Thursday, January 2, 2025

 *ముక్తి... సాధన.....*

ముక్తిని కోరిన సాధకుడు ఒక సద్గురువును సమీపించి - వినయంతో ఆయనను ప్రశ్నించి ఆయన బోధను స్వీకరించాలి. ఐతే గురువును చేరి ఆయనను సేవించి, పూజించితే ముక్తి వస్తుందా ? రాదు ! మరి ఎలా? అంటే..

గురువు మార్గాన్ని సూచిస్తాడు. ఆ మార్గంలో జాగ్రత్తగా ప్రయాణం చేయవలసిన వాడవు నీవే. నిన్ను నీవే ఈ సంసారసాగరం నుండి ఉద్ధరించుకోవాలి. దానికై నిర్విరామంగా కృషి చేయాలి. ఏమిటా కృషి...

సమ్యక్ దర్శన నిష్ఠ...

ముందుగా నీ దృష్టిని సరి చేసుకోవాలి. ఈ ప్రపంచాన్ని మనం రాగద్వేషాలనే రంగుటద్దాల నుండి చూస్తున్నాం. కొన్నింటిపై రాగం - కొన్నింటిపై ద్వేషం. బుద్ధిలో ఈ రాగద్వేషాలుంటే వస్తువులు ఉన్నవి ఉన్నట్లు కనిపించవు. మనకు ఇష్టమైన వ్యక్తి ఏం మాట్లాడినా, ఎలా మాట్లాడినా, అందవిహీనంగా ఉన్నా మనకు బాగానే ఉంటాడు. అదే ఇష్టం లేని వ్యక్తి ఎంత బాగా మాట్లాడినా - ఏమి అన్నా వాటిల్లో నుండి తప్పులను వెతుకుతాం. అతడు మంచిమాట మాట్లాడినా అందులో చెడు కనిపిస్తుంది. కనుక ఇష్టాఇష్టాలతో నిమిత్తం లేకుండా ఈ ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడటమే సమ్యక్ దర్శనం అంటారు. అట్టి నిష్ఠలో నిరంతరం ఉండాలి.

యోగారూఢత్వం...

ఈ సమదృష్ఠితో - సమ్యక్ దృష్ఠితో ప్రపంచాన్ని చూస్తూ ఉండటంతో క్రమంగా మన మనస్సు ప్రశాంతమవుతుంది. అప్పుడు మనస్సు స్థిరంగా ఉంటుంది. నిజంగా ఈ ప్రపంచం ఎంతో ఆకర్షణీయమైనదిగా కనిపిస్తుంది. సుఖాన్నిచ్చేదిగా కనిపిస్తుంది. కాని ఇది నిజం కాదు. ఆ నిజం తెలిస్తే ప్రపంచాన్ని ఉన్నదున్నట్లు చూస్తే మనలో వస్తువులపై గాని, విషయాలపై గాని, భోగాలపై గాని కోరిక, వ్యామోహం లేకుండా తటస్థంగా - నిర్లిప్తంగా ఉండగలుగుతాం. అలా ఉన్నప్పుడు మనస్సులో కోరికల వత్తిడి లేకపోవటాన ఎటువంటి సంచలనం, ఆందోళన లేకుండా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఇలా వివేక వైరాగ్యాలతో మనస్సు ప్రశాంతమైనప్పుడు కర్మలపై ఆసక్తి తగ్గిపోయి ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవటానికి గురువు చూపించిన మార్గంలో జ్ఞానాన్ని గ్రహించటానికి, సాధనలు చేయటానికి తయారుగా ఉంటాం. ఇలా ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవటానికి నిరంతరం కృషి చేసే మనస్సు యోగంలో ఉన్నది అని చెప్పవచ్చు. మనస్సు ఇలా ప్రాపంచిక విషయాలవైపుకు భోగాల వైపుకు పరుగులు తీయకుండా స్థిరంగా - శాంతంగా ఉండి ఆత్మవైపుకు ప్రయాణం చేస్తుంటే యోగారూఢత్వంలో ఉన్నట్లే. ఆ విధంగా మనస్సును శుద్ధం చేసి ఉన్నత లక్ష్యం మీద నిలపటానికి కృషి చేయాలి.. 

No comments:

Post a Comment