అంత సులభం కాదు
ముక్తి అందరికీ కావాలి. దాన్ని ప్రసాదించే భగవంతుడికి భక్తి కావాలి. భక్తి అంటే ప్రేమ, త్యాగం. భక్తి అంటే అంకితభావం- శరణాగతి. అలాంటి వ్యక్తికి మోక్షం ప్రసాదిస్తానని కృష్ణ పరమాత్మ చివరి మాటగా అర్జునుడికి చెప్పాడు. నన్ను నిజంగా శరణు కోరితే, ఆ వ్యక్తి పాపాలన్నీ హరిస్తాను. ముక్తినిస్తాను.. నా మాట నమ్ము- అని స్పష్టంగా చెప్పాడు. ఈ సమాజం ఆ మాటకు విలువనిస్తోందా అన్నదే పరిశీలనార్హమైనది. జన సమూహమే సమాజం. జనాల మధ్య నమ్మకాలు బలపడితే సమాజమూ సక్రమంగానే స్పందిస్తుంది. స్వీయ సంరక్షణకైనా, ధర్మరక్షణకైనా బలమైన మానవ సంబంధాలు అవసరం.
భక్తిలో రకాలు ఉన్నట్టుగానే ముక్తిలోనూ తేడాలున్నాయి. అపరభక్తి ఐహిక సుఖాలవైపు మొగ్గు చూపుతుంది. పరభక్తి ఆముష్మిక సుఖాలను కోరుకుంటుంది. ఐహిక సుఖభోగాలు 'ఐసు' ముక్కల్లా కరిగిపోతాయి. ఆముష్మిక సుఖం నిరుపమాన ఆనందాన్ని ఆకాంక్షిస్తుంది. భూలోకంలో అనుభవించలేని సుఖాలను స్వర్గలోకంలో అనుభవించవచ్చని చెప్పడం మనుషులను మభ్యపెట్టడమే. పరుల కోసం త్యాగం చేయ మని ప్రబోధించేవారే నిజమైన గురువులు. త్యాగం, పరోపకారం తదితరాలతో కూడిన ధర్మాచరణ ఉన్నచోట జయం కలుగుతుంది. మహాభారతానికి జయగ్రంథం అన్న పేరుంది. వ్యాస రచనలన్నీ పద్దెనిమిది సంఖ్యతోనే ఉన్నాయి. మహాభారత యుద్ధం పద్దెనిమిది రోజులు జరిగింది. పద్దెనిమిది అధ్యాయాల గీత ధర్మంతో మొదలై ధర్మం తోనే ముగుస్తుంది. 'ధర్మక్షేత్రే కురుక్షేత్రే' అంటూ మొదలై ఎక్కడ కృష్ణార్జునులుం టారో అక్కడ సిరి, విజయం, ఐశ్వర్యం, దృఢ మైన నీతి ఉంటాయని 링 నమ్మకం-అంటాడు సంజయుడు. అతడు ధర్మానికి మారుపేరు. మొదటి శ్లోకంలో 'మమ'కారం ధృతరాష్ట్రుడి స్వార్థసంకుచిత మనస్త త్త్వానికి ప్రతీక. చివరి శ్లోకంలోని 'మమ' నమ్మకానికి, విశ్వాసానికి ప్రతీక. భగవం తుడికి, భక్తుడికి నడుమ ఉన్న బంధానికి వ్యాఖ్యానం! మొదటి ఆరు అధ్యాయాలకు మిగతా పన్నెండూ భాష్యాలు అంటారు అరవిందులు.
అర్జున విషాదయోగం నరజాతికి పట్టిన భవరోగం గురించి చెబుతుంది. అజ్ఞాన మనే చీకటిని తొలగించేది సాంఖ్యయోగం. జ్ఞాన, కర్మ, సన్యాస యోగం కర్తవ్యోప దేశం చేస్తే, కర్మ సన్యాసయోగం నిష్కామకర్మను విశ్లేషిస్తుంది. ఆత్మసంయమనంతో సాధన ద్వారా పరమ పురుషార్థమైన మోక్షం పొందవచ్చు. అలాగని ప్రబోధించే గీత-మత గ్రంథం కాదని, కర్మయోగ ప్రస్థానమని, విశ్వమానవ సమాజానికి దారి దీపం అని, పాశ్చాత్య వేదాంతులు సైతం ప్రశంసించారు.
ముక్తికి యుక్తమైన దారి సాధన. దాని ద్వారా మనిషి జీవన్ముక్తుడు కావాలి. 'సాధ నమయో జీవన్ముక్తో భవతి!' తానొక్కడు అయితే చాలదు. తోటి మానవులకూ ఆ వివే కాన్ని పంచాలి. చెడ్డదారి నుంచి మంచిదారికి మళ్లించాలి. మృత్యు సమానమైన భవ బంధాన్ని తొలగించాలి. ముక్తి అనుకున్నంత సులభం కాదు కానీ అనుకుని సాధన చేస్తే సాధ్యమే!
ఉప్పు రాఘవేంద్రరావు
No comments:
Post a Comment