Thursday, January 9, 2025

 Vedantha panchadasi:
చిత్ప్రత్యక్షా తతోఽ న్యస్య మిథ్యాత్వం చానుభూయతే ౹
నాద్వైతమపరోక్షం చేత్యేతన్న వ్యాహతం కథమ్ ౹౹256౹౹

256. చైతన్యము ప్రత్యక్షముగ అనుభవింపబడుచున్నది.
తదితరము(జగత్తు)యొక్క మిథ్యత్వము కూడా అనుభవమున ఉన్నది.ఇట్లుండగా
"అద్వైతము అపరోక్షము కాదు" అనుట విరుద్ధవాక్యము కదా !

ఇత్థం జ్ఞాత్వాఽప్యసంతుష్టాః కేచిత్కుత ఇతీర్యతామ్ ౹
చార్వాకాదేః ప్రబుద్ధస్యాప్యాత్మాదేహః కుతో వద ౹౹257౹౹

257. ఇట్లు అద్వైతసత్యమును తెలిసికొనియు కొందరు అసంతుష్టులు అగుదురు. ఎందుచేతయనినచో చార్వికులు మొదలగువారు తర్కము తెలిసినను దేహమే ఆత్మయని ఏల అందురో మొదట చెప్పుము.

సమ్యగ్విచారో నాస్త్యస్య ధీదోషాదితి చేత్తథా ౹
అసంతుష్టాస్తు శాస్త్రార్థం న త్వైక్షంత విశేషతః ౹౹258౹౹

258. వారు బుద్ధిదోషముచే చక్కగా వివేచన చేయలేక పోవుటచేత అనినచో అట్లే అద్వైతసిద్ధాంతమునందు అసంతుష్టులైన వారికి సమ్యక్ విచారణ లేకపోవుటయే అసంతుష్టికి కారణము.

వ్యాఖ్య:- అద్వైతం అనేది ప్రత్యక్షంకాదని అంటే వ్యాఘాతదోషం వస్తుందని చెపుతున్నారు -
చిద్రూపంతో భాసిస్తుందని అనటంవల్లను,స్వయంప్రకాశరూపమై నందునన్నూ చిద్రూపం ప్రత్యక్షమే !

ఇందుకు భిన్నంగా ద్వైతంయొక్క మిథ్యాత్వం అనుభవంలోకి వస్తోంది.ఇట్లా ద్వైత మిథ్యాత్వం అనుభవంలోకి వస్తున్నా అద్వైతాన్ని ప్రత్యక్షం కాదనటం -
అపరోక్షం కాదనటం -
వ్యాఘాతదోషమే గదా !

వేదాంతార్థం తెలుస్తున్నప్పటికి, కొందరు అసంతుష్టులై ఉండటం, తృప్తి చెందక పోవటం తెలివిగల వారైనప్పటికి ఊహాపోహలలో నేర్పరులైనట్టి చార్వాకాది నాస్తికులు దేహాన్నే ఆత్మగా ఎందుకు భావిస్తున్నారు...

సరిగా విమర్శించి విచారణ చేయకపోవటంవల్ల వారు వేదాంతార్థంతో తృప్తి చెందటం లేదు.
సరిగా విచారణ చేయకపోవటం వల్లనే శరీరాన్ని ఆత్మగా భావించుట జరుగుతుంది - 

చార్వాకాదులైన నాస్తికులు తమ బుద్ధియందలి దోషంవల్ల ఎట్లా సరిగా విచారణ చేయలేక పోతున్నారో అట్లాగే బుద్ధిదోషంవల్లనే సంతోష శూన్యులైన కొందరు తత్త్వవేత్తలు కూడా శాస్త్రార్థాన్ని సరిగా పరిశీలనచేసి తెలుసుకోలేక పోతున్నారు.

కాలిబొటనవ్రేలునుండి శిరస్సువరకు గల దేహముయొక్క అణువణువును పరిశీలించితిని.
కానీ ఇందు "అహం"(నేను) అనునది ఏదియు కనిపించలేదు.

రక్తము,మాంసము,ఎముకలు మొదలగు వానితో గూడిన దేహములో
 "ఇది నేను"- అని ఎవడు చెప్పును ?

చలనము శక్తిస్వభావము, ఆలోచించుట చైతన్యములో అంతర్గతముగానుండును,
జరా - మరణములు దేహమునకు సహజములు -  "ఇది నేను" అని ఎవడు చెప్పును ?

ఇది నాలుక,ఇవి చెవులు,ఇది ముక్కు,ఇవి కన్నులు,
ఇది చలనము-"ఇది నేను"అని ఎవడు చెప్పును ?

వీనిలో ఏదియు నేను కాను, మనసా ! నీవు కూడా నేను కాను,ఈ భావనలు కూడా నేను కాను;

నిర్మలము,స్వతంత్రమునగు చైతన్యమే నేను.
"ఇది అంతయు నేను" ,  లేక 
"నేను లేదు "- ఈ రెండువచనముల తత్త్వము ఒక్కటే.వేరేదియు సత్యము కాదు.

