Tuesday, June 24, 2025

 *****************************
******* 2  పాయింట్   ౦ *******
*****************************

' 2  పాయింట్  ౦ ' పథకానికి కొబ్బరికాయ కొట్టేసాము ! 

మత్తెక్కిన గంజాయి తండాలతో పిశాచ నాట్యం చేస్తాము
మాదకద్రవ్య మూకలకు కరాళ కోరలు తొడుగుతాము
బ్లేడు బ్యాచుల వీరులతో శివమెక్కి ఆడుతాము
జేబుదొంగలు గొలుసుచోరులకు కొత్త కత్తెర్లు అందిస్తాము
బెట్టింగు మాఫియా మృగాలతో అమాయకుల్ని వధిస్తాము
సర్వ స్మగ్లర్ల మందలకు ఎర్ర తివాచీలు పరుస్తాము ! 

' 2  పాయింట్  ౦ ' ప్రణాళికకు విఘ్నేశ్వర పూజ చేసేసాము ! 

కాల్ మనీ కర్కోటకులతో రాసుకు పూసుకు తిరుగుతాము
రౌడీ ముఠాల కత్తులతో కుత్తుకల్ని రప్పా రప్పా నరికిస్తాము
హంతకుల గుంపులతో పీనుగుల పంటలు పండిస్తాము
కిడ్నాపర్ల గణాలకు కాదనకుండా  చేతి నిండా పని కల్పిస్తాము
ఆడకూతుళ్ల మానాభిమానాలు సరదా సరదాగా తీయిస్తాము
అడ్డుకునే నిర్భాగ్యులను కట్టేసి నిర్దయగా సజీవదహనం చేస్తాము ! 

' 2  పాయింట్  ౦ ' వెర్షన్ కు శుక్లాంబరధరం పాడేసాము ! 

మాకు పనికొచ్చే శవమైతే రాబందులై వాలిపోతాము
విధ్వంసానికి అనువైతే ఏళ్లు గడిచినా ఓదార్చుతాము
యాత్రల ముసుగులో వినాశనం... పరామర్శల పేరుతో భీతావహం... 
మా దారిలో ఊళ్లు వల్లకాడులు... బతుకులు కోతులు పడ్డ తోటలు... 
తింటున్న అన్నంలో మన్ను పోస్తాము... కంటున్న కలల్ని బూది గావిస్తాము
మనసు పడ్డ దేన్నైనా ఆక్రమిస్తాము... ఎదిరిస్తే గంగమ్మ జాతరలో బలిస్తాము ! 

' 2  పాయింట్  ౦ ' పద్ధతికి పచ్చజెండా ఊపేసాము ! 

ఋణాలు తెచ్చి మరీ పోశాము... మాకే పంగనామాలు పెడతారా ? 
మమ్మల్నే భగభగ రగిలించిన మిమ్మల్ని నుజ్జునుజ్జుగా తొక్కుకుంటూ పోతాము
మాకు చదువుసంధ్యలక్కర్లేదు... కొలువుల కోలాటం మాటే లేదు
పీకపై కత్తి పెట్టి దోచుకోవడం... బినామీల వద్ద దాచుకోవడం... 
చదువుకెళ్లిన మీ ఇంటిపిల్ల -- ఉపాధికెళ్లిన మీ గృహస్వామి
సమయానికి రాకపోతే కలిగే వణుకు ఎలా ఉంటుందో చూపిస్తాము !

         ~~~~~~~~~~~~~~
         ~~~~~~~~~~~~~~

ఎప్పుడో అనుకున్న  ' 2  పాయింట్  ౦ ' ఇప్పుడే మొదలైపోయింది ! 

పాలకుల్లారా ! పాలితుల్లారా ! పహరా హుషార్ ! 
జనాల చుట్టూ పిచ్చికుక్కలు... విషప్పురుగులు... చేరిపోయాయి
నల్లమందు భక్షకులు... ఉన్మాద సమూహాలు... మోహరించాయి
అసుర శ్రేణులు... నిశాచర భూతప్రేతాలు... చుట్టుముట్టాయి
సప్తసముద్రాల ఆవల ఉన్నా బట్టలూడదీసి కొడతామంటున్నాయి
రాజ్యకాంత పరిస్థితి తలుచుకుంటే నిజంగా భయమేస్తుంది దొరా ! 


*****************************
******* వి వి రామారావు *******
*****************************

No comments:

Post a Comment