#EXISTENTIALISM #PSYCHOLOGIST #TIME
ఎగ్జిస్టెన్షల్ సైకాలజీ మీద ఉన్న ఇంటరెస్ట్ తో చెన్నైకి చెందిన ఒక యువ సైకాలజిస్ట్ నిన్న హైదరాబాద్ రావడంతో నన్ను కలిసింది. ఒక సైకాలజిస్టుగా సక్సెస్ సాధించాలంటే ఫస్ట్ రూల్ ఏంటో చెప్పండి అని అడిగింది. కెరీర్ పరమైన విజయం కోసం అయితే #ఎగ్జిస్టెన్షలిజం ఎన్నుకోవద్దు. కెరీరిస్టులు ఎప్పటికీ ఎగ్జిస్టెన్షలిస్టులు కాలేరు. ఎగ్జిస్టెన్షలిస్టులు ఎప్పుడూ కూడా కెరీర్ ని పట్టించుకోరు. ఎగ్జిస్టెన్షలిస్టులులకు విజయం అవసరం లేదు. సమాజం మెప్పు అవసరం లేదు. ఎటువంటి స్థితిలో ఉన్న బ్రతికేటటువంటి పూర్తి ఆత్మస్థయిర్యం ఎగ్జిస్టెన్షలిస్టులులకు ఉంటుంది.
ఇక ఎగ్జిస్టెన్షలిస్టులుగా నేను మొదట ఆలోచించేది పూర్తి స్పృహలో ఉండి నా టైం దేనికోసం వినియోగిస్తే ఎక్కువ ఉపయోగం ఉంటుంది అనేది. చాలా మంది వారి వారి సమస్యలతో, వారి వారి సందేహాలతో సైకాలజిస్టులను సంప్రదిస్తారు. ఎవరికి వారి సమస్యలు అతి పెద్దగా అనిపిస్తాయి. కానీ సైకాలజిస్టుకి ఉండే సమయం పరిమితం. అపుడు సైకాలజిస్ట్ తనకు వచ్చే ఫోన్ కాల్స్ ను హ్యాండిల్ చెయ్యడం అత్యంత ముఖ్యమైనది. ప్రతీ ఒక్కరికీ ఓపికగా సమాధానం చెప్పలేక పోవచ్చు. చెప్పగలిగినా ఆ సమయం సద్వినియోగం కాకపోవచ్చు.
ఇందుకు ఉదాహరణ దాదాపు ఒక సంవత్సరం క్రితం ఒక 19 సంవత్సరాల అమ్మాయికి తనకున్న మానసిక సమస్య వలన పదునుగా ఉన్న ఏ పరికరం కనిపించినా తన శరీరాన్ని కోసుకోవాలి అనిపిస్తుంది. అలా శరీరం తెగుతున్నపుడు కనిపించే దృశ్యం తనకు ఆనందాన్నిస్తుంది. ఆ విధంగా చేతులు కోసుకోవడం, తరువాత తొడలపై కోసుకోవడం, మర్నాడు హాస్పిటల్ కి వెళ్లి డ్రెస్సింగ్ చేపించుకోవడం జరుగుతూ ఉంది. బెంబేలెత్తిన తల్లిదండ్రులు కౌన్సిలింగుకి తీసుకొచ్చారు. నేను చెప్పిన సమయం కన్నా అర్థగంట ముందే వచ్చి నాకు ఫోన్ చేశారు.
