Vedantha panchadasi:
అపరోక్షజ్ఞాన శోకనివృత్త్యాభ్యే ఉభే ఇమే ।
అవస్థే జీవగే బ్రూత ఆత్మానం
చే దితి శ్రుతిః ।।48।।
48. ఈ ప్రకరణ ప్రారంభమున చెప్పబడిన శ్రుతివాక్యము ఆత్మానంచేత్ అనేది జీవుడనుభవించే ఈ రెండు దశలను
అపరోక్షజ్ఞానము శోకనివృత్తి అనే వానిని గూర్చి చెప్పును.
అయమిత్యపరోకషత్వ ముక్తం తద్ద్వివిధం భవేత్ ।
విషయ స్వప్రకాశత్వాద్ధియా ప్యేవం
తదీకషణాత్ ।।49।।
49. 'అయమ్' ఇది అనే శబ్దముచే అపరోక్షత్వము సూచింపబడినది.
ఇదే నేను,అనే వాక్యమున'ఇది'అనే శబ్దము
ఆత్మస్వయం ప్రకాశమును,
ఆస్వయం ప్రకాశమైన ఆత్మను విషయరూపముగ బుద్ధి చూచుననీ రెండు విధములైన అపరోక్షత్వము సూచింపబడినది.
వ్యాఖ్య:-
"ఆత్మానం చేద్విజానీయాత్..."
బృ.4-4-12. అనే శ్రుతివాక్యాన్ని వ్యాఖ్యానించటాన్ని ప్రారంభించి,దానిని వదలి మద్యలో అజ్ఞానాది ఏడుదశల్ని విశ్లేషించటం అప్రాసంగికం అవుతుంది;
అనే ఆక్షేపణకు సమాధానంగా ఆ శ్రుతివాక్య తాత్పర్యాన్ని నిర్ణయించటానికే ఇదంతా చెప్పాల్సి వచ్చింది;
"ఆత్మానం చేద్విజానీయాత్" అనే శ్రుతి ,
అపరోక్షజ్ఞానము,శోకనివృత్తి అనే రెండు అవస్థల్ని జీవాశ్రితంగా చెపుతోంది.
అంటే, ఈ రెండూ జీవుని అవస్థలు(దశలు) అని చెపుతోంది.
వెనుక చెప్పబడిన 'అయమ్' అనే శబ్దంతో ఆత్మను అపరోక్షంగా అంగీకరించారు. అది పరోక్షజ్ఞాన విషయం ఎట్లా అవుతుంది ? అనే శంకను నివృత్తం చేయటానికే - స్పష్టం చేయటానికే - పరోక్షజ్ఞానంలోని భేదాల్ని చెపుతున్నారు.
'అయం' అనే పదానికి శ్రుతి అపరోక్షజ్ఞానం అని అర్థం చెప్పినది గదా !
ఆ అపరోక్షజ్ఞానం రెండువిధాలుగా ఉంటుంది.
మొదటిది -
చిద్రూపమైన - ఆత్మ , స్వయంప్రకాశమైనది.
అంటే, చిద్రూపమైన ఆత్మ స్వయంప్రకాశం కలది అయినందున తన ప్రతీతి కోసం ఇతరమైన సాధనాన్ని దేనినీ ఉపేక్షించదు; అని.
ఇక, రెండవ అర్థం -
బుద్ధిద్వారా కూడా ఆత్మయొక్క స్వయం ప్రకాశత్వం చూపబడుతొంది, అని.అంటే -
ఆత్మను విషయంగాను, బుద్ధివృత్తిని విషయిగాను
చెపుతూ విషయము(తెలుసుకోబడేది) విషయి (తెలుసుకొనేది) అనే, వీటి భేదంవల్ల అపరోక్షత్వం రెండు విధాలుగా చెప్పబడ్డది.
పరోక్షజ్ఞానంలో సైతం బ్రహ్మయొక్క స్వప్రకాశత్వ జ్ఞానం వుంటుంది.
సుషుప్తిలో బ్రహ్మగమనాన్ని సూచించడం జీవుణ్ణి పారమార్థిక రూపంలో వ్యక్తం చేయడానికని గ్రహించాలి.
ఉపాథి కల్పితమైన శరీరరూపం అనిత్యమైనది. జ్ఞానంతో స్వస్వరూపమును తెలుసుకున్న పురుషుడు దేహేంద్రియమనోబుద్ధులకు అతని అతీతుడు అవుతాడు. అప్పుడే సంసారం నుండి బంధ విముక్తుడూ అవుతాడు.
"స యో హ వై తత్పరమం బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి "-
బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మయే అవుతాడు.
చూడడం,వినడం,
తెలుసుకోవటం ఇవన్నీ జీవుడి సహజ లక్షణాలు.శరీరం ఉన్నంత వరకూ లక్షణాలు వ్యక్తమౌతూ ఉంటాయి.
