*ఒక సినిమా హీరో పట్ల నీకున్న పిచ్చి నీ తల్లిని బలిగొంది.రెండు వారాలుగా నిన్నిలా మృత్యు కుహరంలో ఉంచింది*
.నువు ప్రాణాలతో బయటపడతావని గానీ, ఒకవేళ బయటపడినా ఆరోగ్యంతో, అన్ని అవయవాలు మామూలుగా పని చేస్తూ నువు మనిషివౌతావని కానీ నీకు చికిత్స అందిస్తున్న ఖరీదైన డాక్టర్లు కూడా భరోసా ఇవ్వలేకున్నారు. నీ పట్ల ఒక నిట్టూర్పును విడిచే ఖాళీ ఈ సంఘంలో మాతో సహా ఎవరికీ లేదు.
నీలాంటి సినిమా పిచ్చోళ్ళు, అభిమానులు వెర్రి ఎత్తినట్టు అక్కడ పోగుపడి పోవడానికి కారణమైన దైవాంశ సంభూతుడు అదే నీ హీరో ఈ కారణంగా (అతనే ప్రత్యక్షంగా మీ కుటుంబ ఈ స్థితికి కారణమని ఎవరు అనలేం, అది వేరే సంగతి) ఒకరోజు అరెస్ట్ అయితే, అతను రిమాండ్ కు వెళితే ఆ ఒక్క రోజు అందునా ఆ కొద్ది గంటలు అతను ఆ జైలు గోడల మధ్య ఎలా కాలం గడపగలడోనని నిఖిల లోకం తలడిల్లిపోయింది. అంతెందుకు నీ తండ్రి కూడా అతని మీద పెట్టిన కేసులు వాపసు తీసుకుంటానని(చట్టపరంగా ఆ సాంకేతిక విషయాలు వేరే) టీవీ గొట్టాల ముందు నిలువెల్లా నీరైపోయి ఆవేదన చెందాడు.
నీ హీరో తాలూకు మామ ఆ శిబిరం మొత్తానికి మూలవిరాట్టు మెగాస్టార్ చిరంజీవి ఎక్కడో తన షూటింగును(జరుగుతోందా?) రద్దు చేసుకుని హుటాహుటిన ఇంటికి చేరుకున్నాడు. అల్లుడిని ఆగమేఘాల మీద ఎలా విడిపించుకు తేవాలా అని ఆగమైపోయాడు. అతని తల్లి అయితే ఆ కొద్దిగంటల ఆలస్యానికే పాపం తల్లడిల్లిపోయింది.తండ్రి నిజంగా అంతటి మహానటుడికి తండ్రిననిపించాడు. ఏ రకమైన ఇబ్బంది జరగదు, ఏదో ఒక పూట కొద్దిపాటి అసౌకర్యం తప్ప అనే భరోసా ఉన్నప్పటికీ వాళ్లంతా ఎంత చలించిపోయారో, చలించి పోయినట్టు టీవీ తెరల ముందు కనబడ్డారో లోకానికి అగుపించింది. కె. రాఘవేంద్రరావు ప్రభృత మహాదర్శకులు, స్టార్లు, సూపర్ స్టార్లు, ప్రిన్సులతో సహా నీహీరో ఇంటి ముందు క్యూ కట్టేశారు అతను ఎన్ని వేల టన్నుల ఎర్రచందనపు చెక్కల్ని తరలించుకుపోయినా కూడా పోలీసులకు చిక్కడనే భరోసా ఉన్నప్పటికీ.ఆంధ్ర, తెలంగాణ లోని పార్టీల అధినేతలంతా తమ X (ట్విట్టర్ )అకౌంట్లను ఖాళీ లేకుండా నింపేశారు తమ ఆగ్రహాలతో అతనికి కలిగిన అసౌకర్యానికి.
అదీ ఒక సెలబ్రిటీ జీవితానికి, వాళ్ల కోసం పడిచచ్చే సామాన్య కీటకాల వంటి సాధారణ మానవ జీవితాలకి ఉన్న తేడా. మొదటి వారం రోజులు సినిమా టికెట్లు రేట్లు పెంచుకునే వెసులుబాటును ప్రభుత్వాలు అదేదో పవిత్ర కార్యంగా భావించి చేస్తున్నాయి అంటేనే వాటి పాలిత ప్రజ ఎంత నికృష్టమైందో చెప్పకనే చెబుతుంది. అల్లు అర్జున్ ఈ ప్రాణ నష్టానికి ప్రత్యక్షంగా కారకుడా కాదా అనేది ఎడ తెగని చర్చ. కానీ అతనికి కలిగిన, అంతటి విఐపి అసౌకర్యానికి ప్రపంచం అంతా నీళ్లు తాగడం మానేసింది చూడండి *అదీ ఇక్కడ సమాజ బానిసత్వపు ఛాయ. మేరా భారత్ మహాన్.*
No comments:
Post a Comment