Sunday, December 11, 2022

కుర్తాళం పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతీ స్వామి ఆధ్యాత్మిక మహా ప్రయాణం




 శ్వాసంతో ధ్యానం చేస్తే పూర్వ జన్మలు సుస్పష్టం - ఐదు వేల సంవత్సరాల అనుభూతులు పొందా - సాధనతో జ్ఞాననేత్రం సాధ్యం - నమ్మినా నమ్మకపోయినా మంత్రానికి ఎనలేని శక్తి
ధర్మ ప్రభోదన కోసమే చాతుర్మాస్య దీక్షలు
ఆంధ్రప్రభతో కుర్తాళం పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతీ స్వామి
విశ్వాసంతో ధ్యానం చేసిన వారెవరికైనా పూర్వజన్మలు సుస్పష్టంగా కనిపిస్తాయని, ఇందులో ఎటువంటి అనుమానాలకు, అపోహలకు తావులేదని శ్రీ కుర్తాళం పీఠాధిపతి, జగద్గురు శంకరాచార్యులు, లలిత పీఠాధిపతులు సిద్ధేశ్వరానందభారతీ స్వామి అన్నారు. తాను ఐదువేల సంవత్సరాల నాటి అనుభూతులు పొందగలిగానని, అప్పటి నుంచి ఎన్నో పూర్వజన్మలు తన దివ్య దృష్టితో చూసుకునే భాగ్యం కలిగిందని స్వామీజీ పేర్కొన్నారు. విశాఖ లలిత పీఠంలో సిద్ధేశ్వరానంద భారతీస్వామి చాతుర్మాస్య దీక్ష నిర్వహిస్తున్న నేపథ్యంలో బుధవారం స్వామీజీ ఆంధ్రప్రభకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. పూర్వజన్మలు ఉన్నాయన్నది ఎంత వాస్తవమో, అవి కనిపించాలంటే అమ్మవారి అనుగ్రహం కూడా అంతే ముఖ్యమన్నారు. విశ్వాసం ఉంటే ఎవరైనా ధ్యానం చేయవచ్చునని, వాటితో తాము కోరుకున్నట్లు పూర్వజన్మలు చూసే అవకాశం ఉందన్నారు. పూర్వజన్మలు ఉన్నాయన్నది నిజమేనన్నారు. తాను వాటిని చూసిన తరువాతే ఐదువేల సంవత్సరాల నాటి అనుభూతులతో ప్రత్యేకంగా పుస్తకం రాయగలిగానన్నారు. 1958 నుంచి తనకు సన్యాసం స్వీకరించాలని కోరిక కలిగిందన్నారు. అయితే ప్రారంభంలో అనేక ఆటంకాలు ఎదురయ్యాయన్నారు. తొలుత తన సన్యాస దీక్షకు తల్లిదండ్రులు అంగీకరించలేదని, ఆ తరువాత భార్య పిల్లల నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయన్నారు. అప్పట్లో తనకు కలిగిన వైరాగ్యం, అప్పటి కుర్తాళం పీఠాధిపతి త్రివిక్రమ రామానందభారతి స్వామితో కలిగిన పరిచయాల వల్ల సన్యాసం స్వీకరించాలని భావించడం జరిగిందన్నారు. ఆ తరువాత 2002లో హిమాలయాల్లో సాధన చేసే అనేక మంది స్వాములతో సన్నిహిత్యం పెరిగిందన్నారు. అందులో ఒక యోగి 600 ఏళ్లు కిందట తనతో కలిసి చదువుకున్న విద్యార్థిగా తరువాత తెలిసిందన్నారు. ఇక స్వామి శ్రద్ధానంద, స్వామి శ్యామానందల ప్రోత్సాహంతో తాను 2002లో సన్యాసం స్వీకరించానన్నారు. వారు చెప్పినట్లే ఆ ఏడాదే తనకు అన్ని అభ్యంతరాలు తొలగిపోయాయన్నారు. మంత్రాలకు ఎప్పుడూ శక్తి ఉంటుందని, నమ్మినా నమ్మకపోయినా