సూర్యప్రకాశం ఉన్నంత వరకూ నక్షత్రాలు కనబడవు.కాని అవి స్వస్థానంలోనే ఉంటాయి. అలాగే అజ్ఞానం వల్ల జీవుడి తేజోరూపం,శరీర ఇంద్రియాలు, మనోబుద్ధి అహంకారాదులు వల్ల మూసుకుపోతుంది.
జ్ఞానం కలిగినప్పుడు ఈ అడ్డం తొలగిపోతుంది.
స్వస్వరూపం(తేజోరూపం)ప్రకటితమవుతుంది.జ్ఞాన ప్రాప్తితో వచ్చేది శరీర సముత్థానం. అప్పుడు శరీరంతో ఉన్న కర్తృత్వ -భోక్తృత్వాదులుండవు.
శరీరాలలో ఉన్నా శరీరం లేని వాడు -పరమాత్మ.
వివేకం , జ్ఞానం ఉన్నవాడు పరమేశ్వరుడు - అశరీరుడు.
శ్రుతి వాక్యాలు
"జీవో - బ్రహ్మైవ" అని స్పష్టం చేస్తున్నాయి. పరబ్రహ్మ కంటే జీవుడు భిన్నుడు కాడని చెప్పడమే అద్వైత సిద్ధాంత తాత్పర్యమని గ్రహించాలి.
పరోక్షజ్ఞాన కాలేపి విషయస్వప్రకాశతా ౹
సమా బ్రహ్మ స్వప్రకాశమస్తీ త్యేవం విబోధనాత్ ౹౹50౹౹
50.పరోక్షజ్ఞాన కాలమునందును ఆత్మస్వప్రకాశమే.
ఆత్మ స్వప్రకాశము అది కలదు అని బుద్ధి స్పష్టముగ గ్రహించును.
అహం బ్రహ్మేత్యనుల్లిఖ్య బ్రహ్మాస్తీ త్యేవ ముల్లిఖేత్ ౹
పరోక్షజ్ఞానమేతన్న భ్రాన్తం బాధా నిరూపణాత్ ౹౹51౹౹
51. 'నేను బ్రహ్మమును' అనక
'బ్రహ్మము కలదు' అనుట పరోక్ష జ్ఞానము.ఈ పరోక్షజ్ఞానము భ్రాంతి కాజాలదు,దీనిని నిరాకరించు నిరూపణ లేకపోవుట చేత.
వ్యాఖ్య:-పరోక్షజ్ఞానంలో సైతం బ్రహ్మ యొక్క స్వప్రకాశత్వ జ్ఞానం ఉంటుంది.ఎలాగంటే...
అపరోక్షజ్ఞానం కలిగినప్పటి లాగానే,
పరోక్షజ్ఞానం కలిగే సమయంలో కూడా బ్రహ్మమనే విషయం స్వప్రకాశం కలదనే జ్ఞానం ఉంటుంది కాబట్టి !
శ్రుతి కూడా ఈ విధంగానే బోధిస్తోంది.
ప్రత్యగభిన్నమైన బ్రహ్మవిషయక జ్ఞానం పరోక్షరూపం కలది ఎట్లా అవుతుంది ? అంటే -
ప్రత్యగంశాన్ని గ్రహించకపోవటం వల్ల !
బ్రహ్మము లేని వస్తువేదీ లేకున్నను, బ్రహ్మము పరోక్షజ్ఞానమునకు విషయమగుచున్నది.
"బ్రహ్మము కలదు" మొదలగు వాక్యములు పరోక్షజ్ఞానమును కలిగించును.ఇది భ్రాంతియా అనినచో కాదు.
"అహంబ్రహ్మస్మి" -
"నేను బ్రహ్మను" అని అనలేక
కేవలం "బ్రహ్మము ఉన్నది" అని ఈ విధంగా ఉల్లేఖిస్తే అది పరోక్షజ్ఞానము.
భ్రాతిలేనిది.
ఎందుచేతనంటే,
బ్రహ్మవిషయకమైన జ్ఞానం ఎన్నడూ బాధింతం కాదు కాబట్టి ! అంటే -
"బ్రహ్మ ఉన్నాడు" అనే జ్ఞానం ఎన్నడూ ఏ కాలంలోనూ బాధితం కాదు - తోసిపుచ్చబడదు.
పరోక్షజ్ఞానం విషయంలో నాలుగు రకాలుగా భ్రాంతి ఉండవచ్చు.
1)బాధితం కావటానికి తగినదై ఉండటంవల్ల
2)బ్రహ్మయొక్క ఆకారం అప్రత్యక్ష్యమై ఉండటంవల్ల
3)అపరోక్షరూపంలో గ్రహించాల్సినట్టి బ్రహ్మను పరోక్ష రూపంలో గ్రహించటం వల్ల
4)ప్రత్యగంశాన్ని గ్రహించక పోవటం వల్ల.
