Tuesday, January 7, 2025

 ☘️🍁  ఆప్తవాక్యాలు  🍁☘️

69. శ్రద్ధే శ్రద్ధాపయేహ నః

ఓ శ్రద్ధాదేవీ! మా హృదయంలో ఉండి మమ్మల్ని శ్రద్ధాళువులుగా మలచుమా

'శ్రద్ధ' అనేది దివ్యగుణం. అంతేకాదు... దివ్యశక్తి కూడా.

ఈ శక్తిమంతమైన గుణం కార్యసిద్ధిని కలిగిస్తుంది. ఏకాగ్రతతో కూడిన పట్టుదలను 'శ్రద్ధ' అనే పదంతో రూఢిగా వ్యవహరిస్తాం.

శాస్త్రముల యందు, భగవంతుని యందు 'ఆస్తిక్యబుద్ధి'ని 'శ్రద్ధ'గా నిర్వచించారు శాస్త్రవేత్తలు.

'శ్రద్ధావాన్ లభతే జ్ఞానం' - అని గీతావాక్యం. శ్రద్ధ కలవానికే జ్ఞానం లభిస్తుందని స్పష్టపరచింది.

అజ్ఞశ్చ అశ్రద్ధదానశ్చ సంశయాత్మా వినశ్యతి - మూర్ఖుడు,శ్రద్ధారహితుడు,
సంశయస్వభావుడు నశించుతారని కూడా భగవానుని హెచ్చరిక.

వేదాలలో శ్రద్ధాసూక్తం చెప్పబడింది. 'శ్రద్ధ'ను భగవత్స్వరూపంగా ఆరాధించి ఆ దేవత తనయందు ప్రతిష్ఠింపబడాలని ఆ సూక్తంలో సంభావించారు. యజ్ఞాదిక్రియలలో
శ్రద్ధాదేవత అనుగ్రహం ఉంటేనే పూర్ణత్వం సిద్ధిస్తుంది.

వేదాది శాస్త్రాలపై, దైవంపై “ఉన్నది” అనే ఆస్తిక్యబుద్ధిని మాత్రమే మనం కలిగి ఉండగలం. మన ఇంద్రియాల పరిధిని మించిన సత్యం శాస్త్రాలలో ఉన్నది. వాటి వాక్యాలను విశ్వసించే బుద్ధిని 'శ్రద్ధ' అని తెలియాలి. అందుకే కొందరు 'శ్రద్ధావిశ్వాసాలను' రెండు గుణాలుగా చూడకుండా, విశ్వాసాన్ని శ్రద్ధలో అంతర్భాగంగానేవక్కాణిస్తారు. అయితే శ్రద్ధ(ఆస్తిక్యబుద్ధి)తో కూడిన 'విశ్వాసం' కలిగి ఉండాలని చెప్పడానికి కించిద్భేదంతో రెండిటినీ లోకంలో జంటగా పేర్కొనడం
జరుగుతుంది.

గోస్వామి తులసీదాసు “భవానీశంకరౌ వన్డే శ్రద్ధా విశ్వాసరూపిణా” అని
శివపార్వతులవలె అవిభాజ్య దాంపత్యం వంటి సంబంధం శ్రద్ధావిశ్వాసాలకు ఉందని
తీర్మానించారు.

“దైవం, శాస్త్ర ధర్మం ప్రత్యక్షమైతేనే తప్ప నమ్మం" - అని అంటుంటారు. కానీ నమ్మితే కానీ అవి ప్రత్యక్షం కావు. ఆ నమ్మిక దృఢంగా ఉన్నప్పుడు, ఆ ధర్మాన్ని చక్కగా అనుష్ఠిస్తాం. శాస్త్రవిహితమైన ధర్మాన్ని ఆచరించడానికి ఆస్తిక్యభావనే ప్రేరకం.
ఆచరిస్తేనే కానీ ఫలితం లభించదు.

శివపురాణంలో 'స్వధర్మాచరణయే శ్రద్ధ' అని స్పష్టం చేశాడు. శాస్త్రం విధించిన ధర్మమే స్వధర్మం. అటువంటి శ్రద్ధయే వ్యక్తి భౌతిక పురోగతికి గానీ, ఆధ్యాత్మిక
సిద్ధికి గానీ దోహదపడుతుంది. భక్తినీ, ధర్మాన్నీ కూడా 'శ్రద్ధ' అనే పదంతోనే
వ్యక్తీకరించారు ప్రాచీనులు.

"శ్రద్ధాళువు నన్ను అనుభూతిలోకి తెచ్చుకోగలడు" - అని శివపురాణంలో
పరమేశ్వరుని వచనం.

వేదం నుంచి లభించిన ఈ 'శ్రద్ధ' అనే దివ్యశబ్దం - పవిత్రమైన జీవితం, ఆస్తిక్య బుద్ధి, భగవద్భక్తి, దీక్ష, ఏకాగ్రత... ఇలాంటి అనేక అర్థాలను ఏకకాలంలో స్ఫురింపజేస్తుంది.

ఫలంపై దృష్టి పెట్టక భగవంతునిపై పూనికతో పనిచేయడాన్ని 'శ్రద్ధ'గా కొందరు నిర్వచించారు.

మొత్తానికి మనం లోకవ్యవహారంలో అతి తేలికగా వాడుతున్నంత తేలికపాటి భావన ఈ పదంలో లేదు. ఎంతో సముదాత్తశక్తి 'శ్రద్ధ'లో ఉన్నది.

'శ్రద్ధాయాసత్యమాప్యతే' (యజుర్వేదం) - శ్రద్ధ ద్వారానే సత్య (పరమాత్మ) ప్రాప్తి జరుగుతుందని వేదవచనం.

'అస్త్వితి బోధనేన’ - ఉన్నది అనే భావన ఉంటేనే సాధించడం ఉంటుంది. లేదన్న వానికి అన్వేషణ లేదు. సాధనా లేదు. ఇంక సిద్ధించేది ఎలా?

కేవలం ఆస్తిక్యబుద్ధి చేతనే అసలు తత్త్వాన్ని ఆవిష్కరించుకోగలం అని అర్థం.మేధ, ధారణ, ప్రజ్ఞ వంటి బుద్ధి శక్తులన్నిటికీ పునాది శ్రద్ధయే. యజ్ఞాలలో శ్రద్ధదేవతను ఆరాధించడం చేత, తత్రియపై బుద్ధి నిలచి యజ్ఞఫలాలను ప్రాప్తింపజేస్తుంది. దేవతా శక్తులన్నీ అనుకూలించేలా చేస్తుంది.

శ్రద్ధాశక్తిని కలిగినవాడు ఏ కార్యంలోనైనా విజయం సాధించగలడు..    

No comments:

Post a Comment