Sunday, January 5, 2025

 ☘️🍁  ఆప్తవాక్యాలు  🍁☘️

66. ద్వితీయాద్వై భయం భవతి

రెండవ దానివల్ల భయం కలుగుతుంది (బృహదారణ్యకం)

మన వేదాంతవిద్య 'ఏకత్వాన్ని' ప్రతిపాదిస్తోంది. 'ఏకమేవాద్వితీయం బ్రహ్మ','ఏకం సత్', 'ఏకో నారాయణః', 'ఏకో రుద్ర', 'అజాం ఏకాం' వంటి అసంఖ్యాక శ్రుతివాక్యాలు. 'ఏకం దైవతం', 'ఏకం పరాయణం' వంటి పురాణవాక్యాలు ఈ ఏకత్వజ్ఞానమే లక్ష్యంగా బోధిస్తున్నాయి.

ఈ 'ఏకత్వ' బోధను వేదాంతహృదయంగా గ్రహించి దీనిని 'అద్వైతం' అన్నారు.

( దేహంలో దీపించే చైతన్యం అఖండమైన బ్రహ్మమేనని తెలిస్తే
మాయావికారం వల్ల జీవి యందు ఆభాసించే పరిమిత భావం విడివడి
'బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి' అనే స్థితికి చేరతాడు. అతనికి అంతా ఈశ్వర
విలాసమే. అన్ని అలల ఆటలకీ ఆ సముద్రమే ఆధారం. అలలన్నిటినీ కలిపి ఏక సముద్ర దృష్టిగా చూసే వివేకి ప్రతి అలలోనూ ఆ సముద్రుని ప్రత్యేక శోభనే చూసి-'అంతా ఆ సముద్రమే'నని ఒప్పుకుంటాడు.)

ఇదీ ఉపనిషత్తు మాటే. 'ప్రపంచోపశమం శాంతం అద్వైతం' అని మండూక్యోపనిషద్వచనం. దీనిని వ్యాఖ్యానించి బోధించి అచ్చమైన వేదాంత సిద్ధాంతాన్ని స్పష్టపరచిన ఆదిశంకరుల బోధనను 'అద్వైతం' అని తరువాతి వారు వ్యవహరించారు.

శ్రుతిహృదయమే అద్వైత ప్రతిపాదన. మరి 'ఏకం' అనకుండా 'అద్వైతం' (రెండు కాదు) అనడం ఎందుకు? వ్యవహారంలో 'ద్వైతం' వలె గోచరిస్తున్నా, నిజానికి 'అది
రెండు కాదు-ఒక్కటే' అని చెప్పడం 'అద్వైతం' అనే మాటలోని అంతర్యం.

పరమార్థ దృష్టిలో ఇదే సత్యం. అసలు సత్యాన్నే పరమార్థం అంటారు. అందరిలోనూ దీపించే ఈశ్వర చైతన్యమొకటే. జీవుడు అవిద్య వల్ల భ్రమపడి ఈశ్వర చైతన్యాన్ని
భిన్నభిన్నములుగా దర్శిస్తాడు. దేశ కాల వస్తు పరిమితులలో మాత్రమే భావించగలిగే బుద్ధి చైతన్యానికి ఈ భిన్న దర్శనం తప్పదు.

తన కదలికలకు కూడా మూలమైన ఈశ్వరచైతన్యాన్ని గుర్తించి, తన పరిమిత అహాన్ని (మనస్సును) ఈశ్వరచైతన్యంలో లయం చెందించిన యోగిమాత్రమే అద్వైతానుభవాన్ని పొందగలడు. అంటే సత్యాన్ని అనుభవానికి తెచ్చుకోగలడు. సాధకుడు ఆ సత్యాన్ని శాస్త్ర, గురూపదేశ మార్గాల ద్వారా మననం చేసుకుంటూ, మదిలో
స్థిరపరచుకుని జ్ఞానవైరాగ్య భక్తులతో యోగి కాగలడు-లక్ష్యాన్ని (సత్యాన్ని)
సాధించగలడు.

ఉపాధిగతమైన భేదాలే తప్ప అందరికీ మూలచైతన్యం ఒకటేనని విచారణలోతెలుసుకున్నవాడు-ఉపాధిగత మర్యాదలను పాటిస్తూనే ఆ పరబ్రహ్మను ఉపాసిస్తాడు.
క్రమంగా తానే బ్రహ్మానుభూతిలో తాదాత్మ్యం చెంది తాను వేరన్న స్థితిని
విడిచిపెడతాడు.