బ్రహ్మం అనేది స్వయంఅనుభూతి కలది అయినందున ఎవరికీ అనుభావ్యవిషయం(అనుభవింపదగిన విషయం) కాజాలదు.
స్వయంప్రకాశం కాబట్టి -
జ్ఞాత, జ్ఞానమునకు విషయం కాజాలదు.
ఏ చైతన్యస్వరూపం వల్ల సమస్తమూ తెలుసుకొనబడుతోందో అటువంటి దానిని దేనివల్ల తెలుసుకోగలుగుతాము ? అనే
శ్రుతివచనాన్ని బట్టి ఏ ఆత్మతత్త్వంతో ఈ దృశ్యాన్నంతనూ తెలుసుకోగలుగుతున్నామో అటువంటి దానిని ఏ జడవస్తువుతో చూడగలుగుతాము ?తెలుసుకోగలుగుతాము ?
జ్ఞానానికి సాధనమైన మనస్సు కూడా జ్ఞాతవ్యమైన విషయాన్నే తెలుసుకోగలుగుతుందే తప్ప, జ్ఞాతయైన ఆత్మను తెలుసుకోలేదు.
"నైవ వాచా న మనసా ప్రాప్తుం శక్యోన చక్షుషా..." -
కఠ 2-3-12
ఆత్మను వాక్కుతోగాని ,మనస్సుతోగాని,
చక్షురాది ఇంద్రియాలతోగాని పొందటానికి వీలులేదు.
బ్రహ్మ నాస్తీతి మానం చఏత్స్యాద్బాధ్యేత తదా ధృవమ్ ౹
న చైవం ప్రబలం మానం పశ్యామోఽ తో న భాధ్యతే ౹౹52౹౹
52.'బ్రహ్మము లేదు' అని నిరూపింప గలిగినచో అపుడు 'బ్రహ్మము కలదు ' అనే జ్ఞానము భ్రాంతి అనవచ్చును. కాని బ్రహ్మము లేదనుటకు ప్రబలమైన ప్రమాణమేమీ లేదు. కనుక బ్రహ్మము కలదనుట భ్రాంతి కాదు.
వక్త్యనుల్లేఖమాత్రేణ భ్రమత్వే స్వర్గధీరపి ౹
భ్రాన్తిః స్యాద్వ్యక్త్యానుల్లేఖా త్సామాన్యోల్లేఖ దర్శనాత్ ౹౹53౹౹
53.బ్రహ్మమును గూర్చి స్పష్టముగ చెప్పనందున అది భ్రాంతియనినచో స్వర్గాదుల గూర్చి కూడ శ్రుతి స్పష్టముగ చెప్పదు గనుక అవీ భ్రాంతి కావలెను.
అపరోక్షత్వ యోగ్యస్య న పరోక్షమతిర్భ్రమః ౹
పరోక్షమిత్యనుల్లేఖాదర్థాత్పారోక్ష్య సంభవాత్ ౹౹54౹౹
54.అపరోక్షముగ తెలియదగిన దానిని పరోక్షముగ గ్రహించుట భ్రమ కాదు ఇది పరోక్షము మాత్రమేయని చెప్పబడకపోవుట చేత.
అపరోక్షముగ చెప్పబడకపోవుటచే పరోక్షత్వము సిద్ధించుచున్నది.
అంశాగృహీతేర్భ్రాన్తిశ్చేద్ఘట
జ్ఞానం భ్రమో భవేత్ ౹
నిరంశస్యాపి సాంశత్వం వ్యావర్త్యాంశ విభేదతః ౹౹55౹౹
55.బ్రహ్మమును గూర్చి ఒక భాగమును గూర్చి మాత్రమే తెలుపుటచే ఆ పరోక్షజ్ఞానము భ్రమ అనినచో కుండ మొదలగు వానిని గూర్చిన జ్ఞానము కూడ భ్రమయే అగును.
వ్యాఖ్య :- పరోక్షజ్ఞానము విషయములో భ్రాంతి నాలుగు రకాలుగా వుండవచ్చును.
వానిలో ఏదీ బ్రహ్మము పట్ల వర్తింపదు.అవి -
1)బాధితం కావడానికి తగినదై ఉండటం వల్ల -
బ్రహ్మము లేదని రుజువు చేసే ప్రమాణమేదైనా ఉంటే తప్పకుండా పరోక్షజ్ఞానం బాధితమౌతుంది.
