దీక్ష
(కథ )
రచన : టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
స్వీయ రచన.
**********************************
తెరపి లేకుండా మూడు రోజులుగా వాన కురుస్తూనే ఉంది.తాపీ పని చేసుకొనే రవికి మూడు రోజుల నుండి పనిలేదు కాబట్టి చేతిలో డబ్బులు లేవు.భార్య మంజుల మాత్రం వానలోనే పనికి వెళ్తోంది.దగ్గర్లో ఉండే కాలనీలోని నాలుగైదు ఇళ్లల్లో పాచిపని చేసుకొని వస్తూ ఉంటుంది మంజుల. పిల్లలకు స్కూలు లేదు. పలకల మీద ఏవో బొమ్మలు గీసుకుంటూ ఉన్నారు.' ఎటూ కదలనీయకుండా ఈ వాన ఒకటి!'అనుకుంటూ భార్య ఇంట్లో డబ్బులేమన్నా దాచి పెట్టిందేమోనని వంట సరుకులు పెట్టుకొనే డబ్బాలో వెదికాడు రవి.ఏమి కనిపించలేదు.
' దీని తెలివి మండా! బాగానే జాగ్రత్త చేస్తోంది డబ్బుల్ని!" అనుకున్నాడు చికాగ్గా.
సాయంత్రానికి కాస్త కల్లు తాగకపోతే ప్రాణం నిలిచినట్లు అనిపించదు రవికి.
"ఆ పాడలవాటు మానరాదూ! పిల్లలను కాస్త మంచి స్కూల్లో చదివించుకోవచ్చు! నీ ఆరోగ్యం గురించి కూడా ఆలోచించు!"అంటూ మంజుల ఎంత మొత్తుకున్నా రవి వినడు.
"నేను పెట్టే ఖర్చు ఎంతే? ఆ కాస్త సరదా లేకపోతే రోజంతా పని చేయలేనే!" అంటుంటాడు రవి.
అప్పుడప్పుడు వాళ్ళిద్దరి మధ్య గొడవ రేపెట్టే విషయం తాగుడు.మొగుడిని ఎలా దారికి తెచ్చుకోవాలో అర్థం కావటం లేదు మంజులకు.
ఆమె పనిచేసే ఇళ్లల్లో శ్రీధర్ వాళ్ళ ఇల్లు ఒకటి. శ్రీధర్ భార్య కవిత.భార్యా భర్తలిద్దరు బ్యాంక్ ఆఫీసర్లు. వాళ్ల పిల్లలు కాలేజీ చదువుల్లో ఉన్నారు.
"నీ జీతం తీసుకువెళ్లి మొగుడు చేతుల్లో పోయకు!వాడు తాగి తగలేస్తాడు!బ్యాంకులో దాచి పెట్టుకో!పిల్లలకు ఇన్సూరెన్సులు వెయ్యి! తర్వాత తర్వాత పనికి వస్తాయి!" అంటూ మంజుల దగ్గర నుంచి డబ్బులు తీసుకుని ఇన్సూరెన్సులు వేయిస్తుంటుంది కవిత.
నాలుగిళ్ళల్లో పాచిపని చేసుకుంటూ, ఎప్పటికప్పుడు కవితతో మాట్లాడుతూ 'ఇంట్లో ఖర్చులు ఎలా పెట్టుకోవాలి? ఎంత పొదుపు చేయాలి?' అనే విషయాలు తెలుసుకుంటూ ఉంటుంది మంజుల. అందుకే మంజుల అంటే శ్రీధర్ దంపతులకు అభిమానం.
పని ముగించుకుని ఇంటికి వచ్చింది మంజుల.సంచీలోంచి బాక్సులు తీసింది. తను పనిచేసే ఇళ్లల్లో నుండి తెచ్చుకున్న తిండి పదార్థాలను గిన్నెలో సర్దింది.
"ఈరోజు వాన పడుతుందని కవితమ్మ పకోడీలు చేశారు. పిల్లలకు పెట్టమని ఇచ్చారు." అంటూ తిండి పదార్ధాలను ప్లేట్లల్లో సర్ది పిల్లలకిచ్చింది.వాళ్లు సంతోషంగా పకోడీలు తింటున్నారు.
