అందరికీ సులభంగా అర్ధమయ్యే
రీతిలో…
భగవద్గీత… ధారావాహిక-385.
3️⃣8️⃣5️⃣.
భగవద్గీత పఠనం…
మీ అన్ని సమస్యలకు పరిష్కారం…!
*భగవద్గీత*
(సరళమైన తెలుగులో)
*14. గుణత్రయ విభాగ యోగము*
(పదునాలుగవ అధ్యాయము)
_________________________
*అర్జున ఉవాచ:*
*21. కైర్టింగైస్త్రీన్గుణానేతా నతీతో భవతి ప్రభోl*
*కిమాచారః కథం చైతాం స్త్రీన్గుణానతివర్తతేll*
```
మూడుగుణములు, ఈ మూడు గుణములకు అతీతుడు... అంటే గుణాతీతుడు... ఈ రెండు మాటలు విన్న అర్జునుడికి ఒక సందేహం కలిగింది. వెంటనే కృష్ణుడిని అడిగేశాడు. “ఓ కృష్ణా! కాస్త ఆగవయ్యా నాకో సందేహము, నీవు మూడు గుణముల గురించి చెప్పావు. ఆ గుణములు సరే మనకు కనపడవు, మరి ఈ మూడు గుణములు దాటిన వాడు అంటే గుణాతీతుడు ఎలా ఉంటాడు. వాడి లక్షణాలేమిటి. వాడి ఆచార వ్యవహారాలు ఏమిటి, వాడు ఎలా ప్రవర్తిస్తాడు. అసలు ఈ మూడు గుణములను దాటాలంటే ఏం చేయాలి. ఏ ఉపాయంతో దాటాలి. కొంచెం వివరంగా చెప్పు” అని అడిగాడు.
ఇది వరకు అర్జునుడు రెండవ అధ్యాయములో “స్థితప్రజ్ఞస్య కాభాషా” అంటూ ఇదే మాదిరి ప్రశ్న వేసాడు. ఇప్పుడు కూడా అదే ప్రశ్నను కాస్త పదాలు మార్చి వేసాడు.
స్థితప్రజ్ఞుడు, గుణాతీతుడు... వీరిలో ఉన్న లక్షణముల వలననే వారి వారి ఆధ్యాత్మిక ఔన్నత్యము ప్రకటితమౌతుంది. ఈ లక్షణాలు ఉన్న వారిలో ఆధ్యాత్మిక శక్తి ఉందని మనం గమనించవచ్చు. కాబట్టి కేవలం ఆధ్యాత్మిక గురువుల మాదిరి వేషం వేసుకున్నవారెవరో, నిజంగా ఆధ్యాత్మిక శక్తి ఎవరికి ఉందో మనం ఈ బరామీటరు ఉపయోగించి తెలుసుకోవచ్చు. కేవలం చిన్న మాజిక్ చేసినంత మాత్రాన ఆయనను ఆధ్యాత్మికశక్తి కల గురువు అనలేము. పురుషులందు పుణ్యపురుషులు వేరయా అని వేమన గారు అన్నారు. అలాగే గురువులలో నిజమైన ఆధ్యాత్మిక శక్తి ఉన్న వారు ఎవరో తెలుసుకోవడానికి మనందరి బదులు అర్జునుడు ఈ ప్రశ్న అడిగాడు. దానికి పరమాత్మ ఇచ్చిన జవాబు ఏమిటో తరువాతి నాలుగు శ్లోకాలలో తెలుసుకుందాము...```
*శ్రీ భగవానువాచ:*
*22. ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాణ్డవl*
*న ద్వేష్టి సమ్ప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతిll*
```
ఇక్కడి నుండి ఉన్న 22, 23 శ్లోకాలలో గుణములకు అతీతంగా ఉండే వారి లక్షణాలు చెప్పబడ్డాయి. ఈ గుణాలు ఉన్న మానవులు మనకు తటస్థపడితే అతనిని గుణాతీతుడుగా గుర్తించవచ్చు. తరువాత 24, 25 శ్లోకాలలో ఆ గుణాతీతుడు బయట ప్రపంచంలో ఎలా వ్యవహరిస్తాడు. అతని ప్రవర్తన ఎలా ఉంటుంది. అని చెప్పారు.
