*🌺🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺*
*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🍁🌵🍁 🌵🍁🌵 🍁🌵🍁
*ప్రాణస్నేహితులు*
*సృష్టి ఆరంభంలో స్నేహం ఉందో లేదో తెలియదు కానీ, ఇతిహాసకాలం నుంచి మాత్రం మైత్రీబంధం ఉంది. కర్ణ దుర్యోధనులు, కృష్ణ కుచేలుర కథలు మనకు తెలిసినవే. భర్తృ హరి సుభాషిత త్రిశతిలో మంచి మిత్రుడి లక్షణాలను చెప్పాడు. చెడ్డవారి స్నేహం ప్రాతః కాలపు నీడలా మొదట విస్తారంగా ఉండి, క్రమంగా క్షీణించిపోతుంది. మంచివారి స్నేహం సాయంకాలపు నీడలా మొదట చిన్నదిగా ఉండి క్రమంగా వృద్ధి చెందుతుంది.*
*స్నేహం బాల్యం నుంచి అలవడే ఓ అందమైన అనుబంధం. స్నేహం ఓ అద్భుతమైన భావప్రకటన. స్నేహం అంటే నమ్మకం, భరోసా, కంటికి కనిపించని అవగాహన. దూరంగా ఉన్నా, మానసికంగా దగ్గర చేసే మధురభావన. తల్లిదండ్రులతో, తోబుట్టువులతో పంచుకోలేని ఎన్నో విషయాలను స్నేహితులతో పంచుకుంటాం. మనలోని మంచి, చెడులను నిష్పాక్షికంగా తెలియజేస్తూ, అవసర సమయాల్లో అండగా నిలబడ గలిగి, విభేదాలు వచ్చినా మన రహస్యాలను ఇతరుల ముందు బహిర్గతం చేయనివాడే నిజమైన స్నేహితుడు.*
*స్నేహం అంటే రెండు శరీరాల్లో ఉండే ఏకాత్మ. ఇద్దరి మధ్య వ్యక్తిత్వం, నిబద్ధత, నిజాయతీ, నిస్వార్థం అనే నాలుగు స్తంభాలే స్నేహ సౌధానికి పునాదులు. ఒకే అభిప్రాయం, భావాలు గల వ్యక్తులు మిత్రులు కావడం సాధారణమే. కానీ దాన్ని జీవితకాలం కొనసాగించే వారే ప్రాణస్నేహితులు అవుతారు. పాలు, నీళ్లలా కలిసిపోయే నైజం కలవారి మధ్య స్నేహం అంకురిస్తే, అది వటవృక్షమై ఎంతో మందికి ఆశ్రయం ఇస్తుంది. కొన్నిసార్లు మన భావాలకు, అభిప్రాయాలకు పొంతన లేని వ్యక్తులతో తప్పనిసరి స్నేహం చెయ్యాల్సి వస్తుంది. ప్రయోజనం ఆశించి చేసే అలాంటి స్నేహాల్ని వదిలించుకోవడం మంచిది.*
*'నీకు నేనున్నాను, నీ కోసం ఏమైనా చేస్తాను' అనే భరోసా స్నేహానికి సేంద్రియ ఎరువు లాంటిది. స్థాయీభేదాలు, అరమరికలు లేనివాళ్లే స్నేహితులు కాగలరు. 'స్నేహితుడి కోసం ప్రాణం ఇచ్చేవాడికన్నా, ప్రాణమిచ్చే స్నేహితుణ్ని పొందినవాడు అదృష్టవంతుడు' అన్నాడు జాన్ రస్కిన్.*
*నేటి యువత చదువు, ఉద్యోగం, సామాజిక జీవితంలోని ఒత్తిళ్లకు లోనవుతూ, స్నేహం ముసుగులో వ్యసనాలకు బానిసలవుతున్నారు. మంచి, చెడుల విచక్షణ తెలిపే స్నేహితుడు ఉన్నప్పుడు మనలోని దుర్గుణాలు వాటంతటవే తొలగిపోతాయి. ధనం స్నేహితుల్ని చుట్టూ చేరిస్తే, దరిద్రం నిజమైన స్నేహితుల్ని మిగులుస్తుంది. కంటికి రెప్పలా, కాలికి చెప్పులా మారడానికి సిద్ధపడేవాడే నిజమైన స్నేహితుడు.*
*తప్పు జరిగినప్పుడు 'ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు?' అనే రంధ్రాన్వేషణకూడదు. దానికి బదులు తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకుని సరిదిద్దుకోగలిగినవాళ్ల మధ్య స్నేహం సజీవంగా నిలుస్తుంది. ఒక్కసారి స్నేహితుడిగా అంగీకరించాక వాళ్లలో ఉన్న మంచిని, ప్రతిభను పదుగురితో పంచుకోవాలి. చెడు అయితే మనలోనే దాచు కోవాలి. మిత్రుడిలో ఉన్న మలినాలను సైతం ప్రక్షాళన చేయగలిగేవాళ్లే ఉత్తమ స్నేహితులుగా శాశ్వత ఖ్యాతికి అర్హులవుతారు.*
🍁🌵🍁 🌵🍁🌵 🍁🌵🍁
*🙏సర్వేజనాః సుఖినో భవంతు🙏*
🌴🌳🌴 🌳🌴🌳 🌴🌳🌴
No comments:
Post a Comment