మన జీవితంలో డబ్బు ముఖ్యం లేక మనశ్శాంతి ముఖ్యమా?
" అశాంతస్య కుతః సుఖం - భ.గీత 2:66 " - ఎప్పుడూ అశాంతిగా ఉండేవానికి సుఖం ఎక్కడిది అన్నారు పరమాత్మ గీతలో.
డబ్బు అవసరమే కాని ముఖ్యం కాదు. డబ్బు అశాశ్వతం. ఈరోజు ఉంటుంది, రేపు పోవచ్చు. మనశ్శాంతి శాశ్వత సంపద. మనశ్శాంతి వల్ల ఆరోగ్యం బాగుండడమే కాదు తను, తన కుటుంబమే కాక సమాజం కూడా సంతోషంగా ఉంటుంది.
మాయా జూదంలో పాండవులను ఓడించి అరణ్యవాసానికి పంపించి కౌరవ సామ్రాజ్యాధిపతి అయిన దుర్యోధనుడు సంతోషంగా ఉన్నాడా ఒక క్షణమైనా.
పాండవులు అరణ్యవాసానికి వెళ్ళాక దుర్యోధనుడు అనుకుంటాడు " అరణ్యవాసం 12 ఏళ్ళు, అజ్ఞాతవాసం ఏడాది ఎంతసేపు, ఇట్టే గడిచిపోతాయి. అయాక పాండవులు ఎలాగూ వస్తారు, తమ రాజ్యం ఇవ్వమని అడుగుతారు. నేను ఎలాగూ ఇవ్వను. యుద్ధం తప్పదు. భీముడిని సంహరిస్తే పాండవులు నీరసపడి పోతారు. ప్రతిజ్ఞలు చేసిన భీముడిని నేను సంహరించాలి. అది అంత సులభం కాదు. దానికి తగిన సాధన చేయాలి " అనుకుని భీముడిలాగే ఎత్తు , బరువు, లావు ఉండేలా లోహ విగ్రహాన్ని చేయించి తన గదిలో పెట్టుకుని రోజూ దానిని తన చేతులు కాళ్ళూ రక్తాలు కారుతూన్నా లెక్కచేయకుండా కొడుతూ తన్నుతూ ఉండేవాడు. ఏనాడూ ఆనందించడం, సుఖపడడం జరగలేదు. చివరకు అనుకున్నట్లుగానే యుద్ధం జరగడం, భీముడి చేతిలో చావడం జరిగింది.
యుద్దం అయాక పాండవులు కృష్ణుడు ధృతరాష్ట్రుడికి దగ్గరకు వెళ్ళినప్పుడు భీముడిని చంపేయాలని దగ్గరకు రమ్మంటాడు ధృతరాష్ట్రుడు. కృష్ణుడు భీముడిని ఆపి దుర్యోధనుడి గదిలో ఉన్న ఈ లోహపు విగ్రహాన్నే తెప్పిస్తారు కృష్ణుడు. ఆయనేమీ సృష్టించలేదు విగ్రహాన్ని. కర్మఫలం అలా తిరిగి వస్తుంది.
అన్యాయపు ఆర్జన/సంపద సుఖాన్నివ్వదు. దుఃఖాన్నే ఇస్తుంది. ఇది వ్యాసభారతంలో ఉన్న విషయమే అని పూజ్యులు గరికిపాటివారు తెలియచేసారు.
ఇంకా ఆశ్చర్యకరం ఏమిటంటే అందరు రాజులను కలుపుకుని భయంకరమైన కురుక్షేత్ర యుద్ధం చేసి జయించిన ధర్మరాజు మనశ్శాంతి కోల్పోయి ఛీ ఛీ ఈ రాజ్యం నాకు వద్దు అన్నారు. మనశ్శాంతి అంత గొప్పది.
అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తే మనశ్శాంతిని ప్రసాదిస్తారు. జీవితం ఆనందమయం అవుతుంది.
శుభమస్తు
No comments:
Post a Comment