భార్య దగ్గరికి వచ్చాడు రవి.వెనకాల నుండి పట్టుకొని ఆమె భుజంపై తలపెట్టాడు.
" ఎంత అందంగా ఉన్నావే!"
"ఊ...నా అందానికేం గానీ నువ్వు ఎన్ని వేషాలేసినా పైసా ఇచ్చేది లేదు! ఇప్పుడు చెప్పు! అందంగా కనిపిస్తున్నానా?"
చటుక్కున మంజులను వదిలేసాడు రవి.
"ఏందే! కాసిన డబ్బులు అడిగానని అంత పొగరుగా మాట్లాడుతున్నావు!నువ్వు ఒక్కదానివే సంపాదిస్తున్నావా ఏంటి? ఈరోజు ఏదో వాన... పని లేదు కాబట్టి అడిగా! నిన్ను పిల్లల్ని చూసుకోవట్లేదటే? చెప్పు!"
"నువ్వు చూసుకునేదేంది? ఆ దిక్కుమాలిన తాగుడే లేకపోతే నీకు వచ్చే సంపాదనతో ఒక కుంట జాగా దొరికేది. పిల్లలను మంచి స్కూల్లో చదివించుకోవచ్చు!! పోనీ నాకు స్కూటీ కొనిస్తావా సులభంగా పనికెళ్ళి వస్తాను!"
బుర్ర గోకున్నాడు రవి.
'కాసిని డబ్బులు ఇవ్వమంటే పెద్ద పురాణం చెబుతోంది!ఈరోజుకు నిద్ర పట్టడం కష్టమే!' అనుకుంటూ గిన్నెల్లో చూశాడు. గుత్తివంకాయకూర కనిపించింది.
రవిని చూసింది మంజుల.
"ఆరో ఫ్లాటమ్మగారిచ్చింది.నీకిష్టమేగా! తిని పడుకో.!"
"ఈ వానలో కాస్త కల్లు తాగితే బాగుంటుందే!"అంటూ గొణుగుతూ, చేసేదేమీ లేక వంకాయకూరతో అన్నం కలిపాడు. పిల్లలు తండ్రి దగ్గరికి వచ్చారు.వాళ్ళతో ఆ కబురూ ఈ కబురూ చెబుతూ వాళ్లకు ఒక్కో ముద్ద పెడుతూ తను కూడా తింటున్నాడు రవి.
'ఎంత బాగుంది!రవి రోజూ ఆ కల్లు తాగి రాకుండా పిల్లలతో ఆడుకుంటూ, తనతో మాట్లాడుతూ ఉంటే ఎంత బాగుంటుంది' అనుకుంటూ చూస్తోంది మంజుల.
ఆర్ధరాత్రి.
బస్తీలో పెద్దగా ఏడుపులు, అరుపులు వినిపించాయి.
లేచి ఇంటి బయటికి వచ్చారు రవి మంజులలు.
రాత్రి బస్తీలో వాళ్ళల్లో కొందరు కల్లు దుకాణంలో కల్తీ కల్లు తాగారని, వాళ్ళల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.
విషయం వినంగానే రవిని పట్టుకొని భోరుమంది మంజుల.
చలనం లేనట్లుగా నిలుచున్నాడు రవి.
ఏ దేవుడో కాపాడాడు!
కాసేపటికి బస్తీలోకి అంబులెన్సులతో పాటు పోలీసులు, మీడియా వాళ్ళు వచ్చారు. అంతా గోలగోలగా ఉంది.
అందరూ తెలిసినవాళ్ళే!
కూలీ నాలీ చేసుకొనే వాళ్ళే!
అందరిని పరామర్శించి ఇంట్లోకి వచ్చేసరికి తెల్లగా తెల్లవారింది.పిల్లల్ని స్కూలుకు పంపి పనిలోకి వెళ్లారు భార్య భర్తలిద్దరు. మధ్యాహ్నంగా రవికి ఫోన్ చేసింది మంజుల.
"ఇప్పటికి బస్తీలో కల్తీ కళ్ళు తాగిన వాళ్ళలో నలుగురు చచ్చిపోయారు! ఇంకో ఇరవై మంది పరిస్థితి బాగాలేదు!బతకటం కష్టమని అంటున్నారు దాక్టర్లు.నిన్ను శ్రీధరం అయ్యగారు రమ్మంటున్నారు!పని అవ్వంగానే అయ్యగారింటికి వచ్చెయ్!" చెప్పింది మంజుల.
