Sunday, April 26, 2026

'అష్ట కష్టాలు' అంటే ఎనిమిది కష్టాలు. అవి ఏమిటి?

  'అష్ట కష్టాలు' అంటే ఎనిమిది కష్టాలు. అవి ఏమిటి?
అష్ట కష్టాలు పడుతున్నాడు —అనేది తరచుగా వినబడే మాట. ఇపుడు ఇంకా ఎక్కువగానే కష్టాలు ఉండవచ్చు.

ఇప్పుడు పదవీవియోగం ఒక మహా గండం . ఒకసారి ఉండి ఆ భోగం అనుభవించిన వాడు మళ్ళీ అది ఏదో ఒక విధంగా పొందే వరకూ, పడే వేదన ఏ గర్భశోకం కంటేనూ తక్కువైనదేమీ కాదు.

మన ప్రజాస్వామ్యంలో కొత్తగా అనుభవానికి వస్తూన్న మహామహా కష్టం ఇదే.😀

వెనకటి రోజుల్లో ఆ ఉమ్మడి కుటుంబాలు , పంటలు పండడాలు, ఎండడాలు , బంధువులు ఎక్కడో బహుదూరంలో ఉండేవాళ్ళు.. వస్తే— సంవత్సరాల తరబడి ఉండిపోవడాలు , వచ్చి ఊరికే ఉండరు గదా! —ఏదో ఒకటి గతం తవ్వి పోస్తూ, ..చిన్న చిన్న కీచులాటలు,..

బహుభార్యాత్వం ఉంటే— ఆ సవతి పోరాటాలకు తల బట్టగట్టడాలూ ఇలాంటి చెప్పుకోలేని బాధలు — నెత్తిన వెండ్రుక లున్నన్ని.. నిత్యాలు.

1.దేశాంతర గమనం , 2. ఉచ్ఛిష్ట భోజనం , 3. పరాన్న ప్రతీక్ష , 4. యాచన చేయవలసి రావడం ,5. భార్యా వియోగం 6.దారిద్య్రం . 7, దీర్ఘ రోగం. 8.స్వయం పాకం …ఇవి ఆ నాటి అష్ట కష్టాలు.

దేశాంతరం పోవలసి వస్తే, అక్కడ నిలదొక్కుకోవడం కష్టం. తన మన అనేవాళ్ళు ఉండరు. ఆత్మీయులకు దూరంగా ఉండి పోవడం .
ఈ బాధలు ఆ రోజుల్లో కరువు కాటకాల వల్ల, వరదల వంటి ఉపద్రవాల వల్ల , శత్రు రాజుల ఆక్రమణల వల్ల వస్తూన్నవి . ప్రయాణ బాధ గూడా. . దోపిడీ దొంగల భయాలు , అడవుల మధ్య ప్రయాణాలలో మృగ పన్నగ బాధలు … అనభ్యస్తమైనవి కొత్తగా ఎదుర్కోవలసి రావడం —కాలు మీద కాలు వేసుకొని హాయిగా బతికే వాడికి కష్టమే.

ఇపుడు విదేశాలకు పోవడం అంటే అదృష్టం పట్టినట్టు. ఇక్కడి కంటే అక్కడే బాగా సంపాదించవచ్చు . వెనకటి ప్రయాణబాధలా ? అసలే లేనట్టే . చేతిలో డబ్బులేక పోయినా (అప్పుచేసి అనగూడదేమో) క్రెడిట్ కార్డ్ మీద తిరిగి రావచ్చు .

2. ఉచ్ఛిష్టం అపి చ అమేధ్యం భోజనం తామస ప్రియం ..అని శాస్త్రం.

ఎంగిలి కూడు తినడం దోషం…. అవన్నీ ఆ రోజుల్లో.!

మొదట అన్నవిక్రయం పాపం —అని పిచ్చి భయం.

" పూటకూడిళ్ళు" పెట్టుకొన్నాడు —అని చులకనగా మాట్లాడే వారు.

ఇపుడు ఫైవ్ స్టార్ హోటల్ భోజనం ఒక హోదా . గౌరవం. అక్కడ ఎంత శుచి ఉంటుందో ! సర్వజన విదితమే.

ఒక పూటయినా , అలాంటి భుక్తికి ఇష్టపడని రోజులు అవి.

3. పర భాగ్యోపజీవిని దుఃఖ భాగులలో చెప్పారు.

తన జీవనానికి ఇతరుల పెట్టు పోతలపై ఆధారపడ వలసిన స్థితిని గౌరవంగా బతికినవాడు సహించలేడు.

ఉత్తమం స్వార్జితం విత్తం . మధ్యమం పైతృకం ధనం

అధమం భ్రాతృ విత్తం చ. స్త్రీ విత్తం అధమాధమం—

అని నమ్మిన రోజులు.

పిత్రార్జితం కంటే గూడా తన కష్టార్జితం ఆనంద దాయకమట.

మామగారు తన కూతురికి తన ఆర్జనలో ఎంతో కొంత ఇవ్వవచ్చు. అది స్త్రీ ధనం . దాన్ని ఆమె స్వేచ్ఛగా ఖర్చు పెట్టుకోవాలి. దానితో నా కుటుంబం పోషిస్తాను ….అనగూడదు.

