*రహస్య యోగులు - 34*
🤟🙌🤘
రచన : శ్రీధరన్ కాండూరి
*బ్రహ్మర్షి కాగపుంజందర్ జీవిత విశేషాలు*
ఇప్పటివరకు చరిత్రకు తెలిసిన సిద్ధ పురుషులలో అతి ప్రముఖుడు కాగపుజందర్ లేదా కాకపుజందర్. తమిళనాడులోని అనేకమంది హిందువులు కాగపుజందర్ సిద్దర్ని 'దైవంగా' పూజిస్తున్నారు. ఆయన భక్తులు ఆయనను "అయ్యా” అని పిలుస్తారు. కాగపుజందర్ యొక్క గొప్పతనం ఏమిటంటే ఆయన ఎప్పుడో రాబోతున్న ప్రళయాన్ని (యుగాంతం) ముందుగానే దివ్యదృష్టితో చూసి తాళపత్ర గ్రంధాలలో లిఖించాడు. భవిష్యత్తులో ఆయన శివుడిగా అవతరిస్తాడని చెబుతారు.
ఈ ప్రపంచంలో కొన్ని లక్షల సంవత్సరాలు గడిచిన ప్రతిసారీ ఒక మహాప్రళయం (యుగాంతం) వస్తూ ఉంటుంది. ఆ ప్రళయంలో అప్పటివరకు ఉన్న సమస్త జీవులు నశించిపోతాయి. ఆ తరువాత మళ్ళీ క్రొత్త సృష్టి ప్రారంభం అవుతుంది. ఈ సిద్ధపురుషుడు ఒక కాకి రూపంలో ఉండి ఎన్నో ప్రళయాలను చూసాడు. ఆ కారణంగానే ఈయనకు "కాగపుజందర్” అన్న పేరు వచ్చింది. తమిళ భాషలో "కగమ్" అంటే కాకి అని అర్ధం.
కొంతమంది పరిశీలకుల అభిప్రాయం ప్రకారం కాగపుజందర్ దాదాపు 7,500 యుగాంతాలను లేదా ప్రళయాలను చూసాడని తెలుస్తున్నది.
ఒకప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు మధ్య ఒక తీవ్రమైన వివాదం చెలరేగింది. అది ఏమిటంటే వారి ముగ్గురిలో వయస్సులో ఎవరు పెద్దవాడు అని. అందరిలోకి నేను పెద్ద అని ఒకరు అంటే, కాదు నేనే పెద్ద అని ఇంకొకరు అనటం జరిగింది. ఎంత వాదించుకున్నా త్రిమూర్తులలో ఎవరు పెద్దవారో వారికి తేలలేదు. ఆ సమయంలో నారదమహర్షి వారి వద్దకు వచ్చి వారితో ఇలా అన్నాడు.
"మీరు ముగ్గురు వెంటనే భూలోకంలో ఉన్న కాగపుజందర్ మహర్షి వద్దకు వెళ్ళండి. ఆయన, మీ ముగ్గురిలో ఎవరు పెద్దవారో ఖచ్చితంగా చెబుతాడు”. నారద మహర్షి చెప్పిన మాటలు విని త్రిమూర్తులు ఆశ్చర్యపోయారు. ఒక మనిషి ఎంత కాలం జీవిస్తాడు? కాకపుజందర్ ఎంత గొప్ప యోగి అయినప్పటికీ ఆయనకు మా ముగ్గురిలో ఎవరు పెద్దవాడో చెప్పగలిగే వయస్సు ఎలా ఉంటుంది? అని బ్రహ్మదేవుడు, నారద మహర్షిని ప్రశ్నించాడు. అప్పుడు నారదమహర్షి వారితో ఇలా అన్నాడు.
"ఒక యుగాంతం (ప్రళయం) పూర్తి అయిపోగానే క్రొత్త త్రిమూర్తులు ఆవిర్భవిస్తారు. కాగపుజందర్ ఇప్పటి వరకు అనేక ప్రళయాలను చూసాడు. కనుక ఆయన మీ లాంటి ఎందరో త్రిమూర్తులను వరుసగా చూసి ఉన్నాడు. కనుక మీ ముగ్గురిలో ఎవరు పెద్దవాడో చెప్పటం ఆయనకు ఏమాత్రం కష్టం కాదు".
