కథ పేరు: విహార యాత్ర
రచన: కోడూరి తిరుమల మాధవి
అన్నీ పనులు అయ్యాక కాసేపు నడుము వాల్చి కళ్ళు మూసుకుని పడుకున్నాను.
నిన్న సాయంత్రం చూసిన "ది గ్రేట్ ఇండియన్ కిచెన్" సినిమా కళ్ళ ముందు కదలాడింది, సినిమా కథ ఇంటిలోని ఆడవాళ్ళ పరిస్థితి మీద తీశారు.
ఇంటిలో పని చేసే ఆడవారి వ్యక్తిత్వానికి అస్సలు గుర్తింపు వుండదు. వారు చేసే పనికి విలువ కూడా వుండదు.అసలు వారిని ఒక మనిషి కిందనే చూడరు.
అదేమంటే ఇంటి పని చేయడం కూడా ఒక పనేనా! అది చేయడం కూడా మీకు కష్టమా? అని తేలిగ్గా మాట్లాడతారు.
అందరి ఇళ్ళలో ఇలాగే వుంటారు అని నేను చెప్పను గానీ నూటికి అరవై శాతం మంది ఇళ్ళలో ఇలాగే వుంటారు అని మాత్రం ఖచ్చితం గా చెప్పగలను.
ఈ సినిమా చూస్తున్నంత సేపూ నాకు నా జీవితం కళ్ళ ముందు కదలాడింది.
నేను పెళ్ళి చేసుకుని అత్తగారి ఇంట అడుగు పెట్టినప్పటినుండి నా పరిస్థితి కూడా ఇలాంటిదే.
ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు వంటింట్లో చాకిరీ, ఎవరికి ఏమీ కావాలన్న అందివ్వడం, వండడం , వడ్డించడం, తోమడం, కడగడం, ఉతకడం తోనే సరిపోయేది.
"ఛ వెధవ జీవితం" అని ఎన్ని సార్లు నన్ను నేను తిట్టుకున్నానో లెక్కలేదు.
ఉదయం పాల గిన్నె స్టవ్ మీద పెట్టినప్పటి నుండి మొదలవు తుంది చాకిరీ.
ఇంట్లో ఎంతమంది వుంటే అంత మందికి టీలు, కాఫీ లు అందించడం, టిఫెన్ చేయడం, వంట చేయడం వీటితో పాటు మధ్య మధ్యలో అందరికీ అన్నీ అందిస్తూ పరుగులు పెట్టడం ప్రతి ఇల్లాలికి తప్పని సరి.
ఇంకా విచిత్రం ఏమిటంటే అందరికీ అన్నీ వేడి వేడిగా చేసి అందించే ఇల్లాలికి ఒక కప్పు టీ గానీ కాఫీ గానీ లేదా టిఫెన్ గానీ వేడిగా తాగే, తినే భాగ్యం వుండదు.
అందరికీ అన్నీ ఇచ్చి మనం తాగే సరికి లేదా తినే సరికి అవి చప్పగా చల్లారి పోయి వుంటాయి మళ్ళీ వేడి చేసుకునే ఓపిక లేక అలాగే తాగేస్తూ తినేస్తూ వుంటాము.
నాకు మాత్రం మనసులో ఒక బలమైన కోరిక వుంది.
నేను ఎలాగైతే అందరికీ అన్నీ టైమ్ టైమ్ కి అందిస్తూ వుంటానో అలా నాకు కూడా ఎవరైనా అందిస్తే ఎంత బాగుంటుందో అనేది నా కోరిక, ఒక ఇల్లాలికి ఇది కొరకూడని కొరికే అయినా... ఏదో ఆశ.
నా మనసు లోని కోరిక ఏ దేవుడు విన్నాడో గానీ నా కోరిక తీరే సమయం వచ్చింది.
ఎలా! అంటారా
ఒక రోజు సాయంత్రం మా వారు ఇంటికి వస్తూనే హడావుడిగా రాధా... రాధా అంటూ పిలిచారు.
నేను వంటింటి లో నుండి చేతులు తుడుచు కుంటూ " ఏమిటండీ ఏమిటి ఆ హడావిడి అని అడిగాను"
దానికి మా వారు మొదలు నువ్వు వచ్చి కూర్చో చెప్తాను అన్నారు.
