Monday, January 13, 2025

 *పండించే వారి పండుగ* 

*ప్రకృతిలో పరమేశ్వర కారుణ్య స్వరూపాన్ని చూడగలిగిన వాడే ధన్యుడు. అలాంటి ధన్యతనిచ్చే సంస్కారాలు భారతీయుల పండుగలలో ప్రత్యక్షమౌతాయి. ప్రకృతి పరిణామాలలో ఉండే దివ్యశక్తిని తెలుసుకుని, ఆ శక్తి మనలో నింపుకొనేలా పర్వదినాలను ఏర్పరచారు మహర్షులు. అలాంటి పర్వమే సంక్రమణం. భూమిని తల్లిగాను ఆకాశాన్ని తండ్రి గాను మన ఆర్షసంస్కృతి సంభావించింది. మనలను తల్లిలా భరించి, పోషిస్తున్నది భూమాత ఈ తల్లికి ఆ సామర్థ్యన్ని ఇచ్చి, సఫలతను చేకూర్చుతున్నది ఆకాశం.*

*నింగి నుండి కురిసే వర్షాలు, జ్యోతిర్మండలాల కాంతీ, ఆకాశరాజైన సూర్యభగవానుని ప్రాణశక్తి భూమి గ్రహిస్తున్నది. భూవాసులు పోషించబడుతున్నారు. అందుకే గగనాన్ని తండ్రి భావాలతో దర్శించారు.*

*ఎన్ని సౌర కుటుంబాలు ఉన్నా మన భూమికి సంబంధించిన సూర్యుడే మనకు ఆకాశరాజు, అందునా గగనం నుండి సూర్య, మేఘాదుల శక్తులను వివిధ కాలాలలో, వివిధ ప్రాంతాలలో ఒక భూమిపై వివిధ జీవరాశి వివిధాలుగా పొందుతోంది.*

*దైవాన్ని సకలభోగాలతో పూజించే పండుగ భోగి. లోకరాధకుడైన దినకరుడిని ఆరాధించే పండుగ. కుటుంబాలన్నీ భోగభాగ్యాలతో తులతూగే పండుగ. పసిపిల్లలకు భోగిపండ్లు పోసే పసందైన పండుగ. చలికి స్వస్తి పలుకుతూ ఊరూరా భోగిమంటలు వేసే భోగాల పండుగ. భోగి అంటేనే భోగాల పండుగ, 'భగ' అనే పదం నుంచి భోగి అన్నమాట పుట్టిందని చెబుతారు. 'భగ' అంటే 'మంటలు' లేదా 'వేడి'ని పుట్టించడం అని అర్ధం. ఆరుగాలం శ్రమించిన పండించిన పంట చేతికి వచ్చి, లోగిళ్ళున్నీ సిరిసంపదలతో తులతూగుతుంటాయి. అందుకే ఈ పండుగను వేడుకగా మూడు రోజులు చేసుకునే ఆనవాయితీ ప్రారంభమైంది.*

*ఇక ఆధ్యాత్మిక పరంగా ఈ భోగి మంటలను అగ్నిదేవుడికి ఆరాధనగా పరిగణిస్తారు. వాస్తవానికి భోగి మంటల్లో కాల్చాల్సింది పాత వస్తువులని కాదు మనలోని పనికి రాని అలవాట్లు చెడు లక్షణాలు. అప్పుడే మనకున్న పీడ పోయి మానసిక ఆరోగ్యం, విజయాలు వస్తాయి అనే అర్ధం ఈ భోగి మంటల వెనుక ఉంది.*

*మకర సంక్రమణమే కాదు, ప్రతి మాస సంక్రమణానికి ముందు వచ్చే రోజు భోగి. సూర్యుడు దక్షిణాయణం నుంచి ఉత్తరాయణానికి పయనించే పుణ్య మాసం కావడంతో ఇది ప్రధానంగా మారింది.*

*శ్రీమద్భగవద్గీత సమూహ వీక్షకులందరికి మరియు పాఠకులకు భోగి పండుగ శుభాకాంక్షలు* 

*┈┉┅━❀꧁🪷ॐ🪷꧂❀━┅┉┈*
          *ఆధ్యాత్మికం ఆనందం*
🌵🌵🌵 🦚🕉️🦚 🌵🌵🌵

No comments:

Post a Comment