కాగపుజందర్ యొక్క గొప్పతనాన్ని గురించి తెలుసుకున్న త్రిమూర్తులు కాగపుజందర్ని ఎంతగానో మెచ్చుకున్నారు.
ప్రతి ప్రళయం పూర్తి అయిన తరువాత మరల సృష్టి ప్రారంభం అవుతుంది. అప్పుడు కాగపుజందర్ క్రొత్త సృష్టికి అధిపత్యం వహించే ఒక కొత్త శివుడిని ఎన్నికచేసి అతడికి మంత్రోపదేశం చేస్తాడని చెబుతారు. ప్రతి సృష్టి ప్రారంభ సమయంలోనూ కాగపుజందర్, సాక్షాత్తు పరమ శివుడికి మంత్రదీక్ష ఇస్తాడని చెబుతారు.
శ్రీరాముని గురువు అయిన వశిష్ట మహర్షికి కూడా ఈ కాగపుజందరే గురుదీక్ష ఇచ్చాడని చెబుతారు. రోమ ఋషి అనే పేరుతో పిలువబడిన ఒక సిద్ధయోగి, కాగపుజందర్ యొక్క కుమారుడని తెలుస్తున్నది.
ప్రాచీన తమిళదేశంలో అతిశక్తివంతులైన 18 మంది సిద్ధయోగులలో కాగపుజందర్ ప్రముఖుడని చెబుతారు. ఆయనను ఒక దైవంలాగా ఆరాధించేవారు ఎంతోమంది ఉన్నారు. ఆయనను, ఆయన భక్తులు ఎంతో అభిమానంతో “అయ్యా” అని పిలుస్తారు. ఈయన క్రీ.శ. 7వ శతాబ్దంలో జీవించాడని తెలుస్తున్నది.
మీరజార్ మరియు చిన్నమాళ్ అమ్మయార్ అనే పుణ్యదంపతులకు కాగపుజందర్ జన్మించాడు. కాగపు జందర్ తమిళనాడులోని పుదుకొట్టై జిల్లాలో ఉన్న ఇడైయాత్తూర్ అనే గ్రామంలో అష్టమి తిధినాడు తన తల్లిదండ్రులకు 8వ సంతానంగా జన్మించాడు.
చిన్నమ్మాళ్ అమ్మయార్ నిండు గర్భిణిగా ఉన్న సమయంలో ఒకసారి ఆమె గ్రామం లో కుంభవృష్టి కొన్ని రోజుల పాటు కురిసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె తమ యొక్క పంట పొలాల పరిస్థితి ఎలా ఉందో స్వయంగా తెలుసుకుందా మన్న అభిప్రాయంతో ఆమె తమ పొలాల వైపు వెళ్ళింది. అలా వెళ్ళిన సమయంలో ఆమెకు హఠాత్తుగా తల తిరిగి మూర్ఛ పోయింది. ఆమెకు స్పృహ వచ్చి లేచి చూసేసరికి ఆమె ప్రక్కన అపరిమితమైన తేజస్సుతో వెలిగిపోతున్న పసిబిడ్డ కనిపించాడు. అనగా ఆమెకు స్పృహలేని సమయంలో ప్రసవం అయ్యింది అన్నమాట. ఆ బిడ్డకు 15 రోజులు నిండే వరకు కూడా వర్షాలు అలా కురుస్తూనే ఉన్నాయి.
ఈయన పుట్టిన సమయంలో తల్లి పాలు త్రాగటానికి ఇష్టపడలేదు. అప్పుడు ఆ ఇంట్లో పనిచేసే ఒక హరిజన స్త్రీ ఆ బిడ్డకి తన చనుపాలు ఇచ్చిందని చెబుతారు. అప్పటి నుండి ఆమె పాలు త్రాగి కాగపుజందర్ పెద్దవాడయ్యాడని తెలుస్తున్నది. అనాటి సిద్ధపురుషులలో ప్రముఖుడిగా చెప్పబడిన కలాంగినాధర్ స్వయంగా కాకపుజందర్ ఇంటికి వచ్చి అతడికి గురుదీక్ష ఇచ్చాడు. అప్పటికి కాగపుజందర్ వయస్సు కేవలం ఐదు సంవత్సరాలు కావటం విశేషం.