మానవులలో సత్వగుణం వలన ప్రకాశం,సుఖం,శాంతి కలుగుతాయి. అలాగే రజోగుణం వలన ఏదో ఒక పని చెయ్యాలనే ఉత్సాహము, ఉద్వేగము కలుగుతుంటాయి. అలాగే తమోగుణము వలన మోహము, లోభత్వము కలుగుతాయి. మానవుడు ఎవరైనా కానీ ఈ మూడు గుణాలు తప్పకుండా ఉండాలి. జ్ఞాని, గుణాతీతుడు, జీవన్ముక్తుడు, స్థితప్రజ్ఞుడు ఎవరైనా కానీ, ఆహారం సంపాదించుకోవాలి అంటే రజోగుణం ఉండాలి. విశ్రాంతి తీసుకోవాలి, నిద్రపోవాలి కాబట్టి తమోగుణం ఉండాలి. కాకపోతే, గుణాతీతుడిలో సత్వగుణము ఎక్కువ మోతాదులో ఉంటుంది. రజస్తమోగుణములు కొద్ది కొద్దిగా ఉంటాయి. అంటే ఆహారం ధర్మబద్ధంగా సంపాదించుకుంటాడు. విశ్రాంతి నిద్ర పరిమితంగా ఉంటుంది. ఏదీ అతి ఉండదు.
ఇంకా గుణాతీతుడు అయినవాడు పై గుణములు తనలో ఉన్నప్పటికినీ, వాటిని గానీ, వాటి వలన కలిగే ఫలములను గానీ, వేటినీ ద్వేషింపడు, వాటి నుండి దూరంగా వెళ్లాలని కోరుకోడు. అలాగని వాటిని కావాలని వాటికి దగ్గరవ్వాలని కానీ కోరుకోడు.
ఉదాహరణకు ఒకాయన పూజా గదిలో కూర్చుని ధ్యానం చేస్తున్నాడు. వాళ్ల ఇంట్లో ఉన్న మూడేళ్ల పసివాడు ఒక గరిటే తీసుకొని పళ్లెం మీద కొడుతూ ఆడుకుంటున్నాడు. ఈయన ధ్యానం డిస్టర్బ్ అయింది. వెంటనే లేచి వెళ్లి వాడిని రెండు బాదాడు. వాడు కేర్ మని ఏడుపు లంకించుకున్నాడు. ఇంట్లో అందరూ వచ్చి పసివాడిని కొట్టినందుకు ఆయనను తిట్టారు. ఆ రోజుకు ఆయన ధ్యానం ముగిసిపోయింది.
అలా కాకుండా, ఆ ధ్యానం చేసుకుంటున్న వ్యక్తి ఆ పసివాడు చేసే చప్పుళ్లు పట్టించుకోకుండా ఉంటే, తన ధ్యానం మీద మనసు కేంద్రీకరిస్తే, కాసేపయిన తరువాత ఆ పసివాడు ఎంత సేపు చప్పుళ్లు చేసినా ఆయనకు వినపడవు. దీనినే న ద్వేష్టి, అంటే దేనినీ ద్వేషించకూడదు. అటువంటి వాడు తనకు కలిగే ప్రతి ఆటంకాన్ని భగవంతుని ప్రసాదంగా స్వీకరిస్తాడు. అన్నిటినీ ప్రశాంతంగా అంగీకరిస్తాడు. క్రమక్రమంగా తనలో ఉన్న గుణాలు ఒకటొకటిగా వదిలిపెడతాడు. ఆ గుణాలు తనలో లేకపోతే వాటిని కావాలని తెచ్చిపెట్టుకోడు. నిర్లిప్తంగా ఉంటాడు. ఇది కూడా గుణాతీతుని లక్షణము.✍️```
(సశేషం)
🙏యోగక్షేమం వహామ్యహం🙏
రచన:శ్రీమొదలి వెంకటసుబ్రహ్మణ్యం,
(రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
No comments:
Post a Comment