Vedantha panchadasi:
బన్ధమోక్ష వ్యవస్థార్థ మాత్మనానాత్వ మిష్యతామ్ ౹
ఇతి చేన్న యతో మాయా వ్యవస్థాపయితుం క్షమా ౹౹233౹౹
233. బంధమోక్షముల వ్యవస్థ కొరకు ఆత్మలు అనేకములని స్వీకరింప వలెననచో ఆ వ్యవస్థ ఏర్పరచుటకు మాయ సర్వ సమర్థమగుటచే ఆత్మ నానాత్వము అనావశ్యకము.
దుర్ఘటం ఘటయామీతి విరుద్ధం కిన్న పశ్యసి ౹
వాస్తవౌ బన్థమోక్షౌతు శ్రుతిర్న సహతేతరామ్ ౹౹234౹౹
234. అసంభవమును సంభవము
చేయుచున్నావనే విరోధము ఏల చూడవు ? శ్రుతి కూడా బంధమోక్షములు వాస్తవములని అంగీకరింపదు.
న విరోధో న చోత్పత్తిర్న బద్ధో న చ సాధకః ౹
న ముముక్షుర్న వై ముక్తః ఇత్యేషా పరమార్థతా ౹౹235౹౹
234. వినాశము లేదు ఉత్పత్తి కూడా లేదు.
బద్ధుడు లేడు,సాధకుడును లేడు.
ముముక్షువు(మోక్షము కోరువాడు) లేడు.ముక్తుడును లేడు.ఇదే పరమార్థ సత్యము.
వ్యాఖ్య :- "అద్వైత భావాన్ని అంగీకరిస్తే బంధమోక్ష వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తమై పోతుంది, కాబట్టి ఆత్మలు అనేకం ఉన్నాయని అనే వారి వాదాన్ని స్వీకరించాలి"
అనటం కుదరదు.
ఎందుచేతనంటే -
ఆత్మ ఒకటే అయినప్పటికీ మాయద్వారా బంధమోక్ష వ్యవస్థ సాగిపోతుంది.
మాయద్వారా బంధమోక్ష వ్యవస్థ ఎలా జరుగుతుందంటే,
"అత్యంత దుర్ఘటమైన కార్యాన్నైనా సంభవమయేటట్లు చేయగలను"
అనే శ్రుతిని,ఇందలి విరుద్ధ స్వభావాన్నీ చూడటంలేదా ?
వాస్తవానికి బంధమోక్షాలను శ్రుతి అంగీకరించటంలేదు.
బంధం అనేది అవిద్యా జన్యమైతే,
మోక్షాన్ని పారమార్థికంగా అంగీకరించాలి; అని అనుకోవద్దు. ఎందుచేతనంటే,శ్రుతి ఈ బంధమోక్షాలు రెంటినీ సహించటంలేదు.
బంధంలాగానే మోక్షాన్ని కూడా పారమార్థికంగా అంగీకరించటంలేదు.
బంధము వాస్తవమైనచో దానికి నాశమే ఉండదు.అనగా మోక్ష ప్రసక్తియే లేదు.వాస్తవమగు బంధము నుండి మోక్షము కలుగుననుట విరుద్ధ వచనము.
చిద్రూపమైన ఈ ఆత్మ తత్త్వానికి ఉత్పత్తీ లేదు, ప్రళయము(వినాశము)లేదు.
దీనికి పుట్టుక లేదు,చావూ లేదు.
దీనికి బంధమూ లేదు కాబట్టి మోక్షమూ లేదు.బద్ధుడు లేడు సాధకుడును లేడు.
ముముక్షువు(మోక్షము కోరువాడు) లేడు.
"ఇదే పరమార్థ సత్యము".
ఈ "ఆత్మ" అనేది శ్రవణమననాదుల్తో దేనినో సాధించే సాధకుడూ కాడు,ముక్తుడూ కాడు.
"పరమార్థముగనున్నది బ్రహ్మము మాత్రమే అని భావము".
ఇట్టి ఆ బ్రహ్మము నిష్కళముగాను, నిర్వికల్పముగాను,నిరంజనముగాను(శాంతమైనది,మనస్సున కార్యములేనిది) ఉన్నది.ఆ బ్రహ్మమే "నేను" అని తెలిసికొనిన యెడల సత్యముగా
"బ్రహ్మ" మే యగుచున్నాడు.
-- అమృత బిందు ఉప: 10
గౌడపాదకారిక 2.32. ప్ర. 8-71.
