Monday, January 6, 2025

 Vedantha panchadasi:
ద్వైతేన హీనమద్వైతం ద్వైతజ్ఞానే కథం త్విదమ్ ౹
చిద్భాన త్వవిరోధ్యస్య ద్వైతస్యాతోఽ సమే ఉభే  ౹౹244౹౹

244. ద్వైతము అద్వైతమునకు విరోధి.ఎల్లెడల ద్వైతమే ప్రకటమగు చున్నప్పుడు అద్వైతము ఎట్లు సిద్ధించుననినచో,చైతన్యరూపమున అద్వైతము అనుభూతమగుచుండగా దానికి విరోధియగు ద్వైతము మాత్రమే ఎట్లు సిద్ధింపగలదు. ? (ఆక్షేపము:) కాని ఇంద్రియగోచరమగు ద్వైతము అద్వైత జ్ఞానముతో కూడా సిద్ధించుచున్నది.

ఏవం తర్హి శృణు ద్వైతమసన్మాయామయత్వతః ౹
తేన వాస్తవమద్వైతం పారిశేషాద్విభాసతే ౹౹245౹౹

245. అట్లయిన విను.ద్వైతము మాయాకార్యము మాత్రమే అగుటచే అది అసత్తు.కనుక ద్వైతమును నిరాకరిస్తే వాస్తవముగా
 మిగులునది అద్వైతము మాత్రమే.అదే సత్యము.

ఆచింత్యరచనారూపం మాయైవ సకలం జగత్ ౹
ఇతి నిశ్చత్య వస్తత్వమద్వైతే పరిశేష్యతామ్ ౹౹246౹౹

246. ఊహాతీతమైన కల్పనారూపమైన మాయ మాత్రమే ఈ అఖిల దృశ్యమాన ప్రపంచము కూడా అని నిశ్చయించి వాస్తవముగ ఉన్నది అద్వైతమే అని తెలియుము.

వ్యాఖ్య:-  
చైతన్యానుభవమునకు ద్వైతభావమునకు విరోధము లేదని పూర్వపక్షి ఆక్షేపము.

అద్వైత సిద్ధిని గూర్చిన పూర్వ పక్షుల వేరొక శంక --
పూర్వపక్షులు ద్వైతరాహిత్యాన్నే అద్వైతం అంటారు.
ఈ విధంగా
 "ద్వైతం,అద్వైతం అనేవి రెండూ పరస్పర విరుద్ధాలు. కాబట్టి, ద్వైతజ్ఞానం ఉన్నంతవరకు  - ద్వైత ప్రతీతి ఉన్నంతకాలమూ అద్వైత జ్ఞానమమనేది ఎట్లా సంభవమౌతుంది ? "అంటారు.
ఇందుకు సమాధానం -"నీవు చిద్రూప ప్రతీతినే ద్వైత ప్రతీతి అని అనుకుంటున్నావు.చిద్రూప ప్రతీతి అనేది ద్వైత విరోధి కాదు.కాబట్టి ఇరువురి శంకలు సమానం కావు;
కాజాలవు.

పై శంకలకు సిద్ధాంతి ద్వారా సమాధానం --
వెనుకటి శంకకు సమాధానం -
"ద్వైతం అసద్రూపమైనది, మాయామయమైనది.
"అద్వైతం సద్రూపమైనది.కాబట్టి ద్వైతం అద్వైతానికి విరోధి కాదు.
ద్వైతం అసద్రూపమైనందున బాధితమైపోయి పరిశేషంగా వాస్తవమైన అద్వైతం మాత్రమే భాసిస్తుంది
రాజుతో కలసి పదిమంది ఉన్నారు.
ప్రతి వానిని వీడు రాజేనా ? అని ప్రశ్నించగా తొమ్మిదిమంది రాజు కానట్లు తెలిసింది.ఇక శేషించి ఉన్న పదవవాడు రాజే కదా !
ఇది పరిశేష న్యాయం.
ద్వైతాన్ని , అసత్తును నిషేధిస్తూ పోగా మిగిలేది 
"అద్వైతమే " ! "సద్రూపమే" !

అంటే,ఆరోపిత వస్తువును ప్రతినిషేధించటం ద్వారా చివరకు మిగిలి ఉండేది పారమార్థికమైన అద్వైతమే ! 

