Wednesday, September 3, 2025

 *అవతార్ మెహర్ బాబా - 66*
🪷

రచన: బి. రామకృష్ణయ్య


బాబా వాషింగ్టన్, శాన్ఫ్రాన్సిస్కోల ద్వారా ఆస్ట్రేలియాకు వెళ్ళారు. క్వీన్స్లాండ్ రాజధానియైన బ్రిజ్బేన్కు 75 మైళ్ళు ఉత్తరాన గల కీల్ కొండపైన గల 80 ఎకరాల అనాస తోటలో రమణీయమైన ప్రకృతి సౌందర్య ముతో మనోహరంగా ఉన్న స్థలంలో బాబాకు మండలి వారికి వసతి ఏర్పాటు చేసారు. బాబాతో సహవాసం కోసం విక్టోరియా, న్యూ సౌత్ వేల్స్ మొదలగు రాష్ట్రాల నుండి వచ్చిన ప్రేమికులకు గుడారాలను, వసతి భోజన సౌకర్యాలను ఏర్పాటు చేసారు. బాబా 03.06.58వ తేదీ ఉదయం ఆ సహవాస స్థలానికి చేరుకున్నారు. 03.06.58 తేదీ నుండి 06.06.58 తేదీ వరకు 4 రోజులు బాబా తన సహవాసం కోసం సమావేశమైన ప్రేమికులతో గడిపారు. వారికి వ్యక్తిగతంగాను, సామూహికంగాను దర్శనాలిచ్చి వారి హృదయాలను ప్రేమతో నింపి 07.06.58 రోజు బయలుదేరి 08.06.58 వ రోజు బొంబాయి చేరుకున్నారు. 
📖

*మానవజన్మ తరువాత జంతుజన్మ రాదు*

పూనాలో ఉండే రోజుల్లో బాబా ఈరుచ్ తండ్రియైన జెస్సావాలా ఇంటికి (బింద్రాన్ హౌస్క) తరచుగా వెళ్తుండేవారు. ఆ ఇంటిలో నున్న పనిమనిషి దొంగతనం చేసేదని తెలిసి బాబా ఆమెను దొంగతనం చేయవద్దని చెప్పి మందలించారు. అయినా ఆమె మళ్ళీ దొంగతనం చేసిందని తెలిసి బాబా ఆమెను తన దగ్గరకు పిలిచి గంభీరంగా ఇలా చెప్పారు. 'నీవు మళ్ళీ దొంగతనం చేస్తే వచ్చే జన్మలో పందివై పుడతావు - జాగ్రత్త' అన్నారు. ఆమె హడలెత్తి మళ్ళీ ఎప్పుడూ దొంగతనం చేయనని చెంపలేసుకుంది. మళ్ళీ దొంగతనం చేయలేదు. ఆ సమయంలో దగ్గర ఉన్న మండలి వారు ఫ్రాన్సిస్ బ్రాబ్బాన్లను ఉద్దేశించి బాబా ఇలా చెప్పారు.

'ఒకమాటు మానవ శరీరం ధరించిన తర్వాత జీవాత్మకు తిరోగమనం ఉండదు. ఆ జీవుడు జంతు రూపంలోకి మళ్ళీ వెళ్ళడు' అని చెప్పారు.
📖

*మెహెర్ విహార్*

24.08.1963 రోజు బాబా ప్రేమాశీస్సులతో విజయవాడలో డా. జి. యస్. యన్. మూర్తిగారిచే స్వామి సత్యప్రకాశ్ మెహెరా నంద గారి ఆధ్వర్యంలో మెహెర్ విహార్ ప్రారంభించబడి తర్వాత హైదరాబాద్ కి మార్చబడింది. హైదరాబాద్లో అనేక కార్యక్రమాలు నిర్వహించడమే గాక 'దివ్యవాణి' అనే ఆంగ్ల మాసపత్రికను, 'మెహెర్ జ్యోతి' అనే తెలుగు మాసపత్రికని ప్రచురించి బాబా సాహిత్యాన్ని ఎన్నో పుస్తకాలలో తెలుగులో ప్రచురించి ఈ సంస్థ ద్వారా స్వామి సత్యప్రకాశ్ గారు ఎనలేని సేవ చేసారు.
📖