మా బ్రాంచ్ హెడ్ ఆఫీసర్ షణ్ముగంగారు తెలుసుకదా వారి అమ్మాయి పెళ్ళి వచ్చే వారం కోయంబత్తూరు లో జరుగుతోంది
బ్రాంచ్ లోని అందరినీ పిలిచారు.
అందరినీ తప్పకుండా ఫ్యామిలీ లతో రమ్మని మరీ మరీ చెప్పారు.
అందుకే మేము ఫ్రెండ్స్ అందరం మాట్లాడుకుని నాలుగైదు ఫ్యామిలీలు కలిసి వెళదాం అని నిర్ణయం తీసుకున్నాము కోయంబత్తూరు కి కొడైకెనాల్ దగ్గరే కాబట్టి అది కూడా చూసినట్టు వుంటుంది అని పెళ్ళికి రెండు రోజులు ముందుగా వెళదామని ప్లాన్ చేశాము మన ఇద్దరి బట్టలు సర్దు అనగానే
నా చెవులకు నేనే నమ్మలేక పోయాను.
మా పెళ్ళి అయి దగ్గర దగ్గర ఇరవై ఏళ్ళు పూర్తి కావస్తోంది ఈ ఇరవై ఏళ్లలో నేను మా వారు కలిసి బయటకు వెళ్ళిన సందర్భాలు వేళ్ళపై లెక్క పెట్టవచ్చు.
పెళ్ళి అయిన కొత్తల్లో ఏవో నాలుగైదు సినిమాలకు వెళ్ళాం అంతే, ఆతర్వాత పిల్లలు పుట్టడం వాళ్లను తీసుకుని ఎక్కడికి వెళతాం లే అని ఊరుకోవడం,
తరవాత వాళ్ళ స్కూల్ అని చదువులు అని ఏదో ఒక కారణాల తో బయటకు వెళ్ళడమే మానుకున్నాను.
ఎక్కడికి వెళ్లినా ఆయన ఒక్కరే వెళ్ళి వచ్చేవారు, ఒక వేళ ఏదైనా పెళ్ళిళ్ళకు వెళ్ళినా కాళ్ళ మీద నీళ్ళు చల్లుకున్నట్లు ముహూర్తానికి వెళ్ళడం రావడం జరిగేది, మొదట బాధగా అనిపించినా రాను రాను అలవాటై పోయింది.
మళ్ళీ ఇన్నేళ్ళకు ఆయన బయటకు వెళదాం అంటే అందుకే నమ్మలేక పోతున్నాను, నమ్మకం కుదరక గట్టిగా గిల్లుకున్నాను నిజమే సుమీ నొప్పి పుట్టింది.
గాల్లో తేలుతున్నట్టుగా వంట ఇంటిలో కెళ్ళి కాఫీ కలిపి మా వారికి అందిస్తూ "ఎప్పుడండి మనం వెళ్ళేది అని అడిగాను"
"ఎప్పుడేమిటి ఎల్లుండి రాత్రి ట్రైన్ బట్టలు అన్నీ సర్దు ఆ...మరిచి పోయాను కొడైకెనాల్ హిల్ స్టేషన్ కాబట్టి చలిగా వుంటుంది స్వెట్టర్ లు షాల్ పెట్టు అన్నారు.
ఆ...అలాగే అన్నాను.
మేము ఊరికి వెళ్ళే రోజు రానే వచ్చింది ఇంట్లో పిల్లల్ని జాగ్రత్తగా వుండమని చెప్పి బయలు దేరాము, నిజం చెప్పాలి అంటే ట్రైన్ లో ఎక్కి కూర్చునే వరకు ఈ ప్రయాణాన్ని నమ్మలేక పోయాను.
ఆ మరుసటి రోజు కోయంబత్తూరు వెళ్ళి అక్కడి నుండి కొడైకెనాల్ వెళ్ళేసరికి సాయంత్రం అయింది.
కొడైకెనాల్ వెళ్ళే దారంతా ఆకాశాన్ని తాకుతున్న పచ్చని చెట్లు, రంగురంగుల పూలు ,తీగలు , దూదిపింజల్లా సాగిపోతున్న మబ్బులు, చల్లగా చెంపల్ని తాకుతున్న మలయమారుతాలు
ఓహ్ ....చూస్తుంటే ఎవరో చేయి తిరిగిన చిత్రకారుడు కాన్వాస్ మీద వేసిన అద్భుతమైన చిత్రం లా అనిపించింది.
