Sunday, January 12, 2025

 *Vedantha panchadasi:*
అజ్ఞాత్వా శాస్త్రహృదయం మూఢో వక్త్యన్యథాన్యథా ౹
మూర్ఖాణాం నిర్ణయస్త్వాస్తామస్మత్సిద్ధాన్త ఉచ్యతే ౹౹275౹౹

275. శాస్త్రసారము తెలియని మూర్ఖులు అనేక విధములుగ చెప్పుదురు.వారి నిర్ణయములట్లుంచి వేదాంత సిద్ధాంతమును చెప్పెదము.

వైరాగ్యబోధోపరమాః సహాయాన్తే పరస్పరమ్ ౹
ప్రాయేణ సహవర్తన్తే వియుజ్యన్తే క్వచిత్క్వచిత్ ౹౹276౹౹

276. 
వైరాగ్యము తత్త్వబోధ ఉపరతి, కోరికలు లేకుండుట ఆత్మజ్ఞానము 
కర్మ నుండి విరమించుట అనే మూడూ పరస్పరము సహకరించును.సాధారణముగ మూడూ కలిసే ఉండును. ఒక్కొక్కప్పుడు మూడవది లేకయునుండును.

హేతుస్వరూపకార్యిణి భిన్నాన్యేషామసఙ్కరః ౹
యథావదవగన్తవ్యట శాస్త్రార్థం ప్రవివిచ్యతా ౹౹277౹౹

277. ఈ గుణముల హేతువులు స్వరూపములు ఫలితములు వేరు వేరుగ ఉండును.వీనిలో భేదము చక్కగా శాస్త్రార్థము ఎరిగిన బోధపడును.

దోషదృష్టిర్జిహాసా చ పునర్భోగేష్వదీనతా ౹
అసాధారణ హేత్వాద్యా వైరాగ్యస్య 
త్రయోప్యమీ ౹౹278౹౹

278. విషయ సుఖములు తాత్కాలికములను దృష్టియు,
ఆ సుఖములను అనుభవించుట యందు అరూచియు,
వాని ఆకర్షణ నుండి స్వేచ్ఛ - ఈ మూడూ వైరాగ్యమునకు విశిష్టమైన కారణములు.

వ్యాఖ్య:-మానసికమైన సంగమే బంధహేతువు అని అంగీకరిస్తే, ఆంతరికమైనట్టి సంగశూన్యత ఉండి, 
బాహ్యవ్యవహారాల్లో పాల్గొంటూ ఉండేవారిని చూచి , 
వారు అవివేకులు అని ఎందుకు అంటారు ? అంటే -

 మూఢులైనవారు,శాస్త్రార్థాన్ని శాస్త్రాభిప్రాయాన్ని సరిగా తెలుసుకోకుండా ఒకదానికి వేరొక అర్థాన్ని రకరకాలుగా చెపుతూ ఉంటారు.అందుచేత ,వారి మాటల్ని,
వారి ఆలోచనల్ని , భావాల్ని ఆపేక్షించకుండా సిద్ధాంతాన్ని చెపుతాం -

వైరాగ్యం,జ్ఞానం,ఉపరతి
(విషయాల యెడల ఉపేక్ష) అనేవి
మామూలుగా ఒకదాని కొకటి సహాయకారులు.ఎక్కువగా ఈ మూడూ కలిసే ఉంటాయి.కాని 
అక్కడక్కడ(ఒక్కొక్కరియందు)
విడివిడిగా కూడా కనిపించవచ్చు.
ఇవన్నీ కలిసి ఉన్నందువల్ల ,అన్నీ కలసి ఒకటే కాదు గదా ! అనే శంకకు
సమాధానం -

వైరాగ్యాది సాధనాలకు కారణాలైన వాటి వాటి స్వరూపాలు ,వాటి వాటి కార్యాలు (ఫలాలు) వేరు వేరుగా ఉంటున్నాయి.
ఇవన్నీ కలగాపులగంగా ఉండటం లేదు. అందుచేత,ఈ మూడూ ఒకటి కాదు.వివేకవంతులైనవారు ఈ మూడింటిలోను
(వైరాగ్యం,జ్ఞానం,ఉపరతి) ఉన్న భేదాన్ని చక్కగా తెలుసుకోవాలి.

వైరాగ్యం యొక్క హేతు స్వరూపం,కార్యం(ఫలం) -
1)విషయగతమైన దోష దర్శనం
2)ఆ విషయాలను వదిలేయాలనే తీవ్రమైన కోరిక
3)భోగాల విషయంలో దైన్యభావం లేకుండా ఉండటం - తనకు భోగాలు లేకపోయాయే అనే దైన్యం లేకుండా ఉండటం.   -
అనే ఈ మూడూ వరుసగా వైరాగ్యానికి
1)కారణము,2)స్వరూపము,3)ఫలము అవుతాయి.

విషయ సుఖములు తాత్కాలికములను దృష్టియు,ఆ సుఖములను అనుభవించుట యందు నిర్లిప్తత,వాటి ఆకర్షణ నుండి విడుదల - 
వైరాగ్యపు విశిష్టమైన లక్షణములు.

తత్త్వమును తెలియవలెననే కోరికచే కలుగునదీ,
ప్రపంచమునందలి దుఃఖములను చూచుటచే కలుగునదీ అని వైరాగ్యము రెండు విధములుగ చెప్పబడినది.

మొదటిది జిజ్ఞాస రెండవది జిహాస.
పతంజలి వశీకార లేదా అపరా వైరాగ్యము పరావైరాగ్యములను గూర్చి చెప్పును.
జిహాస వశీకార వైరాగ్యమును పోలినను 
జిజ్ఞాస పరావైరాగ్యముతో పోల్చబడదు.