ఈ రోజుల్లో దీనికి వ్యతిరేకం. కట్నం కోసం అర్రులు చాచే విద్యాధికులం మనం.

ఇదంతా ' పరాన్న ప్రతీక్ష' అనే ఒక కష్టంగా లెక్కగట్టారు.

4. యాచన కంటే చావు మేలు.

ఎంత గొప్పవాడైనా దుర్దశలో తలక్రిందులు కావడం అందరూ చూచేదే.

పౌర్ణమినాటి పండు వెన్నెల ఒక నలుసంతైనా అమవస నిసికి చందమామ దాచుకో గలిగాడా? అంతే ! కష్టాల తీవ్రత మన జాగ్రత్తలతో చక్కబడేది కాదే ! అనుభవించవలసినదే.

గౌరవంగా బతికి , తనకు పడని వాళ్ల పంచన నిలబడి, దీనంగా చూడబడడం , ఒకరికి సేవచేయవలసి రావడం , పొట్ట బోసుకోను ఒకరి దగ్గర జోలె పట్టడం — విధి చేయు వింతచేష్టలు.

గౌరవంగా బతికిన వాడు కష్టం వస్తే కనుమరుగై పోతాడు. పూలమ్మిన చోటే కట్టెలమ్మడమా? అనుకొంటాడు.

5. దంపతులు కష్టమో నిష్టూరమో . ఇంత కాలం సంసారం లాగించారు. కొడుకు కోడళ్ళు, , కూతుళ్లు, అల్లుళ్ళు , మనవళ్లు, మనవరాళ్లూ అందరినీ మోసి పోసి, అలసిపోయినా, ఇంకా ఆప్యాయతలతో ఆశలతో బతుకు బండి ఈడుస్తూ ఉంటారు.

ఒకనాటికి అందరూ పోయే వాళ్లే . ఆ సంగతి ఒకరు చెప్పేది కాదు . కానీ , ఎందరున్నా లేకున్నా , ముప్పున కాలుచేతులు ఆడని రోజుల్లో భార్యావియోగబాధ పురుషుడికి స్త్రీ కంటేనూ అతి దుర్భరమట.

ఆ ఒంటరి బతుకు దారిద్య్రమంతటి మనోవ్యథను కలిగిస్తుంది.

6.. దీర్ఘకాలిక వ్యాధి — మంచాన బడి, సేవచేసేవాళ్లు లేక, చేయించుకోవడం ఇష్టంలేక , పలువురికి భారమై , రోగబాధతో పోలేక ఉండడం జీవుడికి అతికష్టం.

*అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం .* అని ఆశపడతారు.

కాశ్యాంతు మరణాత్ ముక్తిః అధవా పుత్రసన్నిధౌ .*. ఎపుడు భగవంతుడు అనుగ్రహిస్తాడా —అని ఎదురుచూస్తూ* శేషాన్ మాసాన్ దివస గణయన్* ఎదురు చూపులు..
7. అతిథుల రాక కష్టకాలంలో అతిబాధాకరం. తన ఇంటికి తన వాళ్లు రావడం సంతోషమే. ఎపుడు? *ఎప్పుడు సంపద గలిగిన.. అప్పుడు* .!

తానే చెప్పుకోలేని దీనదశలో ఎట్లనో గుట్టుగా కష్టకాలం వెళ్లదీస్తూంటే మూలిగే నక్క మీద తాటికాయ బడ్డట్టు —బంధువులు వచ్చి చేరడం — . ఉండమనీ , పొమ్మనీ , ఏమీ చెప్పలేని దుస్థితి . తనకేమీ లేకున్నా పైకి కనబడకుండా గుంభనంగా కాలం గడుపుకొనేవాడికి — ఈ రాక బంధుకోటిలో తనకు అపకీర్తి కలిగిస్తుందే . ..అని బాధ.

8. సుఖంగా భార్యో కోడలో ఎవరో ఒకరు కాచి పోస్తూంటే లోకాభిరామాయణం చెప్తూ , దర్జాగా బతకడం మరిగినవాడికి చెయ్యి కాల్చుకోవడం కష్టమే మరి.!

అప్పట్లో హోటళ్లు లేవు . ఎవరైనా బంధువులు, దగ్గరలో ఉన్నవాళ్లు ఇబ్బంది వచ్చిన నాలుగు రోజులూ భోజనానికి పిలిచేవారు. ఆ వసతి లేనివాడు తనకు చేతగాని ఈ వంటలోకి దిగవలసి వస్తే — అదేమి చిన్న పనా? నా వల్ల కాదు అని కడుపు మాడ్చుకోలేడు గదా!

వీటిలో చెప్పని మరో పెద్ద బాధ . చేతికి ఎక్కి వచ్చిన సంతానం పోవడం. అది జీవితాశను క్రుంగదీస్తుంది. తనకు లోకమేదీ లేదని , దిక్కులేనివాణ్ణని , జీవితాంతం లోలోపల కుమిలి పోయేట్టు చేస్తుంది .

ఇవన్నీ ఒక్కసారిగా చుట్టుముట్టడం దేహధారి భరించలేడు.

అందుకే— ఈ అష్ట కష్టాలు ఆ భగవంతుడికి గూడా వద్దురా అన్నారు.

No comments:

Post a Comment