మంత్రం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఈ సందర్భంగా స్వామీజీ కొన్ని ఉదాహరణలు తెలియజేశారు. అప్పట్లో ఆంధ్రప్రభ సంపాదకులుగా పనిచేసిన పొత్తూరి వెంకటేశ్వరరావు కూడా ప్రారంభంలో నాస్తికుడిగా ఉండేవాడన్నారు. ఒక రోజు తన ఆశ్రమానికి ప్రతి రోజు ఎక్కువుగా పాములు వస్తున్నాయని తనకు చెప్పగా తాను ఒక మంత్రం చెబుతానని దానిని ఉచ్చరించాలని తాను కోరానన్నారు. అయితే మంత్రంపై నమ్మకం లేదని మీపై నమ్మకం ఉందని ఆ మంత్రాన్ని పఠించగా పాములు కూడా ఎక్కడా కనిపించకుండా పోయాయన్నారు. ఆ తరువాత అతను రాసిన ఎతికులపతి పుస్తకంలో తన కోసం అనేక విషయాలను పొందుపరిచారన్నారు. సాధన వల్ల, తపస్సు వల్ల కంటికి కనిపించని జ్ఞాన నేత్రం కూడా చూడగలిగే అవకాశం ఉందన్నారు. రామకృష్ణ పరమహంసతో పాటు త్రైలింగస్వామిలు కూడా ఈ కోవలోకి వస్తారన్నారు. అప్పట్లో త్రైలింగస్వామి 1607 నుంచి 1887 వరకు జీవించినట్లు మన పురాణాలు చెబుతున్నాయన్నారు. మన పురాణాలు సమస్తం జన్మ, కర్మ సిద్ధాంతాలపైనే ఆధారపడి ఉన్నాయన్నారు. అప్పట్లో ఎటువంటి సౌకర్యాలు లేనప్పుడు ఆదిశంకరాచార్యులుతో పాటు ఎంతో మంది యోగులు, ఋషులు దేశమంతా పర్యటించారని, శంకరాచార్యులు ఆశేతుసీతాచలం తన కాలినడకతో పూర్తి చేయగలిగారన్నారు. దేశం, కాలం పరిస్థితులను బట్టి, కళియుగం అవసరాలను బట్టి మార్గాలను మార్చుకోవచ్చునన్నారు. ఎలా చేరామన్నది ముఖ్యం కాదని, అవసరం తీర్చడమే ప్రధానమన్నారు. ధర్మాన్ని రక్షించేందుకు ఎలా వెళ్లినా తప్పులేదన్నారు. ఎన్నో రోగాలను, ఎంతో మంది వైద్యులు నయం చేయలేని జబ్బులను సైతం ప్రయోజన హోమాలు, ధ్యానంతో నయం చేయవచ్చునన్నారు. అటువంటివి తాను ఎన్నో చేసి చూపించగలిగానన్నారు. అందులో ఎంతో మంది ప్రముఖులున్నారని, అయితే వారి పేర్లు బయటకు చెప్పడం ఇప్పుడు అప్రస్తుతమన్నారు. పీఠాధిపతులు హిందూ సనాతన ధర్మాన్ని రక్షించడం, ప్రభోదించడం ప్రధాన కర్తవ్యంగా భావించాలన్నారు. వంద ఉపన్యాసాలు, వెయ్యి గ్రంథాలు చేయలేని పని ఒక ధ్యాన ప్రభోదనతో మనిషికి నయం చేస్తే అటువంటి వ్యక్తి పూర్తిగా మారిపోతారన్నారు. పీఠాధిపతులు ఉపన్యాసాలు చెప్పడం కంటే సమాజంలో మార్పు తీసుకువచ్చే విధంగా ధర్మపరిరక్షణ చేయాలన్నారు. అనేక పీఠాలు వారి శక్తికొలది సేవలందిస్తున్నాయని, అందులో కుర్తాళంపీఠం కూడా తమ పని అది చేసుకుపోతుందన్నారు. శ్రీలంకలో రాముడు, లక్ష్మణుడు విగ్రహం ఉండేది కాదని తాను ధర్మప్రభోదన చేయడం వల్లే ఏడాదిలోనే అక్కడ విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. చాతుర్మాస్య దీక్ష ప్రధాన లక్ష్యం తపస్సు చేసి ధర్మప్రభోదాలు చేయడమేనన్నారు.

