Thursday, January 2, 2025

 Vedantha panchadasi:
తృణార్చకాది యోగాన్తా ఈశ్వరే భ్రాంతిమాశ్రితాః ౹
లోకాయతాది సాంఖ్యాన్తా జీవే విభ్రాన్తి మాశ్రితాః ౹౹216౹౹

216. గడ్డిని పూజించువారు మొదలు యోగసాధకుల వరకు అందరూ ఈశ్వరుని గూర్చి భ్రమించినవారు.
లోకాయతులు(చార్వాకులు)మొదలు సాంఖ్యుల వరకు అందరు జీవుని గూర్చి భ్రమించిన వారు.

అద్వితీయ బ్రహ్మతత్త్వం న జాయన్తి యదా తదా ౹
భ్రాన్తా ఏవాఖిలాస్తేషాం క్వ ముక్తిః క్వేహ వా సుఖమమ్ ౹౹217౹౹

217. అద్వితీయ బ్రహ్మతత్త్వమును ఎరుగకపోవుట చేత వారందరూ భ్రాంతిచెందినవారే .
వారికి ముక్తి ఎక్కడ?సుఖమెక్కడ?ఏదీ లేదని భావము.

ఉత్తమాధమ భావశ్చేత్తేషాం సాదస్తు తేన కిమ్ ౹
స్వప్నస్థ రాజ్యభిక్షాభ్యాం న బుద్ధః స్పృశ్యతే ఖలు ౹౹218౹౹

218. వారికిని ఉత్తమము అధమములైన సుఖములు ఉండవచ్చును గదా,బ్రహ్మజ్ఞానము లేకపోయినా ఉంటే ఉండనిమ్ము.దాని వలన లాభమేమి? 
స్వప్నమందు రాజ్యములేలినా బిచ్చమెత్తినా మేలుకొనినపుడు సమానమే గదా?

తస్మా న్ముముక్షుభిర్నైవ మతిర్జీవేశవాదయోః ౹
కార్యా కింతు బ్రహ్మతత్త్వం విచార్యం బుద్ధ్యతాం చ తత్ ౹౹219౹౹

219. కనుక ముముక్షువులకు జీవేశ్వరులను గూర్చి వాదములు పెట్టుకొనుట తగదు.కాగా బ్రహ్మత్త్వమును గూర్చి విచారింపవలెను.దానిని తెలిసికొనవలెను కూడా.

పూర్వపక్షతయా తౌ చేత్తత్త్వ నిశ్చయహేతుతామ్ ౹
ప్రాప్నుతోఽ స్తు నిమజ్జస్వ తయోర్నైతావతావశః ౹౹220౹౹

220. అట్టివాదములు పూర్వపక్షరూపమున తత్త్వనిశ్చయమునకు తోడుపడును కదా అంటే అట్లే కానిమ్ము.కాని వశము తప్పి ఆ వాదవివాద సముద్రమున మునిగిపోకుండ మాత్రము జాగ్రత్తపడుము.
వ్యాఖ్య:- వాదోపవాదములనునవి అంతులేక కొనసాగును.అవి చిత్తవిభ్రమణమును మాత్రమే కల్పించును.

చెట్లను,రాళ్ళను(అర్చకా)పూజించేవారు మొదలుకొని యోగమార్గాన్ని అనుసరించేవారి వరకు ఉన్న వాదులంతా ఈశ్వరుని విషయంలో భ్రమకులోనై ఉన్నారు.అట్లాగే చార్వికాది నాస్తికులు మొదలుకొని సాంఖ్యుల వరకూ అంతా జీవ విషయకమైన భ్రాంతికిలోనై ఉన్నారు.
ఇందుకు కారణ మేమంటే-

అద్వితీయమైన బ్రహ్మత్త్వాన్ని తెలుసుకొనలేని వారంతా విభ్రాంతులై ఉన్నట్లే!
అటువంటి వారికి మోక్షంగాని,
ఈ లోకంలో సుఖంగాని ఎట్లా లభ్యమౌతుంది?

భ్రాంతులైన అజ్ఞానులు కాబట్టి మోక్షం కలుగదు.తమ పక్షానికి సంబంధించిన మొండి పట్టుదల కలవారైనందున ఈ లోకంలో చిత్తశాంతి సైతం లభించదు. చిత్తశాంతి లేకపోతే సుఖం ఉండదు గదా!

ఇతర పక్షాలకు సంబంధించినదైనా ఏదో ఒక జ్ఞానమంటూ కలిగి ఉన్నందున దానికి తగినట్టి ఉత్తమ మధ్యమాధమ సుఖం ఏదో ఒకటి లభించాలి గదా! అంటే -

అట్లా వాదించేె వారిలో ఉత్తమాధమభేదాలు ఉంటే ఉండవచ్చుగాక!
వాటివల్ల ముముక్షువులకు ఏమి లాభం ఉంటుంది?

స్వప్నంలో లభించే రాజ్యసంపదవల్లగాని,భిక్షాచరణ దారిద్ర్యంవల్లగాని స్వప్నంనుండి మేల్కాంచిన వానికి కలిగే లాభం ఏముంటుంది?
ఆ విధమైన స్వప్నంలో కలిగే సంపదవల్ల,దారిద్ర్యంవల్ల లాభంగాని నష్టంగాని ఏమీ ఉండదు.

ఇక ఉపసంహారంగా జీవేశ్వర స్వరూప జ్ఞానం విచారిస్తే,

అందుచేత,
మోక్షాన్ని కోరేవారు జీవేశ్వర విషయకరమైన వ్యర్థవివాదాల జోలికి పోకుండా,శ్రుతుల్లో చెప్పినట్లుగా బ్రహ్మతత్త్వమును గూర్చి విచారించి తెలుసుకుని బ్రహ్మతత్త్వమునకు సంబంధించిన జ్ఞానాన్ని పొందాలి.