కాగపుజందర్ తన చిన్నతనం నుండి మానవుల పట్ల అపారమైన ప్రేమాభిమానాలను ప్రదర్శిస్తూ ఉండేవాడు.
సిద్ధయోగులు ఇప్పటికీ అదృశ్యరూపంలో ఈ ప్రపంచంలో సంచరిస్తూ ఉంటారని చెబుతారు. ఒక విశేషం ఏమంటే 60 మానవ సంవత్సరాలను ఒక “మహాసిద్ధ సంవత్సరం" అని పిలుస్తారు. గతంలో అనగా 11 సంవత్సరాల క్రితం వరకు “కొరక్కర్” అనే సిద్ధయోగి, నవ సిద్ధులకు అధిపతిగా ఉండేవాడు. మొత్తం 18 మంది సిద్ధయోగులలో 9 మందిని అతిశక్తివంతులైన నవసిద్ధులుగా వర్గీకరించారు. ఆ నవసిద్ధులలో ప్రతి ఒక్క సిద్ధుడూ 60 మహాసిద్ధ సంవత్సరాల పాటు, మిగిలిన 8 మంది సిద్ధులకు అధిపతిగా ఉంటాడు. ప్రస్తుతం కాగపుజందర్ ఈ సిద్ధులకు అధిపతిగా ఉన్నాడని చెబుతారు.
*కాగపుజందర్ మంత్రము :*
॥ ఓం శ్రీ బగులదేవి సమేత శ్రీ కాగపుజందర్ దేవాయ నమః॥
*కాగపుజందర్ నాడి :*
తెలుగుదేశానికి చెందిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి రచించిన కాలజ్ఞానం మానవుల యొక్క దేశాల యొక్క భవిష్యత్తును ఏ విధంగా అయితే తెలియజేస్తుందో, అదేవిధంగా కాగపుజందర్ రచించిన నాడీగ్రంధాలు ప్రపంచ భవిష్యత్తును తెలియజేస్తాయి.
కాగపుజందర్ తమిళ భాషలో అనేక గ్రంధాలను తాళపత్రాలపై వ్రాసాడు. అయితే వాటిలో చాలా భాగం కాల గర్భంలో కలిసిపోయాయి, కొద్దిగా మిగిలిన గ్రంధాలలోని సమాచారాన్ని కొంతమంది మహాపండితుల సహకారం తో కాగితాల మీదకు మార్చటం జరిగింది. ఇలా తయారు చేయించబడిన గ్రంధాల లో భవిష్యత్తును తెలియజేసే నాడీ గ్రంధాలు కూడా ఉన్నాయి.
మానవుల భవిష్యత్తుని తెలియజేసే నాడీ శాస్త్రాలలో కాగపుజందర్ వ్రాసిన నాడీ శాస్త్రం కూడా ఒకటి. ప్రపంచంలో ఇంత వరకు వచ్చిన మరియు రాబోతున్న అనేక రకాల ప్రకృతి విపత్తులు కాగపుజందర్ వ్రాసిన నాడీశాస్త్రంలో కనపడటం విశేషం.
కాగపుజందర్ చెప్పిన జోస్యాలలో కొన్ని ఇప్పటికే నిజం అయ్యాయి. మరికొన్ని భవిష్యత్తులో నిజం అవుతాయి అని అనేకమంది విశ్వసిస్తున్నారు. ఇంకో విశేషం ఏమంటే 2004వ సంవత్సరంలో చెన్నై ప్రాంతాన్ని తాకిన సునామి గురించి కొన్ని వేల సంవత్సరాల క్రితమే కాకపుజందర్ తన నాడీగ్రంధంలో పేర్కొన్నాడు.
చాలాకాలం పాటు వర్షాలు కురవని పరిస్థితులు ఏర్పడతాయని, ఆ తర్వాత కుంభవృష్టి కురిసి, వరదలు వచ్చి దక్షిణ భారతదేశంలోని నగరాలను జలసమాధి చేస్తాయని కాగపుజందర్ పేర్కొన్నాడు.
