*`లొట్టపీసు..!!`*
*సోషల్ మీడియాలో ఈ పదంపై ప్రస్తుతం చర్చ జరుగుతున్నది..!*
*లొట్టపీసు అనేది ఒక పువ్వు. ఇది కలుపు గడ్డి జాతికి సంబంధించిన మొక్క. కుంటలు, నీళ్ళు నిలిచే దగ్గర ఈ చెట్లు పెరుగుతాయి.ఈ పూలు పూజకు ఉపయోగించరు..!*
*పూవు లోపల మొత్తం గుల్లగా ఉండి ,కాయ ఉండదు..గింజ ఉండదు...దేనికీ పనికిరాదు.. పైకి మాత్రం అందంగా వెడల్పుగా రేకులు విస్తరించి ఉండటం వలన ఈ పూలకు లొట్టపీసు అని పేరు వచ్చింది. లొట్టపీసు అంటే లోపల ఏమీ లేకపోవడం..!*
*మా ఉమ్మడి పాలమూరు జిల్లా ఆత్మకూరు వనపర్తి పరిసర ప్రాంతాల్లో ఈ చెట్లను రబ్బరు చెట్లు అని, పూలను రబ్బరు పూలు అని కూడా అంటారు.ఈ చెట్ల కొమ్మలు రబ్బరులా బలంగా ఉంటాయి కాబట్టి రబ్బరు చెట్లు అని పిలుస్తారు..!*
*ఈ చెట్టు పాలు కారుస్తుంది కాబట్టి కొన్ని ప్రాంతాల్లో ఈ పూలను పాలసముద్రాలు అని కూడా అంటారు..!*
*ఇంకా పాలకొడిసె, సిగ్గుమల్లె, బేషరం, బ్యాండు పూలు, బ్యాటరీ పూలు, రేడియో పూలు, తూటుపూలు, తూడు పూలు, మిట్ట తామర, రైలు కట్లపూలు, తుట్టి పూలు, గొట్టం పూలు, సలేంద్ర పూలు, కాశీ నేపాళం,బల రాకాసి, అంటూ వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు చెరువులు..!*
*చెట్ల ఉపయోగం ముఖ్యంగా... ఒకప్పుడు గ్రామాల్లో ఈ చెట్ల కొమ్మలతో దడి (ప్రహరీ గోడ) నిర్మించుకునేవారు. ఇంటి చుట్టూ మాత్రమే కాకుండా , గొర్రెలు మేకలు, పందులు వంటి పెంపుడు జీవాల కోసం, అడ్డుతెరగా స్నాన సౌకర్యాల కోసం, ఈ దడి నిర్మించుకునే వాళ్ళు..!*
*వరి అగ్గి తెగులుకు లొట్ట పీసుచెట్టు ఆకులను సేంద్రియ పద్ధతిలో ఎరువుగా తయారు చేసే ఉపయోగిస్తారు..!*
*ఈ చెట్టు విషపూరితమైనది. ఈ చెట్టు ఉన్నచోట దోమలు రావు. ఈ చెట్లను మేకలు తినవు.. ఆయుర్వేదంలో కూడా ఈ చెట్టుకి మంచి ప్రాముఖ్యత ఉన్నది. తేలుకాటుకు మందుగా ఈ చెట్ల పాలను ఉపయోగిస్తారు..!*
*ఇంకా పిల్లలు ఆడుకోవడానికి కూడా ఈ చెట్లు ఎంతో ఉపయోగపడేవి. మగ పిల్లలు ఈ చెట్ల కొమ్మలను ధనస్సులు చేసుకొని ఆడేవాళ్లు..ఆడపిల్లలు ఈ పువ్వులను తమ చేతి ఐదు వేళ్ళకు తొడిగించుకొని, వేళ్ళు గౌను తొడుక్కునట్టుగా ఆడుకునే వాళ్ళు. ఈ పువ్వుల కాడల్ని తిరగేసి పట్టుకుంటే అచ్చు గౌనులా ఉంటాయి..!*
*అమ్మ చేతిలో,గురువుల చేతిలో, బెత్తంగా కూడా ఈ కొమ్మలు ఉపయోగపడేవి..!*
*" లొట్టపీసు మాచుపత్రి అనేది సామెత.. "*
*మాసిపత్రి లేదా మాసుపత్రి అనేది కూడా ఉపయోగం లేని పూవులు .అందుకే ఈ రెండింటిని ‘పనికిమాలినవి’ అనే అర్థంలో ఒకచోట వాడుతారు. కానీ ఈ రెండు మొక్కలు కూడా ఆయుర్వేదంలో ఉపయోగపడతాయి. ప్రజలు తడికలు అనుకోవడానికి ఉపయోగపడతాయి. కానీ వీటి పూలు పనికిరావు కాబట్టి పనికిమాలినవిగా గుర్తించబడతాయి..!*
*తెలంగాణ రచయిత Sheelam Bhadraiah గారు లొట్టపీసు కథలు పేరుతో ఒక సంపుటిని వెలువరించారు..*

No comments:
Post a Comment