" సరే సరే!నువ్వు నా గురించి కంగారు పడకు!" అన్నాడు రవి.
బస్తీలోని కల్లు దుకాణాన్ని మూసేయించారు పోలీసులు.దాని యజమాని మీద క్రిమినల్ కేసు నడుస్తోంది.
సాయంత్రం శ్రీధర్ ఇంటికి వచ్చాడు రవి.
"ఎలా ఉన్నావు రవీ!" అడిగాడు శ్రీధర్.
" బాగున్నాను సారూ!"అంటూ తలవంచుకొని నిల్చున్నాడు రవి.
"నిన్న జరిగింది చూశావుగా! నీకు ఒక పని చెప్తాను చేస్తావా!"
"చెప్పండి సారూ!"
"రేపు నేను నా ఫ్రెండ్స్ కలిసి వచ్చి మీ వాళ్ళతో మాట్లాడతాము! నువ్వు మీ వాళ్లకు చెప్పి పిలుచుకొని వస్తావా!మీ బస్తీ వాళ్లకు నాలుగు మంచి మాటలు చెబుదామని!అంతకంటే ఇంకేమీ లేదు!"అన్నాడు శ్రీధర్.
"అలాగే సారూ!మా వాళ్ళను తీసుకొస్తాను!"అని శ్రీధరుకు నమస్కారం చేసి, అక్కడినుండి ఇంటికి వచ్చాడు రవి.
రెండో రోజు బస్తీలో ఉండే గుడిలో సమావేశం పెట్టుకున్నారు శ్రీధర్ వాళ్ళు.
ఓ యాభైమంది దాకా సమావేశానికి వచ్చి కూర్చున్నారు.
మైకు తీసికొని మాట్లాడటం మొదలుపెట్టాడు శ్రీధర్.
" రవి నాకు బాగా తెలిసినవాడు. మన బస్తీలో జరిగిన దారుణం చూశారు కదా!ఇప్పటికి దాదాపు పదిహేను మంది దాకా ప్రాణాలు కోల్పోయారు. వ్యసనం అన్నది చెడ్డది. అది మనల్ని ఆలోచించనివ్వదు... మీరు కొద్దో గొప్పో చదువుకున్నవాళ్లే కదా!మంచి చెడు అనేది తెలియక జీవితాలు ఎందుకు నాశనం చేసుకుంటున్నారు? మీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించండి!వాళ్లు కూడా మీలాగా కూలీ నాలి చేసుకుంటూ ఈ మురికివాడలోనే బ్రతకాలా? లేక మంచి ప్రదేశంలో చక్కగా బ్రతకాలా?రేపు వాళ్ళ జీవితాలు ఎలా ఉండాలో నిర్ణయించేది మాత్రం మీరే అవుతారు...ఈ రోజు మీరు జాగ్రత్త పడకుంటే రేపు మీ పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో ఆలోచించండి!... "ఒక్క నిమిషం ఆగాడు శ్రీధర్.
అందరూ మౌనంగా ఉంటున్నారు. కానీ బలహీనతను జయించడం ఎలాగ?
మళ్ళీ కొనసాగించాడు శ్రీధర్.
" అందుకే మీరందరూ ఇకనుండి తాగుడు జోలికి వెళ్ళకూడదు అని నిర్ణయించుకోవాలి!.. మీలో మీకు పట్టుదల ఉండాలి!మేము ఒక నెలరోజుల పాటు గుడికి వచ్చి మీతో మాట్లాడుతూ ఉంటాము. మనం ఏదైనా దీక్ష పెట్టుకుందాం! దానివల్ల ఫలితం ఉంటుంది!"
దీక్ష అనంగానే కొంతమందికి ఆసక్తి కలిగింది.
" దీక్ష అంటే ఏమిటి సారూ?! అడిగాడు ఒకతను.
శ్రీధరుతో పాటు వచ్చిన ఇంకొక ఆయన మైకు తీసుకున్నాడు.
