*మనసు చేసే గారడీ.....*
ఓకానోక్కప్పుడు పేరుగాంచిన విలుకాడొకడు ఉండేవాడు. ఒకరోజున అతను తన ధనుస్సును భుజానికి తగిలించుకొని, బాణాలు చేతబట్టుకొని, ఎత్తైన కొండ ఒకదాని మీదికి విహారంగా బయలుదేరాడు. అక్కడ తిరుగుతూ తిరుగుతూ ఉండగా అతనికి చాలా దాహం వేసింది.
దగ్గరలోనే ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళి, వంగి దోసిలితో నీళ్ళు తీసుకొని కడుపునిండా త్రాగాడు. సరిగ్గా అదే సమయానికి అతనికి నీళ్ళలో పాములాగా ఏదో కదిలినట్లు అనిపించింది. దోసిలిలో ఇంకా మిగిలి ఉన్న నీళ్ళను గబుక్కున వదిలేసి, అతను నీళ్ళలోకి పరిశీలనగా చూస్తే అక్కడ అసలు అలాంటిదేమీ కనిపించలేదు.
అతనికి తను నీళ్లతోసహా ఆ పామును మ్రింగెయ్యలేదు గద అనిపించేసరికి అతని కడుపులో దేవినట్లయింది. తటాలున చెరువు గట్టుపైకి ఎక్కి వాంతి చేసుకున్నాడు- వాంతిలో అతను ఉదయం తిన్న ఆహారమూ, మెతుకులూ, నీళ్ళూ కనబడ్డాయి తప్పిస్తే, పాములాంటిదేమీ, మరి, బయటపడలేదు!
అయినా.. 'తన కడుపులో ఏదో యీదుతున్నది; అటూ ఇటూ పాకుతున్నది' అని బలంగా అనిపించసాగిందతనికి. కడుపు మీద చెయ్యి వేసుకొని అతి కష్టం మీద ఊళ్ళోకి వచ్చిపడ్డ అతను, కనీసం ఇంటిదాకా కూడా చేరకనే కుప్పకూలిపోయాడు. ఊళ్ళో-వాళ్లంతా కలిసి అతన్ని ఇంటికి చేర్చారు.
కడుపు నొప్పితో గిలగిలలాడుతున్న విలుకాడిని ఆ తర్వాత చాలామంది వైద్యులు పరిశీలించారు; కానీ ఏమీ ప్రయోజనం లేకపోయింది. యీలోగా విష చిహ్నాలు అతని శరీరంపై కనబడసాగాయి కూడా- అతను బరువు కోల్పోయాడు.
ఎముకలు-చర్మం తప్ప శరీరంలో మాంసం అనేదే కనిపించకుండా పోయింది. 'నేనిక బ్రతకను' అని అతనికి గట్టిగా అనిపించసాగింది.
ఆ సమయంలో అటుగా వెళ్తున్న యాత్రీకుడు ఒకడు వాళ్ల ఇంట్లో ఆశ్రయం కోరాడు. విలుకాని రోగ స్థితిని చూసి జాలిపడి, "విషయం ఏంటి?" అని అడిగాడు. తను ఏ విధంగా కొండమీదికి వెళ్ళిందీ, చివరికి ఏ విధంగా పామును మ్రింగిందీ అతనికి వివరించాడు విలుకాడు.
"నీ సమస్యను నేను పరిష్కరిస్తాను. అయితే నేను చెప్పినట్లు చేయాలి" అని, బాటసారి అతన్ని మళ్ళీ అదే చెరువు దగ్గరికి తీసుకెళ్ళాడు.
"ఇంతకు ముందు నువ్వు నీళ్ళు ఎలా త్రాగావో చూపించు" అన్నాడు విలుకాడితో. విలుకాడి భుజానికి గతంలో లాగానే ధనస్సు వ్రేలాడుతున్నది.
అతను అయిష్టంగానే వంగి, దోసిలితో నీరు తీసుకోబోతూ కెవ్వున కేక పెట్టాడు- కారణం, పాము ఒకటి నీళ్ళలో ఈదుతూ కనబడింది అతనికి!
యాత్రికుడు అతన్ని శాంతంగా ఉండమన్నాడు- ఆ పామునే కాసేపు గమనించమన్నాడు. విలుకాడికి ఇప్పుడు ధైర్యం చిక్కింది- పాముని జాగ్రత్తగా గమనించాడు- చూడగా అది అసలు పామే కాదు! తన భుజానికే వ్రేలాడుతున్నది కదా..
ధనస్సు.. దానికి కట్టిన త్రాడొకటి, వదులుగా క్రిందికి వ్రేలాడుతున్నది. దాని నీడ నీళ్లలో కదులుతూ పాములా భ్రమ కలిగిస్తున్నది, "అంటే తను కొద్ది రోజుల క్రితం మ్రింగాననుకున్న పాము, నిజానికి తన వింటి త్రాడు నీడేనన్నమాట!"
అతనిలో ఇన్నాళ్లుగా గూడు కట్టుకున్న ఆవేదన ఒక్కసారిగా ఉపశమించింది. కొద్ది రోజుల్లో అతను మళ్ళీ సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడు!
నిజంగా అంతా మనసే. మనసు తప్ప మనకు తెలిసింది ఏదీ అసలు ఉండనే ఉండదు...
No comments:
Post a Comment