Vedantha panchadasi:
యే వదన్తీత్థమేతేఽ పి భ్రామ్యంతే విద్యయాత్రకిమ్ ౹
న యథాపూర్వమేతేషామత్ర భ్రాంతేరదర్శనాత్ ౹౹239౹౹
239. (ఆక్షేపము) ఇట్లు మాయాప్రభావమును వర్ణించువారు కూడ భ్రమకు లోనగుదురు.విద్య వలన,జ్ఞానము వలన కలిగిన లాభమేమి ?
(సమాధానము)జ్ఞానమునకు పూర్వము వలె భ్రాంతి సత్యమని భావింపకుండుటయే.
ఐహికాముష్మికః సర్వః సంసారో వాస్తవస్తతః ౹
న భాతి నాస్తి చాద్వైత మిత్యజ్ఞాన వినిశ్చయః ౹౹240౹౹
240. అజ్ఞానులకు ఈ లోకము పరలోకములందలి సుఖములే సత్యము.అద్వైతము వారికి తోచదు.లేదనియే వారి నిశ్చయము.
జ్ఞానినాం విపరీతోఽ స్మాన్నిశ్చయః సమ్యగీక్ష్యతే ౹
స్వస్వనిశ్చయతో బద్ధో ముక్తోఽ హం చేతి మన్యతే ౹౹241౹౹
241. జ్ఞానుల నిశ్చయము దీనికి విపరీతమని స్పష్టముగ చూడగలము.వారి వారి నిశ్చయములను బట్టి ముక్తులును బద్ధులును అగుదురు.
వ్యాఖ్య:- తత్త్వమనేది అద్వితీయమని తలచేవారు కూడా సంసారంలో పడుతున్నారు గదా !
ఇక,ఆ తత్త్వజ్ఞానంవల్ల ప్రయోజనం ఏమిటి ? అంటే ---
ఈ ప్రపంచమనేది మాయారూపమని, తత్త్వమనేది అద్వితీయమైనదని చెప్పేవారు కూడా భ్రాంతికిలోనై ఉన్నారు,
కాబట్టి తత్త్వజ్ఞానంవల్ల ఏమీ ప్రయోజనం లేదని అనకూడదు.
ఎందుచేతనంటే,
ఇటువంటి వారికుండే భ్రాంతి,అజ్ఞానావస్థలో ఉండే భ్రాంతిలాంటిది కాదు.ప్రారబ్ధకర్మ వశంవల్ల ఎంతటి జ్ఞానులైనవారైనా సంసారిక వ్యవహారానికి వశమైనట్లు కన్పించిననూ-
జ్ఞానులకు అదిసత్యమైనదని
కానీ ఇచ్చాదులు, ఆసక్తి కానీ లేక, అజ్ఞానావస్థలో ఉన్నటువంటి భ్రాంతిలాగా అంతటి తీవ్రత , ప్రభావము కానీ ఉండదు.
ఇక పూర్తిగా అజ్ఞానులభ్రాంతి విషయానికి వస్తే ,
"స్త్రీ పుత్రాదులతో గూడిన ఈ సంసారము,స్వర్గాది సుఖానుభవంతో కూడిన ఆముష్మిక సంసారము అన్నీ యదార్థాలే !
అద్వైత మనేది కనిపించనూ కనిపించదు - లేనూలేదు", ---
అనేది అజ్ఞానులయొక్క నిశ్చయం.అది వారి నమ్మకం !
ఇక తత్త్వజ్ఞానులైన వారి విషయానికి వస్తే ,
అజ్ఞానుల నమ్మకంటే , జ్ఞానులైనవారి నిశ్చయం విలక్షణంగా ఉంటుంది.వారి వారి అనుభవాన్ని బట్టి జ్ఞానులైనవారు కొందరు,
"నేను సంసారబద్ధుడను" అనుకొంటారు.
మరికొందరు,
"నేను ముక్తుణ్ణి" అనుకొంటారు.
జ్ఞానులైన వారికి నిత్యము అద్వైతతత్త్వ స్ఫురణ ఉంటుంది.కాబట్టి ,
వారికి మోక్షమనే ఫలం ఉంటుంది.
అజ్ఞానులకు పారమార్థికం కానట్టి ఈ సంసారమే ఫలంగా లభిస్తుంది. అంటే -
ఎవరికైనా సరే , వారి వారి నిశ్చయానికి , విశ్వాసానికి తగిన ఫలమే లభిస్తుంది.