యదా సర్వేప్రముచ్యన్తే కామా యేఽ స్య హృదిశ్రితాః ౹
ఇది శౌతం ఫల దృష్టం నేతి చేతి చేద్ దృష్ట మేవ తత్ ౹౹259౹౹

259. హృదయమునందలి కామనలన్నీ నిశ్శేషముగ నశించినచో అమృతత్వము సిద్ధించుననే శ్రుతివాక్యము
 (కఠ  ఉప.2.3.14)జ్ఞానుల అనుభవము కూడా.

యదా సర్వే ప్రభిద్యంతే హృదయగ్రంథయస్త్వతి ౹
కామ గ్రంథి స్వరూపేణ వ్యాఖ్యాతా వాక్యశేషతః ౹౹260౹౹

260. మరొక వాక్యమున హృదయగ్రంథులన్నీ ఛేదింపబడినప్పుడు అమృతత్వము సిద్ధించునని చెప్పును.ఇచ్చట గ్రంథి అనగా కామనలని వ్యాఖ్యాత వివరించును.
కఠ.  ఉ 2.3.15.

అహంకారచిదాత్మానా వేకీకృత్యావివేకతః ౹
ఇదం మే స్యాదిదం మే స్యాదితీచ్ఛాః కామశబ్దితాః  ౹౹261౹౹

261. అజ్ఞానవశమున ,
మాయాకార్యమగు అహంకారమనకు చిద్రూపమగు ఆత్మతో ఏకీభావము కల్పించి 
'ఇది నాకు కావలెను' 
'ఇది నాకు కావలెను'
అని కోరుకొనుటలు కామనలు అనబడినవి.

వ్యాఖ్య :- హృదయంలో ఉన్నట్టి తాదాత్మ్యాధ్యాస మూలకమైనట్టి 
కామనలు(కోరికలు)స్వస్వరూపానుసంధానంద్వారా నివృత్తమై పోయినప్పుడు, 
జన్మమరణ శీలమైన జీవాత్మ ఇక్కడే బ్రహ్మ సాక్షాత్కారమనే ఫలాన్ని పొందుతుంది,  అంటూ
ముముక్షువుల హృదయంలోని కామాల నివృత్తివల్ల కలిగే ఫలం శృతియందు మాత్రమే వినిపిస్తోంది.ఎక్కడా కనిపించదు అని అనటం యుక్తం కాదు. ఎందుచేతనంటే,

జ్ఞానులైన వారికి అటువంటి ఫలం
(కామనివృత్తి)తప్పకుండా కలుగుతుంది.
ఇది కనిపించే ఫలమే !
శ్రుతివాక్యం-
"భిద్యతే హృదయగ్రన్ధి శ్చిద్యన్తే సర్వసంశయాః ౹
క్షీయస్తే చాస్య కర్మాణి తస్మి న్ధ్రష్టే పరావరే" 
౼ ముండకోపనిషత్తు 2-2-8.
పై శ్రుతివాక్యంలో 
"హృదయ గ్రంథులన్నీ విడివడినప్పుడు" - అంటే, సమస్తమైన కామనలు 
ఉన్మూలింపబడినప్పుడు అని అర్థం.

అహంకారం,చిద్రూపం ఈ రెంటి తాదాత్మ్యాధ్యాస నివారణము అంటే గ్రంథి భేదనమే అవుతుందనే 
విషయం అనుభవంలోనిదే !
అందుచేత,శ్రుతియందు చెప్పబడిన 'కామనివృత్తి' అనే తత్త్వజ్ఞానఫలం ప్రత్యక్షంగా కనిపించేదే !

లోక వ్యవహారంలో కామమనే శబ్దానికి 'ఇచ్ఛ' అనే అర్థం చెపుతారు కదా !  ఇచ్ఛను(కోరికను)గ్రంథి అని అంటారేమిటి ? అంటే -

అధ్యాసంవల్ల -భ్రమవల్ల- అహంకారాన్ని, చిదాత్మను ఒకటే అని భావించి 'ఇది నాది','ఇది నాది',
'ఇది నాకు కావాలి',' నాకిది కావాలి'
అనే కోరికలు కలగటాన్నే కామం అంటారు.

అన్ని కోరికల్ని కామం అనటానికి వీలులేదు.అందుచేతనే శ్రుతిలో కామమనే శబ్దానికి 'గ్రంథి' అనే శబ్దాన్ని వాడారు.
"గ్రంథి"అంటే కేవలం కోరిక అని కాదు.
అయితే ,అధ్యాసమూలకాలు కావు కాబట్టి కోరికలు బాధకాలు కావు.
అందుచేత స్వీకరింప తగ్గవే ! అని సమాధానం.

సత్యమగు ఆత్మకు మిథ్యయగు అహంకారమునకు కన్పించు అభేదమే అజ్ఞానము.అదే గ్రంథి, గ్రంథి వలె (ముడి వలె) విడదీయనశక్యమని ఉద్దేశము.
ఈ యజ్ఞానవశముననే కోరికలు కలుగును కనుక పారంపర్యముగ కోరికలే గ్రంథులుగ స్వీకరింపబడినవి.

ఆత్మజ్ఞానముచే అజ్ఞానము నశించినపుడు కామనలు కూడా,
వేరు నరకబడిన చెట్టువలె నశించును.
అప్పుడు మానవుడు 
"అమృతత్త్వము" నొందును.         

No comments:

Post a Comment