*చివరి రోజులు*

1968 సం. డిసెంబర్ మాసంలో బాబా ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. ఒంట్లో రక్తం తగ్గిపోయింది. 15.12.1968 నాడు బాబాకు రక్తం ఎక్కించారు. డా. రాంగిండే బొంబాయి నుండి వచ్చి చూచి బాబా ఆరోగ్యం చాలా క్షీణించిందని చెప్పారు. 22.12.68 నాడు మెహెర్ పుట్టిన రోజు జరుపుకొన్నారు. 23.12.68 తేదీన బాబా తమ్ముడు జూనియర్ ఆదీ కుమారుడైన దారాకు శతృఘ్న కుమార్ కూతురు అమృతతో బాబా తన సమక్షంలో వివాహం జరిపించారు. నవంబర్, డిసెంబర్, జనవరి మాసాల్లో ఎందరో ప్రేమికులకు ఎన్నో విచిత్రాను భూతులు కలిగాయి. కొందరు స్వప్నంలోను, మరికొందరు జాగరూక స్థితిలోను బాబా దర్శనం చేసుకున్నారు. బల్గేరియా నుండి అమెరికాకు వలస వచ్చి ఎన్నో కష్టాలను భవించిన ఒక వ్యక్తికి నవంబర్ 26, 27 తేదీ రాత్రి ఒక వింత అనుభవం కలిగింది. దానినతడు బాబాకు ఒక లేఖలో వ్రాసి పంపాడు.

"ఆ రాత్రి నిద్రపోతున్న నా కన్నులు మిరుమిట్లు గొలిపే ప్రకాశంతో నిండి పోయాయి. నా ఎదుట ఒక మానవ రూపం ప్రత్యక్షమై బల్గేరియా భాషలో 'నీవు భయపడకు - నన్ను గుర్తించావా?' అని అడిగింది. సమాధానంగా నేను 'గుర్తించాను మీరు మెహెర్ బాబా' అని పలికాను. (ఆ పేరు నాకు తెలియదు. నాలుగు నెలల క్రిందట ఆ పేరు ఎవరి ద్వారానో విన్నాను గాని నాకు ప్రత్యక్షమైన రూపం మెహెర్ బాబాదే అని నేనెలా గుర్తించానో, ఆ పేరు నేనెలా చెప్పానో నాకే తెలియదు అని అతడు వ్రాసాడు) 'గట్టిగా నమ్ము. నేను నీకు సహాయం చేస్తాను' అని చెప్పి ఆ మానవ రూపం అదృశ్యమైంది. గది అంతా చీకటి అలుముకుంది. మళ్ళీ రెండవ మారు వింత ధ్వని అయ్యింది. నా భార్యకు కూడా మెలుకువ వచ్చింది. ఈ దృశ్యంతో కలిగిన ఉద్వేగంతో తన్మయత్వంలో రెండు రోజులు విభ్రాంతుడనై యున్నాను.

జనవరి మాసంలో బాబాను చూడటానికి పాద్రీ వచ్చాడు. ఆయన బాబాతో ఇలా అన్నాడు 'బాబా మండలి అంతా పెద్ద వాళ్ళమైపోయాము. ఇంక ఈ దుకాణం మూసివేస్తే మంచిదేమో!' దానికి బదులుగా 'కాదు. ఇప్పుడే అసలు ఈ దుకాణం తెరువబడుతుంది' అని బాబా చెప్పారు.

బాబా ఆరోగ్యం గురించి ఆదుర్దా పడే మండలి వారికి తరచూ బాబా ఇలా చెప్పేవారు 'నేను ఈ శరీరాన్ని కాదు- నేను దేవుడనని మరిచిపోకండి - జరిగేది జరుగబోయేది అన్నీ నాకు తెలుసు. మానవుల బాధలను తీసుకోవడానికే ఈ మానవ శరీరం దాల్చాను. అన్నీ నా ఇచ్చ ప్రకారమే జరుగుతాయి.'

'నా సమయం వచ్చింది. ఇక ఏ మందులు పనిచేయవు' అని బాబా చెప్పారు. 

27.01.69 నుండి బాబాకు కుదుపులు (ఈడ్పులు) ఎక్కువయ్యాయి. బొంబాయి నుండి డా. గిండేను పిలిపించారు. కాని ఆయన బాబా ఆఖరి శ్వాస వదిలిన తర్వాతనే చేరుకున్నాడు. బాబా ఇచ్ఛ ప్రకారమే అంతా జరిగి తీరుతుంది. 30.01.69 రోజు పాద్రీ వచ్చాడు. ఆయనతో బాబా 'నీ గదిలోకి వెళ్ళు. రేపు నీకు పని ఉంటుంది' అని అన్నారు. 31.01.69 రోజు బాబా శరీరంలో కుదుపులు ఎక్కువగా వచ్చాయి. పాద్రీ హోమియో మాత్రలు ఇస్తూ వచ్చాడు. 'ఈ రోజు నా శిలువ వేత' అని చెప్పారు బాబా కాని మండలి వారు ఆ మాటను తేలికగా తీసుకున్నారు.
🪷
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం* 

https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe

*తెలుగు భాషా రక్షతి రక్షితః* 

*ఏడాది చందా 120/-, ఫోన్ పే & గూగుల్ పే నెంబర్ 9849656434*

*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂

No comments:

Post a Comment