*పిన్నీసు*
(ప్రభాకర్ పెదపూడి)
పరంధామయ్యగారు సబ్బుమీద కాలేసి పెరట్లో నూతి గట్టుదగ్గర దబ్బుమని పడిపోయారు. పెద్దగా దెబ్బలెవీ తగల్లేదు కానీ పడిపోయేటప్పుడు పార్వతమ్మగారు పట్టుచీరలు ఆరేసుకున్న దండేన్ని పట్టుకున్నారు. “టుప్పుమని” దండెం తెగూరుకుంది. అంతటితో ఆగిందా! అంతక్రితం రోజు ఆరేసిన కాంతమ్మగారి పట్టుచీరలన్నీ మట్టిపాలయ్యాయి. “మీ మొహం మండా..
పడితే పడ్డారు కానీ ఆ దండేన్ని పట్టుకోడమెందుకు ? ఆ పట్టు చీరలన్నీ మళ్ళీ ఇంకోసారి ఉతకడమెందుకు! తగుదునమ్మా అని చేతినిండా పని కల్పించుకుంటారు కదా” కాంతమ్మగారు విసుక్కున్నారు. “ఆ బట్టల సబ్బు ఇలా పడేసి ఏడు, ఉతికి చస్తాను” పట్టు చీరలన్నీ నూతి గట్టుమీద ఉన్న బక్కెట్టులో పడేస్తూ అన్నారు పరంధామయ్యగారు. “కాస్త జాగర్తగా ఉతకండి, ఎల్లుండి చిన్నారి వదిన వాళ్ళింటికి పేరంటానికి వెళ్ళాలి” అంటూ వంటింట్లోకి నడిచారు కాంతమ్మగారు. నూతిగట్టుదగ్గర పరంధామయ్యగారు పిచ్చ కోపంతో పళ్ళు పట పటమని నూరడం కాంతమ్మగారికి వినిపించలేదు. వింటే పెద్ద గొడవయ్యేది.
😡
“ఇదిగో కాంతం పొద్దున్న నూతి గట్టుదగ్గర పడ్డాను కదా! అప్పుడేమీ నొప్పెట్టలేదు, ఇప్పుడు కుడి మోచెయ్యి నొప్పెడుతోంది, కాస్త ఆ గూట్లో “మూవ్” ఉంది కాస్త తీసుకుని మర్ధనా చేద్దూ పుణ్యం ఉంటుంది” పరంధామయ్యగారు నెమ్మదిగా భార్య కళ్ళల్లోకి చూస్తూ బ్రతిమలాడుతున్న ధోరణిలో అన్నారు. “ఏమిటి! వేషాలేస్తున్నారా! మర్ధనా లేదు గిర్ధనా లేదు నోరు మూసుకు పడుకోండి, నిద్రలో అదే తగ్గుతుంది” అటు తిరిగి పడుకున్నారు కాంతమ్మగారు.
మర్నాడు మద్యాహ్నం కాంతమ్మగారు భోజనం తర్వాత పళ్ళు కుట్టుకుంటున్నారు. ఉన్నట్టుండి ఆవిడ భూమి బద్దలైనట్లుగా గావుకేక వేశారు. వీధిలో అటూ ఇటూ దిక్కులు చూస్తూ ఆటు పోయేవాళ్ళనీ ఇటు పోయేవాళ్ళనీ పలకరిస్తున్న పరంధామయ్యగారు భార్య గావుకేక విని పి.టి. ఉష తమ్ముడిలా పరుగుపరుగున లోపలికి వచ్చారు. భర్తని చూడగానే “ఏమండీ! కొంప మునిగిందండీ! పళ్ళు కుట్టుకుంటూ పిన్నీసు మింగేశానండీ” భోరుమన్నారు కాంతమ్మగారు. “అన్నం మింగి ఊరుకోక అది చాలదన్నట్లు పిన్నీసు మింగటమేమిటే, ఏదైనా వస్తువు నోట్లో పెట్టుకునేటప్పుడు జాగ్రత్త ఉండద్దూ!” అంటూ డాక్టర్ దగ్గరికి వెడదామన్నారు.
“ఉండండి, బట్టలు మార్చుకుని చిటికెలో వస్తాను, అంటూ లోపలికి వెళ్ళిన కాంతమ్మగారు అరగంట తర్వాత నవ్వుతూ బయటకు వచ్చారు. “జాకెట్టు విప్పుతుంటే కింద పడిందండీ” అంటూ పిన్నీసు భర్త చేతిలో పెట్టారు. ఆ క్షణంలో కాంతమ్మగారి చెయ్య సన్నగా వణకటం గమనించి “నలభై ఏళ్లల్లో నేను చేయలేని పని ఈ చిన్న పిన్నీసు చేసింది కదా” అనుకున్నారు పరంధామయ్యగారు. 😉
No comments:
Post a Comment