"నా పేరు ప్రకాష్. మేము 'ధర్మబోధ'అనే సంస్థకు చెందిన వాళ్ళం. పిల్లలకు, పెద్దలకు నీతి కథలతో పాటు మంచి విషయాలు చెబుతూ ఉంటాము. దీక్ష అంటే ఏమీ లేదు.మనందరం నెలరోజుల పాటు ఈ గుడికి రావాలి!అయితే దీక్ష తీసికొన్నవాళ్ళు తాగుడు జోలికి వెళ్ళకూడదు.. అలా దీక్షగా ఉన్న వాళ్లకు వారం చివర చిన్న చిన్న బహుమానాలు కూడా ఉంటాయి!సమ్మతమేనా!"
"సార్!మేము మందు తాగట్లేదని మీకెలా తెలుస్తుంది?" కొంటెగా ప్రశ్నించాడొక యువకుడు.
నవ్వారందరూ.
"మా గూఢచార విభాగం మిమ్మల్ని పట్టుకుంటుంది.. మిమ్మల్ని కాపలా కాస్తుంది!"
నవ్వుతూ బదులిచ్చాడు శ్రీధర్.
'ఎవరా?' అని చూస్తున్నారు బస్తీ వాళ్ళు.
"గూఢచార విభాగం అంటే ఎవరో కాదు!మీ ఇళ్లల్లో ఆడవాళ్లే!మీ మీ భార్యలు, తల్లులు.."
ఆ మాట వినంగానే అందరి మొహాల్లో నవ్వు తారట్లాడింది.
"మీ ఆడవాళ్లు చెప్పడం వల్లనే ఈరోజు మేము ఇక్కడికి వచ్చాము!భార్యా పిల్లల్ని చూసుకోండయ్యా! కాస్త పద్ధతిగా మెలగండి! పాపం వాళ్ళు మీ వ్యసనాల వల్ల ఎంత దిగులు పడుతున్నారో చూడండి! తెలుసుకోండి!" ముగించాడు శ్రీధర్.
సమావేశం ముగిసింది.
ఆ వారాంతం దీక్ష మొదలయింది. ఓ ఇరవై మంది మాత్రం గుడికి వచ్చారు.
"మీలో పాటలు పాడేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా?"
శ్రీధర్ అడిగేసరికి ఉత్సాహవంతులు ఇద్దరు ముగ్గురు ముందుకు వచ్చి పాటలు పాడారు.
"శభాష్!ఇలా మీలో ఉన్న టాలెంటును బయటికి తెచ్చి చూపండి!"అంటూ అతి పేదరికం నుండి వచ్చికష్టపడి చదివి తర్వాత ఒక కంపెనీ సి. ఇ. ఓ. అయిన జ్యోతిరెడ్డి కథను చెప్పాడు ప్రకాష్.
కూలీనాలీ చేసుకొనే వాళ్ల కుటుంబాల నుండి కూడా కృషి పట్టుదలతో శ్రమించి ఉన్నత స్థితికి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారని తెలుసుకొని బస్తీ వాళ్ళు ఆశ్చర్యపోయారు.
తర్వాత శ్రీధర్ వాళ్ళు వచ్చిన వాళ్ళతో సినిమా పాటలు తెలిసిన వాళ్ళ చేత అంత్యాక్షరి ఆడించారు.
సరదాగా జోకులు చెప్పారు.
చాలా మందికి నచ్చిందీ కార్యక్రమం. దీక్ష అంటే ఏదో భజన్లు చేయిస్తారేమో అనుకున్నారు. జనాలు. విషయం తెలిశాక రెండోరోజు నుండి తమ తమ పిల్లల్ని తీసికొని వచ్చారు కొందరు. తమ పిల్లలు పాటలు పాడుతూ, డాన్సులు చేస్తూ ఉంటే ఆనందిస్తున్నారు .పిల్లలకు పెన్సిళ్లను, చాకెట్లను పంచి పెట్టారు శ్రీధర్ వాళ్ళు.
రవి కూడా పిల్లల్ని తీసికొని దీక్షకు వచ్చాడు.
పిల్లలిద్దరు ఉత్సాహంగా పాల్గొన్నారు.