ఇంతటి అద్భుతమైన ప్రకృతిని సృష్టించిన సృష్టికర్తకు మనసులో కోటి ప్రణామాలు అర్పించాను.
మేము బుక్ చేసుకున్న హోటల్ ముందు మా బస్ ఆగింది. ఫైవ్ స్టార్ హోటల్ అనుకుంటా పచ్చని ప్రకృతి మధ్య ఠీవీగా రాజభవనం లాగా వుంది,మేము మా మా సామాన్లు తీసుకుని లోపలికి అడుగు పెట్టాము ఎదురుగా నిలువెత్తు అమ్మవారి విగ్రహం, మెడలో మందారాలు ఇంకా ఏవో పూలతో చక్కని మాల, సుగంధాలు వెదజల్లుతూ ధూపం, అందం గా వెలిగిపోతున్న అమ్మవారి విగ్రహం నుండి చూపులు తిప్పుకోలేక పోయాను.
కీస్ తీసుకుని రూముల వైపు కదిలాము.
మేము నాలుగు ఫ్యామిలీస్ కాబట్టి వరుసగా నాలుగు రూములు మావే,
నేను మా వారు మా రూమ్ లోకి వచ్చాము.
ఒక నిముషం నాకు స్వర్గం లోకి అడుగు పెట్టినట్టు అనిపించింది.
విశాలమైన బెడ్డు.
టీ పాయ్ దాని మీద అందమైన ఫ్లవర్వాస్, డ్రెస్సింగ్ టేబుల్, హోటల్ బయట సీనరీ కనపడే లాగా బాల్కనీ ఎంతో నీట్ గా రిచ్ గా వుంది రూమ్.
ఇంతలో కాలింగ్ బెల్ మోగింది తలుపు తీస్తే రూమ్ బాయ్ చేతిలో ట్రై తో నిలబడి వున్నాడు. "కమ్ ఇన్" అనగానే లోపలికి వచ్చి చిక్కని డికాషన్ పాలు కలిపి చక్కెర ఎంత కలపాలి అని అడిగి వేడి వేడి గా కాఫీ కలిపి మా ఇద్దరికీ అందించి వెళ్ళాడు.
కాఫీ కప్పు తీసుకుని బాల్కనీ లో వున్న చైర్ లో కూర్చుని ప్రకృతిని చూస్తూ మెల్ల మెల్లగా వేడి ...వేడి కాఫీ తాగుతూ వుంటే.
ఇంత కంటే ఈ జన్మకు ఇంకేం కావాలి అనిపించింది. "కల నిజమాయేగా కోరిక తీరెగా" అంటూ మనసు మైమరచి పాడింది.
మేడం గారు " కాఫీ త్వరగా తాగి ఫ్రెష్ అయితే బయటకు వెళదాం" అన్న మా వారి మాటలకు ఈ లోకం లోకి వచ్చాను.
"అలాగే" అంటూ కాఫీ ముగించి టవల్ తీసుకుని బాత్రూమ్ లోకి వెళ్ళాను టాప్ తిప్పగానే చల్లగా మంచు లాగ నీళ్ళు చేతికి తగిలాయి.
గీజర్ ఆన్ చేసుకుని షవర్ లో తనివి తీరా స్నానం చేసి పోచంపల్లి చీర కట్టుకుని తయారు అయ్యాను, ఇంతలో మా వారు కూడా తయారు అయ్యారు.
చలిగా వుండడం తో నేను షాలు, మా వారు స్వెట్టర్ వేసు కుని బయటకు వచ్చాము .
మేము కింద రిసెప్షన్ కి వచ్చేసరికి మాతో వచ్చిన అందరూ అప్పటికే కింద రెడీ గా వున్నారు.
అందరం బయలు దేరి కబుర్లు చెప్పుకుంటూ అక్కడి ప్రకృతిని ఆస్వాదిస్తూ నడుస్తున్నాము.
