అందరికీ సులభంగా అర్ధమయ్యే
రీతిలో…
భగవద్గీత… ధారావాహిక-386.
3️⃣8️⃣6️⃣.
భగవద్గీత పఠనం…
మీ అన్ని సమస్యలకు పరిష్కారం…!
*భగవద్గీత*
(సరళమైన తెలుగులో)
*14. గుణత్రయ విభాగ యోగము*
(పదునాలుగవ అధ్యాయము)
_________________________
*23. వ శ్లోకము:*
*”ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచాల్యతేl*
*గుణావర్తన్త ఇత్యేవ యోఽవతిష్ఠతి నేఙ్గతేll”*
```
అజ్ఞాని భగవంతుని గురించి ఇంట్లో కూర్చుని సాధన చేస్తున్నా లేక ఋషీకేష్ వెళ్లి అక్కడ ధ్యానం చేస్తున్నా, అతని మనసు ఎప్పుడూ, తన ఊరిలో ఉన్న ఇంటి చుట్టు తిరుగుతూ ఉంటుంది. ప్రాపంచిక విషయాలలోనే నిమగ్నమై ఉంటుంది. అటువంటి వాడు ఎల్లప్పుడూ అశాంతితో ఉంటాడు. కాని జ్ఞాని అయిన వాడు, గుణములకు అతీతంగా ఉన్న వాడు, ఎల్లప్పుడూ ప్రాపంచిక విషయములలో నిమగ్నం అయి ఉన్నా, అత్యంత ప్రశాంతంగా ఉంటాడు.
అది ఎలాగా అంటే, గుణాతీతుడు ఎప్పుడూ తటస్థంగా ఏమీ పట్టనట్టు ఉంటాడు. దేని గురించీ అతిగా పట్టించుకోడు. దేనికీ అతిగా స్పందించడు. నిర్లిప్తంగా ఉంటాడు. ఉన్నది ఉన్నట్టు అనుభవిస్తాడు. అంటే ఉదాసీనుడి మాదిరి ఉంటాడు. ఇక్కడ ఒక చిక్కు ఉంది. తమోగుణము ఎక్కువగా ఉన్నా చాలా మంది ఉదాసీనంగా ఉంటారు. దేనినీ పట్టించుకోరు. ఏమీ పట్టనట్టు ఉంటారు. చాలా మంది ఈ తమోగుణమును ఉదాసీనంగా, గుణాతీత స్థితిగా భావిస్తారు. అది పొరపాటు. గుణాతీతుడు “ఉదాసీనవత్” అంటే ఉదాసీనుడి మాదిరి ఉంటాడు కానీ ఉదాసీనంగా ఉండడు అని అర్థం చేసుకోవాలి. ఒక వేళ తనలో మూడు గుణాలకు సంబంధించిన కోరికలు కలిగితే వాటి గురించి పట్టించుకోడు. మూడు గుణముల ప్రభావానికి లోనుకాడు. ఈ మూడు గుణములు వాటి పని అవి చేసుకుంటూ ఉంటాయి అని తెలుసుకొని వాటిని దూరం నుండి చూస్తుంటాడు ఆనందిస్తుంటాడు. ఈ మూడు గుణముల ప్రభావంతో కలిగిన ఎటువంటి విపత్కర పరిస్థితులలో కూడా అతని మనస్సు చలించకుండా నిశ్చలంగా ఉంటుంది.```
*24. వ శ్లోకము:*
*”సమదుఃఖసుఖస్స్వస్థ స్సమలోష్టాశ్మకాజ్ఞనఃl*
*తుల్యప్రియా ప్రియో ధీర స్తుల్యనిన్దాత్మసంస్తుతిll”*
```
గుణాతీతుడు అయిన వాడు బయట ప్రపంచంలో తిరిగేటప్పుడు ఎలా వ్యవహరిస్తాడు అని వివరిస్తున్నాడు పరమాత్మ. ఈ ప్రపంచం నిరంతరం మారుతూ ఉంటుంది. సుఖదుఃఖాలు, జయాపజయాలు వస్తూ పోతూ ఉంటాయి. కాని గుణాతీతుడు సుఖము వచ్చినా, దుఃఖము కలిగినా అతిగా స్పందించడు. రెండింటి పట్ల సమభావము కలిగి ఉంటాడు. దేనికీ పొంగిపోడు కుంగిపోడు. ఇటువంటి వాడి మనస్సు బుద్ధి నిశ్చలంగా ఉంటుంది. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉంటాడు. దుర్వ్యసనాలకు లోను కాడు. మనస్సును ఆత్మయందు లగ్నం చేయడానికి ప్రయత్నిస్తాడు. నేను ఈ శరీరము కాదు అనే భావనలోనే ఉంటాడు.
అటువంటి గుణాతీతునకు కోరికలు, లోభత్వము ఉండదు. మోహము అసలే ఉండదు. దారిలో మట్టి బెడ్డ, రాయి, బంగారము కనపడ్డా వాటి వైపు ఒకే విధంగా చూస్తాడు. అది తనకు ఇష్టము, ఇది తనకు ఇష్టం లేదు, అనే భేదబుద్ధి వదిలిపెడతాడు. అది కావాలి ఇది వద్దు అనే రాగద్వేషములను పూర్తిగా విడిచిపెడతాడు. అటువంటి వానికి ధైర్యం ఎక్కువ. దేనికీ భయపడడు. ఇతరులు పొగిడితే ఆ పొగడ్తలకు పొంగి పోడు. అలాగే ఎవరైనా తనను విమర్శిస్తే, ఆ విమర్శలకు కుంగిపోడు. రెండింటి పట్ల సమంగా స్పందిస్తాడు. అన్నిటినీ చిరునవ్వుతో స్వీకరిస్తాడు. భగవంతుని ప్రసాదంగా భావిస్తాడు.
‘లోష్టము’ అంటే మట్టి. మట్టి ఘనీభవిస్తే ‘అశ్మము’ అంటే రాయి అవుతుంది. అదే మట్టిలో నుండి ‘కాంచనము’ అంటే బంగారము వస్తుంది. రాయికి, బంగారానికి మూలము మట్టి అని తెలుసుకోవడమే, దేని మీదా ఆసక్తి లేకుండా ఉండటమే గుణాతీత స్థితి. అంతే కానీ మట్టిని రాయిని బీరువాలో పెట్టి బంగారాన్ని బయట పారెయ్యమని కాదు. అన్నిటికీ మూలం మట్టి అనీ తెలుసుకోవడమే, వాటి మీద విపరీతమైన ఆసక్తి లేకపోవడమే గుణాతీతస్థితి అని తెలుసుకోవాలి.✍️```
(సశేషం)
🙏యోగక్షేమం వహామ్యహం🙏
రచన:శ్రీమొదలి వెంకటసుబ్రహ్మణ్యం,
(రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
No comments:
Post a Comment