి - ఆవరణకు కారణభూతమైన అజ్ఞానం నష్టమైన మీదట,ఆ అజ్ఞాననికి కార్యంలాగా ఉండినట్టి
"కనిపించటంలేదు,లేనేలేడు"
అనే ఆవరణద్వయం కూడా వినష్టమైపోతుంది.
ఈ రెండు రకాల జ్ఞానాలు కూడా ముక్తికి కారణాలౌతాయి.
ఏ జ్ఞానం వల్ల ఏ అంశం నివృత్తమౌతుంది ? అంటే -
కూటస్థోఽస్తి - కూటస్థుడున్నాడు అనే పరోక్షజ్ఞానం వల్ల,
"కూటస్థుడు లేడు" అనే ఆవరణకు హేతువైన అజ్ఞానం పోతుంది.
"కూటస్థోఽస్మి" -
"నేను కూటస్థుణ్ణి" - అనే అపరోక్షజ్ఞానంవల్ల
'కూటస్థో నభాతి' -
"కూటస్థుడు కనిపించటంలేదు" అనే ఆవరణ రూపమైన అజ్ఞానం తొలగిపోతుంది.
పరోక్షజ్ఞానం బుద్ధితో సముపార్జించవచ్చు.
సునిశితమూ,తీక్షణమూ అయిన బుద్ధికల వారందరూ కూడా దీనిని సంపాదించగలరు.
అయితే దీనిని స్వానుభవముగా గ్రహించడం కష్టసాధ్యం.ఎందరో సాధకులు ఏంచేయ్యాలో తెలియని అయోమయ స్థితిలో ఇక్కడ ఆగిపోతూ ఉంటారు.
శాస్త్ర వాక్యముల నుండీ గురూపదేశము వలన బ్రహ్మము కలదని తెలుసికొనును.
అప్పుడే సద్గురువుచే సహాయం అవసరమౌతుంది. స్వనుభవమున తానే బ్రహ్మమని "గురు" సహాయం వలన తెలుసికొనును. ఈ సహాయమే అపరోక్షానుభూతి.
అభానావరణే నష్టే జీవత్వారోప సంక్షయాత్ ౹
కర్తృత్వాద్యఖిలః శోకః సంసారాఖ్యో నివర్తతే ౹౹46౹౹
46.ఆవరణము నశింపగా జీవత్వమనే విక్షేపము కూడా క్షయించిపోవును.
కర్తృత్వభోక్తృత్వశోకసంసారం నివర్తించును.
నివృత్త సర్వసంసారే నిత్యముక్తత్వ భాసనాత్ ౹
నిరఙ్కుశా భవేత్తృప్తిః పునః శోకాసముద్భవాత్ ౹౹47౹౹
47.సకలసంసార దుఃఖములు అంతము కాగా తాను నిత్యముక్తుడనే బోధ కలుగుటచే నిరతిశయమైన తృప్తి జనియించి శోకము కలుగదు.
వ్యాఖ్య:-జ్ఞానానికి ఫలస్వరూపంగా ఉన్న రెండు అవస్థలు(దశలను) -
శోకనివృత్తి,తృప్తి గురించి -
అజ్ఞానావరణం వినష్టమైపోగా, భ్రమవల్ల ప్రతీయమానమయ్యే జీవరూపమైన ఆరోపం కూడా ఉండదు.
అదికూడా వినష్టమౌతుంది.
బ్రహ్మము భాసించుటలేదు అను ఆవరణము నశింపగా జీవత్వమనే విక్షేపము కూడా క్షయించిపోవును.
దానితోపాటుగా జీవభావంవల్ల కలిగిన కర్తృత్వ భోక్తృత్వ ప్రమాతృరూపాలలో ఉండే సంసారమనే శోకం నివృత్తమౌతుంది.
నేను చేసేవాడను,
నేను అనుభవించేవాడను,
నేను తెలుసుకొనే వాడను అని అనుకోవటంవల్ల కలిగే దుఃఖం నశించి పోతుంది.
విజ్ఞానఘన స్వరూపమైన కేవలాత్మకు అజ్ఞానము లేదు. నామరూప క్రియాత్మకమైన దేహాంద్రియాది సంబంధము చేత కలిగిన జీవభావములో నేను,వీడు అనెడి ద్వైతజ్ఞానము కలుగుచున్నది.
బ్రహ్మ జ్ఞానము చేత దేహేంద్రియాది సంబంధము వల్లనైన జీవభావము నశించినప్పుడు,ద్వైత జ్ఞానము నశించుచున్నది.
అవిద్యచేత కల్పింప బడిన దేహేంద్రియ సంఘూతోపాధివలనబుట్టిన జీవభావమునందు ఆత్మసర్వమును
ద్వైతము వలనే కనిపించుచున్నది.
అప్పుడు చూచుట,ఆఘ్రూణించుట,
వినుట,పలుకుట,తలంచుట,తెలిసికొనుట ఇత్యాది ద్వైతజ్ఞానము కలుగుచున్నది.
ఎప్పుడు బ్రహ్మవేత్తకు బ్రహ్మజ్ఞానముచేత సర్వము ఆత్మమాత్రమగుచున్నదో అప్పుడు
దేనిచేత దేనిని చూచును?
దేనిచేత దేనిని ఆఘ్రూణించును?
దేనిచేత దేనిని పలుకును?
దేేనిచేత దేనిని వినును?
దేనిచేత దేనిని తలంచును?
దేనిచేత దేనిని తెలిసికొనును?
ఎవనిచేత సర్వమును తెలిసికొన బడుచున్నదో వానిని దేనిచేత తెలిసికొన వచ్చును?
సర్వమును తెలిసికొనునది విజ్ఞానమయాత్మయే అని తెలుసుకొనిన, ఇక
కర్తృత్వ భోత్తృత్వములు ఎక్కడివి?
సర్వమూ తొలగును.
సంపూర్ణంగా సంసారనివృత్తి జరిగిన పిమ్మట 'నేను ముక్తుణ్ణి'
అనే ప్రతీతి కలుగుతుంది.
దీనినే నిరతిశయానందరూపమైన 'తృప్తి' అంటారు.అంటే ,
ఇక శోకమనేది పుట్టని స్థితి -
సంపూర్ణమైన తృప్తి కలుగుతుంది.
తాను నిత్యముక్తుడననే బోధ సకలసంసారము అంతమయి తృప్తి జనించును.
No comments:
Post a Comment