రంగు రంగుల పూలతోటలు చూసాము, మావారు వారి మిత్రులు హార్స్ రైడింగ్ చేశారు
అక్కడి నుండి బోటింగ్
అలా అలా తిరిగి రాత్రికి హోటల్ చేరుకున్నాము, రూమ్ కి వచ్చి ఫ్రెష్ అయ్యి కింద రెస్టారెంట్ కి వెళ్ళాము తిరగడం వల్ల అందరికీ బాగా ఆకలిగా వుంది.
ఎవరికి కావలసినవి వాళ్ళు ఆర్డర్ చేశారు
నేను మసాలా దోశ ఆర్డర్ చేశాను.
కాసేపటికి వేడి వేడిగా పొగలు కక్కుతున్న మసాలా దోశ నా ముందు వుంది, పక్కనే నంచుకోవడానికి సాంబార్, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ
వేడి వేడి దోశ తింటుంటే కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
ఇంట్లో ఎప్పుడు దోశలు పోసినా అందరూ తిన్నాక చివరిలో నేను తినేటప్పటికీ నా మొహానికి చినిగిపోయిన దోశలు, లేదా మాడిపోయిన దోశలు మాత్రమే మిగిలేవి.
టిఫిన్లు ముగించి రాత్రి క్యాంప్ ఫైర్ కి వెళ్ళాము.
భోగి మంటను తలపిస్తూ వెచ్చగా వున్న మంట దగ్గర అందరూ కూర్చుని వున్నారు ఎక్కడి నుండో సన్నగా హృదయాన్ని మీరుతున్నట్టు వినిపిస్తున్న సంగీతం.
జీవితమంటే ఇది కదా అనిపించింది.
పాటలు, ఆటలు అందరూ చాలా చాలా హుషారుగా వున్నారు.
చాలా మంది కొత్తగా పెళ్ళి చేసుకుని హానీ మూన్ కి వచ్చిన కొత్త జంటలు అనుకుంటా వారిని చూస్తుంటే చాలా చాలా ముచ్చట వేసింది.
అదే సమయంలో నేను జీవితం లో చాలా చాలా కోల్పోయానేమో అనిపించింది.
అలా ఆ రాత్రి వెచ్చటి రగ్గు కప్పుకుని పడుకుంటే ఆనందం తో నిండిన మనసుతో ప్రశాంతం గా నిద్ర పట్టింది.
పక్కరోజు యధావిధిగా తయారయ్యి కొడైకెనాల్ లోని గుణ కేవ్, సూసైడ్ పాయింట్, ఇంకా ఇతర ప్రదేశాలు చూసి కాస్త షాపింగ్ చేసాము.
నా చిరకాల కోరిక తీరింది, ఈ రెండు రోజులు వంటింటి ఊసు లేకుండా కూర్చున్న చోటే కాఫీ, టీ, టిఫెన్, భోజనం అంటూ వేడి వేడి గా అందిస్తుంటే ఇది కదా రాజభోగం అనిపించింది. మహారాణి లా ఫీల్ అయ్యాను.
తిరిగి కొడైకెనాల్ నుండి కోయంబత్తూరు వచ్చి మా వారి బాస్ కూతురి పెళ్ళికి హాజరు అయ్యి వారి ఆతిథ్యాన్ని స్వీకరించి.
తిరుగు ప్రయాణం అవుతుంటే మనసులో చెప్పలేని బాధ ఏదో దిగులు,
నా జీవితం లో మళ్ళీ ఇలాంటి రోజులు వస్తాయా! అన్న అనుమానం.
ఆశ్చర్యం ఏమిటంటే ఎప్పుడూ ముభావం గా వుండే మా వారు ఈ ట్రిప్ లో చాలా సరదాగా వున్నారు. బాధ్యతల వల్లనో ఏమో మరి మా ఇద్దరి మధ్య మాకే తెలియకుండా ఏర్పడిన దూరం తగ్గింది అనిపించింది. చాలా రోజుల తరవాత ఇద్దరం చాలా కబుర్లు చెప్పుకున్నాం,
నాకు మళ్ళీ మా పెళ్ళి అయిన కొత్తల్లోని రోజులు గుర్తుకు వచ్చాయి. ఇద్దరం ఇక్కడే ఇలాగే వుండిపోతే ఎంత బాగుంటుందో అనిపించింది.
