Monday, January 20, 2025

 ☘️🍁  ఆప్తవాక్యాలు  🍁☘️

81. సృష్టే సత్యా ఇహాశిషః

ఈ జగతిలో నీ ఆశీస్సు సిద్ధించుగాక(ఋగ్వేదం)

శుభాన్ని ఆశించడమే ఆశీస్సు. భగవానుడు శుభాన్ని అనునిత్యం ఆశించే స్వభావం కల శుభస్వరూపుడు. ఆయన వలన శుభమే ఈ జగతిలో సిద్ధించాలని ఈ ప్రార్థన.

దీనికి ముందు వాక్యం - 'యదగ్నే స్యామహం త్వం త్వం వా ఘా స్యా అహమ్ |
- ఓ అగ్నీ! (అన్నిటికంటే మునుపే ఉన్న పరమేశ్వరా!) నేను నీవై, నీవు నేనై ఉన్నట్లయితే...'

ప్రార్ధించేవానికి పరమాత్ముని ఆశీస్సు సిద్ధించాలంటే కావలసినది తాదాత్మ్యస్థితి.అదే 'నేను నీవై, నీవు నేనై' ఉన్న స్థితి. భగవంతుని ఆశీస్సు కావాలనుకుంటే, మనమాయనతో తన్మయం కావాలి.

కేవలం ఉపనిషద్భాగాలలో(జ్ఞానకాండ) వేదాంతంగా పల్లవించిన తత్త్వవాక్యాలేకాక,వేదం తదితర భాగా(సంహిత)లలో కూడా తత్త్వాన్నే ప్రబోధిస్తుందనడానికి ఇది
ఉదాహరణ.

అంటే వేదహృదయమే వేదాంతం (తత్త్వం). అద్వైత భావన ఈ మంత్రంలో స్పష్టమౌతుంది. జీవ బ్రహ్మైక్యస్థితియే మనం సాధించవలసిన సత్యం.

మరియొక ఆలోచనలో-

సాధకుడు నిరంతర ఉపాసన, భావన మొదలైన భక్తిమార్గాల ద్వారా తనను తాను భగవదర్పణం చేసుకొని తన్మయస్థితిని పొందుతాడు. తత్ + మయం = తన్మయం. దానితో
లీనావస్థ-‘మయం' కావడం. లయమైతేనే మయం. ఇక్కడ 'తత్' పరబ్రహ్మవాచకం.

తత్త్వమసి మహావాక్యంలో 'తత్' శబ్దానికి పరబ్రహ్మమనే అర్థం. పరబ్రహ్మతో మయత్వమే (లీనమే)-తన్మయం. అదే నిజమైన సత్యం. అదే ఆశీస్సు. సాధించవలసినది.ఆయన అనుగ్రహం చేతనే మనలో ద్వైతభ్రాంతి నివృత్తి చెంది మనకు కలగవలసిన
స్థితి కలుగుతుంది.

ఈశ్వరానుగ్రహాదేవ పుంసామద్వైత వాసనా- అని ఆచార్యులమాట ఈ విషయాన్నే బోధపరుస్తోంది.

'తన్మయస్థితిని పొందినవారికి భగవదనుగ్రహం (జ్ఞానం) లభిస్తుందనేది పై వేదమంత్ర ప్రధానార్థం. ఈశావాస్యమిదం సర్వం అనే ఎఱుకయే కావలసినది. ఇదే
తన్మయత్వం.

'సర్వమున్నతని దివ్య కళామయమంచు' అని ప్రహ్లాదుడు చెప్పిన పలుకును ఇక్కడ
స్మరించాలి. లోకంలో కూడా మన మనస్సు దేనిలో లీనమౌతుందో దానిననుసరించే ఈ జగమంతా సాక్షాత్కరిస్తుంది.

ప్రపంచాన్ని ప్రపంచ దృష్టితోకాక, పరమేశ్వర 'మయం'గా దర్శించగలిగితే గొప్ప యోగం. విచారణతో లభించే జ్ఞానం, ఉపాసనతో సిద్ధించే పరమభక్తి... ఈ రెండూ విశ్వాన్ని విశ్వేశ్వరమయంగా దర్శింపజేస్తాయి. ఈ దర్శనమే తన్మయస్థితి. అదే 'నీవే
నేను - నేనే నీవు' అనే అనుభూతి. దీనిని కలగజేయమని ప్రార్థించడమే గొప్ప ప్రార్థన.

నమశ్శంకరాయ చ మయస్కరాయ చ.. అనే మంత్రంలో 'మయ' స్థితిని కలిగించేది ఈశ్వరానుగ్రహమేనని విశదమౌతోంది. ఈ మయత్వమే కైవల్యం. అదే సత్యం.ఆశించవలసిన శుభం. ఈ సృష్టి అంతా ఆ కైవల్యస్థితిగా భాసించాలి.

అదే మోక్షం. వేరే ఏ లోకంలోనూ లేదది. లోకమంతా లోకేశ్వరమయంగా
దర్శనమివ్వాలంటే 'నేను' ఆయనతో తాదాత్మ్యం చెందాలి.

యోసావాదిత్యే పురుషః సో సావహమ్...‘ఆదిత్యమండలంలోని పురుషుడెవడున్నాడో, అతడే నేను' అని యజుర్వేదమంత్రం కూడా ఈ అద్వయభావాన్ని ద్యోతకపరుస్తోంది. జీవేశ్వరుల అభేదాన్ని స్పష్టం చేసే వాక్యంగా దీనిని గ్రహించవచ్చు.

ఇది కల్పితమైన, ఊహాజనితమైన భావన కాదు. ఇది సత్యం. దీనిని
సిద్ధింపజేసుకొనడమే ఈశ్వరాశీస్సు. ఈ జగతిలో జీవుడు సాధించవలసిన సత్యాశీస్సు ఇదే. లక్ష్యమిదే. సర్వమూ ఈశ్వరమయం అన్నప్పుడు 'నేను' అనే భావన కూడా ఈశ్వరమయమై 'సోహం' స్థితి సిద్ధమౌతుంది.

ఇటువంటి ఉదాత్త తత్త్వ చింతననే వేదం ఆద్యంతాలలో ప్రసరిస్తోంది.     

No comments:

Post a Comment