జీవన్ముక్తి వివేకమున మంద ,మధ్యమ,తీవ్ర వైరాగ్యములు చెప్పబడినవి.
అన్నీ వశీకార వైరాగ్యమున చేర్చబడినవి.

శ్రవణాదిత్రయం తద్వత్తత్త్వమిథ్యావివేచనమ్ ౹
పునర్గ్రన్థేరనుదయో బోధస్యైతే త్రయోమతాః  ౹౹279౹౹

279. శ్రవణ మనన నిదిధ్యాసలనే మూడూ సదసద్వివేకము అజ్ఞానగ్రంథి మరల ఏర్పడకుండుట అనే మూడూ తత్త్వబోధకు విశిష్టకారణములు.

వ్యాఖ్య: శ్రవణ మనన నిది ధ్యాసలు తత్త్వజ్ఞానానికి 
కారణం - హేతువు
సద్ జ్ఞానం - కూటస్థ,అహంకారాల భేదానికి సంబంధించిన జ్ఞానం,
(మిథ్యా జ్ఞాన వివేకం) -తత్త్త్వజ్ఞానం యొక్క స్వరూపం.
మళ్ళీ గ్రంథి పుట్టకుండా ఉండటం 
(మళ్ళీ అధ్యాసం - భ్రాంతి-కలగకుండా ఉండటం)అనేది తత్త్వజ్ఞాన ఫలం.

శ్రవణ మనన నిదిధ్యాసల వలన జ్ఞానము కలుగును - (బృహదారణ్యక ఉప.
2.4.5,  4.5.6)
దాని వలన సద్వస్తువగు ఆత్మ కూటస్థ బ్రహ్మముతో అసద్వస్తువగు అహంకారము యొక్క తాదాత్మ్యధ్యాస తొలగును.వాని వేరువేరు స్వరూపముల వివేచన కలుగును.తత్ఫలముగ అజ్ఞానగ్రంథి ఇకమీద ఏర్పడుదు.అజ్ఞాననాశము వలన జనన మరణ చక్రము ఆగిపోవును.
జ్ఞానము వలన అజ్ఞానము నశించును.
తత్ఫలితంగా మన మోక్షము సిద్ధించును.

శ్రవణము వలన యుక్తిపూర్వకంగా వేదాంతవాక్యతాత్పర్య నిశ్చయముతో,
మననము వలన యుక్తిపూర్వకముగా శ్రవణము చేసిన దానినే తలచటం,
నిదిధ్యాసన వలన విషయాద్యాకార మానసిక వృత్తులను(చింతన ఆకర్షణ)వదలి "సర్వం బ్రహ్మం" అనే బ్రహ్మాకార వృత్తిని ప్రవాహముగా భావించడం.
దీని ఫలిత దశ సమాధి.

మహావాక్యానికి శ్రవణాదులు మూడు తోడయితేనే అపరోక్ష జ్ఞానం కలుగుతుంది.కేవలం మహావాక్యం వలన మాత్రం పరోక్ష జ్ఞానమే వస్తుంది.ఇది 
ఏకదేశిమతము.
(విద్యారణ్యలు మొదలయిన వారు, సిద్ధాంతములో ఏకదేశమును(ఒక భాగమును) ఆశ్రయించి చెప్తారు కనుక ఏకదేశివాదులు)

వారి మతము ఇలా ఉన్నది.
"కేవల మహావాక్యం వింటే అపరోక్ష జ్ఞానం కలుగుట అసంభవము"
సంభవమే అంటే శ్రవణాదులు అనవసరమవుతాయి.

అసలు ఏ విషయములోనయినా 
అపరోక్ష జ్ఞానం 
(తన మనస్సుకు -అనుభవానికి రావడం)కలిగిన తర్వాత ఇక దానిలో సందేహాలు అపార్థాలుండవు.

కనుక శ్రవణాదులు దండగ,అవి చేసే పని సందేహాలను అపార్థాలను తొలగించడమే గదా!
అవే లేనపుడు వీటి అవసరము లేదు.మా మతంలో అయితే అవి వ్యర్థం కావు గదా!
ఈ మతంలో చాలామంది వున్నారు.అయినా ఇది సరికాదు.ఎందువలన?

జ్ఞాన ప్రతిబంధాలను తొలగించడం ద్వారా అందుకు హేతువయ్యేవి శ్రవణాదులు.
శ్రవణం అంటే ఊరక వాక్యం వినడం కాదు,శాస్త్రపూర్వకంగా వినడం.

శ్రవణాది హేతువులు
 వివేకం మొ౹౹  అందువలన అవి పరంపరయా జ్ఞాన హేతువులు.

ఈ సాధనములు సమకూర్చు కొన్న పురుషుడే వేదాంత జ్ఞానమునకు అధికారి-అర్హుడు.
కాగా సాధనా చతుష్టయ సంపదగలవాడే అధికారి.

ఉత్తమ జిజ్ఞాసువు సద్గురువుల పాదసన్నిధి చేరి, సేవాభాగ్యముచే వారి కృపను బడసి,వారిచే ఆత్మ బ్రహ్మల యొక్క యేకత్వమును గూర్చిన వేదాంత మహావాక్యమును శ్రవణము జేయవలయును.

ఛాందోగ్య శృతి ఇట్లు చెప్పుచున్నది.
"ఆచార్యవాన పురుషోవేద" తస్య,తావ,దేవ,చిరం యావన్న విమోక్ష్యేఽథ సంపత్స్యే"
సద్గురుని వలన ఉపదేశమొంది,వస్తుస్వరూప విచారణ జేసి తత్త్వ జ్ఞానము గలిగిన పురుషుడు అద్వయ బ్రహ్మను దెలిసికొని కృతార్థుడగును.   

No comments:

Post a Comment