Wednesday, October 16, 2024

 *ఓర్పు పుణ్యహేతువు!*

```
మనం అనుకున్నట్లుగా లోకం నడవదు. దానితీరు వేరు. మన ఆలోచనలతో అందరూ ఏకీభవించకపోవచ్చు.

ఓర్పు లేనివారికి, ఈర్ష్యాసూయలు గలవారికి మనసు వెంటనే చీకాకు పడుతుంది. అది కోపం రూపంలో వ్యక్తమవుతుంది. కోపావేశం ఆలోచనాశక్తిని క్షీణింపజేస్తుంది. నోటివెంట పరుషపదాలు వెలువడతాయి. చినికి చినికి గాలివాన అయినట్లు- అది తగాదాలకు తుదకు తన్నులాటకు దారితీస్తుంది.

క్షమ మంచిదా,  లేక బలప్రయోగం మంచిదా? అని బలిచక్రవర్తి తన తాత అయిన ప్రహ్లాదుణ్ని ప్రశ్నించాడు.

సదా ప్రతాపం ప్రదర్శించడం గాని, లేక ఎల్లప్పుడూ ఓర్పుతో ఉండటం అనేది గాని మంచిది కాదు. ‘శాంతి శాంతి’ అంటూ జపం చేస్తూ కూర్చునేవాళ్ళు తుదకు అందరికి లోకువైపోతారు. ఆ పరిస్థితిలో   కొందరికి  మరణమే మేలనిపించవచ్చు.'  అని ప్రహ్లాదుడు పలికాడు.

’బలం ఉంది కదా అని ప్రతాపం ఎక్కువగా ప్రదర్శిస్తే ప్రాణాపాయం సంభవించవచ్చు. సమయానుకూలంగా మనసులోని మృదుత్వాన్ని, కాఠిన్యాన్ని కూడా ప్రదర్శించడం నేర్చుకుంటే   ఇహ-పరాల్లో సుఖం పొందుతారు!’ అని వనపర్వం చెబుతోంది.

’గతంలో మనకు ఎవరైనా ఉపకారం చేసి ఉంటే, ఇప్పుడు వారు మన విషయంలో అపరాధం చేసినా వారిని క్షమించాలి. తక్కువ జ్ఞానం ఉన్నవాళ్ళు మనకు అపకారం చేసినా పట్టించుకోకూడదు. అయితే, కపటబుద్ధితో అపకారం తలపెట్టి, తరవాత 'నాకు తెలియక చేశాను' అనేవాళ్లను విడిచిపెట్టకూడదు. ఒకే తప్పు రెండో పర్యాయం చేస్తే కఠినంగా శిక్షించాలి.’ ఇది ప్రహ్లాదుడి ఉపదేశం.

ద్రౌపది తనకు కౌరవులు చేసిన అవమానానికి మండిపడింది. ఆ మంట శాంతివచనాలతో చల్లారేది  కాదు. ధర్మరాజు ఆమె కోపాన్ని పోగొట్టడానికి ప్రయత్నించాడు..“ద్రౌపదీ!  కోపం విచక్షణాజ్ఞానాన్ని నాశనం చేస్తుంది. కోపిష్టులకు 'ఇలా అనవచ్చు. ఇలా అనకూడదు' అనే తేడా ఉండదు. కాబట్టి ఓర్పు పుణ్యహేతువు అని గ్రహించు!" అన్నాడు.

వ్యాసుడు, భీష్ముడు, శ్రీకృష్ణుడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, విదురుడు, సంజయుడు మొదలైన పెద్దలందరూ శాంతినే కోరతారు. పెద్దల మాటను పెడచెవిన పెట్టేవారికి శాంతివచనాలు ఎక్కవుగదా! 

రాజ్యాధికారానికి అర్హత లేకపోయినా సింహాసనం కోరిన సుయోధనుడికి ఓర్పు తక్కువ, అర్హతగల ధర్మరాజుకు ఓర్పు అధికం!

ద్రౌపది తాను పొందిన అవమానాల వల్ల పట్టరాని కోపంతో బుసలు కొడుతున్నది. "జీవులకు కష్టసుఖాలు బ్రహ్మదేవుడి వల్లనే కలుగుతున్నాయి. పెద్దలు మాటిమాటికీ ‘ధర్మో రక్షతి రక్షితః’ (ధర్మాన్ని మనం రక్షిస్తే, ధర్మం మనల్ని రక్షిస్తుంది) అంటూ ఉంటారు గదా! మరి ఆ ధర్మం మిమ్మల్ని రక్షించిందా? మంచివాళ్లు కూడు లేక అల్లాడుతూ ఉంటే, దుర్మార్గులు సుఖంగా ఉంటున్నారు. ఆ దుర్మార్గుడైన దుర్యోధనుడు సంపదతో విలాసంగా జీవిస్తున్నాడు. అలాంటి పాపికి సంపద లభించడానికి కారణం ఏమిటి?" అని ధర్మరాజును నిలదీసింది.

ధర్మరాజు సమాధానం ఇది.. “పాంచాలీ! ధర్మ వ్యతిరేక బుద్ధి వదిలిపెట్టు! ధర్మానికి ఆధర్మానికి తగిన ఫలితం ఉంటుంది. ధర్మదృష్టి లేని వాళ్లు పశువుల్లా జీవిస్తారు. ఈశ్వరుడిని, బ్రహ్మను నిందించకూడదు. మనిషి దేవతల్లాగానే అమరత్వాన్ని పొందుతాడు... శాంతాన్ని మించిన సుగుణం లేదుగ.✍️```
  …డాక్టర్ పులిచెర్ల సాంబశివరావు.

No comments:

Post a Comment