వారివారి నిశ్చయములను బట్టి ముక్తులును బద్ధులును అగుదురు.
నాద్వైత మపరోక్షం చేన్న చిద్రూపేణ భాసనాత్ ౹
అశేషేణ న భాతం చేద్ ద్వైతం కిం భాసతేఖిలమ్ ౹౹242౹౹
242. అద్వైతము అపరోక్షము కాదననిచో చైతన్యస్వరూపముగ అది ఎల్లరకును అపరోక్షమే.ఇది అశేషముగ భాసించుట లేదనిన ద్వైతము కూడ అంతా మనకు కన్పించుట లేదు కదా !
దిఙ్మాత్రేణ విభానంతు ద్వయోరపి సమం ఖలు ౹
ద్వైతసిద్ధివదద్వైత సిద్ధిస్తే తావతా న కిమ్ ౹౹243౹౹
243. సూచనామాత్రముగ తెలియబడుట ద్వైతమునకు అద్వైతమునకు సమానమే.దానిని బట్టి ద్వైతము అసత్యమని నిర్ణయింపగలిగినచో అట్లే అద్వైతము సత్యమనే నిర్ణయమునకు వచ్చుటకు ఏమి అభ్యంతరము ?
వ్యాఖ్య :- అద్వైత తత్త్వ స్ఫురణ కలుగుతుందని శాస్త్రాధారంతో అంటున్నారే తప్ప అనుభవంతో కాదు గదా !
అనే ఆక్షేపానికి సమాధానం --
"అద్వైతమనేది ప్రత్యక్షానుభవ విషయం కాదు"
అని అనటం తగదు.
"ఈ అద్వైత ప్రతీతి చిద్రూపంతో ఉంటుంది.ఆ చిద్రూపంలోనైనా పూర్తిగా స్ఫరింపదు" అని అంటారు. ఇందుకు సమాధాన మేమంటే --
' ఘటం' స్ఫురిస్తోంది.
'పటం' స్ఫురిస్తోంది అని మనం అనేటటువంటి ఈ ప్రతీతుల్లో ఏ స్ఫురణమనేది అనుస్యూతంగా అంతటా ఉంటొందో అటువంటి స్ఫురణయే అద్వైతచేతన తత్త్వ స్ఫరణంలో కూడా ఉంటుంది.
అయితే,ఈ అద్వైత ప్రతీతి పూర్తిగా ఎవరికీ కలగదు అని అంటారు.
ఇందుకు సమాధానం ఏమిటంటే -
జగత్తు రూపంలో ఉండే
"ఈ అద్వైత ప్రతీతి మాత్రం సంపూర్ణంగా అందరికీ కలుగుతుందా ? " అని. కాబట్టి , సంపూర్ణంగా స్ఫురించక పోవటం అనేది ద్వైతం విషయంలోను , అద్వైతం విషయంలోనూ సమానమే ! అని.
ఇట్లా,దోషంలో సారూప్యం చూపించి,దోషపరిహారంలో కూడా సామ్యం చూపిస్తున్నారు.
ఏకదేశ ప్రతీతి (ఏకపక్ష స్ఫురణం)
అనేది ద్వైతంలోనూ, అద్వైతంలోనూ కూడా సమానమే !
అంటే,ద్వైతంలో ఒక స్థానాన్ని చూచి సంపూర్ణ ద్వైతాన్ని నిర్ణయిస్తున్నప్పుడు,
అద్వైతంలో ఒక స్థానాన్ని చూచి సంపూర్ణమైన అద్వైతాన్ని ఎందుకు నిశ్చయించుకోకూడదు ?
నిప్పుమీద పెట్టిన అన్నపుగిన్నెలోని ఒక బియ్యపు గింజను పట్టి అన్నం అంతా ఉడికినట్లు నిశ్చయిస్తున్నారు గదా !
అట్లాగే , ఒక యింటిమీద ఆకాశాన్ని చూచి అది అసంగమై ఉన్నట్లే సమస్త బ్రహ్మాండమూ అసంగమై యున్నట్లు నిశ్చయించుకోవచ్చు గదా !
అద్వైతము సత్యమనుటకు ఆధారముగ మన యందున్న చైతన్యము మనకు అనుభవగతమే.
కాగా శ్రుతివాక్యములు కూడా అద్వైతసత్యమును ఘోషించును.
ద్వైతము సత్యమనుటకు శాస్త్రప్రమాణము లేదు. ద్వైతానుభవము కూడా తరచి చూచిన నిలువదు.
No comments:
Post a Comment