ముముక్షువులు 
జీవవాదం,ఈశ్వరవాదం అనే ఈ వివాదంలో పూర్వ పక్షానుసారంగా తత్త్వ నిర్ణయానికి కారణం అయితే కావచ్చు!తప్పులేదు.
కానీ,వివేకరహితులై ఆ వివాదాల్లో మునిగిపోయి పడి ఉండటం తగదు.

సత్యము,జ్ఞానము,
అనంతరూపత్వము కలదేదో అదే బ్రహ్మము.అదే యథార్థమైనది-అదే వాస్తవికమైనది.

అసఙ్గ చిద్విభుర్జీవః సాంఖ్యోక్త స్తాదృగీశ్వరః ౹
యోగోక్తస్తత్త్వమోరథౌ శుద్ధౌ తావితి చేచ్ఛృణు ౹౹221౹౹

221. (ఆక్షేపము): కాని "సాంఖ్యులు  చెప్పునట్లు జీవేశ్వరులు సంగరహితులు శుద్ధచైతన్యము శాశ్వతులు అనీ యోగులనునట్లు తత్త్వమసి అనే వాక్యమున తత్,త్వం అనే పదములకు అర్థమగు ఈశ్వరుడు జీవుడు శుద్ధ స్వరూపులనీ వేదాంతులు అంగీకరింపవలెను" 
అంటే విను.

న త్తత్త్వమోరుభావర్థావస్మత్సిద్ధాన్తతాం గతౌ ౹
అద్వైత బోధనాయైవ సా కక్షా కాచిదిష్యతే ౹౹222౹౹

222.(సమాధానము):- ఆ అర్థములు అద్వైత సిద్ధాంతమును అనుసరింపవు.అవి జీవ ఈశ్వరులకు వాస్తవమగు భేదమున్నట్లు ప్రతిపాదించును.
అద్వైత సిద్ధాంతమున అట్టి భేదము లేదు.సిద్ధాంతము బోధించుటకు తాత్కాలికముగ మాత్రమే భేదము స్వీకరింపబడును.

అనాది మాయాయాభ్రాంతా జీవేశౌ సువిలక్షణౌ ౹
మన్యన్తే తద్ వ్యుదాసాయ కేవలం శోధనం తయోః ౹౹223౹౹

223. అనాదియగు మాయచే ప్రభావితులై జనులు జీవులు ఈశ్వరుడు అత్యంతము విలక్షణతత్త్వములని భావింతురు. ఇట్టి భ్రమను తొలగించుటకే వేదాంతి తత్,త్వం పదముల అర్థమును విచారించును. వ్యాఖ్య:-సాంఖ్యయోగమతాలవారు చెప్పే జీవేశ్వరులు,శుద్ధచిన్మయులు,
చిద్రూపులు అవటం మీకూ సమ్మతమే గదా !
కాబట్టి,ఈ జీవేశ్వరుల విషయం పూర్వపక్షంలోకి వస్తుందా?రాదా?

సాంఖ్య మతాన్ని అనుసరించి జీవుడు అసంగుడు,చేతనుడు,వ్యాపకుడు.
అట్లాగే యోగమతాన్ని అనుసరించి ఈశ్వరుడుకూడా అసంగుడు, చిద్రూపుడు వ్యాపకుడు(విభుడు)

ఈ జీవుడు ఈశ్వరుడు అనే మాటలు క్రమంగా త్వం,తత్ అనే పదాలకు సరియైన అర్థం అవుతుంది.
అట్లా అనటం అద్వైతమతానికి అనుకూలంగానే ఉంది గదా!
ఇక వారిని పూర్వపక్షులుగా పరిగణించటం ఎందుకు? అంటే,

వారు చెప్పినట్టి త్వమ్,తత్ అనే పదాల అర్థం అద్వైతమతాన్ని అనుసరించి చెప్పినది కాదు.
కూటస్థుడు,బ్రహ్మ అనే శబ్దాలలో విడిగా ఎక్కడైనా చెప్పినప్పటికీ అది అద్వైతజ్ఞానాన్ని కలిగించటానికి మాత్రమే చెప్పబడినది!

ఈ రెంటికి ఉన్న ఏకరూపత్వాన్ని ప్రతిపాదించటానికి మాత్రమే అలా భిన్నత్వంగా వ్యాఖ్యానింపబడినది. అంతే తప్ప,
ఆ రెండూ వేరువేరు అని భిన్నత్వాన్ని అంగీకరించలేదు.

జీవుడు,ఈశ్వరుడు అనే పదాల్ని పరిశీలించటంవల్ల తప్పుదిద్దటమువలన కలిగే ప్రయోజనమేంటంటే,

తనకు ఆశ్రయమైనవారినే వ్యామోహితుల్నిచేసి,భ్రాంతికి లోనుగావించే మాయవల్ల భ్రమలోపడి,విపక్షులైనవారు జ్ఞానులై ఉండే తమ విపరీత జ్ఞానంవలన జీవుని ఈశ్వరుణ్ణి వేరువేరుగా భావిస్తున్నారు.

అందుచేత, వారి భ్రాంతిని తొలగించ టానికే త్వం,తత్ అనే శబ్దాలను ఆరూపంలో శోధనం చేయవలసి వచ్చింది.
పరిశీలన చేసి,తప్పుదిద్దవలసి వచ్చింది.

ఎన్ని దారులలో ప్రయాణించినను "తత్త్వ"విచారణ ద్వారా మాత్రమే ఆ పరమాత్మ ను తెలుసుకోగలము. 

No comments:

Post a Comment