రాత్రి ఇంటికి వచ్చేసరికి ఎనిమిదిన్నర అయింది.
ఎంతయినా తాగుడుకు అలవాటు పడ్డ ప్రాణం!
ఆ రాత్రి అన్నం తిన్నాక భార్య పక్కలోకి చేరాడు రవి.
"చూడు!కాస్త తాగందే నాకు నిద్ర రాదే! ఈ పాటలు పద్యాలు నాకొద్దే! అర్థం చేసుకోవే!ఒక చుక్క తాగొస్తా!" గునుస్తూ భార్య జడ పట్టుకొని ఊపుతూ అన్నాడు రవి.
"నీకు నిద్ర రాదు కదా!అందుకే శ్రీధరంబాబు ఈ పుస్తకం ఇచ్చారు!దీన్ని చదువుకో! నిద్ర దానంతట అదే వస్తుంది!"అంటూ లేచి గూట్లోంచి పుస్తకం ఒకటి తెచ్చి రవి చేతిలో పెట్టింది మంజుల.
అయోమయంగా పుస్తకం వంక, భార్య వంక చూశాడు రవి.
పేజీలు తిప్పాడు.అదొక సస్పెన్స్ నవల.గతిలేక పుస్తకాన్ని చదవటం మొదలు పెట్టాడు. కథ మాత్రం మహా సస్పెన్సుగా ఉంది. రచయిత ఎవడో కానీ పుస్తకం పట్టుకుంటే వదలనట్లుగా రాశాడు.పేజీలు తిప్పుకుంటూ చదువుకుంటూ వెళ్ళాడు రవి.
పదకొండింటికి పుస్తకం పూర్తయింది. రవికి నిద్ర కూడా ముంచుకొచ్చింది.
రెండో రోజు కూడా అదే వరుస! ఒకవైపు సాయంత్రం పూట ఆరుగంటల నుండి రాత్రి ఎనిమిదింటి దాకా దీక్ష.ఇంటికొచ్చి అన్నం తిన్నాక పుస్తక పఠనం.
నిన్నటి నవల కంటే ఈరోజు నవల ఇంకా భయంకరమైన సస్పెన్స్. వారం రోజులు గడిచాయి.
వారాంతంలో దీక్ష తీసుకొన్న వారితో మాట్లాడారు శ్రీధర్ వాళ్లు.
దీక్షకు వచ్చిన నలభై మందిలో పదిహేనుమంది తాగలేదని తెలిసింది.ఒక్కొక్కరికి రెండు పుస్తకాలతో పాటు ఒక టీ షర్టును కూడా బహుమానంగా ఇచ్చారు శ్రీధర్ వాళ్ళు.
ప్రతిరోజూ స్ఫూర్తివంతమయిన కథలు చెబుతున్నారు. ఆ కథలు వింటూ పిల్లలు కూడా ప్రభావితం అవుతున్నారు. బుద్దిగా హోమ్ వర్కులు చేసుకుంటున్నారు.శ్రీధర్ వాళ్ళు పిల్లలకు నేర్చుకోవలసిన పాటల లిస్ట్ ఇచ్చారు . ఖాళీ దొరికితే పిల్లలు పాటలు పాడుకొంటూ ఉన్నారు.
మరొక రోజు పొడుపు కథలు చెప్పటం.
ఇంకో రోజు డ్రాయింగ్ పోటీలు. పెద్దవాళ్ళు కూడా పాల్గొనవచ్చనేసరికి అందరికీ సరదాగా ఉంది.
పిల్లల ఉత్సాహం చూసి మంజులకు సంతోషంగా ఉంది.
పిల్లలకు చిన్న చిన్న కథల పుస్తకాలు ఇచ్చారు శ్రీధర్ వాళ్ళు.పిల్లలు ఆ కథలు చదివి,
రెండో రోజు ఆ పుస్తకంలో చదివిన వాటిల్లో తలా ఒక కథను చెప్పాలి.అక్కడికి వచ్చిన వాళ్ళందరికి అదో కొత్త ప్రపంచం పరిచయమవుతోంది. రెండో వారాంతంలో తాగనివాళ్లకు శ్రీధర్ వాళ్లు పుస్తకాలతో పాటు అర కేజీ కందిపప్పును బహుమానంగా ఇచ్చారు.ఇలా వారానికి ఒకసారి తాగని వాళ్లకు బహుమానంగా ఇంటికి ఉపయోగపడే వస్తువులతో పాటు పుస్తకాలు కూడా దొరుకుతున్నాయి.