ఈ మాయతో గూడిన జగత్తుయొక్క నిర్మాణం మనస్సుతో ఆలోచించటానికి, ఊహించటానికి సైతం అందనంత అజ్ఞేయంగా ఉంటుంది. కాబట్టి ,మనం దీనిని మిథ్య అనుకోవాల్సిందే.

ఊహాతీతమైన కల్పనారూపమైన మాయ మాత్రమే ఈ అఖిల దృశ్యమాన ప్రపంచము కూడా అని నిశ్చయించి వాస్తవముగ ఉన్నది అద్వైతమే అని తెలుస్తుంది.

ఈ విధంగా అనిర్వచనీయమైన రూపం కలదైనందున ద్వైతాన్నిమిథ్యారూపం కలదిగా నిశ్చయించుకొన్నప్పుడు ఇక మిగిలేది  (పరిశేషం)
"సత్యమైన అద్వైతమే " !

పునర్త్వతస్య వస్తుత్వం భాతి చేత్త్వం తథా పునః ౹
పరిశీలయ కో వాత్ర ప్రయాసస్తేన తే వద ౹౹247౹౹

247. ద్వైతము వాస్తవమని మరల మరల తోచునే అంటే మరల మరల దానిని పరిశీలించి అద్వైతమే సత్యమని నిశ్చయించుకొనుచుండుము.దానియందేమి ప్రయాసయున్నది ?
చూ.బ్రహ్మసూత్రములు  4.1.1.

వ్యాఖ్య:- అద్వైత నిర్ణయం జరిగిన పిమ్మట కూడా ద్వైత ప్రతీతి కలుగుతూ ఉంటే వివేకాన్ని ఉపయోగించాలి.

నీ పూర్వ సంస్కార వాసనా బలం వలన,అద్వైత తత్త్వ నిశ్చయం జరిగిన పిమ్మటకూడా ఇంకా ద్వైతం సత్యరూపం కలదిగా నీకు భాసిస్తూ ఉంటే అప్పుడిక నీవు మాటిమాటికీ 
"ఈ ద్వైతమనేది మిథ్య ,అసత్యం "
అని వివేకంతో విమర్శించు.

ఈ విధముగా విమర్శించినందువల్ల నీకు కలిగే నష్టం ఏమీ లేదు గదా !
 వ్యాసుడు మొదలైన మహాపురుషులు ఆత్మజ్ఞానం కోసం మాటిమాటికి శ్రవణమన నాదుల్ని చేయాలని చెప్పారు -

"ఆ వృత్తి రసకృదుపదేశాత్ ".
బ్ర.సూ.4-1-1 అని.అందుచేత ముముక్షువైన వాడు వివేక విమర్శనాభ్యాసాదుల్తో ఆ వాసనా సంస్కారాల్ని అణచాలి.

"శ్రోతవ్యో , మంతవ్యో నిదిధ్యాసితవ్యః" అని పలుమార్లు వక్కాణించి ఉపదేశించటం వలన ,
ఆత్మతత్త్వం బుద్ధిగ్రాహ్యమై , ఆత్మసాక్షాత్కారముతో బ్రహ్మజ్ఞానము కలుగునంత వరకు ధ్యానమననాదులు చేసుకుంటూనే ఉండాలి.ఆవృత్తి యొక్క పర్యవసానం 
ఆత్మ - బ్రహ్మసాక్షాత్కారమే. అందువల్ల ఒకమారు విని దాని మననం లేకుండా వదిలేస్తే దాని ఫలితం ఉండదు.

యజ్ఞకర్మలో బియ్యం దంపి ,పిండి చేసి పురోడాశంలాంటి పదార్థాలు చెయ్యాలంటే , బియ్యాన్ని పిండి అయ్యే వరకు దంపవలసిందే.
అలా మెత్తగా దంచిన తరువాత పురోడాశాదులు హోమం చెయ్యాలి కదా !

అదే విధంగా ఆత్మతత్త్వం గురించి మనస్సుకు పట్టే వరకు 
మననం- ధ్యానం చేసుకోవాలి.ఎట్టి సేవా కార్యక్రమమైనా ఒక రోజుపని కాదు కదా !
"జీవితాంతం ఆ మనోభావన ఉంటేనే ఫలప్రాప్తి కలుగుతుందని తెలుసుకోవాలి.   

No comments:

Post a Comment