ఒక దశలో యాంత్రిక వాహనాలను నడిపే ఇంధనం (ఫ్యూయల్) దొరక్క ఆ వాహనాలు ఎవరూ వాడని పరిస్థితి వస్తుందని, చివరికి పాత వాహనాలు (కార్లు, బైక్లు) తూకానికి అమ్మబడతాయ ని కాగపుజందర్ పేర్కొనటం విశేషం. వాహనాలు నడపటానికి కావలసిన డీజల్, పెట్రోల్ను సముద్ర గర్భాల నుండి బయటకు తీసే రిగ్గులు ఒక మహా భూకంపం కారణంగా నాశనం అయిపో తాయని ఫలితంగా యంత్రాలు నడపటానికి, వాహనాలు నడపటానికి అవసరమైన ఇంధనం దొరక్కుండా పోతుందని కొన్ని వేల సంవత్సరాల క్రితమే కాగపుజందర్ తెలియజేయటం ఒక విచిత్రంగా భావించక తప్పదు.
కాగపుజందర్ చెప్పిన వివరాల ప్రకారం చూసినట్లయితే క్రీ.శ. 2020 సంవత్సరం లో దక్షిణ భారతదేశంలో తీవ్రమైన ప్రకృతి ఉత్పాతాలు సంభవిస్తాయని, ఫలితంగా సముద్రతీరంలో ఉండే చెన్నై, విశాఖ పట్టణం లాంటి మహానగరాలలో చాలా భాగం సముద్రంలో మునిగిపోతాయని తెలుస్తున్నది. ఆ సమయంలో అంతరిక్షం లో సంచరించే ఉపగ్రహాలు పై నుంచి క్రిందకి పడిపోతాయని కాగపుజందర్ తెలియజేసాడు.
భవిష్యత్తులో ఒక సమయంలో ఓజోన్ పొరను చీల్చుకుని ఒక విధమైన కాంతి కిరణాలు భూమిమీద ఉండే మనుషులపై పడతాయని, ఆ కిరణాల ప్రభావం వల్ల మానవుల చర్మాలు కాలిపోతాయని అప్పుడు "సంజీవనీ తైలం" అనే నూనెను చర్మంపై పూసుకోవటం వల్ల ఆ విచిత్ర కిరణాల యొక్క చెడు ప్రభావం తొలగి పోతుందని, కర్నాటకలో ఉండే దట్టమైన అడవులలో దొరికే 18 రకాల వనమూలి కలతో ఈ సంజీవనీ తైలం తయారు చెయ్యాలని కాగపుజందర్ తెలియజేసాడు.
*శ్రీ బగులదేవి సమేత శ్రీ కాగపుజందర్*
భారతదేశంలో ఒక సమయంలో తీవ్రమైన భూకంపం సంభవిస్తుందని, ఆ తరువాత అతి భయంకరమైన ఒక తుఫాను వస్తుందని ఫలితంగా ఉత్తర భారతదేశంలో ఉన్న గంగానది, దక్షిణ భారతదేశంలో ఉన్న కావేరినది ఒకటిగా కలిసిపోతాయని ఫలితంగా లక్షలాది మంది ప్రజలు జలసమాధి అవుతారని కాగపుజందర్ జోస్యం చెప్పాడు. ఆ సమయంలోనే భారతదేశం రెండు ద్వీపాలుగా విడిపోతుందని ఒక ద్వీపం లో ఉత్తర భారతదేశం, ఒక ద్వీపంలో దక్షిణ భారతదేశం ఉంటాయని కాగపు జందర్ తన నాడీ గ్రంధంలో పేర్కొన్నాడు. అయితే ఆయన చెప్పిన ప్రళయం 2020 సంవత్సరంలో వస్తుందా? లేక 2060లో వస్తుందా? అన్న విషయం స్పష్టంగా ఎవరికీ తెలియటంలేదు.
ఈయన తమిళనాడులోని త్రిచి పట్టణానికి దగ్గరలో ఉన్న “ఉరైయూర్” అనే ప్రదేశంలో సజీవ సమాధి అయ్యాడు.
🪷
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅
No comments:
Post a Comment