మళ్ళీ వారం మొదలు. రవికి దీక్షతో పాటు పుస్తక పఠనం కూడా సాగుతోంది. వారానికి ఒకసారి బహుమానం తెచ్చుకుంటున్నాడు.
రెండు నెలలు గడిచాయి. రవి ఇప్పుడు తాగుడు గురించి ఆలోచించటం లేదు.
ఒకరోజు శ్రీధర్ ఇంటికి వచ్చాడతడు.
"ఏమిటి విషయం రవీ!"అడిగాడు శ్రీధర్.
"మీరిచ్చే పుస్తకాలు చదువుకుంటున్నాను సార్!చిన్నప్పుడు నేను ఇంటర్ వరకు చదివాను సార్! తర్వాత పనిలో చేరాను.చదువును వదిలేసాను...మళ్ళీ చదువుకోడానికి వీలవుద్దేమోనని!.." నసుగుతూ చెప్పాడు రవి.
ఎందుకు వీలవదు? భేషుగ్గా చదువుకో!నైట్ కాలేజీలో చేరు!రోజుకు రెండు గంటలు చదివితే చాలు!నవలలతో పాటు క్లాసు పుస్తకాలు కూడా ఉచితంగా ఇస్తాను! శ్రద్ధగా చదువుకో రవీ!నీ చదువుకు ఫీజు కడతాను!" ప్రేమగా రవి భుజాన్ని తట్టాడు శ్రీధర్.
ఆ రోజుతో రవి జీవితం మారిపోయింది.పని చేసుకోవడం ఇంటికి రావడం. నైట్ కాలేజీకి వెళ్లి రావడం.రెండేళ్లు గడిచేసరికి అతడి మాట నడత మారిపోయాయి. అతడి స్నేహితులు మారిపోయారు.ఇప్పుడు తన పిల్లలకి తనే పాఠాలు చెబుతున్నాడు.ఆరేళ్లు గడిచాయి.
రవి ఎం.ఎస్.సి. పూర్తి చేశాడు.తాపీ మేస్త్రి స్థాయి నుండి బిల్డరుగా ఎదిగాడు.
మంజుల పేరుతో అపార్ట్మెంట్ ఒకటి కొన్నాడు. ఆ రోజు గృహప్రవేశం.
శ్రీధరు, ప్రకాష్ కుటుంబాలతో వచ్చారు..మంజుల రవి వాళ్ళ పాదాలకు నమస్కారం చేశారు.
"మీ బస్తీలోకి వచ్చి మేము ఏదో నాలుగు మాటలు చెప్తే వంట పట్టించుకునే వాళ్ళు ఓ ముప్ఫయి మంది కంటే ఎక్కువ లేరు. వాళ్ళల్లో నువ్వు ఒక్కడివే చదువుకుని మంచి స్థితికి వచ్చావు...రవీ! కాస్త సంస్కారం మనల్ని ఉన్నతమైన స్థితికి చేరుస్తుంది. మన వ్యక్తిత్వాన్ని ఎలా మలుచుకోవాలో మనమే నిర్ణయించుకోవాలి!ఈ రోజు నువ్వు మంచి దారిలోకి వచ్చావు!నేను నీకొక బాధ్యత అప్పచెప్తాను!మాలాగా నువ్వు కూడా బస్తీల్లోకి వెళ్లి నాలుగు మంచిమాటలు చెబుతూ ఉండాలి!మీలాగా ఇంకో పదిమంది మారినా అది మనకు గొప్ప విజయం కింద లెక్క!అర్ధం అయిందా!"
శ్రీధర్ చెప్పిన మాటలు విని" సరే సార్!"అని చేతులు జోడించాడు రవి.
మంజుల కళ్ళల్లో కోటి వెలుగులు.
రవి ఇప్పుడు బాధ్యత కలిగిన గృహస్తుడు. అంతే కాదు మంచి పౌరుడు కూడా.//
(సమాప్తం )
💦 *
No comments:
Post a Comment