‘అవిభక్తం విభక్తేషు తతాజ్ఞానం విద్ధి సాత్వికమ్'
-
విడివిడిగా ఉన్న వాటియందు ఏకత్వాన్ని దర్శించడమే సాత్విక జ్ఞానం- అని గీతాచార్యుని వచనం. భిన్నదృష్టి రాజస, తామసాది వికృతులది. సాత్వికజ్ఞానమే
క్రమంగా బ్రహ్మజ్ఞానాన్ని కలిగిస్తుంది.

తాను కాని దానినుంచే తనకు భయం. వియోగ, సంయోగాలన్నీ తనకు భిన్నమైన ఉపాధుల నుండే కలుగుతుంటాయి. కానీ తన నుండి తనకు కలుగవు. ఇక్కడ 'తాను' అనేది స్థూల దేహ పరంగానో, లోపలి సూక్ష్మకారణ దేహాల పరంగానో
చెబుతున్నది కాదు. ఈ మూడు దేహాలలో మూడు అవస్థలలో (జాగ్రత్, స్వప్న, సుషుప్తులు) వ్యవహరించబడుతున్న 'నేను' అనే స్ఫురణ(అహం)తో ఏ త్రిపురాలకు
అతీతమైన చైతన్యం వల్ల కలుగుతుందో - ఆ సర్వ కారణ చైతన్యంలో 'నేను' అనే జీవభావం తాదాత్మ్యం చెందితే 'సర్వం బ్రహ్మమయం' అనే స్పృహ కలుగుతుంది.అప్పుడింక రెండవది ఏముంది? భక్తితో సైతం అంతా భగవన్మయమని చూసే వానికి భయమే లేదు. అందుకే భక్తుడు నిర్భీకుడు ప్రహ్లాదుని వలె.

సముద్రంలో అలలన్నీ సముద్రమే అని గ్రహించకుండా, అలలన్నింటినీ విడిగా చూడడం ఎలాంటిదో ఏకత్వదర్శనం లేకపోవడం కూడా అలాంటిదే. అలలన్నీ సముద్రంలోనివే - సముద్రంతో బంధంలేని అల లేదు. ప్రతి అలలోను సముద్ర శక్తి ఉంది. అన్ని భువనాలు పరబ్రహ్మలోనివేనని - ఆ పరబ్రహ్మను విశ్వ శరీరునిగా
దర్శిస్తాం మనం. మన ఇంద్రియాలలో వేటి లక్షణం, ధర్మం వాటికి ఉన్నా అన్నీ 'నేను' అనే చైతన్యంలోనివే కదా! అలా అన్ని జీవుల చైతన్యాలు పరమాత్మ యొక్క చైతన్య శక్తులే.

సర్వగతమైన సూర్యకాంతి ఇంటి కిటికీలోంచి పడుతుంటే కేవలం కిటికీ గుండా వెలుగును చూసేవాడు, ఆ వెలుగును కిటికీ పరిమాణంగానే భావిస్తాడు. గది దృష్టితో (వ్యవహారంలో) అది నిజమే. కానీ కిటికీ వద్దకు వెళ్లి ఆ వెలుగుకి
మూలస్థానమైన ఆకాశంలోని సూర్యుని చూస్తే- ఆ వెలుగు అపారమైనదని,అపరిమితమైనదనీ - పరిమితి కిటికీదే కానీ సూర్యకాంతిది కాదనీ తెలుస్తుంది.

దేహంలో దీపించే చైతన్యం అఖండమైన బ్రహ్మమేనని తెలిస్తే మాయావికారం వల్ల జీవి యందు ఆభాసించే పరిమిత భావం విడివడి 'బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి'
అనే స్థితికి చేరతాడు. అతనికి అంతా ఈశ్వర విలాసమే. అన్ని అలల ఆటలకీ ఆ సముద్రమే ఆధారం. అలలన్నిటినీ కలిపి ఏక సముద్ర దృష్టిగా చూసే వివేకి ప్రతి
అలలోనూ ఆ సముద్రుని ప్రత్యేకశోభనే చూసి-'అంతా ఆ సముద్రమే’నని ఒప్పుకుంటాడు.

'ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు పోలిక' అని భాగవతం ఈ సత్యాన్నే ప్రతిపాదిస్తోంది. "హరియట హరుడట సురలట మునులట అఖిలాండకోటులట-అందరిలోను పరమాత్ముడు వెలిగే" అని త్యాగయ్య అద్భుతంగా కీర్తించారు.          

No comments:

Post a Comment