☘️🍁 ఆప్తవాక్యాలు 🍁☘️
68. యజ్ఞాః పృథివీం ధారయన్తి
యజ్ఞములు పృథివిని ధరిస్తున్నాయి (అథర్వవేదం)
యజ్ఞభూమి భారతదేశం. వేదములు మొదలుకొని భారతీయ సంస్కృతి అంతా యజ్ఞప్రాధాన్యాన్ని తెలియజేస్తున్నాయి.
భగవద్గీతావచనం ప్రకారం - సృష్టికి పూర్వమే యజ్ఞములతో మానవులను సృష్టించి, యజ్ఞముల ద్వారా దేవతలను భావించమని పరమేశ్వరుడు ఆజ్ఞాపించాడు. దేవతలకీ,మానవులకీ యజ్ఞములే మాధ్యమం.
ప్రకృతిని నిర్వహించే దివ్యశక్తులే దేవతలు. వారిని యజ్ఞముల ద్వారా భావించే నాగరికతని భరతవర్షం సాధించింది. ఇది విశ్వనియమం.
ప్రధానంగా ఋణములు మూడు-
“ఋణైస్త్రిభిర్ద్విజో జాతో
దేవర్షి పితౄణం ప్రభో,
యజ్ఞాధ్యయన పుత్రైస్తా-
న్యనిస్తీర్య త్యజన్ పతేత్||
దేవఋణం, ఋషిఋణం, పితౄణం
-మూడూ ప్రతివ్యక్తి తీర్చుకోవలసిన
ఋణాలు. యజ్ఞములతో దేవతల, అధ్యయనంతో ఋషుల, సత్సంతానం ద్వారా పితరుల ఋణాలను తీర్చుకోవాలి.
ప్రతివారు వారికి తగిన విధంగా యజ్ఞాలను ఆచరించాలి. ఎంత నిష్కాముడైనా,విరాగియైనా కామ్యకర్మలను వదలవచ్చేమో గానీ యజ్ఞకర్మలను వదలరాదు.
మన మనోమాలిన్యాలను తొలగించుకోవాలంటే యజ్ఞ, దాన, తపః కర్మలను వదలరాదు. ఫలాకాంక్ష లేకున్నా వాటిని చేయవలసిందే.
యజ్ఞదానతపః కర్మ న త్యాజ్యం కార్యమేవ తత్!
యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణామ్ ॥ (గీత)
యజ్ఞ, దాన, తపః కర్మలు కార్యములు (చేయవలసినవి). అవి బుద్ధిమంతులను శుద్ధులను చేస్తాయి. శుద్ధికలిగిన చిత్తానికే జ్ఞానసిద్ధి, కైవల్యం లభిస్తాయి.
నాయం లోకోస్త్య యజ్ఞస్య కుతో.. న్యః కురుసత్తమ |
- అని గీతాచార్యుని ప్రకటన. యజ్ఞరహితునకు ఇహమూ లేదు, పరమూ లేదు.
అయజ్ఞోయో హతవర్చా భవతి |
యజ్ఞరహితునకు వర్చస్సు నశిస్తుందని అథర్వవేదం హెచ్చరిస్తోంది.
భగవదారాధన, జపం - ఇవి ప్రధానంగా యజ్ఞాలు, 'దేవపితృకార్యాభ్యాం న
ప్రమదితవ్యమ్' అని వేదమే అనుశాసిస్తోంది. 'దేవపితృకార్యాలలో ఏమరపాటు కూడదు'. ఇవి జీవికి గతులను నిర్ణయించేవి. ఆత్మజ్ఞానులమనే భ్రమతో, మిడిమిడి జ్ఞానంతో కొందరు నిత్యనైమిత్తికాది కర్మలను విడిచిపెడతారు. వారికి జ్ఞానసిద్ధి లభించదు సరికదా - ఇహ పరగతులు కూడా ఉండవు.
ఏదో ఒక శాస్త్ర సమ్మతమైన ఉపవాసాది నియమాలను, సత్య శాచాదులను పాటించడం తపస్సు. యజ్ఞములతోపాటు వీటిని పాటించాలి. అలాగే కర్మబంధ
మోచనానికై స్వార్జితమైన ద్రవ్యంతో శాస్త్ర విహిత దానాలను ఆచరించాలి. ఈ యజ్ఞ దాన తపస్సులతో కూడిన దైవభక్తిగానీ, ఆత్మవిచారణగానీ మోక్షానికి హేతువులౌతాయి.
మోక్షకాంక్ష కలవాడు ఫలాపేక్ష రహితంగా ఈ మూడింటినీ ఆచరిస్తాడు. సామాన్యులు
ఫలాకాంక్షతో చేయవచ్చు. కానీ వారిని కర్మవిముఖుల్ని చేయరాదు. 'న బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానం కర్మసంగినాం' - లంపటత్వంతో కర్మలను ఆచరించేవారిని ఆత్మజ్ఞానం పేరుతో అయోమయ పరచవద్దని కృష్ణ వచనం.
అయజ్ఞో న చ పూతాత్మా నశ్యతి ఛిన్న పర్ణవత్॥
'యజ్ఞ రహితుడు పవిత్రుడు కాలేడు. రాలిన ఆకువలె పతనమవుతాడు' - అని శాస్త్రవచనం.
ఈ శాశ్వత సత్యాలను మరువరాదు.
No comments:
Post a Comment