గతంలో ఋషులు, మునులు ఏడాది పొడవునా దేశ వ్యాప్త పర్యటనలు చేసేవారని, అయితే నాలుగు నెలల పాటు ప్రకృతి విపత్తులు సంభవించడం, ప్రయాణాలకు ఆటంకాలు ఏర్పడటంతో ఆ నాలుగు నెలలు చాతుర్మాస్య దీక్షలు నిర్వహించాలని ఆ సమయంలో పీఠాధిపతులు, మఠాధిపతులు ఏదో ఒక ప్రాంతంలో ఉండి ఈ దీక్షలు నిర్వహించాలని ప్రభోదించడం జరిగిందన్నారు.
అయితే క్రమేపీ నాలుగు నెలల దీక్ష నాలుగు పక్షాలుగా మార్చి రెండు నెలలుగా కాలక్రమేనా మార్పు వచ్చిందన్నారు. ఇప్పటికీ కొందరు పీఠాధిపతులు నాలుగు నెలల పాటు, మరికొందరు రెండు నెలల పాటు ఈ చాతుర్మాస్య దీక్షలు నిర్వహి స్తున్నారన్నారు. భక్తులు కోరిన కోర్కెలు నెరవేరడం వల్లే ఆలయాలకు భక్తులు తాకిడి పెరుగుతుందన్నారు. అయితే ఇందులో కూడా స్వార్ధ భక్తి పెరుగుతూ వస్తుంద న్నారు. స్త్రీలు కూడా సన్యాసం తీసుకోవచ్చని స్వామీజీ స్పష్టం చేశారు. అయితే ఆది కాలంలో ఆ సిద్ధాంతం లేదని క్రమేపీ అనేక ఆశ్రమాలు ఇప్పుడు స్త్రీలకు కూడా సన్యా సం తీసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాయన్నారు. కుర్తాళం పీఠాధిపతులంతా ఎక్కువ మంది న్యాయవాదులే అన్న ప్రశ్నకు స్వామీజీ బదులిస్తూ అందులో ప్రత్యేకత ఏమీ లేదని, అది వారి ఆకాంక్ష, అభిమతం మేరకే జరిగిందన్నారు. కుర్తాళం పీఠాన్ని 1905లో మౌన స్వామి ప్రారంభించారన్నారు. తెలుగువాడు, ప్రకాశం జిల్లాకు చెందిన మౌన స్వామి ఎంతో తపస్సు చేసి దివ్యశక్తులు సాధించిన తరువాత పీఠాధిపతిగా ఆయన బాధ్యతలు స్వీకరించారన్నారు. మౌన స్వామికి బంగారం సృష్టించే శక్తులు సైతం ఉండేవని, దాంతో ఆయన్ను సర్వసిద్ధిగా కూడా పిలిచేవారన్నారు. కుర్తాళం పీఠానికి భవిష్యత్తు పీఠాధిపతి ఎవరన్నది తాను ఇప్పుడే చెప్పలేమన్నారు. అది మౌనస్వామి, దేవతలు కలిసి నిర్ణయించాల్సిందేనన్నారు. తాను ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో మౌనస్వామితో మాట్లాడటం కూడా జరిగిందన్నారు. ఆయన సిద్ధ శరీరంతో ఉన్నారని, తమ కోరిక మేరకు మరికొన్ని సంవత్సరాలు అదే విధంగా ఉండి ధర్మసంస్థాపనకు పాటుపడతారన్నారు. 2002లో సన్యాసం స్వీకరించిన తాను 2019 వరకు 17 సార్లు చాతుర్మాస్య దీక్షలు చేపట్టడం జరిగిందన్నారు. ఈసారి చాతుర్మాస్య దీక్ష విశాఖ లలిత పీఠంలో చేపట్టడం కూడా భగవంతుడి అనుగ్రహమేనన్నారు. సాధన, ధ్యానం, నమ్మకం ఉంటే ఎటువంటి శక్తులైనా సాధించవచ్చునని, ఇందులో ఎటువంటి అనుమానాలకు సందేహం లేదన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక యజ్ఞాలు, ప్రయోజిత హోమాలు చేపట్టి హింధూ ధర్మపరిరక్షణకు పాటుపడుతున్నామన్నారు. కుర్తాళం పీఠాధిపతిగా తాను బాధ్యతలు చేపట్టడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు.

No comments:

Post a Comment