*వృక్ష దేవతలు*
హిందువులు అన్ని జీవుల్లోను దేవుణ్ని చూశారు. అందువల్లనే ఆవులు వంటివి పూజనీయ జంతవులయ్యాయి. అలాగే కొన్ని పర్వతాలు పుణ్య స్థలాలయ్యాయి. కొన్ని నదులు పుణ్య నదులయ్యాయి. వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ఉన్నాయి. అలాగే చెట్లలో కూడా దేవుణ్ని చూశారు. కొన్ని చెట్లను దేవతా వృక్షాలన్నారు.
నిజానికి చెట్లు భూమి మీద సౌరశక్తిని గ్రహించుకునే కేంద్రాల్లో ఒకటి. అవి మనకు కాయలు, పండ్లు, పువ్వులు, ఔషధాలు ఇవ్వడంతో బాటు వంట చెరుకు వంటివి ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతగానో తోడ్పడుతున్నాయి. కాగా చెట్లకు మనుషుల మాదిరి ఆనందం, బాధ వంటివి ఉంటాయని మనువు పేర్కొన్నారు. అది ఆధునిక విజ్ఞాన శాస్త్రరీత్యా కూడా నిరూపితమయింది. భారతీయ రుషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు. ఇక ఆర్యులు చెట్లతో సహా ప్రకృతి శక్తులను పూజించేవారు. హిందువులు పవిత్ర మైన వృక్ష జాతులుగా పేర్కొనే వాటిలో తులసి, రావి (అశ్వత్థం), వేప, మారేడు, మర్రి, అశోక, ఉసిరి మరి కొన్ని ఉన్నాయి. దేవతా వృక్షాలుగా పేర్కొనే వాటిలో కొన్నిటికి అద్భుతమైన ఔషధ శక్తులు ఉండడం విశేషం. కొన్ని దేవతా వృక్షాల విశేషాలు తెలుసుకుందాం.
తులసి
తులసి పవిత్రమైనదని అందరికీ తెలుసు. ప్రతి ఇంటిలో తులసి ఉండాల్సిన అవసరముంది. తులసి కథ అందరికీ తెలిసిందే. విష్ణుమూర్తికి తులసి ప్రీతికరమని,దానితోఆయనకు పూజ పుణ్యప్రదమనేది అందరికీ తెలిసిందే. తులసిని పవి త్రంగా ఉన్నప్పుడే ముట్టుకోవచ్చని, అనవసరంగా తుంచరాదనే నియమాలు కూడా ఉన్నాయి. తులసి పవిత్రతని చెప్పే ఒక శ్లోకం ఉంది. అది
యన్మూలే సర్వ తీర్థాని, యన్మధ్యే సర్వ దేవతా:
యదగ్రే సర్వ వేదాశ్చ, తులసీం త్వాం నమామ్యహం
మూలంలో సర్వ తీర్థాలు, మధ్య భాగంలో సర్వ దేవతలు, అగ్రభాగంలో సర్వ వేదాలు గల తులసి కి నమస్కరిస్తున్నాను అని దీని అర్థం. తులసికి ఎన్నో ఔషధ గుణాలున్నాయన్నవిషయం తెలిసిందే. తులసికి మనస్సును ఉద్వేగాలను, శరీరాన్ని పరిశుద్ధం చేసే శక్తి ఉందని చెబుతారు. అందువల్లనే యోగులు, సాధువులు వంటి వారు తులసి మాలను మెడలో ధరిస్తుంటారు. ఇతరుల చెడు భావాలను ఎదుర్కొని దూరం చేసే శక్తి తులసికి ఉంది. అంత ఎందుకు తులసిని స్పృశించడమే మనలను శుద్ధి చేస్తుందని చెబుతారు.