(పరోక్షజ్ఞానానికి అడ్డు లేక హాని కలుగవచ్చు )
కాని, ఆ విధంగా
'బ్రహ్మము లేదు' అనేందుకు ప్రమాణం లేనందున
'బ్రహ్మము ఉన్నది' అనే పరోక్షజ్ఞాన విషయంలో బాధ అనేది ఉండదు -
పరోక్ష జ్ఞానాన్ని త్రోసి పుచ్చటానికి వీలుండదు అని భావం.బాధితమయ్యే విషయం కాదు కాబట్టి భ్రమారూపం కూడా కాజాలదు.
బ్రహ్మము కనిపించటానికి విషయం కాదు కాబట్టి, పరోక్షజ్ఞానం భ్రాంతి కావచ్చు అని అనటం యుక్తం కాదని అంటున్నారు.
మొదటిది విరుద్ధమైన ప్రతిపాదనము
సత్యమని నిరూపించుట.
అది బ్రహ్మము పట్ల నిరూపింపబడలేదు.
2)బ్రహ్మయొక్క ఆకారం అప్రత్యక్షమై ఉండటం వల్ల -
ఒక వ్యక్తియొక్క ఆకారాన్ని ఉల్లేఖించలేనంత మాత్రాన - చెప్పలేక పోతున్నంత మాత్రంచేత,పరోక్ష జ్ఞానం భ్రాంతిరూపమైనదని అంటే, వ్యక్తి యొక్క జ్ఞానం'ఇది స్వర్గం' అనే జ్ఞానం కూడా భ్రాంతిరూపాలే కావాలి; అని అనటం అతి ప్రసంగమే అవుతుంది.
దీనిని నివారించటానికై బ్రహ్మముయొక్క పరోక్షజ్ఞానం భ్రమారూపం కలది కాదు అని అంగీకరించాలి.అంటే స్వర్గాదుల గురించిన పరోక్షజ్ఞానము వలె బ్రహ్మమును గూర్చిన పరోక్షజ్ఞానము కూడా భ్రాంతి కాదు.
రెండవది స్వరూపము స్పష్టముగ చెప్పబడలేదనుట.
ఇది కూడా నిరాకరింపబడినది.
మూడవది అపరోక్షరూపంలో తేలుసుకోదగినట్టి బ్రహ్మాన్ని ముందుగా పరోక్షరూపంలో తెలుసుకోవటం
భ్రమ కాజాలదు.
ఎందుచేతనుటే -
'బ్రహ్మము కలదు' అనే
పరోక్ష జ్ఞానము
'ఇదం బ్రహ్మ' -'ఇది బ్రహ్మము' అనే అపరోక్షజ్ఞానము అసంభవమనుట లేదు.మరి దాని పరోక్షత్వమెట్లు ?
"ఇదే బ్రహ్మము" అని అపరోక్షముగ చెప్పబడకపోవుట చేత.
అట్లు అపరోక్షమగు జ్ఞానము కలిగే వరకు బ్రహ్మము గూర్చిన జ్ఞానము పరోక్షముగనే ఉండును.
అనగా పరోక్షజ్ఞానము వలన బ్రహ్మము యొక్క వస్తుత్వమును గూర్చిన సంశయములు తొలగి అపరోక్షజ్ఞానము సంభవమని నిశ్చయము కలుగును.
కాని బ్రహ్మము మనస్సునకు వాక్కునకు అతీతమగుటచే ఇతర విషయజ్ఞానము వలె పరోక్షముగనే పూర్తిగ తెలియబడదు.
"అపరోక్షముగనే అనుభవముననే" తెలియబడును.
అంతిమ వికల్పం -
అంశాన్ని గ్రహింపక పోవుటవల్ల,పరోక్షజ్ఞానాన్ని భ్రమరూపం అని అంటే ఘటానికి సంబంధించిన జ్ఞానాన్ని కూడా భ్రమ అని అంగీకరించాలి.
బ్రహ్మమును మాత్రమే సూచించి ప్రత్యగాత్మను వదలెనని ఉద్దేశము.
కుండను గూర్చిన జ్ఞానము కలిగినను,కుండయందేమి ఉన్నదో తెలియక పోవుటచే ఘటజ్ఞానము భ్రమకానట్లే,
ఇంకను ప్రత్యగాత్మ గురించి చెప్పుకున్నను బ్రహ్మమును గూర్చిన జ్ఞానము భ్రమకాదు.
"బ్రహ్మము నిరవయవం (అవయవ రహితం). అందూచేత బ్రహ్మము యొక్క ఒక అంశను గ్రహించటం,
ఒక అంశను గ్రహించకపోవటం అంటూ వుండదు.
నిరవయవమగు బ్రహ్మము సావయవమని చెప్పుట వ్యావర్త్యాంశ (ఉపాధులు) యొక్క విభేదం ఉన్నందువల్ల.
ఈ ఉపాదులనే పరోక్షజ్ఞానము తెలుపును.
కాబట్టి పరోక్షజ్ఞానము భ్రమరూపం కాదు.
No comments:
Post a Comment