'సర్, మీరు త్వరగా రండి లేదంటే అమ్మాయి అసహనంతో కౌన్సిలింగ్ వద్దు అని వెళ్ళిపోతుంది' అంటూ ప్రాధేయపడ్డారు. నేను వెంటనే ఆఫీసుకి బయలుదేరాను. అందరూ ఆఫీసులకు వెళ్లే సమయం. హెవీ ట్రాఫిక్, ఎవరి హడావుడిలో వారు వేగంగా వెళ్లిపోతున్నారు. అయినా నా వాహనాన్ని వేగంగా నడుపుకుంటూ వీలయినంత త్వరగా ఆఫీసుకి చేరుకోవాలని ప్రయత్నంలో ఉన్నాను. అటువంటి సమయంలో ఒక ఫోన్ వచ్చింది. నా వాహనాన్ని వేగం తగ్గించి ప్రక్కకు తీసుకుని ఫోన్ ఆన్సర్ చేశాను. భీమవరం నుండి ఒక పెద్దావిడ కాల్ చేసింది. 'నేను డ్రైవింగులో ఉన్నాను తరువాత మాట్లాడతాను, మీ సమస్యను మెసేజ్ చెయ్యండి' అని చెప్పాను. కానీ ఆవిడ 'చాలా అర్జెంటు సర్, మాట్లాడాలి' అని చెప్పింది.
వెనుక నుంచి ఇతర వాహనాల హరన్స్ కొడుతున్నారు. సరే అని చెప్పి నెమ్మదిగా నా వాహనాన్ని కష్టపడి సేఫ్ ప్లేసులో ఆపుకుని ఆమెకు తిరిగి ఫోన్ చేసాను. అప్పడు ఆమె చెప్పిన సమస్య ఏంటంటే తన ఎనిమిది సంవత్సరాల మనమరాలు 'స్కూలుకి వెళ్ళనంటుంది, ఏంచెయ్యాలి?' అని అడుగుతుంది. అదేంటమ్మా అర్జెంటు అన్నారు కదా అంటే, అవును స్కూల్ టైం అయిపోతుంది. అయినా ఈ అమ్మాయి వెళ్ళను అని ఏడుస్తుంది అని చెప్పింది.
ఒక ఫోన్ కాల్ వచ్చినపుడు వారి వాయిస్, వాడిన పదాలు, పిచ్, ఆత్రుత వంటి అనేక అంశాల ఆధారంగా ఆ ఫోన్ కోసం ఎంత సమయం కేటాయించాలి అనేది అప్పటికప్పుడు నిర్ణయించుకోవాలి. ఎవరి సమస్యలు వారికి పెద్దగా అనిపిస్తాయి. ఒక సైకాలజిస్టుగా మనమే వారిని అంచనా వెయ్యాలి. ఆ అంచనా ఒకొక్కసారి తప్పు కూడా కావచ్చు. పై ఉదాహరణలో అలా అంచనా వేయడంలో విఫలం అయ్యాను. అటువంటి సమయంలో అవసరాన్ని బట్టి ఓపెన్ కొశ్చన్స్ మరియూ క్లోస్డ్ కొశ్చన్స్ వేసి సమాచారాన్ని వీలైనంత త్వరగా రాబట్టాలి. కొన్నిసార్లు అవతలి వ్యక్తులు మనలను అహంకారులని, అజ్ఞానులని తిట్టుకోనూ వచ్చు. అయినా భయపడకుండా, బాధపడకుండా మన ప్రవర్తన ఉండాలి. ఒక్కోసారి ముప్పై సెకండ్ల సమయం అడిగినా ముప్పై నిమిషాలు కేటాయించాల్సి రావచ్చు.
కొన్నిసార్లు అర్థరాత్రులు, తెల్లవారు ఝామున కూడా కాల్స్ వస్తాయి. వాటిని అంచనా వెయ్యగలగాలి. వాటి వాటి అర్జెన్సీని అంచనా వేసి వారికి సమాధానం ఇవ్వడం, లేదా ఇగ్నోర్ చెయ్యడం చెయ్యాలి. ఓపికగా సమాధానమే ఇవ్వాలని నిర్ణయించుకుంటే నీకు నిద్ర ఉండదు. లేదు ఇగ్నోర్ చెయ్యాలి అంటే సరయిన సమయంలో ప్రతి స్పందించ లేకపోతే అవతల ఒక జీవితం నష్టపోయే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో పట్టు సాధించడం మాస్టర్స్ ఇన్ సైకాలజీ చదివినంత సులభం కాదు.
#HariRaghav 01.09.2019
No comments:
Post a Comment