Wednesday, October 16, 2024

 Vedantha panchadasi:
పృథక్ పృథక్ చిదాభాసాః చైతన్యాధస్త దేహినామ్ ౹
కల్ప్యంతే జీవనామానో బహుధా సంసరం త్యమీ ౹౹7౹౹

7.  అట్లే శుద్ధ చైతన్యమునందు ఆరోపింపబడిన బ్రహ్మాది శరీరములకు శుద్ధ చైతన్యమువంటి చైతన్యములు అనగా చిదాభాసలు, కల్పింపబడుచున్నవి.
ఈ చిదాభాసలకే జీవులని పేరు.ఈ జీవులే బహు విధములుగా సంసారచక్రమున పరిభ్రమింతురు.(నిర్వికారమగు బ్రహ్మమునకు సంసరణము లేదని భావము.)

వస్త్రాభాసస్థితాన్ వర్ణాన్ యద్వదాధార వస్త్రగాన్ ౹
వదన్త్యజ్ఞా స్తధా జీవసంసారం చిద్గతం విదుః ౹౹8౹౹

8. అజ్ఞానులు కల్పితవస్త్రముల యందలి రంగులనే,చిత్రమునకు ఆధారమైన వస్త్రము వలె నిజమైన వస్త్రములుగ భావింతురు.అట్లే పరమాత్మ యందు ఆరోపింపబడిన జీవులు,చిదాభాసలు జన్మమృత్యు సంసారమున తిరుగుచుండగా అజ్ఞానులు పరమాత్మయే సంసారచక్రమున భ్రమించుచున్నదని భావిస్తారు.

చిత్రస్థ పర్వతాదీనాం వస్త్రాభాసో న లిఖ్యతే ౹
సృష్టిస్థ మృత్తికాదీనాం చిదాభాసస్తథా నహి ౹౹9౹౹

9. పటచిత్రమునందలి పర్వతములు మొదలగు వానికి వస్త్రాభాసలు,కల్పిత వస్త్రములు, చిత్రింపబడవు.అట్లే సృష్టియందలి మట్టి,శిలలు మొదలగు వానికి చిదాభాస కూడా ఉండదు.

చిదాభాసుడు మనఃప్రకాశముగా అగుపించు ఆత్మయొక్క భావన.
ఒకటి మూడు అగును,మూడు అయిదు అగును,అయిదు అనేకమగును.

అనగా నిర్మలమైన ఆత్మ(ఒకటిగా ఉన్నట్లు అగుపించు సత్త్వము), సంపర్కము ద్వారా మూడు(సత్త్వ,రజస్తమస్సులు)
అగును.ఆ మూడింటితో పంచభూతములు జనించును.ఆ అయిదింటితో సమస్త విశ్వము ఆవిర్భవించును.
ఇదే దేహము ఆత్మయని భ్రాంతిని కలిగించును.

జీవాత్మ యందు ప్రతిఫలించిన విధముగా,ఆకాశపరిభాషలో అది మూడు వర్గములు(విధములు)గా విభజింపబడి యున్నట్లు వివరింపబడినది.

నిరవధికమయిన శుద్ధచైతన్యము, నిరవధికమయిన మానసిక చైతన్యప్రపంచము,నిరవధికమయిన పదార్థప్రపంచము (చిదాకాశము,చిత్తాకాశము,భూతాకాశము).

మనస్సు(చిత్తము)తన త్రివిధరూపములుగా అనగా,
మనస్సు,బుద్ధి,అహంకారములుగా విభజింపబడినప్పుడు,అది అంతఃకరణమనబడును.కరణము అనగా ఉపకరణము(సాధనము లేక పనిముట్టు)అని అర్థము.

కాళ్ళు,చేతులు,ఇతర దేహావయవములు బాహ్యకరణములు,దేహములోపల పనిచేయు ఇంద్రియములు అంతఃకరణములు.

ఆ ఆత్మభావన లేక ఈ అంతఃకరణములతో పనిచేయు ప్రకాశమానమనస్సు జీవుడు అనబడును.

స్పర్శ వేద్యమయిన శుద్ధచైతన్యరూపము యొక్క ప్రతిబింబమయిన మానసికచైతన్యము పదార్థప్రపంచమును చూచునపుడు దానిని''మానసాకాశము"అందురు.

కానీ అది స్పర్శవేద్యమయిన శుద్ధచైతన్య రూపమును చూచునప్పుడు,దానిని
"సంపూర్ణ చైతన్యము"  
(చిన్మయము)అందురు.

అందువలననే
"మానవుని బంధ-మోక్షములు రెండింటికిని మనస్సు కారణము"-
అని చెప్పిరి.ఈ మనస్సే అనేకభ్రాంతులను కల్పించును.ఈ రాగబంధాలతో జీవులు బహు విధములుగా సంసార చక్రమున పరిభ్రమిస్తూవుంటారు.

పరమాత్మస్థితి ఎట్టి మార్పు లేనిది, పొందనిది.మరియు అది మలినము(జననమరణాలు) కాదు. మాలిన్యమే కల్పితము, కల్పనయే మాలిన్యము. దీనిని తెలిసికొన్నప్పుడు కల్పన(ఊహ)త్యజింపబడి మాలిన్యము నివర్తించును.

తన స్వరూపము ఆత్మవిచారణవలన పైన పేర్కొన్న తత్త్వరహస్యము నిశ్చయింపబడిన యెడల బాహుళ్యము (నానాత్వము) అయిదుగాను,
అయిదు మూడుగాను, మూడు ఒకటిగాను లయించును.

తలనొప్పికి మందువేసుకొని వదిలించుకున్న పిదప నీవు సహజముగా(పూర్వము)ఉండినట్లే ఉందువు.తలనొప్పి, దేహమే ఆత్మ అనుభ్రాంతివంటిది.ఆత్మవిచారణ అను ఔషధమును ఇచ్చినప్పుడు అది అదృశ్యమగును.
నిత్యసత్యుడుగా మిగులుదువు.     

No comments:

Post a Comment