Sunday, April 26, 2026

అత్యాశకు పోతే...

 అత్యాశకు పోతే...

ఒక రాజోద్యోగి చెట్టుకింద నుంచి వెళ్తుంటే 'బంగారంతో నిండిన ఏడు గోతాలు కావాలా' అనే మాటలు వినపడ్డాయి. అతడు ఉత్సాహంగా కావాలి కావాలి అను కుంటూ ఇంటికి వెళ్లాడు. ఇంట్లో బంగారు నాణేలతో నిండిన ఆరుగోతాలతో పాటు ఒకటి ఖాళీగా కనిపించింది. రాజోద్యోగి మనసులో ఖాళీ గోతాన్ని కూడా బంగారు నాణేలతో నింపాలన్న బుద్ధి పుట్టింది. వెంటనే ఇంట్లో ఉన్న బంగారు నగలను కరి గించి నాణేలుగా మార్చి పోసినా గోతం నిండలేదు. నిరుత్సాహంతో అతడు ఉన్న డబ్బు అంతా పెట్టి బంగారు నాణేలు కొని నింపినా గోతం ఇంకా ఖాళీగానే కనబడు తోంది. దాంతో అతడు రాజు దగ్గరికి వెళ్లి తన కుటుంబ అవసరాలకు డబ్బు సరిపో వడం లేదని జీతాన్ని రెట్టింపు చేయమని కోరాడు. అతడు మంచి పనిమంతుడని భావించిన రాజు అలాగే చేశాడు. ప్రతి నెలా ఆ జీతం సొమ్ములతో బంగారం కొని పోస్తున్నా గోతం నిండటంలేదు. నెలలు గడుస్తుంటే ఏడో గోతాన్ని చూస్తూ అతడు దుఃఖించసాగాడు. బాధతో తన ఉద్యోగం కూడా సరిగా చేయలేకపోతున్నాడు. అతడి దైన్యస్థితిని చూసిన రాజుకు అనుమానం వచ్చింది. 'నీకు గాని ఆ ఏడు గోతాలు తార సపడ్డాయా' అని ఆయన అడగ్గానే ఏడుపు ముఖంతో అవునన్నాడా ఉద్యోగి. 'ఆ గో తాలను యక్షుడు ఎవరికి దత్తం చేస్తాడో వాళ్లు ఇలాగే బాధపడతారు. ఇంకా కూడబె ట్టాలనే ఆశ పుడుతుంది. మనశ్శాంతి కరవ వుతుంది. వెంటనే వాటిని యక్షుణ్ని పట్టుకు పొమ్మను. లేకపోతే నీ ఆరోగ్యం పాడవు తుంది' అని రాజు హెచ్చరించాడు. ఉద్యోగి అలాగే చేశాడు. ఏడు గోతాలు ఉన్నపళంగా మాయమయ్యాయి. అంటే తాను తినీ తినక కూడబెట్టిన ధనం కూడా పోయింది.
లోకంలో కొందరి స్థితి ఇలాగే ఉంటుందని, నిజమైన ఆదాయమేదో, వ్యయమేదో తెలియని వారికి ఉన్నదంతా నశిస్తుందంటూ ఈ కథ చెప్పారు రామకృష్ణ పరమహంస. ఆశ అనే తాడుకు అంతం లేదు. సంతృప్తి చెందినవాడే సుఖంగా ఉంటాడని చెబుతుంది భాగ వతం. సంపాదించిన ధనాన్ని ధర్మబద్ధంగా ఖర్చు పెట్టగలవాడే నిజమైన సంప న్నుడు. ధనానికి దానం, భోగం, నాశనం అనే మూడు గతులుంటాయి. ఇతరులకు పెట్టక తాను అనుభవించక ఉన్న సంపదలకు మూడోగతి అనగా నాశనం తప్ప దంటుంది భర్తృహరి సుభాషితం. లోభి సంపాదించి దాచుకున్న ధనాన్ని పరులు అను భవిస్తారు. లోభులు, దురాశాపరులకు మనశ్శాంతి ఉండదు.

నేడు కొంతమంది కష్టపడకుండా డబ్బు సంపాదించాలనుకుంటూ పందేలు కడుతు న్నారు. జూదం ఆడుతున్నారు. అత్యాశతో ఉన్నది కూడా పోగొట్టుకుంటున్నారు. అప్పులు తీర్చలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. జూదక్రీడలు ఇలాగే అనేక అనర్థాలకు దారితీస్తాయని మన పురాణ ఇతిహాసాలు హెచ్చరిస్తున్నాయి. యువత విద్యార్జనపై శ్రద్ధ చూపించాలి. జ్ఞానవంతులు కావాలి. తమ శక్తికి తగ్గ ఉద్యోగమో, వ్యాపారమో ఎంచు కోవాలి. లక్ష్యాలను నిర్ణయించుకోవాలి. స్వయంకృషితో వాటిని సాధించాలి. ఇతరులను చూసి ఈర్ష్యపడుతూ దుఃఖించకుండా సంపాదించిన దాంతో సంతృప్తికర జీవనం సాగిం చగలిగితే సుఖ సంతోషాలకు లోటుండదు. దీన్ని గ్రహించగలవారే వివేకులు.

ఇంద్రగంటి నరసింహ మూర్తి

No comments:

Post a Comment