ఏం చేస్తాం ఎంత ఆకాశం లో ఎగిరినా చివరికి భూమి పైకి దిగాలి అన్నట్టు ఎక్కడ ఎంత తిరిగినా ఆఖరికి ఇంటికి చేరాల్సిందేగా అనుకుని భారం గా ఒక నిట్టూర్పు విడిచాను.
రైల్వే స్టేషన్ లో అందరికీ వీడ్కోలు పలికి ఇంటికి వచ్చాము,
రాత్రి పడుకున్నానన్న మాటే గాని ఎంతకీ నిద్ర పట్టలేదు కొడైకెనాల్ లో గడిపిన ఆ రెండు రోజులు ఆ అనుభూతులు అన్నీ కళ్ళ ముందు కదలాడుతూ వున్నాయి.
ఇంతలో నా భుజం మీద మా వారి చెయ్యి పడింది. " రాధా నిద్ర పోలేదా? ఇటు తిరుగు "అంటూ నన్ను తన వైపుకు తిప్పుకున్నారు, నేను అవును అన్నట్టు చిన్నగా తల వూపాను.
మా వారు నా కళ్ళలోకి చూస్తూ " నన్ను క్షమించు రాధా అన్నారు"
"ఎందుకండీ" అన్నాను
వారు నన్ను దగ్గరికి తీసుకుని అందరు మగవాళ్ళు చేసే తప్పే నేనూ చేశాను
బాధ్యతల్లో పడి నీ గురించి పట్టించుకోవడమే మానేశాను.
ఇంటిని,భర్తను ,పిల్లల ను చూసుకోవడమే నీ బాధ్యత అన్నట్టు ప్రవర్తించాను, నీకు కూడా కొన్ని కోరికలు ఆశలు వుంటాయి అన్నది పూర్తిగా మరిచిపోయాను.
మగవాడిగా బయట నాకు ఎన్ని బాధ్యతలు వున్నాయో ఇంటి ఇల్లాలిగా నీవు కూడా అంతే బాధ్యతలు మోస్తున్నావు అన్న సంగతి గ్రహించలేక పోయాను.
నీ అవసరాలు తీర్చి నిన్నేదో చాలా బాగా చూసుకుంటున్నాను అనుకున్నాను కానీ నీ సంతోషం ఆనందం గురించి ఆలోచించలేదు. మన మధ్య పెరిగిన దూరాన్ని కూడా గుర్తించలేదు.
నిన్న మన ట్రిప్ లో నువ్వు ఎంతో సంతోషంగా ఎప్పుడూ లేనంత ఉత్సాహం గా వుండడం చూశాను. ఇల్లే ప్రపంచం గా వుండే ఆడవాళ్ళకు కూడా కాస్త వెసులుబాటు, విశ్రాంతి కావాలి అన్న కనీస ఆలోచన కూడా నాకు లేకుండా పోయింది.
ఇన్ని రోజులు నువ్వు ఏం కోల్పోయావో అర్థం అయింది, బాధ్యతలతో పాటు భార్యా భర్తల మధ్య ప్రేమ,అనురాగం, అనుబంధాన్ని పెంచుకోవడానికి కొంత సమయాన్ని కేటాయించుకోవాలి అలా చేయక పోతే క్రమేణా జీవితాలలో ఒక నిస్తేజం ఆవరిస్తుంది, యాంత్రికత చోటుచేసుకుంటుంది.
అది ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుతుంది అది తెలియక నీతో ముభావం గా వుంటూ నిన్ను మరింత బాధ పెట్టాను.
ఈ ట్రిప్ లో పెళ్ళి అయిన కొత్తల్లో నా రాధ ఎలా వుండేదో ఆ రాధను మళ్ళీ చూశాను. ఒట్టు వేసి చెప్తున్నాను ఇంక మీదట వీలు వున్నప్పుడు డల్లా ఇద్దరం కలిసి ఎక్కడికైనా వెళదాం.
నీకు నాకు కూడా కాస్త రిలాక్స్ గా వుంటుంది. మన బంధాన్ని ఎప్పటికీ నిత్య నూతనం గా వుంచుకుందాం సరేనా అనగానే.
నిజంగానా అంటూ సంతోషం గా మా వారి వైపు చూశాను.
శుభం
No comments:
Post a Comment