మాయాఖ్యాయాః కామధేనోర్వత్సౌ జీవేశ్వరావుభౌ ౹
యథేచ్ఛం పిబతాం ద్వైతం తత్త్వం త్వద్వైతమేవ హి ౹౹236౹౹
236. మాయ అనే కామధేనువునకు జీవుడు,ఈశ్వరుడు అనే రెండు దూడలు.ఆ ఆవు పాలను ద్వైతమును ఎంతగా సేవించినా
సత్యము అద్వైతము మాత్రమే.
కూటస్థ బ్రహ్మణోర్భేదో నామమాత్రాదృతే నహి ౹
ఘటాకాశ మహాకాశౌ వియుజ్యేతే నహి క్వచిత్ ౹౹237౹౹
237. (జీవేశ్వరులు మిథ్యయగుటచే వారి భేదము మిథ్య.అట్లే సత్యములగు కూటస్థ బ్రహ్మముల భేదము సత్యము కావలెననే సంశయము పరిహరింప బడుచున్నది.)నామమాత్రముగనే తప్ప కూటస్థమునకు బ్రహ్మమునకు భేేదము లేదు. అనంతమైన ఆకాశమునకు ఘటము నందలి ఆకాశమునకు పేరునకే కదా భేదము.
యదద్వైతం శ్రుతం సృష్టేః ప్రాక్తదేవాద్య చోపరి ౹
ముక్తావపి వృథామాయా భ్రామయ త్యఖిలాన్ జనాన్ ౹౹238౹౹
238. శ్రుతి ప్రోక్తమైన అద్వైతము సృష్టికి పూర్వము ఉండెను, ఇప్పుడును కలదు,
ఇకమీద ఉండును.
అనగా అది త్రికాలాబాధ్య సత్యమని భావము.
వ్యాఖ్య:- తత్త్వజ్ఞానము లేని సకల జనులను మాయ వ్యర్థముగ భ్రమపెట్టుచుండును.
మాయ,జీవుడు,ఈశ్వరుడుకు ఉన్న భేదము--
జీవుడు,ఈశ్వరుడు అనే వారిద్దరూ,మాయ అనే కామధేనువు యొక్క రెండు దూడల లాంటివారు.ఆ యిద్దరూ ద్వైతమనే పాలను యిష్టం వచ్చినట్లు త్రాగితే త్రాగవచ్చు గాక !
కాని , పరమార్థం వాస్తవిక తత్త్వం మాత్రం అద్వైతమే !సిద్దాంతరూపంలో అద్వైతం మాత్రమే తెలుసుకోదగినది.
జీవుడు,ఈశ్వరుడు ఈ యిరువురు మాయికులు అయినందున వారి భేదం కూడా మిథ్యే అయితే కూటస్థుడు,బ్రహ్మ అనేవారు పారమార్థికమైతే వారి భేదం కూడా పారమార్థికమని అంగీకరించాలి గదా ! అనే సంశయం,
కూటస్థునికి బ్రహ్మకు ఉన్న భేదం నామమాత్రమే ! ఘటాకాశం,మహాకాశం ఈ రెంటికి ఉన్న భేదం నామమాత్రమైనట్లు. అనంతమైన ఆకాశమైనా ఘటమునందలి ఆకాశమైనా పేరునకే కదా భేదము.
" సదేవ సోమ్యేదమగ్ర ఆసీ దేక మేవాద్వితీయం "
--చాందోగ్య 6-2-1
అనే ఈ శ్రుతిలో సృష్టికి పూర్వం ఏ అద్వితీయ బ్రహ్మం ఉన్నట్లు ప్రతిపాదింపబడ్డదో, ఆబ్రహ్మమే ఆ అద్వితీయ తత్త్వమే సృష్టికి తరువాత ఈనాడు ప్రళయకాలం తరువాత కూడా(ముక్తిలో కూడా) ఉంటుంది.
ఈ విధముగా బ్రహ్మము త్రికాలా బాధ్యము అని తెలుస్తోంది.కాబట్టి సత్యం !
మనం అనుకొనే భేదమంతా మాయద్వారా ఈ జీవులన్నీ భ్రమకు లోనైనందు వలన కలిగిందే ! ఈ భ్రమకు కారణం తత్త్వజ్ఞానం లేకపోవడమే !
పూర్ణ బ్రహ్మ స్వరూపము నుండి విడిపోయిన జీవాత్మ మరలా మునుపటివలనే ఆ పరమాత్మ స్వరూపాన్ని పొందడమే ధ్యేయంగా ఉండాలి.శ్రుతి స్మృతి మరియు వేదాంతం అన్నింటి సిద్ధాంతం ఇదే.
"జీవాత్మకు అచ్యుతపద ప్రాప్తి".
No comments:
Post a Comment