Wednesday, September 3, 2025

 🙏🏻శ్రీ రమణీయం🙏🏻

మనం పూజలు చేస్తాం. తీర్థ యాత్రలకు వెళ్తాం. దేవాలయాలకు వెళ్తుంటాం. వీటి వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది. ఒక్కొక్కసారి శాంతి లభిస్తుంది. రమణ మార్గాన్ని అభ్యసించే వారికి ప్రశాంతత సిద్ధిస్తుంది.
1896వ సంవత్సరం సెప్టెంబర్ ఒకటవ తేదిన ఓ పదహారేళ్ల యువకుడు ఇంటిని విడిచిపెట్టాడు. లోపల ఏదో ప్రేరణ. ఎవ్వరికీ చెప్పకుండా అరుణాచలానికి (తిరువణ్ణామలై) వెళ్తున్నాడు. అక్కడికి చేరుకోగానే తన దగ్గరున్న కొద్దిపాటి పైకాన్నీ, ఇతర వస్తువుల్నీ త్యజించాడు. మదురై నుంచి తిరువణ్ణామలైకి ఎంతో దూరం కాకపోయినా.. ఆ ప్రయాణం మూడు రోజుల పాటు సాగింది. ఈ ప్రయాణానికి కొద్ది రోజుల ముందు ఆ యువకుడికి తన నిజతత్త్వం అనుభవపూర్వకంగా తెలిసింది. తాను కేవలం చైతన్యమేనని తెలుసుకున్నాడు. ఆ చైతన్యానికి రూపం లేదు, అది సర్వ వ్యాప్తం. అరుణాచలం చేరిన తర్వాత ఆ చైతన్యం ఎరుకలోనే నిమగ్నుడయ్యాడు. ఎప్పుడో గానీ ఆహారం తీసుకునేవాడు కాదు. మౌనంగా కళ్లు మూసుకుని కూర్చుండేవాడు. అరుణగిరి గుహల్లో రోజుల కొద్దీ ధ్యానావస్థలో ఉండిపోయేవాడు. అతని స్థితికి ఎందరో ఆకర్షితులయ్యారు. అలా ఆయన దగ్గరికి వచ్చిన వారిలో శ్రీకాకుళం దగ్గరలో ఉన్న కలువరాయి గ్రామానికి చెందిన కావ్యకంఠ గణపతి ముని ఒకరు. గణపతి ముని గొప్ప తాపసి. ఆయన ఆ యువకుడి అసలు పేరు వెంకటరామన్‌ అని తెలుసుకొని... భగవాన్‌ శ్రీ రమణ మహర్షి అని నామకరణం చేశారు. రమణులు అరుణాచలం చేరి అప్పటికే పదకొండేళ్లు గడిచిపోయాయి. మరో పదిహేనేళ్లు కొండమీదే ఉన్నారు స్వామి. 1922లో కొండ దిగువన, ఊరు శివారులో ఒక ఆశ్రమం ఏర్పడింది. దీనినే 'శ్రీరమణాశ్రమం' అంటారు. 1950లో దేహం చాలించే వరకూ రమణులు అక్కడే ఉన్నారు. ఎక్కువగా మాట్లాడేవారు కాదు. మౌనంలోనే తన ఆధ్యాత్మిక శక్తితో తరంగాలు ప్రసరింపజేసేవారు. ''యోగులలో మేరువు'' అని శ్రీ అరవిందులు రమణులను వర్ణించారు. ఎవరికైనా మనసు బాగోకపోతే, 'కొన్ని రోజులు రమణ మహర్షి ఆశ్రమంలో ఉండి రండి..'అని మహాత్మాగాంధీ తన అనుచరులతో చెప్పేవారట. వారి సమక్షంలో ధ్యానం చేసుకున్న అసంఖ్యాకులలో సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ఒకరు. దేశ, విదేశాల నుంచి ఎందరో రమణుల ఆశ్రమానికి వచ్చేవారు. ఎవరైనా ఆధ్యాత్మిక సందేహాలు అడిగితే.. మహర్షి క్లుప్తంగా, స్పష్టంగా సమాధానాలు ఇచ్చేవారు. తమిళం, తెలుగు, కొద్దిగా ఇంగ్లిష్‌ మాట్లాడేవారు. శ్రీరమణులు ఆశ్రమ కార్యక్రమాలలో పాల్గొనేవారు. క్యాన్సర్‌ వ్యాధి సోకి దేహాన్ని ఎంత కష్టపెట్టినా.. ఆయన ముఖంలో దరహాసం, కళ్లలో మెరుపూ ఏమీ తగ్గిపోలేదు. 'ఇది ఎలా సాధ్యం?' అని అందరూ ఆశ్చర్యపోయేవారు. వారు చేసిన బోధన..
ప్రతి మనిషీ ఎప్పుడూ సంతోషంగా ఉండాలనీ, ఆ సంతోషం బయటి ప్రపంచంలో దొరుకుతుందనీ ఆరాటపడుతూ, వెతుక్కుంటూ ఉంటాడు. శ్రీరమణులు చెప్పిందేమిటంటే.. 'మనం ఈ వెతుక్కోవడానికి కారణం మన మనసు. అది ఆలోచనల పుట్ట. ఒకదాని తర్వాత ఒకటిగా ఆలోచనలన్నీ.. ప్రవాహంలా వస్తుంటాయి. ఈ ఆలోచనలన్నిటికీ మూలం ''నేను'' అనే భావం. ఈ ''నేను'' అంటే ఏమిటి? ఎక్కడ్నుంచి ఉదయిస్తుంది? అని ఆరా తీస్తే మనసు తన మూలమైన ఆత్మలో విశ్రమిస్తుంది. అప్పుడు ఆనందంగా ఉంటుంది. గాఢంగా నిద్ర పోయామనుకోండి. నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత.. 'నాకు ప్రపంచమే తెలియలేదు. నా ఇల్లు కూడా మరచిపోయాను' అంటాం. దీనంతటికీ కారణం.. కలలు కూడా లేని గాఢ నిద్రలో... మనసు తన మూలంలో విశ్రమించడం. మేల్కొని ఉండగా కూడా ఆ స్థితిని అందుకోవచ్చ'ని రమణులు బోధించారు. అందుకోసం.. ''ఆత్మవిచారం'' అనే మార్గాన్ని సూచించారు. నిరంతర అభ్యాసం వల్ల మనోనిశ్చలత వృద్ధి అవుతుంది. మనం పూజలు చేస్తాం. తీర్థ యాత్రలకు వెళ్తాం. దేవాలయాలకు వెళ్తుంటాం. వీటి వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది. ఒక్కొక్కసారి శాంతి లభిస్తుంది. రమణ మార్గాన్ని అభ్యసించే వారికి ప్రశాంతత సిద్ధిస్తుంది. రమణులు బోధించిన 'ఆత్మ విచార మార్గం' అందరికీ సాధ్యం కాదు. దీనిని గుర్తించేవారు 'తన కన్నా ఉన్నతమైన శక్తి.. ఈ విశ్వాన్ని నడిపిస్తోందని గ్రహించి.. దానికి బేషరతుగా వశమైపోతార'ని అంటారు రమణులు. అద్వైత సిద్ధాంతాన్ని జీవితంలో ఆచరించి చూపిన మహనీయుడు ఆయన. వారు చూపిన మార్గం అనుసరిద్దాం. ఆచరణాత్మక ధోరణిని పెంపొందించుకుందాం.
(పింగళి సూర్య సుందరం)

No comments:

Post a Comment