రావి
దేవతా వృక్షాల్లో రావి(అశ్వత్థం)ఒకటి. అశ్వత్థం సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపం. రావి చెట్టులో త్రిమూర్తులు ఉన్నారని చెప్పే శ్లోకం కూడా ఉంది. అది
మూలతో బ్రహ్మ రూపాయ, మధ్యతో విష్ణు రూపిణి
అగ్రత: శివ రూపాయ, వృక్ష రాజాయతే నమ:
ఈ వృక్షం మూలం వద్ద్ద బ్రహ్మ, మధ్యలో విష్ణువు, అగ్రంలో శివుడు ఉన్నారని దీని అర్థం. ఇక రావి చెట్టు విష్ణువు రూపమని చెబుతారు. అందువల్లనే అశ్వత్థ నారాయణుడు అనే పేరు కూడా ఆయనకు ఉంది. మొహంజొదారో లో దొరికిన ఒక ముద్రలో సింధులోయ నాగరికతకు చెందిన ప్రజలు అశ్వత్థ వృక్షాన్ని పూజిస్తున్న దృశ్యం బయటపడింది. దేవదానవ యుద్ధంలో దేవతలు ఓడిపోయిన ఒక సందర్భంలో విష్ణువు అశ్వత్థ వృక్షంగా మారాడని పురాణాలు చెబుతున్నాయి. ఆయన ఆ చెట్టు రూపం దాల్చినందున దానికి పవిత్రత వచ్చిందని చెబుతారు. కృష్ణ నిర్యాణం కూడా ఈ చెట్టు కిందే జరిగిందని కొందరు చెబుతారు. స్త్రీలు సంతానం కోసం ఈ చెట్టు మొదలుకు గాని దాని కొమ్మలకు గాని ఎర్ర వస్త్రం గాని, ఎర్ర దారం గాని కట్టే ఆచారం ఉంది. ఏ చెట్టును నరకడమైనా పాపమే కాగా అశ్వత్థ వృక్షాన్ని నరకడం మహాపాపమని ఒక పురాణ వచనం. బుద్ధునికి ఈ చెట్టు కిందే జ్ఞానోదయం అయిందని చెబుతారు. అందువల్ల వారు దానిని బోధి వృక్షమని, జ్ఞాన వృక్షమని వ్యవహరిస్తారు.
వేప
వేపచెట్టు లక్ష్మీ దేవి స్వరూపమని చెబుతారు. అందువల్లనే విష్ణు రూపమైన రావి చెట్టుకు, లక్ష్మీ రూపమైన వేప చెట్టును ఒకే చోట పాతి వాటికి వివాహం చేసే ఆచారం కూడా ఉంది. ఉత్తర హిందూస్థానంలో వేప చెట్టును నీమారి దేవిగా వ్యవహరిస్తారు. కొన్ని శుద్ధి కార్యక్రమాల్లో వేప రెమ్మలను ఉపయోగిస్తారు. వేపలో ఉన్న ఔషధ గుణాలు తెలిసినవే. వేప చెట్టు గాలే శరీరానికి మంచిదని అంటారు. దాని ఆకులు క్రిమి సంహారిణిగా ఉపయోగిస్తాయి. దాని బెరడు కొన్ని రకా ల చర్మ వ్యాధుల చికిత్సలో ఉపయోగపడుతుంది.
మారేడు
మారేడు పత్రాలనే సంస్కృతంలో బిల్వ పత్రాలంటారు. మారేడు శివునికి ప్రీతికరం. అందుకే ఆయనకు లక్ష పత్రి పూజలో కూడా బిల్వాలనే వాడతారు. అది దేవతా వృక్షమై నందునే దానిని కొన్ని రోజులలో, తిథులలో కోయరాదనే నిబంధన కూడా ఉంది. కోసేటప్పుడు కూడా ఒక శ్లోకం చదివి నమస్కరించి కోయాలంటారు.
ఆ శ్లోకం
అమృతోద్భవ శీవృక్ష మహాదేవ ప్రియ: సదా
గృహ్ణామి తవ పత్రాణి శివపూజార్థమాదరాత్
మారేడుకు అమృతం నుంచి ఉద్భవించిందని, శ్రీ వృక్షమని పేర్లు. అలాగే ఎప్పుడూ శివునికి ఇష్టమైనది. అటువంటి నీ పత్రాలను శివ పూజ నిమిత్తం కోస్తున్నాను అని దీని అర్థం. మారేడు లక్ష్మీ దేవికి ప్రీతికరం. మూడుగా కలసి ఉన్న బిల్వ దళాలను శివుని పూజకు వాడుతారు. ఈ మూడు పత్రాల దళం శివుని మూడు కనులకు ప్రతీక అని భావిస్తారు. జైనులకు కూడా ఇది పవిత్ర వృక్షం.
No comments:
Post a Comment